రాష్ట్ర జలవనరుల శాఖలో తన అనుయాయులను కీలక పోస్టుల్లో నియమించుకునేందుకు గత టీడీపీ ప్రభుత్వం జారీచేసిన అడ్డగోలు ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు అడ్డంగా కొట్టేసింది. రాజ్యాంగంలోని రాష్ట్రపతి ఉత్తర్వులకు, జోనల్ వ్యవస్థకు భిన్నంగా ఉన్నాయని స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చింది. టీడీపీ నాయకుల వ్యవహారాల వల్ల నష్టపోయిన ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన ఇంజినీర్లకు దీంతో ఎంతో ఊరట లభించింది.
సాక్షి, విశాఖపట్నం: పదోన్నతులు ఒక పద్ధతి ప్రకారం జరిగితే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ) కనిష్టంగా మూడేళ్ల సర్వీసుతో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ)గా పదోన్నతి పొందుతారు. ఈఈ కూడా కనిష్టంగా మూడేళ్ల సర్వీసు తర్వాత సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్‌ఈ) అవుతారు. ఎస్‌ఈ పదోన్నతిపై చీఫ్ ఇంజినీర్ (సీఈ) పోస్టులోకి వెళతారు. కానీ టీడీపీ ప్రభుత్వ హయాంలో నాటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రాంగంతో పదోన్నతుల విధానం క్రమం తప్పింది. తనకు కావాల్సిన వ్యక్తులను కీలక పోస్టుల్లో కూర్చోబెట్టుకునేందుకు నిబంధనలను, పదోన్నతుల సంప్రదాయాలను తుంగలోకి తొక్కారు. దీంతో జోన్–1 ప్రాంతమైన ఉత్తరాంధ్రకు చెందిన ఇంజినీర్లు తీవ్రంగా నష్టపోయారు.
53 మంది ఇంజినీర్లు తామున్న పోస్టు నుంచి దిగువ పోస్టుకు రివర్సన్ అయ్యారు. చివరకు 2014 సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ ద్వారా పదోన్నతి పొందినవారికీ రివర్సన్ వచ్చిందంటే టీడీపీ ప్రభుత్వ అడ్డగోలు వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో ఊహించవచ్చు. ఇదేమి న్యాయమంటూ ఉత్తరాంధ్ర ఇంజినీర్లు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో ఏకంగా 31 మంది బాధిత ఇంజినీర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విషయం కాబట్టి తెలంగాణ హైకోర్టు పరిధిలో విచారణ జరిగింది. జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం ఈనెల 22వ తేదీన తీర్పు ఇచ్చింది. ఐదుగురు రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ సిఫారసులను సాకుగా చూపించి 2017లో టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. నిబంధనలకు అనుగుణంగా జలవనరుల శాఖలో పదోన్నతుల ప్రక్రియను రెండు నెలల్లోగా చక్కదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఊరట చెందిన ఉత్తరాంధ్ర ఇంజినీర్ల సంఘం హర్షం ప్రకటించింది.
ఏమిటీ వివాదం?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆరు జోన్‌లను విద్య, ఉద్యోగాల విషయంలో సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో భౌగోళికంగా విభజించారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక అంశాల్లో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే భారత రాజ్యాంగంలోని 371(డి) అధికరణ ప్రకారం ఈ ఏర్పాటు చేశారు. 1975 సంవత్సరంలో 32వ రాజ్యాంగం సవరణ ద్వారా దీన్ని రాజ్యాంగంలో చేర్చారు. ఈ ప్రకారం రాష్ట్రంలోని జోన్–1లో ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు, జోన్–2లో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు, జోన్–3లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, జోన్–4లో రాయలసీమ నాలుగు జిల్లాలు ఉన్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాలన్నీ 5, 6 జోన్లలో ఉన్నాయి. కొన్ని విభాగాల్లో ఉద్యోగులు తమ విద్యాభ్యాసం, స్థానికత ఆధారంగా సొంత జోన్లలోనే పనిచేసే అవకాశం కల్పిస్తూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 610 జీవో తీసుకొచ్చారు.
ఏ జోన్‌కు చెందినవారు ఆ జోన్‌లోనే ఎక్కువ కాలం పనిచేస్తే స్థానిక పరిస్థితులపై పూర్తిస్థాయి అవగాహనతో ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహించవచ్చనేది ఆ జీవో ఉద్దేశం. ఈ ప్రకారమే ఇప్పటివరకూ జోన్‌ల వ్యవస్థ అమల్లో ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన జలవనరుల శాఖలో కీలకమైన పోస్టుల్లో తమకు కావాల్సినవారిని కూర్చోబెట్టడానికి ఈ జోన్‌ల విధానంపై సరికొత్త ఆలోచనకు తెరతీశారు. నాటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు మౌఖికంగా ఆదేశాలివ్వడంతో ఇంజనీర్–ఇన్–చీఫ్ కార్యాలయం కసరత్తు ప్రారంభించింది. ఈ విషయం తెలిసి ఉత్తరాంధ్ర ఇంజినీర్ల సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. రాజధాని అమరావతికి వెళ్లి మరీ రద్దు నిర్ణయం వద్దంటూ వేడుకున్నారు.
తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విన్నవించారు. భయపడినట్లు ఏమీ జరగదని, అందరికీ న్యాయం జరుగుతుందని సర్దిచెప్పి పంపించారు. తీరా రాష్ట్రంలోని 83 మంది ఇంజినీర్లకు రివర్సన్ ఇచ్చేశారు. వారిలో ఉత్తరాంధ్రకు చెందినవారే 53 మంది ఉన్నారు. వారికి రివర్సన్ ఇస్తూ నాటి ప్రభుత్వం 2017, 2018 సంవత్సరంలో జీవోలు జారీ చేసింది. వారిలో ఇద్దరు చీఫ్ ఇంజినీర్లు ఉండటం గమనార్హం. వారికన్నా దిగువస్థాయిలోని సూపరింటెండెంట్ ఇంజినీరు (ఎస్‌ఈ)గా మారిపోయారు. ఎస్‌ఈ పోస్టు నుంచి 19 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (ఈఈ)గా మారిపోయారు. ఈఈ పోస్టు నుంచి 32 మందికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (డీఈఈ)గా రివర్సన్ అయ్యారు. ఇలా దిగువ స్థాయికి వెళ్లి పోస్టింగ్‌లోకి వెళ్లడం ఇష్టంలేక చాలామంది దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారంటే పరిస్థితిని ఊహించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment