చదివింది లా. కానీ వృత్తి మాత్రం దొంగతనం.చేతివ్రాత నిపుణుడు, గ్రాఫాలజీలో కోర్సు కూడా చేసాడు. కానీ చోరీలు చేయడంలో అతని ట్రాక్ రికార్డ్ చూస్తే ఔరా అంటారు. పోలీసులను సైతం బురిడీ కొట్టించడంలో అతని తర్వాతే మరెవ్వరైనా. దొంగతనంలో ఈ విధంగా ఆరితేరిన ప్రపంచంలోనే తొలి, ఏకైక వ్యక్తి. నకిలీ పత్రాలను ఉపయోగించి ఏకంగా జడ్జ్ అయిపోయాడు. 2000 మంది నేరస్థులను విడుదల చేశాడు. ఆశ్చర్యంగా ఉంది కదా..ఈ స్టోరీ ఏంటో తెలుసుకుందాం రండి.
అతగాడి పేరే ధన్ రామ్ మిట్టల్...అత్యంత దుర్మార్గపు దొంగ. ఓ కారు దొంగతనం సందర్బంగా ధనిరామ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతను చెప్పిన విషయాలు విని పోలీసులు సైతం ఖంగుతిన్నారు.
జడ్డిగా, ట్రాన్స్ పోర్టు అధికారిగా, రైల్వే స్టేషన్ మాష్టరుగా పక్కనున్నోడికి కూడా అనుమానం రాకుండా తన దందా కొనసాగించాడు. 1960 ప్రాంతంలో రోహ్ తక్ కోర్టులో క్లర్కుగా విధులు నిర్వర్తించాడు. క్లర్కుగా పనిచేస్తున్న సమయంలో అక్కడి జడ్జి రెండు నెలలు లీవులో ఉన్నాడు. దీంతో నకిలీ పత్రాల సాయంతో ఏకంగా తానే జడ్జి అవతారం ఎత్తేశాడు ధన్ రామ్. ఈ రెండు నెలల కాలంలో దాదాపు 2 వేలమంది నేరస్థులును విడుదల చేశాడు. అంతే కాదు చాలా మందిని జైల్లో కూడా పెట్టాడు.ఆ తర్వాత విషయం బయటపడే సమయానికి మనోడు పరార్. తర్వాత ఆయన కేసులన్నింటినీ మరోసారి విచారించి తీర్పులు వెలువరించారు. అతని కోసం పోలీసులు ఇంకా వెతుకుతూనే ఉన్నారు.
ఆ తర్వాత రీజనల్ ట్రాన్స్‌పోర్టు అధికారిగాను అవతారమెత్తి కారు డాక్యుమెంట్లపై ఫోర్జరీ సంతకాలు పెట్టేశాడు. రోహ్ తక్ రైల్వే స్టేషన్ లోనే రైల్వే అధికారులను సైతం బురిడీ కొట్టించి స్టేషన్ మాష్టరు కొలువు దక్కించుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతని అరాచకాలకు లెక్కే లేదు.
25 ఏళ్ల వయసులో దొంగతనాల ద్వారా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. దొంగతనం రుచిమరిగిన అతగాడు ఇక అక్కడనుంచి వరసగా దొంగతనాలతో పోలీసులకు చుక్కలు చూపించాడు. కానీ ధని రామ్ 1964లో తొలిసారి జైలుకి వెళ్లాడు. కథ ఇక్కడితో అయి పోలేదు. వరుసగా అరెస్టులవుతూ , విడుదలవుతూ అలా ఇప్పటివరకు 25 సార్లు అరెస్టు అయిన ధని రామ్ అత్యధికంగా అరెస్టయిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.
ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్. సమీప ప్రాంతాలలో కార్ల దొంగతనంలో కూడా మహా ముదురు. ఏ కారును పడితే ఆ కారును దొంగిలించడు. కేవలం ఎస్టీమ్, మారుతి 800, హుందాయ్ శాంత్రో తదితర సెక్యూరిటీ అలారం లేని కార్లను మాత్రమే దొంగతనం చేస్తుంటాడు. అదీ పట్టపగలు. వాటిని సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో అమ్మేస్తాడు.
ఒకవేళ పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లినా తగ్గేదేలే అంటాడు. మళ్లీ అదే తంతు. 81 సంవత్సరాలు మీద పడ్డా కూడా.. ఇప్పుడెక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. ధని రామ్ ఎప్పటికి చోరీలకు ఫుల్ స్టాప్ పెడుతాడో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
Comments
Please login to add a commentAdd a comment