పెనుకొండ(అనంతపురం జిల్లా): టీడీపీ నాయకులు బరి తెగించారు. ఎన్నికల్లో ప్రజా మద్దతు లేకపోవడంతో అడ్డదారుల్లో వెళుతున్నారు. పెనుకొండ నగర పంచాయతీకి తొలిసారిగా జరుగుతున్న ఎన్నికల్లో వారి ఆగడాలు శ్రుతిమించాయి. ఓటర్లను భారీఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నారు. డబ్బు, మద్యం, ఇతరత్రా నజరానాలు ఎర వేస్తున్నారు. మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, కాలవ శ్రీనివాసులు, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యేలు ఈరన్న, కందికుంట వెంకటప్రసాద్, ఉన్నం హనుమంతరాయ చౌదరితో పాటు టీడీపీ నేతలు పరిటాల శ్రీరామ్ తదితరులు మూడు వారాలుగా పెనుకొండలోనే మకాం వేశారు.
ఒక్కొక్కరు ఒక్కో వార్డు బాధ్యతలు తీసుకుని, ఆ పరిధిలోని ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కర్ణాటక నుంచి భారీ ఎత్తున మద్యం తెప్పించి రహస్య ప్రాంతాల్లో నిల్వ చేశారు. అక్కడి నుంచి ఓటర్లకు పంచి పెడుతున్నారు. ఇదివరకే ఒకటో వార్డులో స్వయాన బీటీ నాయుడు వాహనంలోనే మద్యం దొరకడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయినా జంకకుండా టీడీపీ నేతలు ప్రలోభపర్వం సాగిస్తున్నారు. ప్రతికూల పరిస్థితులు ఉన్న వార్డుల్లో ఏకంగా ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5వేల దాకా పంచినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ప్రచారం చివరిరోజైన శనివారం రోడ్‌షోలకు ఎస్పీ ఎవ్వరికీ అనుమతి ఇవ్వలేదు. దీంతో వైఎస్సార్‌సీపీ తరఫున మంత్రి శంకరనారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్ రోడ్‌షో నిర్ణయాన్ని ఉపసంహరించుకుని..ప్రచారానికే పరిమితమయ్యారు. టీడీపీ నేతలు మాత్రం పోలీసుల ఆంక్షలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. వంద వాహనాలతో పట్టణంలో హల్‌చల్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు సార్వత్రిక ఎన్నికలకు మించి చేస్తున్న హడావుడి, ఆగడాలపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment