సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఒక యువతి దక్షిణ భారతదేశ స్థాయిలో మొదటి సాన్థంలో నిలిచి పేరు ప్రఖ్యాతులు పొందిందంటే సామాన్య విషయం కాదు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులు, స్నేహితుల సహకారంతో ఆమె దూసుకెళ్లింది. సౌత్ ఇండియా 2020 కిరీటం పొందింది. గొప్పగొప్ప వారి ప్రశంసలు అందుకుంది. అందుకుంటూనే ఉంది. ఆమె పెనుకొండకు చెందిన సుగమ్య. మిస్ యూనివర్స్‌గా నిలవడమే తన లక్ష్యమని చెబుతున్న ఆమె సాక్షితో తన అనుభూతులను పంచుకుంది. -పెనుకొండ
మాది పెనుకొండ. తండ్రి రవిశంకర్ ఆధ్యాత్మికవేత్త, యోగా గురువు. తల్లి గాయత్రి. పలు సినిమాల్లో నటించింది. ఇక్కడి సరస్వతి విద్యామందిర్‌లో 3వ తరగతి వరకు చదివా. 4, 5 తరగతులు హైదరాబాద్‌లో. 6, 7, 8,9 బెంగళూరు రిషీకుల పాఠశాలలో పూర్తిచేశా. బీఎస్సీ సైకాలజీ, కళాక్షేత్ర ఫౌండేషన్ చెన్నైలో డిప్లమాలో భరతనాట్యం చేసి, ప్రస్తుతం ఎంఏ భరతనాట్యం చదువుతున్నా. మహారాష్ట్రలోని పండరీపురలో ఉన్న మిట్ విశ్వనాథ్ గురుకుల భరతనాట్య డ్యాన్సు టీచర్‌గా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నా.
మెమొంటోలుతల్లిదండ్రులతో సుగమ్యశంకర్
ఇలా మిస్ సౌతిండియా అయ్యా..!
స్నేహితుల సహకారంతో మిస్ సౌత్ ఇండియా 2020 విషయం తెలుసుకున్నా. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశా. 2019 డిసెంబర్‌లో బెంగళూరులో మొదటిసారిగా పరీక్ష నిర్వహించారు. కేరళలోని కొచ్చిలో జరిగే 4 రోజుల శిక్షణకు 2020 జనవరి మొదటి వారంలో పిలుపొచ్చింది. అక్కడ ఫోటో జెనిక్, టాలెంట్ పోటీలు, వ్యక్తిత్వ వికాసం, మానసికంగా దృఢంగా ఉండేలా శిక్షణ తీసుకున్నా. వ్యూయర్స్ ఛాయిస్ ద్వారా ఓటింగ్ ప్రారంభమైంది. 23 మంది పోటీ పడితే 67 వేల మంది నాకు మద్దతుగా ఓట్ చేశారు. ఈవెంట్‌లో మిస్ సౌత్ ఇండియా కిరీటం కట్టబెట్టారు.
తల్లిదండ్రుల సహకారంతోనే ఇక్కడి దాకా..
అమ్మానాన్న, నా సోదరుడు, స్నేహితుల సహకారంతో ఇక్కడిదాకా నా ప్రయాణం సాధ్యమైంది. వారి తోడ్పాటు లేకుంటే ఇంత దాన్ని అయ్యే దానిని కాదు. ప్రతి విషయంలోనూ ఎన్నో సూచనలు అందించి ఆచరణలో పెట్టే వరకు సలహాలు ఇస్తూనే వుంటారు. అన్నయ్య సునాగ్ శంకర్‌భరద్వాజ్ ప్రోత్సాహం మరువలేనిది. మిస్ సౌత్ ఇండియా పోటీల సందర్భంగా ఇంగ్లిష్ మాట్లాడడంలోనూ, ర్యాంప్‌పై నడిచే విషయంలోనూ, హావభావాల ప్రదర్శన విషయంలోనూ అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు. వీరే నా భవిష్యత్తు మార్గనిర్దేశకులు. ఈ జన్మ వారికే అంకితం.
సుగమ్యను వరించిన అవార్డులు
యువతకు లక్ష్యం ఉండాలి..
ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉండాలి. ముఖ్యంగా యువతకు. విద్యకు పెద్దపీట వేయాలి. పోటీతత్వాన్ని ఎదుర్కోవాలి. ముందుచూపు లేకుండా వెళ్ల రాదు. ప్రధానంగా యువతులు ఉదాశీన వైఖరి విడనాడాలి. ప్రాణాల మీదకు వచ్చే వరకు ఉండరాదు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.
ఎన్నో అనుభూతులను నింపిన ప్రయాణమిది..
ప్రస్తుతం మాటల్లో చెప్పలేని ఎంతో ఆనందం అనుభవిస్తున్నా. ఇంతటి స్థానం పొందుతానని ఎన్నడూ ఊహించలేదు. ఎంతో మంది ప్రముఖులు ప్రశంసిస్తూ సన్మానం చేస్తుండడం తీయని అనుభూతి. ప్రస్తుతం కన్నడ, తమిళం, మళయాళం చిత్రాల్లో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని యాడ్ ఫిల్మ్‌లలో నటించా.
లక్ష్యం మిస్ యూనివర్స్..
మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలవాలన్నదే నా ధ్యేయం. అలాగే, భరత నాట్య కళాక్షేత్రం పెనుకొండలో స్థాపించి ఈ ప్రాంత బాలికలకు శిక్షణ ఇవ్వాలనే కోరిక ఉంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ ఇమిడి వుంటుంది. దాన్ని వెలికితీసినపుడే ఆత్మ సంతృప్తి వుంటుంది. అమ్మ కళాకారిణి, నాన్న యోగా గురువు. వీరి ప్రతిరూపంగా పోటీ రంగంలో ముందుకు వెళ్లాలన్నదే లక్ష్యం.
అనేక పురస్కారాలు అందుకున్నా..
గుంటూరులో భరతనాట్యంతో యువకళారత్న అవార్డును మంజీర సాహిత్య అకాడమీ ద్వారా 2019లో పొందా. రాయల ఉత్సవాల సందర్భంగా భరతనాట్యంలో అనేక ప్రదర్శనలు ఇచ్చా. ప్రశంసలందుకున్నా. అనూష ఆర్ట్ అకాడమీ ద్వారా చెన్నైలో పురస్కారం పొందాను. అనంతసాహితీ అకాడమీ, త్యాగరాజ సంగీత సభల్లో అనేక పురస్కారాలూ వరించాయి.
Comments
Please login to add a commentAdd a comment