Police Bust Fake Educational Certificates Racket, 6 Arrested In Hyderabad - Sakshi
Sakshi News home page

నకిలీ సర్టిఫికెట్ల తయారీలో శిక్షణ!

Published Wed, Aug 24 2022 9:11 AM | Last Updated on Wed, Aug 24 2022 9:58 AM

Rachakonda Police Nabbed Gang Selling Fake Certificates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నకిలీ విద్యార్హత పత్రాల తయారీ ముఠా గుట్టురట్టయ్యింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లను సృష్టించి, విక్రయిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఎస్‌ఓటీ డీసీపీ కే మురళీధర్, ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌లతో కలిసి రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు. 

  • చాంద్రాయణగుట్ట, క్యూబా కాలనీకి చెందిన మహ్మద్‌ ఖలీముద్దీన్‌ అలియాస్‌ ఖలీం నకిలీ సర్టిఫికెట్లను తయారు చేయడంలో దిట్ట. గత ఏడేళ్లుగా ఈ దందాను నిర్వహిస్తున్నాడు. ఇతనిపై చాంద్రాయణగుట్ట, అబిడ్స్‌ ఠాణాలలో రెండు కేసులున్నాయి. పోలీసుల నిఘా ఉండటంతో అజ్ఞాతంలో ఉంటూ తన అనుచరులకు శిక్షణ ఇస్తున్నాడు. ఖలీం స్నేహితుడైన గోల్కొండ మోతీ దర్వాజకు చెందిన ముక్తార్‌ అహ్మద్‌కు అడోబ్‌ ఫొటోషాప్‌లో ఫొటోలు, డాక్యుమెంట్ల ఎడిటింగ్‌పై మంచి అనుభవం ఉంది. దీంతో ఖలీం ఇతనికి నకిలీ సరి్టఫికెట్ల తయారీ శిక్షణ ఇచ్చాడు. అలాగే విద్యార్హత పత్రాల తయారీకి అవసరమైన యూనివర్సిటీ గుర్తింపు చిహ్నలు, హాలోగ్రామ్స్‌ ఇతరత్రా వస్తువులను అందించాడు. తన పేరు బయటకు రాకుండా రహస్యంగా ఉంచాలని, కమీషన్‌ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించాడు. 
  • రాజేంద్రనగర్‌కు చెందిన అహ్మద్‌ ఫిరోజ్, లక్డీకపూల్‌ ఏసీ గార్డ్స్‌కు చెందిన మహ్మద్‌ ఫరూక్‌ అజీజ్, టోలిచౌకీ పారామౌంట్‌ కాలనీకి చెందిన మహ్మద్‌ సారూషుల్లా ఖాన్‌లను ముక్తార్‌ కమీషన్‌ ఏజెంట్లుగా నియమించుకున్నాడు. వారికి అవసరమైనట్లు నకిలీ విద్యార్హత పత్రాలను తయారు చేసేవాడు. ఒక్కో సరి్టఫికెట్‌ను రూ. లక్ష, రూ. 2 లక్షలకు విక్రయించేవాడు. ఇందులో 25 శాతం కమీషన్‌ను ఖలీంకు చెల్లించేవారు. 
  • ఈ క్రమంలో నిందితుల నుంచి హుస్సేనీఆలంకు చెందిన మహ్మద్‌ జుబేర్‌ అలీ,  టోలిచౌకీకి చెందిన సయ్యద్‌ అతీఫుద్దిన్‌ రూ.లక్షకు నకిలీ విద్యార్హత పత్రాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. సర్టిఫికెట్లను తీసుకునేందుకు బాలాపూర్‌ ఎర్రకుంటకు వెళ్లారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు చేసి సరూషుల్లా ఖాన్, జుబేర్, అతీఫుద్దిన్, ఫరూఖ్‌ అజీజ్, మహ్మద్‌ ఫిరోజ్, ముక్తార్‌ అహ్మద్‌లను పట్టుకున్నారు. వీరి నుంచి నకిలీ సర్టిఫికెట్లతో పాటు ల్యాప్‌టాప్, స్టాంప్‌లు, 6 సెల్‌ఫోన్లు ఇతరత్రా వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 
  • ఇప్పటివరకు ఈ ముఠా 258 సర్టిఫికెట్లను తయారు చేసి, విక్రయించారని, వీరిలో పలువురు విదేశాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఎర్రగడ్డకు చెందిన సల్మాన్‌ యూకేకు, కాలాపత్తర్‌కు చెందిన మీర్జా యూసుఫుద్దిన్‌ న్యూయార్క్‌కు, మెహదీపట్నానికి చెందిన మహ్మద్‌ మాజీద్‌ అమెరికాకు, గోల్కొండకు చెందిన రెహాన్, అశ్వాక్‌ అహ్మద్‌ దుబాయ్‌ దేశాలకు వెళ్లినట్లు సీపీ తెలిపారు. నిందితులపై పీడీ యాక్ట్‌ నమోదు చేసి, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్ట్‌లో శిక్ష పడేలా చేస్తామని పేర్కొన్నారు.

వీరి వెనకెవరున్నారు? 
ఈ నకిలీ సరి్టఫికెట్ల రాకెట్‌ను నడుపుతున్న ప్రధాన నిందితుడు మహ్మద్‌ ఖలీముద్దిన్‌తో సహా ఇతర నిందితులు, కొనుగోలు చేసే విద్యార్థులు అందరూ ఒకే వర్గానికి చెందిన వారే కావటంతో పోలీసులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వీరి నుంచి నకిలీ పత్రాలను కొనుగోలు చేసిన విద్యార్థులు ఎక్కువగా గల్ఫ్‌ దేశాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

దీంతో వీరి వెనక ఎవరైనా అదృశ్య శక్తులు ఉండి ఈ రాకెట్‌ను నడిపిస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు సూత్రధారి ఖలీం పట్టుబడితేనే దీని వెనక ఎవరున్నారనేది బయటపడుతుందని ఓ పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు. 

(చదవండి: నకిలీ పత్రాలతో ఇల్లు విక్రయం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement