st reservation
-
తుది తీర్పునకు లోబడే గ్రూప్–1 ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి గ్రూప్–1 అభ్యర్థులు దాఖలు చేసిన కేసులో తుది తీర్పునకు లోబడే ఫలితాలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ల వినతిని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు సూచించింది. గ్రూప్–1 ప్రాథమిక పరీక్ష ఫలితాల వెల్లడికి ముందే సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ 2022, సెప్టెంబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 33ను విడుదల చేసిందని.. కొత్త రిజర్వేషన్ల మేరకు మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ.. మెదక్ జిల్లా సర్ధనా హవేలీఘన్పూర్ పోచమ్మరాల్ తండాకు చెందిన జీ. స్వప్న సహా మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. పరిపాలనా విభాగం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)ని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. ఈ జీవోను వచ్చే ఆదివారం జరిగే ప్రాథమిక పరీక్షకు వర్తింపజేయాలని కోరారు. 503 పోస్టులను భర్తీ చేయడం కోసం ఈ ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. పెంచిన రిజర్వేషన్లకు అనుగుణంగా రోస్టర్ పాయింట్ల నిర్ణయించకుండానే గ్రూప్–1 ప్రిలిమినరీ నిర్వహిస్తున్నారని.. పాయింట్లు కేటాయిస్తే ఎస్టీ అభ్యర్థులకు రిజర్వేషన్ కోటా కింద దాదాపు 50 పోస్టులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రస్తుతం ప్రాథమిక పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించారు. అయితే తుది ఫలితాలు మాత్రం తీర్పునకు లోబడే ఉంటాయని పేర్కొంటూ..విచారణ వాయిదా వేశారు. -
గిరిజన రిజర్వేషన్లు పెంచండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు 6.5 శాతంగా ఉన్నాయని, జనాభా ప్రాతిపదికన పరిశీలిస్తే రిజర్వేషన్లు 9.08 శాతంగా ఉండాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు, రాష్ట్ర ప్రభుత్వ తీర్మానం కేంద్రానికి సమర్పించినట్లు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు పెంచుతామని పేర్కొన్నారు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో గురువారం జరిగిన నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ కాన్క్లేవ్లో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రిజర్వేషన్ల అంశంతో పాటు రాష్ట్రానికి మంజూరు చేసిన గిరిజన యూనివర్సిటీ ప్రారంభం అంశాన్ని కూడా ప్రస్తావించారు. కేంద్రం త్వరితంగా అనుమతులిస్తే వర్సిటీని అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్రంలో 50 శాతానికి పైగా గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ స్కూళ్లను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
పంచాయతీలకు 39 నామినేషన్లు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఖాళీగా ఉన్న సర్పంచ్, వార్డు సభ్యు ల పదవులకు జిల్లావ్యాప్తంగా 39 నామినేష న్లు దాఖలయ్యాయి. సంగారెడ్డి మండలం చింతలపల్లి సర్పంచ్ ఎస్టీ జనరల్కు రిజర్వు కాగా ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కౌడిపల్లి రాయిలాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. 21 వార్డులకు గాను 35 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల మూడో తేదీన ప్రారంభమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారంతో ముగిసింది. పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ అనంతరం ఈ నెల 10న బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. సంగారెడ్డి మండలం చింతలపల్లి పంచాయతీ సర్పంచ్ పదవితో పాటు ఒకటో వార్డును ఎస్టీలకు రిజర్వు చేశారు. గతంలోనూ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. ప్రస్తుతం కూడా ఎవరూ నామినేషన్ వేసేందుకు ముందుకు రాలేదని అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 21 వార్డులకు గాను, 9 చోట్ల ఒక్కరు చొప్పున నామినేషన్లు వేశారు. మునిపల్లి మండలం పెద్దచల్మెడ 10వ వార్డు, మెదక్ మండలం వాడిలోని ఆరో వార్డుకు ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు. ఒకరు కంటే ఎక్కువ మంది బరిలో ఉన్న చోట ఈ నెల 18న ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.