
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. అత్యున్నత న్యాయస్థానంలో ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతుల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు కల్పిస్తూ జూన్ 24న సర్క్యులర్ జారీ చేశారు. జూన్ 23 నుంచే రిజర్వేషన్ విధానం అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు మోడల్ రిజర్వేషన్ రోస్టర్, రిజిస్టర్‌ను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. దీని ప్రకారం.. సుప్రీంకోర్టులో పదోన్నతుల్లో ఎస్సీ ఉద్యోగులకు 15 శాతం, ఎస్టీ ఉద్యోగులకు 7.5 శాతం కోటా కల్పిస్తారు.
రిజిస్ట్రార్లు, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ లైబ్రేరియన్లు, జూనియర్ కోర్టు అసిస్టెంట్లు, చాంబర్ అటెండెంట్లు ఈ రిజర్వేషన్లకు అర్హులు. న్యాయమూర్తులకు ఇవి వర్తించవు. రిజర్వేషన్ విధానంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ స్పందించారు. ప్రభుత్వ సంస్థలు, వివిధ హైకోర్టుల్లో రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని గుర్తుచేశారు. సుప్రీంకోర్టునూ అమల్లోకి తీసుకురావడం సరైన నిర్ణయమని అభిప్రాయడ్డారు. సుప్రీంకోర్టులో రెండో దళిత ప్రధాన న్యాయమూర్తిగా ఆయన రికార్డుకెక్కిన సంగతి తెలిసిందే. దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం పెంచడానికి ఈ రిజర్వేషన్లు దోహదపడతాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.