Telugu Badminton Players Fake Birth Certificate To BAI; CCS Police Investigating - Sakshi
Sakshi News home page

HYD: బ్యాడ్మింటన్‌ క్రీడలో తప్పుడు డేట్‌ ఆఫ్‌ బర్త్‌ల బాగోతం.. ఆకాశరామన్న లేఖతో రంగంలోకి పోలీసులు

Published Wed, Aug 2 2023 8:28 AM | Last Updated on Wed, Aug 2 2023 3:20 PM

Telugu Badminton Players Fake Birth Certificate To BAI CCS Police Investigating - Sakshi

-శ్రీరంగం కామేష్‌, సాక్షి ప్రతినిధి

బ్యాడ్మింటన్‌లో ఓ వయస్సు క్రీడాకారుడు అదే ఏజ్‌ గ్రూప్‌లో ఉండే మరో ఆటగాడితో పోటీ పడాలి. నిబంధనలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అలా జరిగినప్పుడే సరైన పోటీ అన్పించుకుంటుంది. వయస్సులో తేడాలున్నప్పుడు ఆటలోని అనుభవాన్ని బట్టి ప్రతిభా సామర్థ్యాల్లో సైతం తేడా ఉండేందుకు అవకాశం ఉంటుంది. పతకాలు, ర్యాంకుల్ని సైతం ప్రభావితం చేస్తుంది. ఇంతటి కీలకమైన వయస్సు నిబంధనకు తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు జాతీయ స్థాయి ఉత్తమ ర్యాంకర్లు తూట్లు పొడిచారు.

తమ పుట్టిన తేదీ విషయంలో భారీ స్కామ్‌కు పాల్పడ్డారు. తమ వాస్తవ వయస్సును తగ్గించేసి బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాకు (బీఏఐ) తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారు. ఈ మేరకు అందిన ఆకాశరామన్న ఉత్తరం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైౖమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) పోలీసులు ముగ్గురి విషయంలో ఈ అక్రమాలను నిర్ధారించారు. సమగ్ర ఆధారాలతో తెలంగాణ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌కు లేఖ రాశారు. కానీ వారు ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.  

ఉత్తరం ఆధారంగా.. 
ఈ స్కామ్‌కు సంబంధించిన సమాచారాన్ని సిటీ సీసీఎస్‌ పోలీసులకు ఓ అజ్ఞాత వ్యక్తి లేఖ ద్వారా అందజేశారు. ఈ ఏడాది మార్చి 29న అందిన ఈ లేఖలో ఆరుగురు క్రీడాకారులపై ఆరోపణలున్నాయి. వీరు తమ అసలు వయస్సును దాచి పెట్టి నకిలీ సర్టిఫికెట్ల సృష్టించి బీఏఐకి సమర్పించారని, తద్వారా తమ కంటే చిన్న వారితో పోటీల్లో తలపడుతూ మెడల్స్, జాతీయ స్థాయి ర్యాంకులు సాధిస్తున్నారని అతను ఆరోపించారు. దీనివల్ల నిబంధనలు పాటించిన క్రీడాకారులకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే బీఏఐకి అనేకమంది నుంచి ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు.  

సమగ్ర దర్యాప్తు చేసిన సీసీఎస్‌.. 
కేవలం ఈ ఆరుగురే కాకుండా దాదాపు 40 మంది బ్యాడ్మింటన్‌ ఆటగాళ్ల వయస్సు విషయంలో తమకు సందేహాలు ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తి ఆ లేఖలో పేర్కొన్నారు. వీరిలో చాలామంది 2005–10 మధ్య పుట్టారని, అయితే జనన ధ్రువీకరణ పత్రాలకు బదులుగా కొందరు వైద్యులు ఇచ్చిన బోగస్‌ మెడికల్‌ సర్టిఫికెట్లు దాఖలు చేసి తమ వయస్సు తగ్గించుకున్నారని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు.

ఈ క్రీడాకారులకు తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది కోచ్‌లు, వారి తల్లిదండ్రులతో పాటు ఈ వైద్యుల సహకారం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ లేఖను సిటీ పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.చంద్రకుమార్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.  
చదవండి: BWF Rankings: తొమ్మిదో ర్యాంక్‌కు ప్రణయ్‌.. పీవీ సింధు మాత్రం..

ముగ్గురి విషయంలో ఆధారాలు లభ్యం... 
సీసీఎస్‌ ప్రత్యేక బృందానికి తొలి దశలోనే ముగ్గురు క్రీడాకారులకు సంబంధించిన సమగ్ర ఆధారాలు లభించాయి. బీఏఐ జాబితాలో అండర్‌–17 కేటగిరీలో 1176 పాయింట్లతో మూడో ర్యాంకులో ఉన్న రోహన్‌కుమార్‌ ఆనంద్‌దాస్‌ రాజ్‌కుమార్‌ తాను పుట్టిన తేదీని 2007 జనవరి 29గా పేర్కొంటూ బీఏఐకి సర్టిఫికెట్లు సమర్పించి టోర్నమెంట్లలో ఆడాడు. వాస్తవానికి రోహన్‌ పుట్టిన తేదీ 2005 అక్టోబర్‌ 29గా పోలీసులు నిర్ధారించారు.

ఇదే కేటగిరీలో 92 పాయింట్లతో 44వ ర్యాంక్‌లో ఉన్న దవు వెంకట శివ నాగరామ్‌ మౌనీష్‌ తన పుట్టిన తేదీని 2007 జనవరి 29గా పేర్కొన్నారు. అయితే ఇతని అసలు పుట్టిన తేదీ 2006 జూన్‌4 అని దర్యాప్తులో తేలింది. అండర్‌–15 కేటగిరీలో 188 పాయింట్లతో 32వ ర్యాంక్‌లో ఉన్న భూక్యా నిషాంత్‌ తన పుట్టిన రోజును 2010 అక్టోబర్‌ 12గా పేర్కొనగా..
ఇతడి వాస్తవ పుట్టిన తేదీ 2007 జనవరి 12గా తేలింది.

అయితే వీళ్లంతా మైనర్లు కావడంతో తమంతట తాముగా ఇలాంటి చర్యలకు పాల్పడలేరని, వాళ్ల కోచ్‌లు లేదా తల్లిదండ్రుల సహకారం, ప్రోద్బలంతోనే ఇలా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వారినే ఈ వ్యవహారంలో బాధ్యుల్ని చేయాలని భావిస్తున్నారు. 

ఏమాత్రం స్పందించని అసోసియేషన్‌.. 
ముగ్గురి బాగోతం బట్టబయలు కావడంతో ఇలాంటి వాళ్లు మరికొందరు ఉండి ఉంటారని పోలీసులు అనుమానించారు. అయితే ఈ వ్యవహారాన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలన్నా, బాధ్యుల్ని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఫిర్యాదు తప్పనిసరి. ఈ నేపథ్యంలో అన్ని వివరాలతో తెలంగాణ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌కు ఈ ఏడాది మే 25న ఓ లేఖ (నం.65/పీఈ/క్యాంప్‌/డీసీపీ/డీడీ/సీసీఎస్‌/డీడీ/2023) రాశారు.

దీనిపై తగిన చర్యలు తీసుకుని తమకు తెలియజేయాల్సిందిగా డిటెక్టివ్‌ డిపార్ట్‌మెంట్‌ డీసీపీ కోరారు. కానీ అసోసియేషన్‌ ఇప్పటివరకు స్పందించక పోవడంతో వారికి తెలిసే ఈ స్కామ్‌ జరుగుతోందా? అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కామ్‌ దేశ వ్యాప్తంగా జరుగుతూ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. 
చదవండి: ఔటర్‌ చుట్టూ ఏడు ఇంటర్‌చేంజ్‌ మెట్రో స్టేషన్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement