
మలయాళ డైరెక్టర్ తనను ఇబ్బందిపెట్టాడంటోంది నటి అశ్విని నంబియార్ (Ashwini Nambiar). సినిమా గురించి మాట్లాడాలని పిలిపించి దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్నాడని చెప్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆయన ఒక పెద్ద డైరెక్టర్. ఒకరోజు సినిమా గురించి ఏదో మాట్లాడాలని ఆఫీసుకు రమ్మన్నాడు. నిజానికి నేనెక్కడికి వెళ్లినా అమ్మ నా వెంటవచ్చేది. ఆమె తోడుంటే వెయ్యి ఏనుగుల బలం ఉండేది. ఆ రోజు తనకు ఆరోగ్యం బాగోలేదు. హెయిర్ డ్రెస్సర్‌గా పనిచేసే మహిళను తోడు తీసుకెళ్లమంది. అప్పుడు నేనింకా టీనేజర్‌ను.
సినిమా గురించి రమ్మని చెప్పి..
అతడి ఇల్లు, ఆఫీస్ అంతా ఒకేచోట ఉంటాయి. నాతోవచ్చిన మహిళ కిందే ఆగిపోయింది. నేను ఆడుతూ పాడుతూ పైగదిలోకి వెళ్లాను. అక్కడెవరూ కనిపించలేదు. ఇంతలో బెడ్‌రూమ్‌లో నుంచి ఇటురా.. అన్న పిలుపు వినిపించింది. ఆ డైరెక్టర్ (Malayalam Director)తో అంతకుముందు ఓ మలయాళ సినిమా చేశాను. ఆ చనువుతో దగ్గరకు వెళ్లాను. కూతురి వయసున్న నన్ను అసభ్యంగా తాకాడు. అక్కడి నుంచి బయటకు వచ్చేశాక నా పెదాలపై నవ్వు మాయమైంది. సరదాగా ఉండే నేను మూగబోయాను. నేనేమైనా తప్పు చేశానా? ఆయనకు నేనే అవకాశం ఇచ్చానా? అని రకరకాలుగా ఆలోచించాను.
అమ్మ ఏడుపు చూసి..
నా ముఖం చూడగానే ఏమైందని అమ్మ ఆరా తీసింది. జరిగిందంతా చెప్పడంతో తాను రాకపోవడం వల్లే ఇలా జరిగిందని ఏడ్చేసింది. నా వల్ల అమ్మ బాధపడటం చూసి తట్టుకోలేకపోయాను. ఏంచేయాలో తెలియక ఆ రోజు రాత్రి నిద్రమాత్రలు మింగాను. వెంటనే నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లి కాపాడారు. అప్పుడు మా అమ్మ.. జరిగినదాంట్లో నా తప్పు లేదని అర్థమయ్యేలా చెప్పింది. నేను లేకపోతే తను బతకలేనని బాధపడింది. ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చి పని చేయొద్దని ప్రాధేయపడింది. ఆ డైరెక్టర్‌కు నా తండ్రి వయసుంటుంది.
(చదవండి: మహేశ్ వల్లే సినిమాలకు దూరమైన నమ్రత.. రిలేషన్‌లో ఉన్నప్పుడు)
రీఎంట్రీ..
అమ్మ మాటలతో ధైర్యం తెచ్చుకున్నాను. తిరిగి షూటింగ్‌లో అడుగుపెట్టాను. కొన్నిసార్లు అమ్మ లేకపోయినా సెట్‌కు వెళ్లేదాన్ని. దేన్నైనా ఎదుర్కోగలను అన్న ధైర్యంతోనే ముందడుగు వేశాను అని చెప్పుకొచ్చింది. 18 ఏళ్లపాటు వెండితెరకు దూరంగా ఉన్న అశ్విని ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ సుడల్ 2తో రీఎంట్రీ ఇచ్చింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. పెళ్లవగానే యాక్టింగ్ మానేస్తానని ఎక్కడా చెప్పలేదు. ఎప్పటికైనా మళ్లీ సినిమాల్లోకి వస్తానన్న నమ్మకం నాకుంది. ప్రస్తుతం నా కూతురు కాలేజీలో చదువుతోంది. ఇదే సరైన సమయం అనిపించింది.
ఇదే సరైన ఛాన్స్ అని..
షూటింగ్స్ కోసం సింగపూర్ నుంచి పదేపదే చెన్నై రావడం అంత ఈజీ కాదు. సింగపూర్‌లో ఉండగా నేను మాస్టర్స్ పూర్తి చేశాను. కాలేజీలో 13 ఏళ్లపాటు టీచర్‌గా పని చేశాను. ప్రోగ్రామ్స్ చేసేదాన్ని. గతేడాది నా కూతురు కాలేజీలో జాయిన్ అయింది. ఇదే సరైన సమయం అనుకున్నాను. సరిగ్గా అప్పుడే సుడల్ 2 సిరీస్ నుంచి పిలుపొచ్చింది. ఈ సిరీస్ రచయితలు పుష్కర్- గాయత్రితో అంతకుముందు పనిచేసిన అనుభవం ఉండటంతో సులువుగా ఒప్పేసుకున్నాను అని చెప్పుకొచ్చింది. అశ్విని మొదట సీరియల్స్‌లో నటించింది. హిట్లర్ మూవీలో చిరంజీవి చెల్లెలిగా కనిపించింది. ఆంటీ, పెళ్లి చేసుకుందాం, పోలీస్ చిత్రాలతో తెలుగువారిని పలకరించింది. మలయాళ, తమిళ భాషల్లోనూ సినిమాలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment