illegal promotions
-
అక్రమ పదోన్నతులు: ‘సాక్షి’ కథనంతో కలకలం
పెనుకొండ మండలంలో పనిచేసిన ఓ సెకండరీ గ్రేడ్ టీచర్... స్కూల్ అసిస్టెంట్‌గా (ఇంగ్లిష్) పదోన్నతి పొందాలనుకున్నాడు. ఎంఏ ఇంగ్లిష్ చదివాల్సి ఉన్నా.. అంత ఓపికలేక ఇతర రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ తెచ్చి ప్రమోషన్ పొందాడు. తాజాగా నకిలీ బాగోతాలన్నీ తవ్వుతుండగా ఏం జరుగుతుందోనని భయపడిపోతున్నాడు. అనంతపురం విద్య: నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి పదోన్నతులు పొందిన అయ్యవార్ల గుట్టు రట్టవుతోంది. అడ్డదారిలో పదోన్నతులు పొందిన టీచర్ల వ్యవహారంపై ‘సారూ... ఇదేమి తీరు’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో విద్యాశాఖలో కలకలం రేగింది. గుర్తింపు లేని వర్సిటీల నుంచి ఎంఏ ఇంగ్లిష్ సర్టిఫికెట్లు సమర్పించి పదోన్నతులు పొందిన వారి వివరాలన్నీ తక్షణమే తనకు అందించాలని డీఈఓ కే.శామ్యూల్ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు అలగప్ప, భారతీయార్, మధురై కామరాజ్, వినాయక మిషన్స్ తదితర వర్సిటీల్లో ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేసినట్లు సర్టి ఫికెట్లు అందజేసిన ఉపాధ్యాయుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఒకటి అక్రమం..మరొకటి సక్రమం... ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్ పదోన్నతికి తప్పనిసరిగా ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేసి ఉండాలి. అయితే నకిలీ సర్టిఫికెట్లతో కొందరు తక్షణమే పదోన్నతి తీసుకున్నారు. తిరిగి మరో దఫా అదే పీజీని మరో వర్సిటీ నుంచి ఒరిజినల్‌గా పూర్తి చేశారు. ఇలా ఆరుగురు ఎంఏ ఇంగ్లిష్‌ను రెండు దఫాలు పూర్తి చేసినట్లు ఎస్ఆర్ (సర్వీసు రిజిస్టర్)లో నమోదు చేయించుకున్నారు. నకిలీ పీజీ సర్టిఫికెట్‌ను అసలు పీజీ సర్టిఫికెట్‌గా మార్చేందుకు ఎత్తుగడ వేశారు. పదోన్నతి దక్కినప్పుడు నమోదు చేసిన సర్టిఫికెట్, వర్సిటీ.. తాజాగా నమోదు చేసిన సర్టిఫికెట్ వేర్వేరుగా ఉండటం గమనార్హం. సింగిల్ సబ్జెక్టు పేరుతో... ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్ పదోన్నతికి ఎంఏ ఇంగ్లిష్ /లేదా డిగ్రీలో ఇంగ్లిష్ లిటరేచర్ తప్పనిసరి. ఈ క్రమంలో నకిలీ ఎంఏ ఇంగ్లిష్ సర్టిఫికెట్ తెచ్చుకున్న వారు కొందరైతే.. మరికొందరు ఏకంగా సింగిల్ సబ్జెక్టు ఇంగ్లిష్ డిగ్రీ పేరుతో నకిలీ సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. డీఈఓ నిర్ణయంతో వారందరికీ చెమటలు పడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో...ఎవరిపై వేటు పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కానీ మెజార్టీ ఉపాధ్యాయులు మాత్రం ఇప్పటికైనా అక్రమార్కులపై చర్యలు తీసుకుని సీనియార్టీ, అర్హత ఉన్న వారికి పదోన్నతి కల్పించాలని కోరుతున్నారు. -
ఇంజినీర్లకు ఊరట!
రాష్ట్ర జలవనరుల శాఖలో తన అనుయాయులను కీలక పోస్టుల్లో నియమించుకునేందుకు గత టీడీపీ ప్రభుత్వం జారీచేసిన అడ్డగోలు ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు అడ్డంగా కొట్టేసింది. రాజ్యాంగంలోని రాష్ట్రపతి ఉత్తర్వులకు, జోనల్ వ్యవస్థకు భిన్నంగా ఉన్నాయని స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చింది. టీడీపీ నాయకుల వ్యవహారాల వల్ల నష్టపోయిన ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన ఇంజినీర్లకు దీంతో ఎంతో ఊరట లభించింది. సాక్షి, విశాఖపట్నం: పదోన్నతులు ఒక పద్ధతి ప్రకారం జరిగితే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ) కనిష్టంగా మూడేళ్ల సర్వీసుతో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ)గా పదోన్నతి పొందుతారు. ఈఈ కూడా కనిష్టంగా మూడేళ్ల సర్వీసు తర్వాత సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) అవుతారు. ఎస్ఈ పదోన్నతిపై చీఫ్ ఇంజినీర్ (సీఈ) పోస్టులోకి వెళతారు. కానీ టీడీపీ ప్రభుత్వ హయాంలో నాటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రాంగంతో పదోన్నతుల విధానం క్రమం తప్పింది. తనకు కావాల్సిన వ్యక్తులను కీలక పోస్టుల్లో కూర్చోబెట్టుకునేందుకు నిబంధనలను, పదోన్నతుల సంప్రదాయాలను తుంగలోకి తొక్కారు. దీంతో జోన్–1 ప్రాంతమైన ఉత్తరాంధ్రకు చెందిన ఇంజినీర్లు తీవ్రంగా నష్టపోయారు. 53 మంది ఇంజినీర్లు తామున్న పోస్టు నుంచి దిగువ పోస్టుకు రివర్సన్ అయ్యారు. చివరకు 2014 సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ ద్వారా పదోన్నతి పొందినవారికీ రివర్సన్ వచ్చిందంటే టీడీపీ ప్రభుత్వ అడ్డగోలు వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో ఊహించవచ్చు. ఇదేమి న్యాయమంటూ ఉత్తరాంధ్ర ఇంజినీర్లు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో ఏకంగా 31 మంది బాధిత ఇంజినీర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విషయం కాబట్టి తెలంగాణ హైకోర్టు పరిధిలో విచారణ జరిగింది. జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం ఈనెల 22వ తేదీన తీర్పు ఇచ్చింది. ఐదుగురు రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ సిఫారసులను సాకుగా చూపించి 2017లో టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. నిబంధనలకు అనుగుణంగా జలవనరుల శాఖలో పదోన్నతుల ప్రక్రియను రెండు నెలల్లోగా చక్కదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఊరట చెందిన ఉత్తరాంధ్ర ఇంజినీర్ల సంఘం హర్షం ప్రకటించింది. ఏమిటీ వివాదం? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆరు జోన్లను విద్య, ఉద్యోగాల విషయంలో సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో భౌగోళికంగా విభజించారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక అంశాల్లో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే భారత రాజ్యాంగంలోని 371(డి) అధికరణ ప్రకారం ఈ ఏర్పాటు చేశారు. 1975 సంవత్సరంలో 32వ రాజ్యాంగం సవరణ ద్వారా దీన్ని రాజ్యాంగంలో చేర్చారు. ఈ ప్రకారం రాష్ట్రంలోని జోన్–1లో ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు, జోన్–2లో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు, జోన్–3లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, జోన్–4లో రాయలసీమ నాలుగు జిల్లాలు ఉన్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాలన్నీ 5, 6 జోన్లలో ఉన్నాయి. కొన్ని విభాగాల్లో ఉద్యోగులు తమ విద్యాభ్యాసం, స్థానికత ఆధారంగా సొంత జోన్లలోనే పనిచేసే అవకాశం కల్పిస్తూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 610 జీవో తీసుకొచ్చారు. ఏ జోన్‌కు చెందినవారు ఆ జోన్లోనే ఎక్కువ కాలం పనిచేస్తే స్థానిక పరిస్థితులపై పూర్తిస్థాయి అవగాహనతో ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహించవచ్చనేది ఆ జీవో ఉద్దేశం. ఈ ప్రకారమే ఇప్పటివరకూ జోన్ల వ్యవస్థ అమల్లో ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన జలవనరుల శాఖలో కీలకమైన పోస్టుల్లో తమకు కావాల్సినవారిని కూర్చోబెట్టడానికి ఈ జోన్ల విధానంపై సరికొత్త ఆలోచనకు తెరతీశారు. నాటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు మౌఖికంగా ఆదేశాలివ్వడంతో ఇంజనీర్–ఇన్–చీఫ్ కార్యాలయం కసరత్తు ప్రారంభించింది. ఈ విషయం తెలిసి ఉత్తరాంధ్ర ఇంజినీర్ల సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. రాజధాని అమరావతికి వెళ్లి మరీ రద్దు నిర్ణయం వద్దంటూ వేడుకున్నారు. తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విన్నవించారు. భయపడినట్లు ఏమీ జరగదని, అందరికీ న్యాయం జరుగుతుందని సర్దిచెప్పి పంపించారు. తీరా రాష్ట్రంలోని 83 మంది ఇంజినీర్లకు రివర్సన్ ఇచ్చేశారు. వారిలో ఉత్తరాంధ్రకు చెందినవారే 53 మంది ఉన్నారు. వారికి రివర్సన్ ఇస్తూ నాటి ప్రభుత్వం 2017, 2018 సంవత్సరంలో జీవోలు జారీ చేసింది. వారిలో ఇద్దరు చీఫ్ ఇంజినీర్లు ఉండటం గమనార్హం. వారికన్నా దిగువస్థాయిలోని సూపరింటెండెంట్ ఇంజినీరు (ఎస్ఈ)గా మారిపోయారు. ఎస్ఈ పోస్టు నుంచి 19 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (ఈఈ)గా మారిపోయారు. ఈఈ పోస్టు నుంచి 32 మందికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (డీఈఈ)గా రివర్సన్ అయ్యారు. ఇలా దిగువ స్థాయికి వెళ్లి పోస్టింగ్‌లోకి వెళ్లడం ఇష్టంలేక చాలామంది దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారంటే పరిస్థితిని ఊహించవచ్చు. -
అడ్డగోలు పదోన్నతులజాతర!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అసలు ఖాళీలు లేవు... ఆపై పోస్టులు కూడా లేవు... ఉన్న పోస్టుల సంఖ్య కంటే ఎక్కువ మందే పనిచేస్తున్నారు. కొత్తగా పోస్టులు ఇవ్వటానికి ప్రభుత్వ నిబంధనలు అంగీకరించవు. కాని ఇవేమీ మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారులకు అక్కర్లేదు. కావాల్సింది డబ్బులు ఒక్కటే. పైరవీలు చేసే వారికి అగ్రప్రాధాన్యం ఇవ్వటం ఈ శాఖలో షరా మాములుగా మారింది. తాజాగా ఇదే రీతిలో ఖాళీలు లేని డిప్యూటీ డెరైక్టర్ పోస్టింగ్‌లు ఉన్నట్లు చూపి 40 మందికి పదోన్నతులు ఇవ్వటానికి కమిషనర్ లేని సమయంలో కొందరు ఉన్నతాధికారులు చకాచకా పావులు కదిపారు. పర్యవసానంగా భారీగా మార్కెటింగ్‌శాఖలో పదోన్నతుల జాతర జరగనుంది. సర్వీసు నిబంధనల ప్రకారం మార్కెట్‌యార్డుల్లో పదోన్నతులు, పోస్టింగ్‌ల విషయంలో 9ః1 నిష్పత్తి ప్రకారం జరగాలి. అంటే పదోన్నతుల్లో 9మంది మార్కెట్‌కమిటీ ఉద్యోగులకు పదోన్నతి ఇస్తే మార్కెట్‌యార్డుల్లో పనిచేయటానికి 1 మార్కెటింగ్ శాఖ అధికారికి ఇస్తారు. కాని ప్రస్తుతం శాఖలో దీనికి పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. ఫలితంగా వందల మంది మార్కెట్‌కమిటీ ఉద్యోగులు పదోన్నతుల కోసం పోరు సాగించాల్సి వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మార్కెటింగ్‌శాఖ డిప్యూటీ డైరైక్టర్(డిడి) పోస్టులు ఆరు మాత్రమే ఉన్నాయి. మూడు లేదా ఐదు జిల్లాలకు కలిపి ఒక రీజియన్‌గా గుర్తించి ఒక డిప్యూటీ డెరైక్టర్‌ను నియమిస్తారు. అలాగే రాష్ట్రంలో 57 మార్కెట్‌యార్డుల్లో ఉన్నతశ్రేణి కార్యదర్శులు ఉన్నారు. ఉన్నతశ్రేణి కార్యదర్శిగా మార్కెట్ కమిటీ యార్డు సర్వీసులో పదోన్నతి పొందిన వారితో పాటు డిప్యూటీ ైడె రెక్టర్లు కూడా అర్హులే. అయితే అక్కడ 9ః1 నిష్పత్తిని అనుసరించి ఇవ్వాలి. ఆ ప్రకారం 5 ఉన్నతశ్రేణి కార్యదర్శి పదవుల్లో డిప్యూటీ డైరైక్టర్లు పనిచేయవచ్చు. కాని ప్రసుత్తం రాష్ట్రంలో ఆరుగురు డిప్యూటీ డెరైక్టర్లతో పాటు డీడీ హోదాలో ఉండి మార్కెట్ యార్డుల్లో ఏడుగురు పనిచేస్తున్నారు. వీరు కాకుండా తాజాగా మరో 40 మంది అసిస్టెంట్ డెరైక్టర్లకు డిప్యూటీ డైరక్టర్లుగా పదోన్నతులు కల్పించనున్నారు. వాస్తవానికి ఖాళీలు లేకపోగా ఉన్న యార్డుల్లో నిష్పత్తికి మించి అదనంగా పనిచేస్తున్నారు. కాని మార్కెట్‌యార్డులను చూపి డీడీలుగా పదోన్నతులు కట్టబెట్టడానికి పెద్ద వ్యవహారమే నడిచింది. శాఖలో చక్రం తిప్పే ముఖ్య వ్యక్తి కమిషనర్ ప్రమేయం లేకుండానే తతంగం అంతా నడిపినట్లు తెలుస్తోంది. ఒక్కొక్క పోస్టుకు లక్ష నుంచి రెండు లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. దీనికి గాను రాష్ర్టంలోని అన్ని జిల్లాల నుంచి పదోన్నతులు ఇవ్వటానికి వీలుగా సమాచారాన్ని కమిషనర్ కార్యాలయానికి తెప్పించారు. ఖమ్మం జిల్లాలో ఒకరు, గుంటూరులో మూడు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు, విజయవాడ ఒకరు, విశాఖపట్నం నుంచి ఒకరు, కృష్ణా జిల్లా నుంచి ఒకరు అసిస్టెంట్ డెరైక్టర్ నుంచి డీడీలుగా పదోన్నతులు పొందే జాబితాలో ఉన్నారు. వీరు కాకుండా రాష్ర్టంలోని అన్ని జిల్లాల నుంచి ఏడీలు ఉన్నారు. ఏడీ పదోన్నతుల్లోనూ... మరోవైపు ఇదే రీతిలో సీనియర్ మార్కెటింగ్ అసిస్టెంట్ నుంచి అసిస్టెంట్ డెరైక్టర్లుగా పదోన్నతుల కోసం 52 మంది జాబితాతో ఫైల్ సిద్ధం చేశారు. వీటిలోనూ ఇదే తంతు కొనసాగుతుంది. రాష్ర్టవ్యాప్తంగా 30పోస్టులకు గాను పూర్తిస్థాయిలో అధికారులు ఉన్నారు. అలాగే ఏడీ స్థాయి అధికారి స్పెషల్‌గ్రేడ్ కార్యదర్శిగా మార్కెట్ యార్డుల్లో పనిచేసే అవకాశం ఉంది. అది కూడా సుమారు 12 మంది వరకు మాత్రమే పనిచేసే వీలుంటుంది. కాని ఇప్పటికే 37 మంది పనిచేస్తున్నారు. దీంతో నిత్యం మార్కెట్‌కమిటీ ఉద్యోగులు మార్కెటింగ్‌శాఖ ఉద్యోగుల మధ్య సమస్యలు ఉత్పన్నమై పదోన్నతుల కోసం మార్కెట్ కమిటీ ఉద్యోగులు నిత్యం ట్రిబ్యునల్‌ను, హైకోర్టును ఆశ్రయించి హక్కులు కాపాడుకుంటున్నారు. అసలు ఖాళీలు లేవు. కొత్తగా పదోన్నతులు ఇచ్చిన వారికి పోస్టింగ్‌లు మంజూరు చేయటం కష్టమని తెలిసికూడా కొందరు ఉన్నతాధికారులు కాసుల కోసమే తతంగం నడుపుతున్నారనే అరోపణలు ఉన్నాయి. సదరు శాఖ అమాత్యుని పేరు చెప్పుకొని శాఖలో చెలామణి అవుతూ అమాత్యునికి తెలియకుండానే కొన్ని పనులు చక్కపెడుతున్నారు. కిందిస్థాయిలోనూ సమస్యలే.... ఈవ్యవహారాలతో కిందిస్థాయిలో ఇబ్బందులు తలెత్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 358 పోస్టుల ఖాళీలు ఉన్నట్లు 2010లో నిర్ధా రించారు. ఇలాంటి అక్రమాలతో ఇవన్నీ మరుగున పడిపోతున్నాయి. తెలంగాణ రీజియన్‌లోని ఖమ్మం, వరంగల్, అదిలాబాద్, నల్గొండ, కరీంగనర్ జిల్లాలో 27 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 50 వరకు పదోన్నతులు కిందిస్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా గ్రేడ్-2, గ్రేడ్-3 కార్యదర్శుల పదోన్నతులు 11, సూపర్వైజర్ నుంచి అసిస్టెంట్ కార్యదర్శులు 38 మంది పదోన్నతులు నిలిచిపోయాయి. మార్కెట్ కమిటీ సర్వీసులోకి ఇబ్బడి ముబ్బడిగా మార్కెటింగ్‌శాఖ ఉద్యోగులు కొందరు పైరవీలతో వస్తుండటం వల్ల పదోన్నతులు సక్రమంగా జరగటం లేదు. పర్యవసానంగా మార్కెట్ యార్డులోనే పదోన్నతులు ప్రకియ పూర్తిగా గాడితప్పింది. ఖమ్మం జిల్లాలోని 13 మార్కెట్ కమిటీల్లో 130 మంది సిబ్బందికి గాను 60 మందే పనిచేయటం ప్రస్తుత పరిస్థితికి నిదర్శనం.