Fake Certificates
-
ఉద్యోగం నుంచి తొలగించడం సబబే
సాక్షి, అమరావతి: తనకు వినికిడి లోపం ఉందని నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించి దివ్యాంగుల కోటాలో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సంపాదించిన ఓ మహిళను సర్వీస్ నుంచి తొలగిస్తూ విద్యాశాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. సర్వీస్ నుంచి వెళ్లిపోయే స్వేచ్ఛను ఆ మహిళా టీచర్‌కు ఇస్తూ ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.తనకు వినికిడి లోపం లేదని తెలిసి కూడా.. ఆ లోపం ఉన్నట్టు నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించి ఉద్యోగం పొందినందుకు ఆ మహిళకు రూ.లక్ష ఖర్చులు విధించింది. ఈ మొత్తాన్ని నెల రోజుల్లోపు విశాఖపట్నంలో వినికిడి లోపంతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేక స్కూల్ నిర్వహిస్తున్న ఓంకార్ అండ్ లయన్స్ ఎడ్యుకేషనల్ సొసైటీకి చెల్లించాలని ఆ మహిళను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.కేసు పూర్వాపరాలివీ2012లో నిర్వహించిన డీఎస్సీలో దివ్యాంగుల కోటా (వినికిడి లోపం) కింద స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు జి.వెంకటనాగ మారుతి అనే మహిళ ఎంపికయ్యారు. అంతకు ముందు ఆమె తనకు 70 శాతం వినికిడి వైకల్యం ఉందని దరఖాస్తులో పేర్కొన్నారు. దీంతో ఆమె ప్రకాశం జిల్లా పి.నాగులవరం జెడ్పీ హైసూ్కల్లో స్కూల్ అసిస్టెంట్‌గా నియమితులయ్యారు. అయితే.. వినికిడి లోపానికి సంబంధించి ఆమె సమర్పించిన ధ్రువీకరణ పత్రంపై ఫిర్యాదు రావడంతో విచారణ జరిపిన విద్యాశాఖ అధికారులు ఆమెను సర్వీసు నుంచి తొలగిస్తూ 2015 మార్చిలో ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ మారుతి ఏపీఏటీలో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్ మారుతిని సర్వీసు నుంచి తొలగిస్తూ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. స్వచ్ఛందంగా ఉద్యోగం నుంచి వెళ్లిపోయేందుకు ఆమెకు అవకాశం ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తూ 2017లో తీర్పునిచ్చింది. ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ ఆమె 2018లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ తిల్హరీ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల తుది విచారణ జరిపింది. దివ్యాంగుల కోటా కిందకు తాను రానని తెలిసి కూడా నాగ మారుతి అదే కోటా కింద దరఖాస్తు చేసి తప్పుడు వివరాలు పొందుపరచి, నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించి ఉద్యోగం పొందారని ధర్మాసనం తేల్చింది. ఉద్యోగం పొందేందుకు పిటిషనర్ మోసపూరితంగా వ్యవహరించారని స్పష్టం చేసింది. ఉద్యోగం నుంచి తొలగించాల్సి ఉండగా, స్వచ్ఛందంగా ఉద్యోగం నుంచి వెళ్లిపోయేందుకు అమెకు వెసులుబాటు కల్పించాలని అధికారులను ట్రిబ్యునల్ ఆదేశించడం పట్ల విస్మయం వ్యక్తం చేసింది. అమెను సర్వీసు నుంచి తొలగిస్తూ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు సబబేనంది. -
పూజా ఖేడ్కర్‌పై కేంద్రం సీరియస్
ముంబై: కంటిచూపు లోపాలు, మానసిక, శారీరక వైకల్యం ఉందంటూ యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్లు సమర్పించడం, నాన్ క్రీమీలేయర్ పత్రాల దురి్వనియోగం, ఎంబీబీఎస్‌లో చేరేందుకు తప్పుడు పత్రాల సృష్టి.. ఇలా పలు వివాదాలకు కేంద్రబిందువైన 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా మనోరమ దిలీప్ ఖేడ్కర్ వ్యవహారంపై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.తక్షణం మహారాష్ట్రలో ఆమెకు జిల్లా శిక్షణను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. తిరిగి ముస్సోరీలోని లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అడ్మిని్రస్టేషన్ అకాడమీలో రిపోర్ట్‌చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు పూజకు మహారాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి నితిన్ గాడ్రే లేఖ రాశారు. ‘‘ మహారాష్ట్రలో వాసిం జిల్లా సూపర్‌న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో ఉన్న మిమ్మల్ని తక్షణం ‘జిల్లా శిక్షణ’ నుంచి పక్కనపెడుతున్నాం. 23వ తేదీలోపు మళ్లీ ముస్సోరీ ఐఏఎస్ అకాడమీలో రిపోర్ట్చేయండి. అకాడమీ తీసుకునే చర్యలకు సిద్దంగా ఉండండి’’ అని ఆమెకు పంపిన లేఖలో నితిన్ పేర్కొన్నారు. ప్రత్యేక వసతులతో వార్తల్లోకి..ట్రైనీ అయినాసరే జిల్లా కలెక్టర్ స్థాయిలో తనకూ అధికారిక సదుపాయాలు, వసతులు కలి్పంచాలని డిమాండ్‌చేయడంతో పూజ వ్యవహార శైలి తొలిసారిగా వార్తల్లోకి ఎక్కింది. ప్రత్యేకంగా ఆఫీస్‌ను కేటాయించాలని, అధికారిక కారు ఇవ్వాలని డిమాండ్చేయడంతోపాటు సొంత ఖరీదైన కారుపై ఎర్ర బుగ్గను తగిలించుకుని తిరిగారు. దీంతో పుణెలో అసిస్టెంట్ కలెక్టర్ హోదా నుంచి ఆమెను వాసిమ్ జిల్లాలో సూపర్‌న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా ప్రభుత్వం బదిలీచేసింది.తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి సివిల్స్‌లో ఆమె ఆలిండియా 821వ ర్యాంక్ సాధించారని మీడియాలో వార్తలొచ్చాయి. దాంతో యూపీఎస్సీకి ఆమె సమర్పించిన వైకల్యం సర్టీఫికెట్లు, అఫిడవిట్ల విశ్వసనీయతపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో ఈ విషయంలో నిజానిజాలను నిగ్గుతేల్చాలని కేంద్రప్రభుత్వ ఏకసభ్య కమిటీని నియమించింది. రెండు వారాల్లోగా నివేదించాలని ఆదేశించింది. ఆదివారం పుణె పోలీసులు పూజ లగ్జరీకారును సీజ్‌చేశారు. తప్పుడు పత్రాలతో ఎంబీబీఎస్ సీటు సాధించారని విమర్శలు వెల్లువెత్తాయి. సోమవారం అర్ధరాత్రి పూజ ఇంటికి మహిళా పోలీసులు వెళ్లారు. కొంచెం పని ఉందని చెప్పి ఆమే వారిని పిలిపించినట్లు తెలుస్తోంది. అయితే పుణె కలెక్టర్ సుహాస్ దవాసే తనను వేధిస్తున్నారని ఫిర్యాదు చేసేందుకే వారిని ఇంటికి పిలిపించిందని పోలీసు అధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు. కాగా 2022 ఆగస్ట్‌లో పుణె జిల్లా పింప్రి ఆస్పత్రిలో ఎడమ మోకాలికి వైకల్యం ఉందని ఆమె వికలాంగ సర్టీఫికెట్ సంపాదించారని యశ్వంత్రావ్ చవాన్ స్మారక ప్రభుత్వాసుపత్రి డీన్ రాజేంద్ర వాబ్లే వెల్లడించారు. అయితే అదే నెలలో ఔధ్ ప్రభుత్వాసుపత్రిలో వైకల్య సరిఫికెట్ కోసం పెట్టుకున్న ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైందని తెలుస్తోంది. ‘‘కమిషనర్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఆదేశాల మేరకు పూజ గతంలో సమర్పించిన వైకల్య సర్టీఫికెట్లు అన్నింటినీ పరిశీలిస్తాం. ఆమెకు కంటి, మానసిక, అంగ వైకల్యం ఉందని ధ్రువపరిచిన ఆస్పత్రులు, వైద్యులెవరో తేలుస్తాం’ అని పుణె పోలీసు అధికారి వెల్లడించారు. పరారీలో తల్లిదండ్రులు ! తల్లిదండ్రులకు కోట్ల రూపాయల ఆస్తులున్న విషయాన్ని దాచి పెట్టి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్‌ను సంపాదించారనీ పూజపై ఆరోపణలున్నాయి. పూజ తల్లిదండ్రుల వ్యవహారశైలిపైనా మీడియాలో వార్తలొచ్చాయి. గ్రామ సర్పంచ్ అయిన పూజ తల్లి మనోరమ ఒక భూవివాదంలో కొందరిని గన్‌తో బెదిరిస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. క్రిమినల్ కేసులో తల్లిదండ్రుల జాడ కోసం పోలీసులు వెతుకుతున్నారు. వారిద్దరి మొబైల్స్ స్విచ్చాఫ్ చేసి ఉన్నాయి. పుణెలోని మెట్రో రైల్ కారి్మకులతో గొడవ పడుతున్న వీడియో కూడా సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
వేల కార్లు చోరీ, నకిలీ జడ్జి అవతారం, 2 వేల క్రిమినల్స్ రిలీజ్
చదివింది లా. కానీ వృత్తి మాత్రం దొంగతనం.చేతివ్రాత నిపుణుడు, గ్రాఫాలజీలో కోర్సు కూడా చేసాడు. కానీ చోరీలు చేయడంలో అతని ట్రాక్ రికార్డ్ చూస్తే ఔరా అంటారు. పోలీసులను సైతం బురిడీ కొట్టించడంలో అతని తర్వాతే మరెవ్వరైనా. దొంగతనంలో ఈ విధంగా ఆరితేరిన ప్రపంచంలోనే తొలి, ఏకైక వ్యక్తి. నకిలీ పత్రాలను ఉపయోగించి ఏకంగా జడ్జ్ అయిపోయాడు. 2000 మంది నేరస్థులను విడుదల చేశాడు. ఆశ్చర్యంగా ఉంది కదా..ఈ స్టోరీ ఏంటో తెలుసుకుందాం రండి. అతగాడి పేరే ధన్ రామ్ మిట్టల్...అత్యంత దుర్మార్గపు దొంగ. ఓ కారు దొంగతనం సందర్బంగా ధనిరామ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతను చెప్పిన విషయాలు విని పోలీసులు సైతం ఖంగుతిన్నారు. జడ్డిగా, ట్రాన్స్ పోర్టు అధికారిగా, రైల్వే స్టేషన్ మాష్టరుగా పక్కనున్నోడికి కూడా అనుమానం రాకుండా తన దందా కొనసాగించాడు. 1960 ప్రాంతంలో రోహ్ తక్ కోర్టులో క్లర్కుగా విధులు నిర్వర్తించాడు. క్లర్కుగా పనిచేస్తున్న సమయంలో అక్కడి జడ్జి రెండు నెలలు లీవులో ఉన్నాడు. దీంతో నకిలీ పత్రాల సాయంతో ఏకంగా తానే జడ్జి అవతారం ఎత్తేశాడు ధన్ రామ్. ఈ రెండు నెలల కాలంలో దాదాపు 2 వేలమంది నేరస్థులును విడుదల చేశాడు. అంతే కాదు చాలా మందిని జైల్లో కూడా పెట్టాడు.ఆ తర్వాత విషయం బయటపడే సమయానికి మనోడు పరార్. తర్వాత ఆయన కేసులన్నింటినీ మరోసారి విచారించి తీర్పులు వెలువరించారు. అతని కోసం పోలీసులు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఆ తర్వాత రీజనల్ ట్రాన్స్‌పోర్టు అధికారిగాను అవతారమెత్తి కారు డాక్యుమెంట్లపై ఫోర్జరీ సంతకాలు పెట్టేశాడు. రోహ్ తక్ రైల్వే స్టేషన్ లోనే రైల్వే అధికారులను సైతం బురిడీ కొట్టించి స్టేషన్ మాష్టరు కొలువు దక్కించుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతని అరాచకాలకు లెక్కే లేదు. 25 ఏళ్ల వయసులో దొంగతనాల ద్వారా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. దొంగతనం రుచిమరిగిన అతగాడు ఇక అక్కడనుంచి వరసగా దొంగతనాలతో పోలీసులకు చుక్కలు చూపించాడు. కానీ ధని రామ్ 1964లో తొలిసారి జైలుకి వెళ్లాడు. కథ ఇక్కడితో అయి పోలేదు. వరుసగా అరెస్టులవుతూ , విడుదలవుతూ అలా ఇప్పటివరకు 25 సార్లు అరెస్టు అయిన ధని రామ్ అత్యధికంగా అరెస్టయిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్. సమీప ప్రాంతాలలో కార్ల దొంగతనంలో కూడా మహా ముదురు. ఏ కారును పడితే ఆ కారును దొంగిలించడు. కేవలం ఎస్టీమ్, మారుతి 800, హుందాయ్ శాంత్రో తదితర సెక్యూరిటీ అలారం లేని కార్లను మాత్రమే దొంగతనం చేస్తుంటాడు. అదీ పట్టపగలు. వాటిని సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్మేస్తాడు. ఒకవేళ పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లినా తగ్గేదేలే అంటాడు. మళ్లీ అదే తంతు. 81 సంవత్సరాలు మీద పడ్డా కూడా.. ఇప్పుడెక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. ధని రామ్ ఎప్పటికి చోరీలకు ఫుల్ స్టాప్ పెడుతాడో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. -
నకిలీ డాక్టర్లకు చెక్..
సాక్షి, హైదరాబాద్: అర్హత లేకున్నా వైద్యులుగా ప్రాక్టీస్ చేస్తున్న వారిపై, అక్రమంగా ఆసుపత్రులు నడుపుతున్నవారిపైనా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టీఎస్ఎంసీ) ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌లో అర్హత లేకున్నా ప్రాక్టీస్ చేస్తున్న రెండు ఆసుపత్రు లకు ఇటీవలే ఎన్నికైన కొత్త మండలి నోటీసులు జారీ చేసింది. సదరు ఆసుపత్రుల్లో యాంటీబయా టిక్స్, స్టెరాయిడ్స్ వంటి షెడ్యూల్డ్ డ్రగ్స్‌ను గుర్తించి ఈ మేరకు వాటిపై కేసులు నమోదు చేసింది. ఇంకా అనేక చోట్ల నకిలీ వైద్యుల దందాపై దాడులకు శ్రీకారం చుట్టింది. డాక్టర్లుగా చెప్పుకునే ఆర్ఎంపీలపై క్రిమినల్ కేసులు పెడతామని మండలి హెచ్చరించింది. పేరుకు ముందు ‘డాక్టర్’ హోదా పెట్టుకున్నా, ఆసుపత్రి అని రాసి ఉన్న బోర్డులు ప్రదర్శించినా, రోగులకు ప్రిస్క్రిప్షన్ రాసినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఆర్ఎంపీల ముసుగులో రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలు 30 వేల మంది వర కు ఉన్నారని ఓ అంచనా. ప్రతీ గ్రామంలో వారు ప్రాక్టీస్ చేస్తుంటారు. అయితే కొంతమంది నకిలీ సర్టిఫికెట్లతో ఆర్ఎంపీలు, పీఎంపీల ముసుగులో డాక్టర్లుగా చెలామణీ అవుతూ.. ఇష్టారాజ్యంగా అబార్షన్లు చేయడం, అత్యధిక మోతాదులో ఉన్న యాంటీబయాటిక్స్ ఇవ్వడం, చిన్న రోగాలకు కూడా అధికంగా మందులు రాస్తున్నారని మండలి గుర్తించింది. ఇటీవల నగరంలోని మలక్‌పేట్ ప్రాంతంలో నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను కలిగి ఉన్న ఒక అర్హతలేని ప్రాక్టీషనర్ ప్రిస్క్రిప్షన్‌ను పరిశీలిస్తే, శిశువుకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ మెరోపెనెమ్ రాయడం చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. సహజంగా శిశువులకు ఉపయోగించే యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు పెద్దలకు ఉప యోగించేవి కాకుండా ప్రత్యేకంగా ఉంటాయి. పెద్ద లకు వాడే ఇంజెక్షన్లు శిశువుకు ప్రాణాంతకంగా మారతాయి. మలక్‌పేటలోని ఆ నకిలీ డాక్టర్ మాది రిగానే చాలామంది నకిలీ డాక్టర్లు మానసిక ఔష ధాల ప్రిస్క్రిప్షన్‌లోనూ ఇష్టారాజ్యంగా మందులు రాస్తున్నారని తేలింది. ఈ నేపథ్యంలో నకిలీ డిగ్రీని ప్రదర్శించడం, అర్హత లేకున్నా ప్రిస్క్రిప్షన్లు రాయ డం వంటి దృష్టాంతాలను మండలి తీవ్రంగా తీసు కుంది. మరోవైపు అడ్డగోలుగా అల్లోపతి మందు లను సూచిస్తున్న ఇద్దరు నకిలీ ఆయుష్ వైద్యులను గుర్తించి వారిపై ఆయుష్ శాఖకు లేఖ రాసింది. ఇక నకిలీ వైద్యుల ఆగడాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) సాయాన్ని కూడా తీసుకోవాలని మండలి నిర్ణయించింది. నకిలీ ప్రైవేట్ ప్రాక్టీషనర్ల ద్వారా రోగులకు మందులు అందకుండా చేయాలని నిర్ణయించింది. -
అమెరికా నుంచి నకిలీ సర్టిఫికెట్
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో ఉంటున్న ఓ స్నేహితుడు నకిలీ డిగ్రీ సర్టిఫికెట్తో తన మిత్రుడిని అమెరికాకు రప్పించేందుకు యత్నించగా విఫలమై.. కటకటాలపాలయ్యాడు. స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కర్మన్‌ఘాట్‌కు చెందిన పులిపాటి మణికంఠ బీటెక్ ఫెయిలయ్యాడు. ఉద్యోగ వెతుకులాటలో ఉన్నాడు. ఈ క్రమంలో అమెరికాలో ఉంటున్న తన స్నేహితుడు జనార్దన్ సూచన మేరకు మేఘాలయ – షిల్లాంగ్‌లోని విల్లియం కార్వే యూనివర్సిటీ నుంచి నకిలీ డిగ్రీ సరి్టఫికెట్ పొందాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో జనార్దన్ సూచన మేరకు నకిలీ విద్యార్హత పత్రాల తయారీదారు నరే‹Ùను కలిశాడు. అతడిని సంప్రదించి రూ.1.6 లక్షలు చెల్లించి విల్లీయం కార్వే యూనివర్సీటీకి చెందిన నకిలీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ సర్టిఫికెట్ పొందాడు. ఈమేరకు విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు బుధవారం మణికంఠను అరెస్టు చేశారు. నరేష్, జనార్దన్‌లు పరారీలో ఉన్నారు. నిందితుడి నుంచి బీఎస్సీ సరి్టఫికెట్‌తో పాటు మూడు మార్క్స్ మెమోలు, ప్రొవిజనల్ సర్టిఫికెట్ , మైగ్రేషన్ సర్టిఫికెట్, సీఎంఎం సర్టిఫికెట్ , టీసీ, రెండు ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. -
'అంగట్లో సర్టిఫికెట్లు' డబ్బు ఇచ్చారంటే.. తెలంగాణదైనా..! ఏపీదైనా..!
మహబూబ్‌నగర్: మీకు పుట్టిన తేదీ తెలియదా.. మీ కూతురికి పెళ్లి వయసు లేకపోయినా కల్యాణలక్ష్మి పథకం కోసం వయస్సు పెంచిన ఆధార్ కార్డు కావాలా.. బీమా సొమ్ము కోసం మరణ ధ్రువీకరణ పత్రం కావాలా.. మీరు చేయాల్సిందంతా ఒక్కటే ప్రభుత్వ ఆధార్ సెంటర్ పేరుతో నకిలీ దందా చేస్తున్న వారిని సంప్రదిస్తే చాలు. వారికి అడిగినంత సొమ్ము ఇచ్చారంటే మీకు కావాల్సిన సర్టిఫికెట్ మీ ముందుంటుంది. అది తెలంగాణకు చెందినదైనా, ఏపీదైనా. ఈ నకిలీ దందా జరుగుతోంది ఎక్కడో కాదు, జోగుళాంబ గద్వాల జిల్లాలోనే. ‘సాక్షి’ పరిశోధనలో ఇటీవల ఈ నకిలీ ధ్రువపత్రాల దందా వెలుగులోకి వచ్చింది. అవసరాలే ఆసరాగా నకిలీవి సృష్టిస్తూ.. ప్రస్తుతం ప్రతి పథకంలో కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా అవసరముంది. అయితే, గతంలో వివిధ ఆసుపత్రుల్లో ప్రసవాలు అయిన వారు తమ పిల్లల జనన తేదీలను నమోదు చేసుకోలేదు. వారికి ఇప్పుడు ఆధార్‌కార్డు అవసరం ఉండటంతో వారి జనన ధ్రువీకరణ పత్రాలను ఆధార్ కేంద్రం పేరుతో నడుపుతున్న వారు తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జోగుళాంబ గద్వాల ఆస్పత్రి ఇచ్చినట్లు ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తున్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రం జనన ధ్రువీకరణ పత్రాలన్నీ మీసేవల ద్వారానే అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఏపీలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ శాఖ ద్వారా జనన ధ్రువీకరణ పత్రం అందిస్తుండగా.. అక్కడి ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ పేరుతో కర్నూల్ జనరల్ హాస్పిటల్లో జన్మించినట్లుగా జనన ధ్రువీకరణ పత్రాన్ని అందించి అటు ప్రజలను, ఇటు అధికారులను మోసం చేస్తున్నారు. అసలు నకిలీ పత్రాలను అప్లోడ్ చేస్తున్నా, అధికారులు పరిశీలించడం లేదా? లేక అధికారులకు తెలిసే జరుగుతుందా అనే అను మానాలెన్నో ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలో వందల సర్టిఫికేట్లు, కర్నూల్ జిల్లాలోని వారికి సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులుగా ఈ దందా సాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలకు దారి తీస్తుంది. అవి నకిలీ ధ్రువపత్రాలు.. రాష్ట్ర ప్రభుత్వం పేరుతో ఇచ్చిన ధ్రువీకరణ పత్రం పూర్తిగా నకిలీది. ప్రస్తుతం జనన ధ్రువీకరణ పత్రాలు అన్ని మీసేవల ద్వారానే అందుతున్నాయి. కొందరు ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని చేసే వాటిని సంబంధిత అధికారులు పర్యవేక్షించాలి. ప్రజలు కూడా మోసపోకూడదు. – డాక్టర్ కిషోర్, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వాసుపత్రి దందా జరుగుతోందిలా.. కేవలం పాఠశాలల విద్యార్థులకు, వారి ఆధార్ వివరాలు నమోదు చేయడం కోసం సర్వశిక్షా అభియాన్ ద్వారా జిల్లాలోని పలు విద్యా సంస్థల వద్ద ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ మార్కెట్లో నెట్వర్క్ సేవల పేరుతో పెద్దఎత్తున షాపులు తెరిచి, అక్కడ ఆధార్ కార్డులు, పేరు మార్పిడి, కొత్త కార్డులు తదితర సవరణలు చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ, ఆధార్ కార్డులో సవరణల కోసం, కొత్త కార్డుల కోసం జనన ధ్రువీకరణ పత్రాలు అవసరముంటుంది. నిబంధనల ప్రకారం గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లకుండా నేరుగా ఆసుపత్రి నుండే ధ్రువీకరణ పత్రాలు వచ్చినట్లు నకిలీ పత్రాలను తయారు చేసి, వాటిని ప్రామాణికంగా తీసుకుని ఆధార్ కార్డు డౌన్లోడ్ చేస్తున్నారు. దీని కోసం రూ.5వేల నుంచి అత్యవసరమైతే మరింత ఎక్కువ వసూలు చేస్తున్నట్లు సమాచారం. ‘సాక్షి’ పరిశోధనలో ఇలాంటి నకిలీ ధ్రువీకరణ పత్రాలు చాలానే బయటపడ్డాయి. ఆధార్ సైట్లో ఉన్న లొసుగులను వాడుకుంటూ తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. దానికి అమాయక ప్రజలు బలైపోతున్నారు. రూ.వేలకు వేలు డబ్బులు చిల్లు పెట్టుకుని తీరా అది నకిలీవి అని తెలిసినా చేసేదేమి లేక మౌనంగా ఉండిపోతున్నారు. -
హైదరాబాద్ లో నకిలీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు కలకలం
-
బ్యాడ్మింటన్ క్రీడలో తప్పుడు డేట్ ఆఫ్ బర్త్‌లు.. వయసు మార్చి గోల్మాల్!
-శ్రీరంగం కామేష్, సాక్షి ప్రతినిధి బ్యాడ్మింటన్‌లో ఓ వయస్సు క్రీడాకారుడు అదే ఏజ్ గ్రూప్‌లో ఉండే మరో ఆటగాడితో పోటీ పడాలి. నిబంధనలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అలా జరిగినప్పుడే సరైన పోటీ అన్పించుకుంటుంది. వయస్సులో తేడాలున్నప్పుడు ఆటలోని అనుభవాన్ని బట్టి ప్రతిభా సామర్థ్యాల్లో సైతం తేడా ఉండేందుకు అవకాశం ఉంటుంది. పతకాలు, ర్యాంకుల్ని సైతం ప్రభావితం చేస్తుంది. ఇంతటి కీలకమైన వయస్సు నిబంధనకు తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు జాతీయ స్థాయి ఉత్తమ ర్యాంకర్లు తూట్లు పొడిచారు. తమ పుట్టిన తేదీ విషయంలో భారీ స్కామ్‌కు పాల్పడ్డారు. తమ వాస్తవ వయస్సును తగ్గించేసి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు (బీఏఐ) తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారు. ఈ మేరకు అందిన ఆకాశరామన్న ఉత్తరం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్ సెంట్రల్ క్రైౖమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు ముగ్గురి విషయంలో ఈ అక్రమాలను నిర్ధారించారు. సమగ్ర ఆధారాలతో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్‌కు లేఖ రాశారు. కానీ వారు ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఉత్తరం ఆధారంగా.. ఈ స్కామ్‌కు సంబంధించిన సమాచారాన్ని సిటీ సీసీఎస్ పోలీసులకు ఓ అజ్ఞాత వ్యక్తి లేఖ ద్వారా అందజేశారు. ఈ ఏడాది మార్చి 29న అందిన ఈ లేఖలో ఆరుగురు క్రీడాకారులపై ఆరోపణలున్నాయి. వీరు తమ అసలు వయస్సును దాచి పెట్టి నకిలీ సర్టిఫికెట్ల సృష్టించి బీఏఐకి సమర్పించారని, తద్వారా తమ కంటే చిన్న వారితో పోటీల్లో తలపడుతూ మెడల్స్, జాతీయ స్థాయి ర్యాంకులు సాధిస్తున్నారని అతను ఆరోపించారు. దీనివల్ల నిబంధనలు పాటించిన క్రీడాకారులకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే బీఏఐకి అనేకమంది నుంచి ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. సమగ్ర దర్యాప్తు చేసిన సీసీఎస్.. కేవలం ఈ ఆరుగురే కాకుండా దాదాపు 40 మంది బ్యాడ్మింటన్ ఆటగాళ్ల వయస్సు విషయంలో తమకు సందేహాలు ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తి ఆ లేఖలో పేర్కొన్నారు. వీరిలో చాలామంది 2005–10 మధ్య పుట్టారని, అయితే జనన ధ్రువీకరణ పత్రాలకు బదులుగా కొందరు వైద్యులు ఇచ్చిన బోగస్ మెడికల్ సర్టిఫికెట్లు దాఖలు చేసి తమ వయస్సు తగ్గించుకున్నారని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రీడాకారులకు తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది కోచ్‌లు, వారి తల్లిదండ్రులతో పాటు ఈ వైద్యుల సహకారం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ లేఖను సిటీ పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్ కె.చంద్రకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. చదవండి: BWF Rankings: తొమ్మిదో ర్యాంక్‌కు ప్రణయ్.. పీవీ సింధు మాత్రం.. ముగ్గురి విషయంలో ఆధారాలు లభ్యం... సీసీఎస్ ప్రత్యేక బృందానికి తొలి దశలోనే ముగ్గురు క్రీడాకారులకు సంబంధించిన సమగ్ర ఆధారాలు లభించాయి. బీఏఐ జాబితాలో అండర్–17 కేటగిరీలో 1176 పాయింట్లతో మూడో ర్యాంకులో ఉన్న రోహన్‌కుమార్ ఆనంద్‌దాస్ రాజ్‌కుమార్ తాను పుట్టిన తేదీని 2007 జనవరి 29గా పేర్కొంటూ బీఏఐకి సర్టిఫికెట్లు సమర్పించి టోర్నమెంట్లలో ఆడాడు. వాస్తవానికి రోహన్ పుట్టిన తేదీ 2005 అక్టోబర్ 29గా పోలీసులు నిర్ధారించారు. ఇదే కేటగిరీలో 92 పాయింట్లతో 44వ ర్యాంక్‌లో ఉన్న దవు వెంకట శివ నాగరామ్ మౌనీష్ తన పుట్టిన తేదీని 2007 జనవరి 29గా పేర్కొన్నారు. అయితే ఇతని అసలు పుట్టిన తేదీ 2006 జూన్4 అని దర్యాప్తులో తేలింది. అండర్–15 కేటగిరీలో 188 పాయింట్లతో 32వ ర్యాంక్‌లో ఉన్న భూక్యా నిషాంత్ తన పుట్టిన రోజును 2010 అక్టోబర్ 12గా పేర్కొనగా.. ఇతడి వాస్తవ పుట్టిన తేదీ 2007 జనవరి 12గా తేలింది. అయితే వీళ్లంతా మైనర్లు కావడంతో తమంతట తాముగా ఇలాంటి చర్యలకు పాల్పడలేరని, వాళ్ల కోచ్‌లు లేదా తల్లిదండ్రుల సహకారం, ప్రోద్బలంతోనే ఇలా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వారినే ఈ వ్యవహారంలో బాధ్యుల్ని చేయాలని భావిస్తున్నారు. ఏమాత్రం స్పందించని అసోసియేషన్.. ముగ్గురి బాగోతం బట్టబయలు కావడంతో ఇలాంటి వాళ్లు మరికొందరు ఉండి ఉంటారని పోలీసులు అనుమానించారు. అయితే ఈ వ్యవహారాన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలన్నా, బాధ్యుల్ని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఫిర్యాదు తప్పనిసరి. ఈ నేపథ్యంలో అన్ని వివరాలతో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్‌కు ఈ ఏడాది మే 25న ఓ లేఖ (నం.65/పీఈ/క్యాంప్/డీసీపీ/డీడీ/సీసీఎస్/డీడీ/2023) రాశారు. దీనిపై తగిన చర్యలు తీసుకుని తమకు తెలియజేయాల్సిందిగా డిటెక్టివ్ డిపార్ట్మెంట్ డీసీపీ కోరారు. కానీ అసోసియేషన్ ఇప్పటివరకు స్పందించక పోవడంతో వారికి తెలిసే ఈ స్కామ్ జరుగుతోందా? అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కామ్ దేశ వ్యాప్తంగా జరుగుతూ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. చదవండి: ఔటర్ చుట్టూ ఏడు ఇంటర్చేంజ్ మెట్రో స్టేషన్లు -
‘ఆ టీచర్ల డ్యూటీ సర్టిఫికెట్లు ఫేక్?’
జగిత్యాల: జిల్లాలో ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలకు పర్యవేక్షకులుగా సారంగాపూర్ మండలంలోని 10 మంది ఉపాధ్యాయులను మార్చి 15 నుంచి ఏప్రిల్ 1 వరకు రిలీవ్ చేశారు. దీంతో వారు మార్చి 14న మధ్యాహ్నం 2 గంటలకు సదరు పరీక్ష కేంద్రాల్లో రిపోర్ట్ సైతం చేశారు. కానీ వీరిలో కొందరు టీచర్లు అటు ఇంటర్మీడియట్ పరీక్షల పర్యవేక్షణకు, ఇటు పాఠశాలలకు వెళ్లలేదు. అన్నీ ప్రెజెంట్ అని వేసుకున్నారు.. ఇంటర్మీడియట్ పరీక్షల పర్యవేక్షణకు వెళ్లిన టీచర్లు తిరిగి పాఠశాలల్లో జాయిన్ అయ్యే సమయంలో హెచ్ఎంలకు, హెచ్ఎంలే అయితే ఎంఈవోలకు డ్యూటీ సర్టిఫికెట్లు అందజేయాల్సి ఉంటుంది. కానీ అవి అందజేయకుండానే ఉపాధ్యాయులు తమ విధుల్లో చేరారు. 15 రోజులకు సంబంధించిన జీతం సైతం తీసుకున్నారు. ‘సాక్షి’ దినపత్రికలో ‘ఇన్విజిలేషన్‌కు వెళ్లలేదు’ అనే శీర్షికన వార్త ప్రచురితం కావడంతో సంబంధిత ఎంఈవో ఈ నెల 15వ తేదీలోపు డ్యూటీ సర్టిఫికెట్లు అందించాలని వారిని ఆదేశించారు. దీంతో కొందరు అందజేశారు. వీరిలో పర్యవేక్షకులుగా పనిచేయనప్పటికీ ఫేక్ సర్టిఫికెట్ సృష్టించి, ఎంఈవోకు అందించినట్లు తెలిసింది. రిలీజ్ ఆర్డర్లో ఇంటర్మీడియట్ అధికారులు కంప్యూటర్ షీట్లో అబ్సెంట్, ప్రెజెంట్ వేశారు. కానీ కొందరు టీచర్లు వాటిని జిరాక్స్ తీసుకొని, చేతితో అన్నీ ప్రెజెంట్ అని వేసుకున్నారు. కాగా, మార్చి 15 నుంచి వీరు విధుల్లో చేరుతున్నట్లు ఉండగా డ్యూటీ సర్టిఫికెట్లో మాత్రం 10 నుంచే వెళ్లినట్లు పెట్టారు. అలాగే పేర్లను అధికారులు పెన్నుతో రాయగా కొందరు కంప్యూటర్ షీట్లో టైప్ చేసుకున్నారు. ఎవరి ఇష్టానుసారంగా వారు డ్యూటీ సర్టిఫికెట్లు తయారు చేసి, అందజేశారు. ఇవి ఫేక్ డ్యూటీ సర్టిఫికెట్లు అని స్పష్టంగా తెలుస్తోంది. పూర్తిస్థాయిలో విచారణ చేపడితే నిజానిజాలు బయటపడతాయన్న అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై సారంగాపూర్ ఎంఈవో భీమయ్యను వివరణ కోరగా డ్యూటీ సర్టిఫికెట్లు తీసుకొని, డీఈవోకు పంపించామని, ఆయన పరిశీలిస్తారని తెలిపారు. -
‘చార్మినార్’ నుంచే ఎక్కువ!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో జనన, మరణ ధ్రువీకరణ నకిలీ పత్రాలు అత్యధికంగా చార్మినార్ ప్రాంతం నుంచే జారీ అయినట్లు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు గుర్తించారు. జీహెచ్ఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కె.పద్మజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఏసీపీ ఎం.సందీప్‌రెడ్డి నేతృత్వంలోని బృందం దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సమగ్ర ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేస్తోంది. ఈ స్కామ్‌పై అంతర్గత విచారణ చేపట్టిన జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం ప్రాథమికంగా 50 కంటే ఎక్కువ జనన, 100 కంటే ఎక్కువ మరణ నకిలీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన ఈ–సేవ, మీ–సేవ కేంద్రాల పైనే దృష్టి పెట్టారు. అఫ్జల్‌గంజ్, అంబర్పేట్, ఆసిఫ్‌నగర్, బహదూర్‌పుర, బోయిన్పల్లి, చార్మినార్, చిక్కడపల్లి, చిలకలగూడ, గోల్కొండ, కాచిగూడ, మొఘల్‌పుర, ముషీరాబాద్, నల్లకుంట, సైదాబాద్, సైఫాబాద్, షాహినాయత్‌గంజ్, యాకత్‌పురల్లోని 25 కేంద్రాల నిర్వాహకులు ఇన్స్టంట్ అప్రూవల్ విధానాన్ని దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. వీళ్లు ఎలాంటి ధ్రువీకరణ లేని వారితో తెల్లకాగితాలు అప్లోడ్ చేయించి జనన, మరణ ధ్రువీకరణలు జారీ చేశారని తేలింది. శివార్లను కలిపితే మరింత అధికం.. ● మొత్తం 22,954 నకిలీ సర్టిఫికెట్లకుగాను చార్మినార్ ప్రాంతంలోని నాలుగు కేంద్రాల నుంచే 4512 (19.65 శాతం) జారీ అయినట్లు వెలుగులోకి వచ్చింది. అత్యధికంగా ఓవైసీ బిల్డింగ్‌లో ఉన్న కేంద్రం నుంచి 2913 జారీ కాగా... ముషీరాబాద్ ఎక్స్ రోడ్‌లోని కేంద్రం నుంచి 969 నకిలీ ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యాయి. 50, 100 కంటే ఎక్కువ జారీ చేసిన కేంద్రల సంఖ్య సిటీలోనే 25గా ఉందని, శివార్లతో కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. వీటి కంటే తక్కువ సంఖ్యలో జారీ చేసిన ఈ–సేవ, మీ–సేవ కేంద్రాల వివరాలను ఆరా తీస్తామని ఆయన స్పష్టం చేశారు. ● గతేడాది ఏప్రిల్ నుంచి మొత్తం 31,454 దరఖాస్తులు అప్లోడ్ కాగా.. 22,954 నకిలీ సర్టిఫికెట్లు జారీ అయ్యాయని, వీటిలో 21,085 జనన, 1869 మరణ ధ్రువీకరణ పత్రాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఈ తరహా దందా రాష్ట్ర వ్యాప్తంగా సాగినట్లు సీసీఎస్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ స్కామ్ దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన అధికారులు ఎలా ముందుకు వెళ్లాలనే అంశానికి సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేస్తున్నారు. దీన్ని ఉన్నతాధికారులకు సమర్పించడం ద్వారా వారి అప్రూవల్ తీసుకోనున్నారు. ఈ కుంభకోణంపై జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే ఈ–సేవ, మీ–సేవ కేంద్రాల ఈఎస్‌డీకీ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో వారి స్పందనను పోలీసులు పరిగణలోకి తీసుకోనున్నారు. వచ్చే వారం నుంచి ఆయా కేంద్రాల నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి విచారణ ప్రారంభించనున్నారు. -
ఫేక్ సర్టిఫికేట్ల వ్యవహారంపై జీహెచ్ఎంసీ కఠిన చర్యలు..
సాక్షి, హైదరాబాద్: బర్త్, డెత్ ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారంపై జీహెచ్ఎంసీ కఠిన చర్యలు చేపట్టింది. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిధ్దమైంది. మొత్తం నలుగురు బల్దియా ఉద్యోగులపై బదిలీ వేటు వేసింది. హెల్త్ విభాగం సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లను బదిలీ చేయాలని నిర్ణయించింది. స్టాటిస్టికల్ విభాగంలో ఏఎస్ఏ, డీఎస్ఓ లను సొంత డిపార్ట్ మెంట్లకు పంపించాలని నిర్ణయం తీసుకుంది. కంప్యూటర్ ఆపరేటర్ల నియామకంలో అవకతవకలపై మేయర్ విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ఆదేశించారు. పూర్తి విచారణ జరిపి నివేదిక అందజేయాలన్నారు. ఇలాంటివి పునరాృతం కాకుండా చూడాలని కమిషనర్, మిగతా అధికారులకు ఆదేశాలు పంపారు. ఏం జరిగిందంటే..? ఆన్లైన్లో బర్త్ సర్టిఫికెట్ వచ్చేలా సాఫ్ట్వేర్ రూపొందించింది జీహెచ్ఎంసీ. అయితే ఈ చర్య ద్వారా వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందనే విమర్శ ఇప్పుడు వినిపిస్తోంది. బర్త్‌తో పాటు డెత్ సర్టిఫికెట్లను ఎడాపెడా జారీ చేశారు ఇంటిదొంగలు. అలాగే.. నాన్ అవైలబిలిటీ పేరుతో గత మార్చి నెల నుంచి డిసెంబర్ దాకా 31 వేల సర్టిఫికెట్లు జారీ చేశారు. ఆ నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగానే కొందరికి పాస్ పోర్టులు, వీసాలు కూడా మంజూరు అయ్యాయి. వాటి ఆధారంగానే మరికొందరు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు . అంతేకాదు.. ఫేక్ డెత్ సర్టిఫికెట్లతో బీమా బురిడీ జరిగిందని గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో కంప్యూటర్ ఆపరేటర్లేదే కీలక పాత్రగా నిర్ధారించుకున్న పోలీసులు.. అలాగే మీ సేవా సిబ్బందితో కొందరు అధికారులు కుమ్మకై పత్రాలు జారీ చేసినట్లు గుర్తించారు. పోలీసుల చర్యలతో బయటపడ్డ బాగోతం గత డిసెంబర్లో మొఘల్ పురలోని మూడు మీసేవా సెంటర్లలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. వందల కొద్దీ నకిలీ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది ఈ అంశం. ఇక పోలీసుల చర్యలతో జీహెచ్ఎంసీ మేల్కొంది. గ్రేటర్‌లోని 30 సర్కిళ్లలో ఈ తతంగం జరిగినట్లు గుర్తించి, 27 వేలకు పైగా నకిలీ సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. అంతేకాదు.. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది కూడా. చదవండి: రసవత్తరంగా రాజకీయం.. కవిత లేఖకి ఈడీ రిప్లై! -
ఫేక్ సర్టిఫికెట్ల స్కాం.. రాజాసింగ్ సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో వెలుగుచూసిన నకిలీ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారాయన. పాతబస్తీ కేంద్రంగా నకిలీ బర్త్ సర్టిఫికెట్స్ జారీ చేశారని, ఈ స్కాంలో ఎంఐఎం పాత్ర కూడా ఉందని ఆరోపించారాయన. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కు చెందిన వారికి కూడా సర్టిఫికేట్స్ అంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే కచ్చితంగా సర్జికల్ స్ట్రీక్ నిర్వహిస్తామన్నారు. విదేశీ చొరబాటు దారులను అరికట్టేందుకు ఎన్ఆర్సీ, సీఏఏ అమలు కావాలన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎంఐఎంకు భయపడి ఓల్డ్ సిటీ వైపు చూడరని ఆయన వ్యాఖానించారు. ఔట్ సోర్సింగ్ ఇచ్చాక వారిపై నిఘా పెట్టల్సిన అవసరం ఉందని రాజాసింగ్ అన్నారు. ఇదిలా ఉంటే.. ఆన్లైన్లో బర్త్ సర్టిఫికెట్ వచ్చేలా సాఫ్ట్వేర్ రూపొందించింది జీహెచ్ఎంసీ. అయితే ఈ చర్య ద్వారా వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందనే విమర్శ ఇప్పుడు వినిపిస్తోంది. బర్త్‌తో పాటు డెత్ సర్టిఫికెట్లను ఎడాపెడా జారీ చేశారు ఇంటిదొంగలు. అలాగే.. నాన్ అవైలబిలిటీ పేరుతో గత మార్చి నెల నుంచి డిసెంబర్ దాకా 31 వేల సర్టిఫికెట్లు జారీ చేశారు. ఆ నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగానే కొందరికి పాస్ పోర్టులు, వీసాలు కూడా మంజూరు అయ్యాయి. వాటి ఆధారంగానే మరికొందరు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు . అంతేకాదు.. ఫేక్ డెత్ సర్టిఫికెట్లతో బీమా బురిడీ జరిగిందని గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో కంప్యూటర్ ఆపరేటర్లేదే కీలక పాత్రగా నిర్ధారించుకున్న పోలీసులు.. అలాగే మీ సేవా సిబ్బందితో కొందరు అధికారులు కుమ్మకై పత్రాలు జారీ చేసినట్లు గుర్తించారు. పోలీసుల చర్యలతో బయటపడ్డ బాగోతం గత డిసెంబర్లో మొఘల్ పురలోని మూడు మీసేవా సెంటర్లలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. వందల కొద్దీ నకిలీ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది ఈ అంశం. ఇక పోలీసుల చర్యలతో జీహెచ్ఎంసీ మేల్కొంది. గ్రేటర్‌లోని 30 సర్కిళ్లలో ఈ తతంగం జరిగినట్లు గుర్తించి, 27 వేలకు పైగా నకిలీ సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. అంతేకాదు.. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది కూడా. -
ఎఫ్ఎంజీ నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం బట్టబయలు
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): దేశంలో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ (ఎఫ్ఎంజీ) ఫేక్ సర్టిఫికెట్ల కుంభకోణం వెలుగు చూసింది. దాంతో సీబీఐ మన రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని 91 నగరాలు, పట్టణాల్లో గురువారం విస్తృతంగా సోదాలు నిర్వహించింది. ఎఫ్ఎంజీ ఫేక్ సర్టిఫికెట్లకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించింది. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన భారతీయ విద్యార్థులు మనదేశంలో వైద్యవృత్తి చేపట్టాలంటే ఎఫ్ఎంజీ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) ఈ పరీక్ష నిర్వహిస్తుంది. కాగా, ఇందులో ఉత్తీర్ణులు కాకుండానే ఉత్తీర్ణులైనట్టుగా దేశంలో 73మంది ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించినట్టు సీబీఐ గుర్తించింది. ఆ ఫేక్ సర్టిఫికెట్లను ఆయా రాష్ట్రాల మెడికల్ కౌన్సిళ్లు సైతం ఆమోదించడం గమనార్హం. దీనిపై సీబీఐ ఈ నెల 22న కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా గురువారం దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. ఈ ఫేక్ సర్టిఫికెట్లతో ప్రమేయం ఉన్న పలువురు ఎఫ్ఎంజీ గ్రాడ్యుయేట్లు, అందుకు సహకరించిన మెడికల్ కౌన్సిళ్లు, వైద్య సంస్థలను గుర్తించింది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తామని సీబీఐ ప్రకటించింది. మన రాష్ట్రంలోనూ నకిలీ సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్ ఎఫ్ఎంజీ ఫేక్ సర్టిఫికెట్ల కుంభకోణానికి సంబంధించి విజయవాడలోని రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ కార్యాలయంలో సీబీఐ అధికారులు ఈ నెల 23న తనిఖీలు నిర్వహించారు. 12 గంటలపాటు ఏకబిగిన కొనసాగిన ఈ సోదాల్లో 2014 నుంచి 18 మధ్య విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకున్న వైద్యుల వివరాలను పరిశీలించారు. ఇతర రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీలు కొనసాగుతున్నంతసేపు కార్యాలయంలో అధికారులు, సిబ్బందిని బయటకు కూడా పంపించలేదు. కాగా గురువారం విజయవాడలోని రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌తోపాటు విశాఖపట్నంలోనూ సీబీఐ సోదాలు నిర్వహించింది. -
భలే అడ్వొకేట్లు.. వంశ వృక్షాన్నే డూప్లికేట్ చేశారు!
అనంతపురం శ్రీకంఠం సర్కిల్: న్యాయవాద వృత్తిలో ఉన్న తల్లీ కుమారుడు సునాయసంగా డబ్బు సంపాదించేందుకు అడ్డదారి తొక్కారు. బతికున్న యజమానులను చనిపోయినట్లుగా సర్టిఫికెట్లు సృష్టించి.. నకిలీ వారసులను తెరపైకి తీసుకొచ్చి.. వారి ద్వారా రూ.75లక్షల విలువచేసే ఆస్తి కాజేయబోయారు. బాధితుడి ఫిర్యాదుతో బండారం బయటపడిపోయింది. కీలక సూత్రధారులైన తల్లీ కుమారుడు, వీరికి సహకరించిన మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను అనంతపురం ఇన్చార్జ్ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు ఆదివారం తన చాంబర్లో టూటౌన్ సీఐ శివరాముడుతో కలిసి మీడియాకు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో నివాసముంటున్న అనంతపురం వాసి శ్రీరాములునాయక్‌కు స్థానిక ఆదర్శ నగర్ కాలనీలో 333, 339 సర్వేనంబర్లలోని 5.14 సెంట్ల విస్తీర్ణంలో ఇల్లు ఉంది. రూ.75లక్షలు విలువ చేసే ఈ ఆస్తిని ప్రస్తుతం అమ్మకానికి పెట్టారు. ఈ క్రమంలో ధర్మవరం న్యాయవాది కట్టా శ్రీదేవి, ఆమె కుమారుడు కట్టా గణేష్‌లు ఆ ఆస్తి డాక్యుమెంట్లు సేకరించారు. యజమాని ఇక్కడ లేనందున ఎలాగైనా ఆస్తిని కొట్టేయాలని కుట్ర పన్నారు. శ్రీరాములు నాయక్, ఆయన భార్య ఇద్దరూ చనిపోయినట్లుగా తమ ల్యాప్‌టాప్‌లోనే నకిలీ డెత్ సర్టిఫికెట్లు తయారు చేశారు. కట్టా శ్రీదేవి తనకు అత్యంత నమ్మకస్తురాలైన పనిమనిషి ముత్యాలమ్మ, అనిల్‌కుమార్, బండిమాల లోకేశ్వర, సాంబశివ, డాక్యుమెంట్ రైటర్ శ్రీనివాసప్రసాద్, గుర్రం గణేష్‌ల సహకారం తీసుకున్నారు. అనిల్‌కుమార్‌ను శ్రీరాములునాయక్ కొడుకుగా చిత్రీకరిస్తూ ఆధార్‌కార్డులో మార్పులు చేశారు. నకిలీ వంశ వృక్షం తయారు చేయించారు. వీటి ద్వారా గత సెప్టెంబర్ 23న ధర్మవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శ్రీరాములునాయక్ ఆస్తిని అనిల్‌కుమార్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తర్వాత అనిల్‌కుమార్ నుంచి పనిమనిషి ముత్యాలమ్మకు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేయించారు. మోసం బయటపడిందిలా.. శ్రీరాములు నాయక్ తన ఆస్తిని అమ్మే ఏర్పాట్లను ఈ నెలలో ముమ్మరం చేశాడు. ఈ క్రమంలో ‘జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ’ అనిల్‌కుమార్ నుంచి ముత్యాలమ్మకు వెళ్లినట్లు బయటపడింది. దీంతో శ్రీరాములునాయక్ ఎవరో తన ఆస్తిని కాజేశారని ఎస్పీ ఫక్కీరప్పకు ‘స్పందన’లో ఫిర్యాదు చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ కేసును టూటౌన్ పోలీసులకు అప్పగించారు. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. దర్యాప్తులో తల్లీ కొడుకులైన అడ్వొకేట్లు కట్టా శ్రీదేవి, కట్టా గణేష్‌ల పన్నాగం బయట పడింది. దీంతో తల్లీకుమారుడితో పాటు ధర్మవరం మండలం దర్శినమలకు చెందిన బేతరాసి అనిల్‌కుమార్, అనంతపురం రామ్‌నగర్‌కు చెందిన జింక శ్రీనివాస ప్రసాద్, చెన్నేకొత్త పల్లి మండలం బసంపల్లికి చెందిన పుట్టపర్తి సాంబశివ, బండిమాల లోకేశ్వర్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్, డెత్ సర్టిఫికెట్, లీగల్ హైర్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రిమాండ్‌కు పంపారు. ఈ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. -
ఇద్దరు దోస్తులు.. టెన్త్‌లో ఒకరు ఫెయిల్, ఒకరు పాస్.. 25 ఏళ్లుగా డాక్టర్ పని
వరంగల్ క్రైం: చదివింది పదో తరగతి.. అందులో ఒకరు ఫెయిల్.. మరొకరు పాస్. ఇద్దరు మిత్రులు.. డాక్టర్ల వద్ద పనిచేసిన అనుభవం.. పైసలపై ఆశ పెరగడంతో డాక్టర్ల అవతారమెత్తారు. అందుకు అవసరమయ్యే సర్టిఫికెట్లను కొనుగోలు చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 25ఏళ్లుగా నగరంలో డాక్టర్లుగా చలామణి అవుతున్న ఇద్దరు నకిలీల బాగోతం ఎట్టకేలకు బయటపడింది. నిందితులను టాస్క్‌ఫోర్స్, ఇంతేజార్గంజ్ పోలీసులు అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి తెలిపారు. నకిలీ డాక్టర్ల నుంచి రూ.1.28 లక్షలు నగదు, ఆస్పత్రి పరికరాలు, మందులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మంగళవారం కమిషరేట్‌లో నిందితుల వివరాలు వెల్లడించారు. హంటర్‌రోడ్డు ప్రాంతానికి చెందిన ఇమ్మడి కుమార్ పదో తరగతి పూర్తి చేయగా, వరంగల్ చార్‌బౌళి ప్రాంతానికి చెందిన మహ్మమద్ రఫీ ఫెయిల్ అయ్యాడు. ఇద్దరు మిత్రులు కావడంతో 1997 సంవత్సరానికి ముందు ప్రముఖ డాక్టర్ల దగ్గర అసిస్టెంట్లుగా పనిచేశారు. డబ్బులు బాగా సంపాదించాలనే ఆలోచనతో బీహార్ రాష్ట్రంలోని దేవఘర్ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయంనుంచి ఆయుర్వేద వైద్యంలో డిగ్రీ పూర్తి చేసినట్లుగా నకిలీ సర్టిఫికెట్లతోపాటు గుర్తింపు కార్డులు కొనుగోలు చేశారు. కుమార్ క్రాంతి క్లినిక్ పేరుతో కొత్తవాడలో దుకాణం తెరిచాడు. రఫీ సలీమా క్లినిక్ పేరుతో చార్‌బౌళి ప్రాంతంలో 25 ఏళ్లుగా ఆస్పత్రి నడిపిస్తున్నాడు. సాధారణ రోగాలతో వచ్చే వారి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు గుంజేవారు. రోగం ముదిరేలోపే కార్పొరేట్ ఆస్పత్రులకు పంపేవారు. చివరికి నకిలీ డాక్టర్ల వ్యవహారం బయటకు తెలియడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్థానిక మట్టెవాడ, ఇంతేజార్గంజ్ పోలీసులు.. వరంగల్ రీజినల్ ఆయుష్ విభాగం వైద్యుల ఆధ్వర్యంలో రెండు ఆస్పత్రులపై దాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో నేరం ఒప్పుకున్నారు. నకిలీ డాక్టర్లను అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన టాస్క్‌ఫోర్స్, పోలీసులను సీపీ డాక్టర్ తరుణ్ జోషి అభినందించారు. -
మున్నాభాయ్ వర్సిటీ..! పది నుంచి పీహెచ్డీ దాకా.. ఏది కావాలన్నా రెడీ
సాక్షి, హైదరాబాద్: ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడం చూశాం.. కాపీ కొట్టి పరీక్ష రాసి టాప్ ర్యాంకులు పొందిన వారినీ చూశాం.. కానీ ఏ కోర్సు చదవకుండానే ఎంబీబీఎస్, ఎంటెక్, పీహెచ్డీ... ఇలా ఏ సర్టిఫికెట్ కావాలన్నా చిటికెలో రూపొందించి ఇస్తున్న ముఠాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. పదో తరగతి నుంచి పీహెచ్డీ, ప్రొఫెషనల్ కోర్సుల సర్టిఫికెట్ల దాకా ఏదైనా తయారుచేసి నిరుద్యోగ యువతను కటకటాల్లోకి వెళ్లేలా చేస్తున్నాయి. సర్టిఫికెట్‌ను బట్టి రేటు.. కూకట్‌పల్లికి చెందిన నవీన్ (పేరు మార్చాం) డిగ్రీ సర్టిఫికెట్ కావాలని తన స్నేహితుడు కరణ్ (పేరు మార్చాం)కి అడి గాడు. తనకు తెలిసిన విజయవాడ స్నేహితుడు రామ్మో హన్ను కలిస్తే పని అవుతుందని, యూపీలోని ఓ యూని వర్సిటీ నుంచి బీకాం సర్టిఫికెట్ తెప్పిస్తాడని చెప్పాడు. రామ్మోహన్‌కు కాల్ చేయగా రూ.1.2 లక్షలు ఖర్చువుతుందనగా... తాను 90 వేలు ఇవ్వగలను అన్నాడు. ఆ మేరకు డబ్బులివ్వగా వారంలోనే సర్టిఫికెట్ ఇచ్చాడు. ఇలా ముఠాలు నిరుద్యోగ యువత అవసరాన్ని ఆసరాగా చేసుకొని పేర్లు కూడా సరిగ్గా తెలియని యూనివర్సిటీల పేరిట నకిలీ సర్టిఫికెట్లు ఇస్తున్నాయి. పదో తరగతి సర్టిఫికెట్‌కు రూ.లక్ష, ఇంటర్ రూ.80 వేలు, డిగ్రీకి కనీసం రూ.లక్ష, బీటెక్ అయితే రూ.2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు రాచకొండ, సైబరాబాద్ పోలీసుల విచారణలో బయటపడింది. వరుస కేసులతో గుట్టురట్టు.. ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టులో సైబరాబాద్, రాచకొండ పోలీసులు నకిలీ సర్టిఫికెట్ రాకెట్ల గుట్టురట్టు చేసి పలువురిని కటకటాల పాలుచేశారు. జూలైలో గ్యాంగ్ సూత్రధారిగా ఉన్న విజయవాడకు చెందిన ప్రైవేట్ టీచర్ కోటా కిషోర్ వివిధ బోర్డులు, యూనివర్సిటీల పేరిట నకిలీ సర్టిఫికెట్లు అమ్ముతున్నట్టు గుర్తించి 11మందిని అరెస్ట్ చేశారు. 18 వర్సి టీలు, 13 రాష్ట్రాల బోర్డుల పేరిట వందల సర్టిఫికెట్లు సృష్టించి డబ్బులు దండుకున్నట్టు గుర్తించారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకున్న వారిని టార్గెట్ చేసు కొని నకిలీలు రూపొందించిన ఏడుగురిని గత ఆగస్టులో అరెస్ట్‌చేశారు. రూ.25 వేల నుంచి 5 లక్షల వరకు తీసుకొని 500 మందికి నకిలీ సర్టిఫికెట్లు, రికమెండేషన్ లెటర్లు సమకూర్చి నట్టు వెలుగులోకి వచ్చింది. అలాగే, విదేశాలకు వెళ్లా లనుకునే వారికి బీటెక్, ఎంటెక్ సర్టిఫి కెట్లు రూపొందించి లక్షలు సొమ్ము చేసుకున్నట్టు బయటపడింది. అమెరికా, యూకే, కెనడా వెళ్లేందుకు వీసాలు ప్రాసెస్ చేస్తా మని చైతన్యపురిలో కన్సల్టెన్సీ బోర్డు పెట్టి నకిలీలు రూపొందించిన ముఠాను అరెస్ట్ చేశారు. కాక తీయ, ఉస్మానియా, ఆచార్య నాగార్జున, జేఎన్టీయూ వర్సిటీల ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి నకిలీలు సృష్టి స్తూ వీసాలకు డాక్యుమెంట్లను రూపొందించిన వ్యవహా రా న్ని పోలీసులు బయటపెట్టారు. ఈ ముఠాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంజనీ రింగ్ పూర్తిచేసిన ఓ మహిళ, మరో ఇద్దరు నిరుద్యోగులను కటకటాల్లోకి నెట్టినట్టు పోలీసులు తెలిపారు. గల్లీకో కన్సల్టెన్సీ.. ఎలాగైనా విదేశాలకు వెళ్లి సెటిల్ అవ్వాలని అక్రమ మార్గాలను ఎంచుకుంటున్న యువతకు ఈ కన్సల్టెన్సీలు ఆశాదీపంగా కనిపిస్తున్నాయి. పైగా ఎంత డిమాండ్ చేస్తే అంత మొత్తంలో డబ్బులు దండుకోవచ్చన్న అత్యాశతో మోసాలకు పాల్ప డుతున్నారు. గల్లీకో కన్సల్టెన్సీ పేరిట అందమైన ఆఫీసులు పెట్టి బురిడీ కొట్టిస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే 2వేలకు పైగా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ లున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇందులో సగానికి పైగా కన్సల్టెన్సీలు అక్రమ మార్గాల్లో విద్యార్థులను విదేశాలకు పంపుతున్నట్టు తెలుస్తోంది. కొంతమంది ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉన్నా వీసా రాదనే భయంతో కన్సల్టెన్సీలను సంప్రదిస్తున్నారు. -
నకిలీ సర్టిఫికెట్ల తయారీలో శిక్షణ!
సాక్షి, హైదరాబాద్: నకిలీ విద్యార్హత పత్రాల తయారీ ముఠా గుట్టురట్టయ్యింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లను సృష్టించి, విక్రయిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఎస్ఓటీ డీసీపీ కే మురళీధర్, ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌లతో కలిసి రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. చాంద్రాయణగుట్ట, క్యూబా కాలనీకి చెందిన మహ్మద్ ఖలీముద్దీన్ అలియాస్ ఖలీం నకిలీ సర్టిఫికెట్లను తయారు చేయడంలో దిట్ట. గత ఏడేళ్లుగా ఈ దందాను నిర్వహిస్తున్నాడు. ఇతనిపై చాంద్రాయణగుట్ట, అబిడ్స్ ఠాణాలలో రెండు కేసులున్నాయి. పోలీసుల నిఘా ఉండటంతో అజ్ఞాతంలో ఉంటూ తన అనుచరులకు శిక్షణ ఇస్తున్నాడు. ఖలీం స్నేహితుడైన గోల్కొండ మోతీ దర్వాజకు చెందిన ముక్తార్ అహ్మద్‌కు అడోబ్ ఫొటోషాప్‌లో ఫొటోలు, డాక్యుమెంట్ల ఎడిటింగ్‌పై మంచి అనుభవం ఉంది. దీంతో ఖలీం ఇతనికి నకిలీ సరి్టఫికెట్ల తయారీ శిక్షణ ఇచ్చాడు. అలాగే విద్యార్హత పత్రాల తయారీకి అవసరమైన యూనివర్సిటీ గుర్తింపు చిహ్నలు, హాలోగ్రామ్స్ ఇతరత్రా వస్తువులను అందించాడు. తన పేరు బయటకు రాకుండా రహస్యంగా ఉంచాలని, కమీషన్ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించాడు. రాజేంద్రనగర్‌కు చెందిన అహ్మద్ ఫిరోజ్, లక్డీకపూల్ ఏసీ గార్డ్స్‌కు చెందిన మహ్మద్ ఫరూక్ అజీజ్, టోలిచౌకీ పారామౌంట్ కాలనీకి చెందిన మహ్మద్ సారూషుల్లా ఖాన్‌లను ముక్తార్ కమీషన్ ఏజెంట్లుగా నియమించుకున్నాడు. వారికి అవసరమైనట్లు నకిలీ విద్యార్హత పత్రాలను తయారు చేసేవాడు. ఒక్కో సరి్టఫికెట్‌ను రూ. లక్ష, రూ. 2 లక్షలకు విక్రయించేవాడు. ఇందులో 25 శాతం కమీషన్‌ను ఖలీంకు చెల్లించేవారు. ఈ క్రమంలో నిందితుల నుంచి హుస్సేనీఆలంకు చెందిన మహ్మద్ జుబేర్ అలీ, టోలిచౌకీకి చెందిన సయ్యద్ అతీఫుద్దిన్ రూ.లక్షకు నకిలీ విద్యార్హత పత్రాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. సర్టిఫికెట్లను తీసుకునేందుకు బాలాపూర్ ఎర్రకుంటకు వెళ్లారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు చేసి సరూషుల్లా ఖాన్, జుబేర్, అతీఫుద్దిన్, ఫరూఖ్ అజీజ్, మహ్మద్ ఫిరోజ్, ముక్తార్ అహ్మద్‌లను పట్టుకున్నారు. వీరి నుంచి నకిలీ సర్టిఫికెట్లతో పాటు ల్యాప్‌టాప్, స్టాంప్‌లు, 6 సెల్ఫోన్లు ఇతరత్రా వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ ముఠా 258 సర్టిఫికెట్లను తయారు చేసి, విక్రయించారని, వీరిలో పలువురు విదేశాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఎర్రగడ్డకు చెందిన సల్మాన్ యూకేకు, కాలాపత్తర్‌కు చెందిన మీర్జా యూసుఫుద్దిన్ న్యూయార్క్‌కు, మెహదీపట్నానికి చెందిన మహ్మద్ మాజీద్ అమెరికాకు, గోల్కొండకు చెందిన రెహాన్, అశ్వాక్ అహ్మద్ దుబాయ్ దేశాలకు వెళ్లినట్లు సీపీ తెలిపారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసి, ఫాస్ట్‌ట్రాక్ కోర్ట్‌లో శిక్ష పడేలా చేస్తామని పేర్కొన్నారు. వీరి వెనకెవరున్నారు? ఈ నకిలీ సరి్టఫికెట్ల రాకెట్‌ను నడుపుతున్న ప్రధాన నిందితుడు మహ్మద్ ఖలీముద్దిన్‌తో సహా ఇతర నిందితులు, కొనుగోలు చేసే విద్యార్థులు అందరూ ఒకే వర్గానికి చెందిన వారే కావటంతో పోలీసులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వీరి నుంచి నకిలీ పత్రాలను కొనుగోలు చేసిన విద్యార్థులు ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వీరి వెనక ఎవరైనా అదృశ్య శక్తులు ఉండి ఈ రాకెట్‌ను నడిపిస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు సూత్రధారి ఖలీం పట్టుబడితేనే దీని వెనక ఎవరున్నారనేది బయటపడుతుందని ఓ పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: నకిలీ పత్రాలతో ఇల్లు విక్రయం) -
హైదరాబాద్ లో ఫేక్ సర్టిఫికెట్ల దందా గుట్టురట్టు
-
తెలంగాణ: నకిలీ సర్టిఫికెట్స్‌తో 230 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్ట్ జూనియర్ లెక్చర్లలో 230 మంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందినట్లు తెలంగాణ ఆర్థికశాఖ అధికారులు గుర్తించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో వివిధ శాఖల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల వివారలను సేకరించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు 11 వేల మంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వారి వివరాలు పంపించాలని ఆయా శాఖలను ఆర్థిక శాఖ కోరింది. దీంతో తమ తమ శాఖల్లోని ఉద్యోగుల వివరాలను అధికారులు సేకరించి, వారి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేశారు. ఈ క్రమంలో అనేక అవకతవకలు వెలుగు చూశాయి. 230 మంది కాంట్రాక్ట్ లెక్చర్ర్లు నకిలీలుగా తేలింది. మరికొంతమంది మంజూరు లేని పోస్టులలోపనిచేస్తున్నట్లు, క్వాలిఫికేషన్ లేకున్నా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా జాయిన్ అయినట్లు బయటపడింది. ఇప్పటి వరకు 18 మంది డిగ్రీ లెక్చర్లు, ఆరుగురు పాలిటెక్నిక్ లెక్చరర్లకు అధికారులు షోకాజ్ నోటీసులు అందించారు. మరి నకిలీ లెక్చరర్ల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. చదవండి: బండి సంజయ్‌కు హయత్ నగర్ పోలీసులు నోటీసులు -
నకిలీ కోవిడ్ డెత్ సర్టిఫికెట్లపై సుప్రీం ఆందోళన
న్యూఢిల్లీ: దేశంలో కొందరు డాక్టర్లు నకిలీ కోవిడ్–19 డెత్ సర్టిఫికెట్లు జారీ చేస్తుండడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా కారణంగా మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న నష్ట పరిహారాన్ని కాజేయడానికి నకిలీ డెత్ సర్టిఫికెట్లు పుట్టుకొస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన ధర్మాసనం పేర్కొంది. నష్టపరిహారం కోరుతూ వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి నిర్ధిష్ట కాల వ్యవధి ఉండాలని సూచించింది. ఏకంగా డాక్టర్లే నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు ఇస్తుండడం తీవ్రమైన విషయమని ధర్మాసనం తెలిపింది. దీనివల్ల అసలైన బాధితులకు అన్యాయం జరుగుతుందని వెల్లడించింది. గౌరవ్ బన్సల్‌తోపాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. -
నాడే చిక్కిన నాగమణి!
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) డేటాబేస్ ట్యాంపరింగ్ చేసి, అనర్హులను రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేసిన కేసు దర్యాప్తును సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో కౌన్సిల్ సీనియర్ అసిస్టెంట్ అనంతకుమార్‌తో సహా ముగ్గురు నిందితులను గురువారం అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ కేసులో మరో అనుమానితురాలిగా ఉన్న నాగమణి 2015లోనే అరెస్టు అయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ►విజయవాడకు చెందిన భూక్యా నాగమణి, విజయనగరానికి చెందిన గంట రాంబాబు సన్నిహితులు. వీరిద్దరూ కలిసి 2015లో నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్తో పాటు ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ పత్రాన్ని డీటీపీలో రూపొందించారు. గుంటూరు జిల్లా నిజాంపట్నానికి చెందిన చెన్ను నాగమణి 2012లో ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేయించుకున్నారు. ఈమెకు చెందిన 65699 నంబర్‌నే వినియోగించిన ఈ ద్వయం నకిలీ పత్రాలు రూపొందించింది. ►వీటి ఆధారంగా నాగమణి నగరానికి చెందిన రమేష్ ద్వారా ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో ఉన్న లక్ష్మీ నర్సింగ్ హోమ్‌లో గైనకాలజిస్ట్‌గా చేరారు. తన విద్యార్హత పత్రాల్లో ఎంబీబీఎస్, ఎంఎస్ (ఓబీజీ) అంటూ పొందుపరచడంతో ఆస్పత్రి యాజమాన్యం ఉద్యోగం ఇచ్చింది. ఈమె వ్యవహారశైలి, రాస్తున్న మందులు చూసిన సదరు హాస్పిటల్ పరిపాలనాధిపతి సుభాష్ అనుమానించారు. తన సందేహం నివృతి చేయాల్సిందిగా కోరుతూ మెడికల్ కౌన్సిల్‌కు లేఖ రాశారు. ►పూర్వాపరాలు పరిశీలించిన కౌన్సిల్ నాగమణి నకిలీ వైద్యురాలని తేల్చడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సుభాష్‌కు సూచించింది. దీంతో ఆయన చెన్నూరు పోలీసు లకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఆ పోలీసులు నాగమణితో పాటు రాంబాబును 2015 ఆగస్టు 22న అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. ►ఇంతవరకు బాగానే ఉన్నా... ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంలో చెన్నూరు పోలీసులు విఫలయ్యారు. నాగమణి, రాంబాబు కలిసి డీటీపీ ద్వారా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేశారని తేల్చారు. ఉమ్మడి రాష్ట్రంలోని ఏపీ మెడికల్ కౌన్సిల్లో నిజాంపట్నానికి చెందిన చెన్ను నాగమణి రిజిస్టర్ చేసుకున్నారని, ఆమె రిజిస్ట్రేషన్ నంబర్ 65699 అని వీరికి ఎలా తెలిసిందనేది ఆరా తీయలేదు. ఇప్పుడు ఈ కోణంపై దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. -
నకిలీల ‘అవుట్ సోర్సింగ్’
వరంగల్ జిల్లాలో ఉన్న ఓ ఏకలవ్య మోడల్ స్కూల్లో క్రాఫ్ట్ టీచర్‌గా ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పనిచేస్తున్నాడు. వాస్తవానికి ఆ వ్యక్తి పదోతరగతి మాత్రమే చదవగా.. డిగ్రీ, అనుబంధ కోర్సులో ఉత్తీర్ణత సాధించినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించాడు. తర్వాత అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా క్రాఫ్ట్ టీచర్ ఉద్యోగం సంపాదించాడు. ఇలా ఒకరిద్దరు కాదు.. గిరిజన గురుకుల విద్యా సంస్థల సొసైటీ, ఏకలవ్య మోడల్ పాఠశాలల్లోని పలు విభాగాల్లో పదుల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు పొందారు. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో తాత్కాలిక పద్ధతిలో నియమించే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకూ ‘నకిలీ’చీడ పట్టింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల విద్యా సంస్థలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ‘నకిలీలు’ఉ న్నట్లు తెలుస్తోంది. వారికి అర్హత లేకున్నా ఇంటర్మీ డియట్, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను తప్పుడు పద్ధతిలో సృష్టించి వాటి ద్వారా అవుట్ సోర్సింగ్ కొలువులు సంపాదించుకున్నట్లు తెలిసింది. ఈ అంశం జిల్లా స్థాయిలో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. బోగస్ సర్టిఫికెట్లతో బురిడీ.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను జిల్లా స్థాయిలో ఒక ప్రైవేటు ఏజెన్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఏజెన్సీల ద్వారా వచ్చే అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించి, ఆమోదం తెలిపిన అనంతరం వారిని ఉద్యోగంలో చేరనిస్తారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలవారీ జీతాలను ప్రభుత్వం నేరుగా కాకుండా ఏజెన్సీల ద్వారా చెల్లిస్తారు. ఈ క్రమంలో ఏజెన్సీల్లోని కొందరు నిర్వాహకులు ఒకరిద్దరు అధికారులతో మిలాఖత్ అయ్యి నకిలీ సర్టిఫికెట్లున్న అభ్యర్థులకు కొలువులు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల విద్యాసంస్థలు, కాలేజీలతో పాటు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో పెద్ద సంఖ్యలో తప్పుడు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు వందకు పైగా ఉద్యోగులను ఇలా ఎంపిక చేసినట్లు వెల్లడైంది. సబార్డినేట్ పోస్టులే ఎక్కువ.. గిరిజన గురుకుల సొసైటీతో పాటు ఏకలవ్య మోడల్ స్కూళ్లలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసిన ఉద్యోగాల్లో అత్యధికం సబార్డినేట్ పోస్టులే ఉన్నట్లు సమాచారం. వాటితో పాటు కొన్నిచోట్ల బోధన సిబ్బందిని సైతం ఇలాగే భర్తీ చేసినట్లు తెలుస్తోంది. ల్యాబ్ అసిస్టెంట్, అటెండర్ పోస్టులతో పాటు మెస్ మేనేజర్, క్రాఫ్ట్ టీచర్, ఆర్ట్ టీచర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టుల్లో ఇలాంటి ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. సబార్డినేట్ పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు నకిలీవి సృష్టించగా, బోధన సిబ్బంది కేటగిరీలో డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను తప్పుడు పద్ధతిలో సృష్టించారు. ఈ వ్యవహారానికి సంబంధించి విచారణ జరపాలని ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. పూర్తిస్థాయిలో విచారణ జరిపితే అక్రమాల గుట్టు తెలుస్తుందని అంటున్నారు. -
బేరాల్లేవమ్మా.. ఎస్సెస్సీ టు బీటెక్.. ఏదైనా ఒకే రేటు!
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ కలిగిన విద్యార్థులకు శరాఘాతంగా మారుతున్న నకిలీ విద్యార్హత పత్రాలపై నగర పోలీసులు జంగ్ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం ఓ గ్యాంగ్‌ను పట్టుకున్నారు. గతంలో చిక్కిన నాలుగు ముఠాలు ఆయా వర్సిటీల నుంచి సర్టిఫికెట్లు జారీ చేయిస్తుండగా... వీళ్లు మాత్రం నకిలీవి తయారు చేసి అమ్మేస్తున్నారు. టెన్త్ నుంచి డిగ్రీ వరకు ఏదైనా ఒకే రేటుకు విక్రయించేస్తున్నారని అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి వెల్లడించారు. యాకుత్‌పురకు చెందిన సయ్యద్ నవీద్ సంతోష్‌నగర్ ప్రాంతంలో ఎంహెచ్ కన్సల్టెన్సీ పేరుతో ఎడ్యుకేషనల్ సేవలు అందించే సంస్థను నిర్వహిస్తున్నాడు. లాక్డౌన్ ప్రభావంతో వ్యాపారం దెబ్బతిన్న ఇతగాడు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. గతేడాది మేలో బషీర్‌బాగ్‌లో క్యూబేజ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వీసా ప్రాసెసింగ్ సంస్థను ఏర్పాటు చేశాడు. నిబంధనల ప్రకారం వీసా ప్రాసెసింగ్ చేస్తే ఇతడికి ఎక్కువ లాభాలు రావట్లేదు. మరోపక్క అనేక మంది సరైన విద్యార్హతలు లేని వాళ్లు సైతం వీరి వద్దకు ప్రాసెసింగ్‌కు వస్తున్నారు. దీంతో తానే నకిలీ సర్టిఫికెట్లు రూపొందించి ప్రాసెసింగ్ చేస్తే భారీ లాభాలు ఉంటాయని భావించాడు. చదవండి: ఇకపై జంక్షన్లో చుక్కలే!.. రెడ్ సిగ్నల్ పడగానే డ్రంకన్ డ్రైవ్ డీటీపీలో మంచి పట్టున్న మీర్‌చౌక్ వాసి షేక్ నదీమ్‌ను తన సంస్థలో నియమించుకున్నాడు. జమాల్‌కాలనీకి చెందిన మహ్మద్ అబ్రారుద్దీన్ ఆ తరహా విద్యార్థులను తీసుకువచ్చేవాడు. వారి అవసరాలకు తగ్గట్టు నవీద్ పదో తరగతి నుంచి బీటెక్ వరకు సర్టిఫికెట్లను నదీమ్‌తో తయారు చేయించేవాడు. వీటిని రూ.70 వేల నుంచి రూ.80 వేలకు విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, పి.శ్రీనయ్యలతో కూడిన బృందం దాడి చేసింది. నవీద్, నదీమ్, అబ్రార్‌లతో పాటు సర్టిఫికెట్లు ఖరీదు చేసిన అబ్దుల్ రహీం ఖాన్, అబ్దుల్ కరీం ఖాన్, మహ్మద్ ఇస్మాయిల్ అహ్మద్, మహ్మద్ నాసిర్ అహ్మద్, ఫైసల్ బిన్ షాదుల్లాలను పట్టుకున్నారు. అన్నిరకాల సర్టిఫికెట్లు లభ్యం నిందితుల నుంచి రాష్ట్ర ఎస్సెస్సీ బోర్డు పేరుతో ఉన్న సర్టిఫికెట్లు 4, మహారాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు పేరు తో ఉన్న సర్టిఫికెట్లు 4, ఓయూ పేరుతో ఉన్న డిగ్రీలు 3, ఏయూ పేరుతో ఉన్న బీటెక్ పట్టాలు 7, తెలంగాణ యూనివర్శిటీ పేరుతో ఉన్న డిగ్రీలు 30, పుణేలోని సింబయోసిస్ ఇంటర్నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ పేరుతో ఉన్న పట్టా ఒకటి స్వాధీనం చేసుకున్నారు. -
ఒకటి తర్వాత మరొకటి.. వందల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు..
సాక్షి,హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ యూనివర్సిటీ (ఎస్ఆర్కేయూ) నుంచి నగరంలోని విద్యార్థులకు వందల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు సరఫరా అయ్యాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేతన్ సింగ్‌తో పాటు మూడు కన్సల్టెన్సీల నిర్వాహకులను ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు మరో కన్సల్టెన్సీ నిర్వాహకుడిని కటకటాల్లోకి నెట్టారు. ఇతడి విచారణలో కేతన్‌తో పాటు ఆ వర్సిటీ ఇంజినీరింగ్ (ఈఈఈ) విభాగాధిపతి ఇ.విజయ్‌కుమార్‌కు ఈ స్కామ్‌లో ప్రమేయం ఉన్నట్లు తేలిందని సోమవారం ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు వెల్లడించారు. ► విజయవాడకు చెందిన పీకే వీరన్నస్వామి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలసవచ్చాడు. చాదర్‌ఘాట్ పరిధిలో వీఎస్ గ్లోబల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ పేరుతో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఇందులో ఆశించిన మేర ఆదాయం లేకపోవడంతో నకిలీ సర్టిఫికెట్ల దందా మొదలుపెట్టాడు. ► కేతన్ సింగ్‌తో పాటు విజయ్‌కుమార్‌తో ఒప్పందం చేసుకున్న ఇతగాడు ఈ పని మొదలెట్టాడు. డ్రాప్ఔట్స్, బ్యాక్‌లాగ్స్ ఉన్న వాళ్లతో పాటు ఫెయిల్ అయిన విద్యార్థుల వివరాలను కాలేజీల నుంచి సేకరిస్తున్నాడు. ఆ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను సంప్రదిస్తున్న వీరన్న స్వామి ఎలాంటి అడ్మిషన్లు, పరీక్షలు లేకుండా సర్టిఫికెట్లు ఇస్తానని ఒప్పందాలు చేసుకుంటున్నాడు. ► వీరన్న ఈ విద్యార్థులు, నిరుద్యోగుల వివరాలను వాట్సాప్ ద్వారా వర్సిటీలో ఉన్న కేతన్, విజయ్‌లకు పంపిస్తున్నాడు. వీటి ఆధారంగా బ్యాక్ డేట్స్‌తో డిగ్రీలు రూపొందిస్తున్న వాళ్లు వర్సిటీలోనూ రికార్డులు సృష్టిస్తున్నారు. ఇలా తయారు చేసిన డిగ్రీలను కోర్సును బట్టి రూ.80 వేల నుంచి రూ.2.5 లక్షలు వరకు విక్రయిస్తున్నా రు. కొన్నాళ్లుగా ఈ దందా గుట్టుగా సాగుతోంది. ► సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సై శ్రీకాంత్ తదితరులతో కూడిన బృందం కన్సల్టెన్సీపై దాడి చేసింది. వీరన్నతో పాటు సర్టిఫికెట్లు ఖరీదు చేయడానికి వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులైన కంభపు సాయి గౌతమ్ (కొత్తపేట), చిన్రెడ్డి రితీష్ రెడ్డి (వనస్థలిపురం), బచ్చు వెంకట సాయి సుమ రోహిత్ (ఫతేనగర్), మున్నా వెల్‌ఫ్రెడ్ (వికారాబాద్), కోసిమెత్తి సూర్యతేజ (మాదాపూర్), తుమ్మల సాయితేజ (బాచుపల్లి) పట్టుబడ్డారు. ► నిందితులతో పాటు వారి నుంచి స్వాధీనం చేసుకున్న సర్టిఫికెట్లు, స్టాంపులు తదితరాలను తదుపరి చర్యల నిమిత్తం చాదర్‌ఘాట్ పోలీసులకు అప్పగించారు. ఇప్పటికే అరెస్టు అయిన కేతన్‌ను పీటీ వారెంట్‌పై ఈ అధికారులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. పరారీలో ఉన్న విజయ్‌కుమార్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
హైదరాబాద్ పోలిస్ కమిషనర్ కీలక ఆదేశాలు.. ‘ఇకపై వేసేయడమే’
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు కమిషనరేట్‌కు సంబంధించి ఎలాంటి నేరంలో ఎవరికి పాత్ర ఉన్నా ఉపేక్షించేది లేదని కొత్వాల్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ఇప్పటి వరకు కౌన్సెలింగ్‌లు చేశాం. వాటితో ఫలితం ఉండట్లేదు. అందుకే ఇకపై వేసేయడమే (జైల్లో)’ అని వ్యాఖ్యానించారు. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్న రెండు నకిలీసర్టిఫికెట్ల ముఠాల నుంచి వందల మంది ధ్రువపత్రాలు ఖరీదు చేశారు. ఈ వ్యవహారం వారి తల్లిదండ్రులకు తెలిసి జరగడంతో పాటు వారికీ పాత్ర ఉంది. ఇప్పటికే ఏడుగురి విద్యార్థులను అరెస్టు చేశామని, త్వరలో మిగిలిన వారినీ పట్టుకుంటామని ఆనంద్ అన్నారు. వీరికి సర్టిఫికెట్లు కొని పెట్టిన, ప్రోత్సహించిన తల్లిదండ్రులను సైతం అరెస్టు చేస్తామని ఆయన పేర్కొన్నారు. నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసిన యూనివర్సిటీల గుర్తింపు రద్దు చేయాలని సిఫారసు చేస్తూ యూజీసీకి ఆధారాలతో సహా లేఖ రాస్తాం. ఇటీవల డ్రగ్స్ కేసుల విషయంలోనూ తమ పంథా మార్చామని ఆయన అన్నారు. గతంలో మాదకద్రవ్యాల విక్రేతలను మాత్రమే అరెస్టు చేసే వాళ్లు. వీరి నుంచి డ్రగ్స్ ఖరీదు చేసి, వినియోగించిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చేవాళ్లు. పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ విధానం మారింది. చదవండి: నిజామాబాద్‌లో రెచ్చిపోయిన రౌడీమూకలు.. టీస్టాల్‌పై వీరంగం టోనీ కేసులో ఏడుగురు బడా వ్యాపారులను కటకటాల్లోకి పంపారు. ఇకపైనా ఇదే విధానం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. మరోపక్క రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రిపై వచ్చిన ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకున్నామని పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే మహారాష్ట్రలో కేసు నమోదైనట్లు తెలిసిందని, ఒకే నేరంగా రెండు కేసులు సాధ్యం కావని అన్నారు. ఎక్కడ నమోదైందో తెలుసుకుని ఇక్కడి ఫిర్యాదులనూ అక్కడికే పంపుతామన్నారు. ఇప్పటి వరకు ఎక్కడా రిజిస్టర్ కాకపోతే మాత్రం జూబ్లీహిల్స్‌లో కేసు నమోదు చేస్తామని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వచ్చే ఫిర్యాదులు ఆ ఠాణాకే వస్తాయని పేర్కొన్నారు. చదవండి: బాలిక అనుమానాస్పద మృతి.. రాత్రి సమయంలో ఎందుకు వెళ్లింది?