విద్యాశాఖ అధికారుల ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు
నకిలీ ధ్రువీకరణ పత్రంతో టీచర్ ఉద్యోగం పొందిన మహిళకు రూ.లక్ష ఖర్చులు విధింపు
సాక్షి, అమరావతి: తనకు వినికిడి లోపం ఉందని నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించి దివ్యాంగుల కోటాలో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సంపాదించిన ఓ మహిళను సర్వీస్ నుంచి తొలగిస్తూ విద్యాశాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. సర్వీస్ నుంచి వెళ్లిపోయే స్వేచ్ఛను ఆ మహిళా టీచర్‌కు ఇస్తూ ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.
తనకు వినికిడి లోపం లేదని తెలిసి కూడా.. ఆ లోపం ఉన్నట్టు నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించి ఉద్యోగం పొందినందుకు ఆ మహిళకు రూ.లక్ష ఖర్చులు విధించింది. ఈ మొత్తాన్ని నెల రోజుల్లోపు విశాఖపట్నంలో వినికిడి లోపంతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేక స్కూల్ నిర్వహిస్తున్న ఓంకార్ అండ్ లయన్స్ ఎడ్యుకేషనల్ సొసైటీకి చెల్లించాలని ఆ మహిళను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.
కేసు పూర్వాపరాలివీ
2012లో నిర్వహించిన డీఎస్సీలో దివ్యాంగుల కోటా (వినికిడి లోపం) కింద స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు జి.వెంకటనాగ మారుతి అనే మహిళ ఎంపికయ్యారు. అంతకు ముందు ఆమె తనకు 70 శాతం వినికిడి వైకల్యం ఉందని దరఖాస్తులో పేర్కొన్నారు. దీంతో ఆమె ప్రకాశం జిల్లా పి.నాగులవరం జెడ్పీ హైసూ్కల్‌లో స్కూల్ అసిస్టెంట్‌గా నియమితులయ్యారు. అయితే.. వినికిడి లోపానికి సంబంధించి ఆమె సమర్పించిన ధ్రువీకరణ పత్రంపై ఫిర్యాదు రావడంతో విచారణ జరిపిన విద్యాశాఖ అధికారులు ఆమెను సర్వీసు నుంచి తొలగిస్తూ 2015 మార్చిలో ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ మారుతి ఏపీఏటీలో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్ మారుతిని సర్వీసు నుంచి తొలగిస్తూ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది.
స్వచ్ఛందంగా ఉద్యోగం నుంచి వెళ్లిపోయేందుకు ఆమెకు అవకాశం ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తూ 2017లో తీర్పునిచ్చింది. ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ ఆమె 2018లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ తిల్హరీ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల తుది విచారణ జరిపింది. దివ్యాంగుల కోటా కిందకు తాను రానని తెలిసి కూడా నాగ మారుతి అదే కోటా కింద దరఖాస్తు చేసి తప్పుడు వివరాలు పొందుపరచి, నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించి ఉద్యోగం పొందారని ధర్మాసనం తేల్చింది. ఉద్యోగం పొందేందుకు పిటిషనర్ మోసపూరితంగా వ్యవహరించారని స్పష్టం చేసింది.
ఉద్యోగం నుంచి తొలగించాల్సి ఉండగా, స్వచ్ఛందంగా ఉద్యోగం నుంచి వెళ్లిపోయేందుకు అమెకు వెసులుబాటు కల్పించాలని అధికారులను ట్రిబ్యునల్ ఆదేశించడం పట్ల విస్మయం వ్యక్తం చేసింది. అమెను సర్వీసు నుంచి తొలగిస్తూ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు సబబేనంది.
Comments
Please login to add a commentAdd a comment