భలే అడ్వొకేట్లు.. వంశ వృక్షాన్నే డూప్లికేట్‌ చేశారు! | Created Death Certificates While The Owners Were Still alive | Sakshi
Sakshi News home page

భలే అడ్వొకేట్లు.. వంశ వృక్షాన్నే డూప్లికేట్‌ చేశారు!

Published Mon, Oct 24 2022 4:17 PM | Last Updated on Mon, Oct 24 2022 4:29 PM

Created Death Certificates While The Owners Were Still alive - Sakshi

అనంతపురం శ్రీకంఠం సర్కిల్‌: న్యాయవాద వృత్తిలో ఉన్న తల్లీ కుమారుడు సునాయసంగా డబ్బు సంపాదించేందుకు అడ్డదారి తొక్కారు. బతికున్న యజమానులను చనిపోయినట్లుగా సర్టిఫికెట్లు సృష్టించి.. నకిలీ వారసులను తెరపైకి తీసుకొచ్చి.. వారి ద్వారా రూ.75లక్షల విలువచేసే ఆస్తి కాజేయబోయారు. బాధితుడి ఫిర్యాదుతో బండారం బయటపడిపోయింది. కీలక సూత్రధారులైన తల్లీ కుమారుడు, వీరికి సహకరించిన మరో నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇందుకు సంబంధించిన వివరాలను అనంతపురం ఇన్‌చార్జ్‌ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు ఆదివారం తన చాంబర్‌లో టూటౌన్‌ సీఐ శివరాముడుతో కలిసి మీడియాకు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో నివాసముంటున్న అనంతపురం వాసి శ్రీరాములునాయక్‌కు స్థానిక ఆదర్శ నగర్‌ కాలనీలో 333, 339 సర్వేనంబర్లలోని 5.14 సెంట్ల విస్తీర్ణంలో ఇల్లు ఉంది. రూ.75లక్షలు విలువ చేసే ఈ ఆస్తిని ప్రస్తుతం అమ్మకానికి పెట్టారు. 

ఈ క్రమంలో ధర్మవరం న్యాయవాది కట్టా శ్రీదేవి, ఆమె కుమారుడు కట్టా గణేష్‌లు ఆ ఆస్తి డాక్యుమెంట్లు సేకరించారు. యజమాని ఇక్కడ లేనందున ఎలాగైనా ఆస్తిని కొట్టేయాలని కుట్ర పన్నారు. శ్రీరాములు నాయక్, ఆయన భార్య ఇద్దరూ చనిపోయినట్లుగా తమ ల్యాప్‌టాప్‌లోనే నకిలీ డెత్‌ సర్టిఫికెట్లు తయారు చేశారు.

కట్టా శ్రీదేవి తనకు అత్యంత నమ్మకస్తురాలైన పనిమనిషి ముత్యాలమ్మ, అనిల్‌కుమార్, బండిమాల లోకేశ్వర, సాంబశివ, డాక్యుమెంట్‌ రైటర్‌ శ్రీనివాసప్రసాద్, గుర్రం గణేష్‌ల సహకారం తీసుకున్నారు. అనిల్‌కుమార్‌ను శ్రీరాములునాయక్‌ కొడుకుగా చిత్రీకరిస్తూ ఆధార్‌కార్డులో మార్పులు చేశారు. నకిలీ వంశ వృక్షం తయారు చేయించారు. వీటి ద్వారా గత సెప్టెంబర్‌ 23న ధర్మవరం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో శ్రీరాములునాయక్‌ ఆస్తిని అనిల్‌కుమార్‌ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఆ తర్వాత అనిల్‌కుమార్‌ నుంచి పనిమనిషి ముత్యాలమ్మకు జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ చేయించారు. 

 మోసం బయటపడిందిలా.. 
శ్రీరాములు నాయక్‌ తన ఆస్తిని అమ్మే ఏర్పాట్లను ఈ నెలలో ముమ్మరం చేశాడు. ఈ క్రమంలో ‘జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ’ అనిల్‌కుమార్‌ నుంచి ముత్యాలమ్మకు వెళ్లినట్లు బయటపడింది. దీంతో శ్రీరాములునాయక్‌ ఎవరో తన ఆస్తిని కాజేశారని ఎస్పీ ఫక్కీరప్పకు ‘స్పందన’లో ఫిర్యాదు చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ కేసును టూటౌన్‌ పోలీసులకు అప్పగించారు.

ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. దర్యాప్తులో తల్లీ కొడుకులైన అడ్వొకేట్లు కట్టా శ్రీదేవి, కట్టా గణేష్‌ల పన్నాగం బయట పడింది. దీంతో తల్లీకుమారుడితో పాటు ధర్మవరం మండలం దర్శినమలకు చెందిన బేతరాసి అనిల్‌కుమార్, అనంతపురం రామ్‌నగర్‌కు చెందిన జింక శ్రీనివాస ప్రసాద్, చెన్నేకొత్త పల్లి మండలం బసంపల్లికి చెందిన పుట్టపర్తి సాంబశివ, బండిమాల లోకేశ్వర్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్, డెత్‌ సర్టిఫికెట్, లీగల్‌ హైర్‌ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మేజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు రిమాండ్‌కు  పంపారు.  ఈ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. త్వరలోనే వారిని కూడా అరెస్ట్‌ చేసి, కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement