
కల్వకుర్తి: అతను వృత్తిరీత్యా కారు డ్రైవర్. ఓ చోరీ కేసులో 2006లో పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిస్తే కొన్నాళ్లకు బెయిల్ లభించింది. ఆ తర్వాత బెయిల్ ఇచ్చిన జడ్జి ఇంట్లోనే మరోసారి దొంగతనం చేశాడు. 2002 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్న రాఘవేందర్‌రెడ్డి అనే వ్యక్తి వాహన తనిఖీల్లో నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పోలీసులకు పట్టుబడ్డాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవుని ఎర్రవెల్లి గ్రామానికి చెందిన రాఘవేందర్‌రెడ్డి వృత్తిరీత్యా కారుడ్రైవర్. అయితే, కారు నడిపితే వచ్చే డబ్బు జల్సాలకు సరిపోకపోవటంతో దొంగతనాలు చేయటం ప్రారంభించాడు. సింగిల్‌గానే..: దొంగతనానికి రాఘవేందర్‌రెడ్డి ఒక్కడే వెళ్లేవాడు. ఏదైనా ప్రాంతంలో దొంగతనం చేయాలంటే ఆ ఊరిలో రాత్రి భోజనం చేసి సెకండ్ షో సినిమా చూశాక చోరీకి పాల్పడేవాడు. 2006లో చేవెళ్ల పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకి కూడా పంపించారు.
అప్పట్లో కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. బెయిల్ వచ్చిన రాత్రే జడ్జి ఇంట్లో దొంగతనం చేశాడు. అలాగే 2018 ఏప్రిల్ 19వ తేదీన ఒకేరోజు కల్వకుర్తి ఇందిరానగర్ కాలనీలో నాలుగు ఇళ్లు, విద్యానగర్ కాలనీలోని ఓ ఇంటిలో దొంగతనం చేశాడు. ఇందిరానగర్‌లోని ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లినప్పుడు ఏమీ దొరకకపోవటం.. అప్పటికే ఆకలి వేస్తుండటంతో అన్నం వండుకుని తిని మరీ వెళ్లాడు. ఈ విషయాలన్నీ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. కాగా, దొంగతనం చేసిన వస్తువులు అమ్మాక వచ్చిన డబ్బుతో గోవా, బెంగళూరు, హైదరాబాద్‌లో జల్సాలు చేసేవాడు. రాఘవేందర్‌రెడ్డిపై పలు పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయని కల్వకుర్తి డీఎస్పీ పుష్పారెడ్డి తెలిపారు. కోదాడ, పరిగి, వరంగల్, కాజీపేట, కల్వకుర్తి పోలీసుస్టేషన్లలో ఆయనపై పది కేసులు నమోదైనట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment