పెనుకొండ మండలంలో పనిచేసిన ఓ సెకండరీ గ్రేడ్ టీచర్... స్కూల్ అసిస్టెంట్‌గా (ఇంగ్లిష్) పదోన్నతి పొందాలనుకున్నాడు. ఎంఏ ఇంగ్లిష్ చదివాల్సి ఉన్నా.. అంత ఓపికలేక ఇతర రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ తెచ్చి ప్రమోషన్ పొందాడు. తాజాగా నకిలీ బాగోతాలన్నీ తవ్వుతుండగా ఏం జరుగుతుందోనని భయపడిపోతున్నాడు.
అనంతపురం విద్య: నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి పదోన్నతులు పొందిన అయ్యవార్ల గుట్టు రట్టవుతోంది. అడ్డదారిలో పదోన్నతులు పొందిన టీచర్ల వ్యవహారంపై ‘సారూ... ఇదేమి తీరు’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో విద్యాశాఖలో కలకలం రేగింది. గుర్తింపు లేని వర్సిటీల నుంచి ఎంఏ ఇంగ్లిష్ సర్టిఫికెట్లు సమర్పించి పదోన్నతులు పొందిన వారి వివరాలన్నీ తక్షణమే తనకు అందించాలని డీఈఓ కే.శామ్యూల్ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు అలగప్ప, భారతీయార్, మధురై కామరాజ్, వినాయక మిషన్స్ తదితర వర్సిటీల్లో ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేసినట్లు సర్టి ఫికెట్లు అందజేసిన ఉపాధ్యాయుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
ఒకటి అక్రమం..మరొకటి సక్రమం...
ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్ పదోన్నతికి తప్పనిసరిగా ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేసి ఉండాలి. అయితే నకిలీ సర్టిఫికెట్లతో కొందరు తక్షణమే పదోన్నతి తీసుకున్నారు. తిరిగి మరో దఫా అదే పీజీని మరో వర్సిటీ నుంచి ఒరిజినల్‌గా పూర్తి చేశారు. ఇలా ఆరుగురు ఎంఏ ఇంగ్లిష్‌ను రెండు దఫాలు పూర్తి చేసినట్లు ఎస్‌ఆర్ (సర్వీసు రిజిస్టర్)లో నమోదు చేయించుకున్నారు. నకిలీ పీజీ సర్టిఫికెట్‌ను అసలు పీజీ సర్టిఫికెట్‌గా మార్చేందుకు ఎత్తుగడ వేశారు. పదోన్నతి దక్కినప్పుడు నమోదు చేసిన సర్టిఫికెట్, వర్సిటీ.. తాజాగా నమోదు చేసిన సర్టిఫికెట్ వేర్వేరుగా ఉండటం గమనార్హం.
సింగిల్ సబ్జెక్టు పేరుతో...
ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్ పదోన్నతికి ఎంఏ ఇంగ్లిష్ /లేదా డిగ్రీలో ఇంగ్లిష్ లిటరేచర్ తప్పనిసరి. ఈ క్రమంలో నకిలీ ఎంఏ ఇంగ్లిష్ సర్టిఫికెట్ తెచ్చుకున్న వారు కొందరైతే.. మరికొందరు ఏకంగా సింగిల్ సబ్జెక్టు ఇంగ్లిష్ డిగ్రీ పేరుతో నకిలీ సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. డీఈఓ నిర్ణయంతో వారందరికీ చెమటలు పడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో...ఎవరిపై వేటు పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కానీ మెజార్టీ ఉపాధ్యాయులు మాత్రం ఇప్పటికైనా అక్రమార్కులపై చర్యలు తీసుకుని సీనియార్టీ, అర్హత ఉన్న వారికి పదోన్నతి కల్పించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment