Badminton Association of India
-
Badminton: కొత్త కెరటం... తీగల సాయిప్రసాద్
సాక్షి, హైదరాబాద్: అసోంలోని గువహటిలో గత ఏడాది ఆగస్టులో బ్యాడ్మింటన్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఎన్సీఈ) ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిభావంతులైన కుర్రాళ్లను గుర్తించి వారిని భవిష్యత్తు కోసం తీర్చిదిద్దడం కోసం భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రం ఇది. ముందుగా అండర్–17 స్థాయిలో సెలక్షన్స్ ప్రక్రియ జరిగింది. ఇందులో ఏకంగా 858 మంది యువ షట్లర్లుపాల్గొన్నారు. వీరిలో టాప్–4కి మాత్రమే అక్కడ చోటు లభించింది. ఈ సెంటర్లో మొదటి విద్యార్థిగా అడుగు పెట్టిన కుర్రాడే హైదరాబాద్‌కు చెందిన తీగల సాయిప్రసాద్. అప్పటికే తన ప్రతిభ తో ఆకట్టుకున్న సాయిప్రసాద్ ఎన్సీఈలో శిక్షణతో మరింత పదునెక్కాడు. తన ఆటలోని సత్తాను చూపిస్తూ ఇటీవల కీలక విజయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గత నెలలో ఇరాన్లో జరిగిన ఫజర్ జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్‌లో సాయి టైటిల్ సాధించి షటిల్ వేదికపై కొత్త కెరటంలా వెలుగులోకి వచ్చాడు. తండ్రి ప్రోత్సాహంతో... సాయి తండ్రి సూర్యారావు జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ప్లేయర్. ఆటగాడిగా కెరీర్‌ను ముగించిన తర్వాత ఆయన కోచ్‌గా మారారు. సుదీర్ఘ కాలం పాటు న్యూజిలాండ్‌లో వేర్వేరు క్లబ్‌లలో కోచింగ్ ఇచ్చిన సూర్య ఆ తర్వాత భారత్‌కు తిరిగొచ్చారు. చిన్నప్పటినుంచి తండ్రి ఆటను చూస్తూ వచ్చిన సాయి సహజంగానే షటిల్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. దాంతో సాయిని పూర్తిస్థాయిలో ఆటగాడిగా తీర్చిదిద్దాలని భావించిన సూర్య స్వయంగా తానే ఓనమాలు నేర్పించారు. ఆ తర్వాత మరింత మెరుగైన శిక్షణ కోసం ప్రతిష్టాత్మక పుల్లెల గోపీచంద్ అకాడమీలో సాయి చేరాడు. అదే అకాడమీలో తండ్రి సూర్య కూడా ఒక కోచ్‌గా ఉండటం సాయికి మరింత సానుకూలాంశంగా మారింది. అటు గోపీచంద్ మార్గనిర్దేశనం, ఇటు తండ్రి శిక్షణ వెరిసి సాయి మంచి ఫలితాలు సాధించాడు. అండర్–13 స్థాయిలో జాతీయస్థాయి నంబర్‌వన్ కావడంతోపాటు అండర్–15, అండర్–17లలో సాయిప్రసాద్ టాప్–5లో కొనసాగాడు. జాతీయ జూనియర్ ర్యాంకింగ్ టోర్నీలతో పాటు అండర్–13 స్థాయిలో సింగపూర్, థాయ్‌లాండ్‌లలో జరిగిన టోర్నీల్లో టైటిల్స్ సాధించాడు. అనంతరం కెరీర్లో ఎదుగుతున్న కీలక దశలో అతను గువహటి ఎన్సీఈలో ప్రవేశంతో తన ఆటకు మెరుగులు దిద్దుకున్నాడు. కెరీర్లో కీలక విజయం... అగ్రశ్రేణి కోచ్‌లు, అత్యుత్తమ సౌకర్యాలతో ఉన్న ఎన్సీఈలో సాయిప్రసాద్ సాధనకు మరింత మంచి అవకాశం దక్కింది. ఈ క్రమంలో అతని పురోగతి వేగంగా సాగింది. గత ఏడాది ఆగస్టులో సాయి జూనియర్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 1043వ స్థానంలో ఉన్నాడు. అక్కడి నుంచి మెరుగైన ప్రదర్శనతో ఈ ఏడాది జనవరి తొలి వారంలో మొదటి సారి టాప్–100లోకి అడుగు పెట్టాడు. మంగళవారం ప్రకటించిన తాజా బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ ర్యాంకింగ్స్‌లో అతను 37వ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో జనవరిలో అతని కెరీర్లో చెప్పుకోదగ్గ విజయం దక్కింది. ఇరాన్లో జరిగిన జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్‌లో సాయిప్రసాద్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు. ఫైనల్ చేరడానికి ముందు చక్కటి ప్రదర్శనతో అతను వరుసగా మూడు మ్యాచ్‌లలో స్థానిక ఇరాన్ ఆటగాళ్లను ఓడించడం విశేషం. గత వారమే 17 ఏళ్లు పూర్తి చేసుకున్న సాయి ఇకపై అండర్–19 స్థాయి టోర్నీల్లోనే పాల్గొనబోతున్నాడు. జూనియర్ విభాగంలో టాప్–10 ర్యాంకింగ్స్‌లోకి చేరడంపై సాయి దష్టి పెట్టాడు. ఆపై జూనియర్ వరల్డ్‌లాంటి పెద్ద టోర్నీని గెలవడం అతని ముందున్న ప్రస్తుత లక్ష్యం. సాయి ప్రతిభకు తోడు ఎన్సీఈ శిక్షణ అతని ప్రదర్శన స్థాయిని పెంచింది. ఇదే ఆటను కొనసాగిస్తే మున్ముందు ఈ అబ్బాయి అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో అద్భుత ఫలితాలు సాధించడం ఖాయం. -
‘బాయ్’ ఎక్స్‌లెన్స్ సెంటర్ కోచ్‌గా ముల్యో హండోయో
అస్సాం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) గువాహటిలో కొత్తగా నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (ఎన్సీఈ)ను అధునాతన సొబగులు, క్రీడా సదుపాయాలతో తీర్చిదిద్దింది. దీనికి హెడ్ కోచ్‌గా ఇండోనేసియాకు చెందిన ప్రఖ్యాత కోచ్ ముల్యో హండోయోను ‘బాయ్’ నియమించింది. హండోయోకు భారత షట్లర్లతో విజయవంతమైన అనుబంధముంది. హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, గురుసాయిదత్ తదితరుల ప్రతిభకు మెరుగులు దిద్ది... చైనా షట్లర్లకు ఎదురునిలిచే నైపుణ్యాన్ని ముల్యోనే నేర్పారు. ఆయన కోచింగ్ హయాంలోనే శ్రీకాంత్ ప్రపంచ నంబర్‌వన్‌గా ఎదిగాడు. అలాగే మరో ఇద్దరు విదేశీ కోచ్‌లను కూడా ఎన్సీఈకి నియమించారు. మాజీ ఆల్‌ఇంగ్లండ్ చాంపియన్ ఇవాన్ సొజొనొవ్ (రష్యా) డబుల్స్ కోచ్‌గా, కొరియాకు చెందిన సింధు మాజీ కోచ్ పార్క్ తే సంగ్ కోచ్‌గా వ్యవహరిస్తారు. అస్సాం, బాయ్ ఉమ్మడి భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఎన్సీఈలో 24 కోర్టులున్నాయి. 3000 మంది ప్రేక్షకులు వీక్షించవచ్చు. శిక్షణపొందే షట్లర్లు, సిబ్బంది కోసం సౌకర్యవంతమైన వసతి గదులు, కసరత్తుకు జిమ్, ఇతరత్రా అధునాతన సదుపాయాలెన్నో ఉన్నాయి. ఈ సెంటర్‌ను శుక్రవారం లాంఛనంగా ప్రారంభిస్తారు. -
బ్యాడ్మింటన్ క్రీడలో తప్పుడు డేట్ ఆఫ్ బర్త్‌లు.. వయసు మార్చి గోల్మాల్!
-శ్రీరంగం కామేష్, సాక్షి ప్రతినిధి బ్యాడ్మింటన్‌లో ఓ వయస్సు క్రీడాకారుడు అదే ఏజ్ గ్రూప్‌లో ఉండే మరో ఆటగాడితో పోటీ పడాలి. నిబంధనలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అలా జరిగినప్పుడే సరైన పోటీ అన్పించుకుంటుంది. వయస్సులో తేడాలున్నప్పుడు ఆటలోని అనుభవాన్ని బట్టి ప్రతిభా సామర్థ్యాల్లో సైతం తేడా ఉండేందుకు అవకాశం ఉంటుంది. పతకాలు, ర్యాంకుల్ని సైతం ప్రభావితం చేస్తుంది. ఇంతటి కీలకమైన వయస్సు నిబంధనకు తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు జాతీయ స్థాయి ఉత్తమ ర్యాంకర్లు తూట్లు పొడిచారు. తమ పుట్టిన తేదీ విషయంలో భారీ స్కామ్‌కు పాల్పడ్డారు. తమ వాస్తవ వయస్సును తగ్గించేసి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు (బీఏఐ) తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారు. ఈ మేరకు అందిన ఆకాశరామన్న ఉత్తరం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్ సెంట్రల్ క్రైౖమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు ముగ్గురి విషయంలో ఈ అక్రమాలను నిర్ధారించారు. సమగ్ర ఆధారాలతో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్‌కు లేఖ రాశారు. కానీ వారు ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఉత్తరం ఆధారంగా.. ఈ స్కామ్‌కు సంబంధించిన సమాచారాన్ని సిటీ సీసీఎస్ పోలీసులకు ఓ అజ్ఞాత వ్యక్తి లేఖ ద్వారా అందజేశారు. ఈ ఏడాది మార్చి 29న అందిన ఈ లేఖలో ఆరుగురు క్రీడాకారులపై ఆరోపణలున్నాయి. వీరు తమ అసలు వయస్సును దాచి పెట్టి నకిలీ సర్టిఫికెట్ల సృష్టించి బీఏఐకి సమర్పించారని, తద్వారా తమ కంటే చిన్న వారితో పోటీల్లో తలపడుతూ మెడల్స్, జాతీయ స్థాయి ర్యాంకులు సాధిస్తున్నారని అతను ఆరోపించారు. దీనివల్ల నిబంధనలు పాటించిన క్రీడాకారులకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే బీఏఐకి అనేకమంది నుంచి ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. సమగ్ర దర్యాప్తు చేసిన సీసీఎస్.. కేవలం ఈ ఆరుగురే కాకుండా దాదాపు 40 మంది బ్యాడ్మింటన్ ఆటగాళ్ల వయస్సు విషయంలో తమకు సందేహాలు ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తి ఆ లేఖలో పేర్కొన్నారు. వీరిలో చాలామంది 2005–10 మధ్య పుట్టారని, అయితే జనన ధ్రువీకరణ పత్రాలకు బదులుగా కొందరు వైద్యులు ఇచ్చిన బోగస్ మెడికల్ సర్టిఫికెట్లు దాఖలు చేసి తమ వయస్సు తగ్గించుకున్నారని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రీడాకారులకు తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది కోచ్‌లు, వారి తల్లిదండ్రులతో పాటు ఈ వైద్యుల సహకారం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ లేఖను సిటీ పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్ కె.చంద్రకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. చదవండి: BWF Rankings: తొమ్మిదో ర్యాంక్‌కు ప్రణయ్.. పీవీ సింధు మాత్రం.. ముగ్గురి విషయంలో ఆధారాలు లభ్యం... సీసీఎస్ ప్రత్యేక బృందానికి తొలి దశలోనే ముగ్గురు క్రీడాకారులకు సంబంధించిన సమగ్ర ఆధారాలు లభించాయి. బీఏఐ జాబితాలో అండర్–17 కేటగిరీలో 1176 పాయింట్లతో మూడో ర్యాంకులో ఉన్న రోహన్‌కుమార్ ఆనంద్‌దాస్ రాజ్‌కుమార్ తాను పుట్టిన తేదీని 2007 జనవరి 29గా పేర్కొంటూ బీఏఐకి సర్టిఫికెట్లు సమర్పించి టోర్నమెంట్లలో ఆడాడు. వాస్తవానికి రోహన్ పుట్టిన తేదీ 2005 అక్టోబర్ 29గా పోలీసులు నిర్ధారించారు. ఇదే కేటగిరీలో 92 పాయింట్లతో 44వ ర్యాంక్‌లో ఉన్న దవు వెంకట శివ నాగరామ్ మౌనీష్ తన పుట్టిన తేదీని 2007 జనవరి 29గా పేర్కొన్నారు. అయితే ఇతని అసలు పుట్టిన తేదీ 2006 జూన్4 అని దర్యాప్తులో తేలింది. అండర్–15 కేటగిరీలో 188 పాయింట్లతో 32వ ర్యాంక్‌లో ఉన్న భూక్యా నిషాంత్ తన పుట్టిన రోజును 2010 అక్టోబర్ 12గా పేర్కొనగా.. ఇతడి వాస్తవ పుట్టిన తేదీ 2007 జనవరి 12గా తేలింది. అయితే వీళ్లంతా మైనర్లు కావడంతో తమంతట తాముగా ఇలాంటి చర్యలకు పాల్పడలేరని, వాళ్ల కోచ్‌లు లేదా తల్లిదండ్రుల సహకారం, ప్రోద్బలంతోనే ఇలా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వారినే ఈ వ్యవహారంలో బాధ్యుల్ని చేయాలని భావిస్తున్నారు. ఏమాత్రం స్పందించని అసోసియేషన్.. ముగ్గురి బాగోతం బట్టబయలు కావడంతో ఇలాంటి వాళ్లు మరికొందరు ఉండి ఉంటారని పోలీసులు అనుమానించారు. అయితే ఈ వ్యవహారాన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలన్నా, బాధ్యుల్ని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఫిర్యాదు తప్పనిసరి. ఈ నేపథ్యంలో అన్ని వివరాలతో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్‌కు ఈ ఏడాది మే 25న ఓ లేఖ (నం.65/పీఈ/క్యాంప్/డీసీపీ/డీడీ/సీసీఎస్/డీడీ/2023) రాశారు. దీనిపై తగిన చర్యలు తీసుకుని తమకు తెలియజేయాల్సిందిగా డిటెక్టివ్ డిపార్ట్మెంట్ డీసీపీ కోరారు. కానీ అసోసియేషన్ ఇప్పటివరకు స్పందించక పోవడంతో వారికి తెలిసే ఈ స్కామ్ జరుగుతోందా? అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కామ్ దేశ వ్యాప్తంగా జరుగుతూ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. చదవండి: ఔటర్ చుట్టూ ఏడు ఇంటర్చేంజ్ మెట్రో స్టేషన్లు -
ఆసియా క్రీడలకు సైనా దూరం! కారణమిదే
న్యూఢిల్లీ: భారత మహిళా స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్లలో చైనాలో జరిగే ఆసియా క్రీడలకు దూరం కానుంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక కోసం ఈనెల 4 నుంచి 7 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న సెలెక్షన్ట్రయల్స్ టోర్నీలో సైనా నెహ్వాల్ పాల్గొనడంలేదు. ‘ఫిట్నెస్ సంబంధిత సమస్యల కారణంగా సైనా ట్రయల్స్‌లో బరిలోకి దిగడంలేదు. సైనాతోపాటు పురుషుల డబుల్స్ జోడీ కుశాల్ రాజ్, ప్రకాశ్ రాజ్ కూడా ట్రయల్స్ టోర్నీ నుంచి వైదొలిగారు’ అని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కార్యదర్శి సంజయ్ మిశ్రా తెలిపారు. చదవండి: ‘బ్రిజ్‌భూషణ్‌ను రక్షించే ప్రయత్నమిది’ న్యూఢిల్లీ: తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తున్న భారత అగ్రశ్రేణి రెజ్లర్లకు అన్ని వైపుల నుంచి సంఘీభావం లభిస్తోంది. తాజాగా కాంగ్రెస్ నేత, భారత మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ కూడా వేదిక వద్దకు వచ్చి తన మద్దతు ప్రకటించాడు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్‌ను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అతనిపై చర్యకు వెనుకాడుతోందని సిద్ధూ విమర్శించాడు. ‘ఎఫ్ఐఆర్ ఎందుకు ఆలస్యం చేశారు. అందులో వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదు. దానిని బలహీనంగా తయారు చేశారని అర్థమవుతోంది. అన్నీ దాచేసి బ్రిజ్‌భూషణ్‌ను రక్షించే ప్రయత్నమే ఇదంతా. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తే ఇప్పటి వరకు అరెస్ట్ ఎందుకు చేయలేదు. విచారణ నిష్పక్షపాతంగా జరగాలి’ అంటూ సిద్ధూ వ్యాఖ్యానించాడు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా కూడా రెజ్లర్లకు సంఘీభావం పలకగా... రేడియోలో ‘మన్‌కీ బాత్’ కాదు, రెజ్లర్ల వద్దకు వచ్చి వారి మన్‌కీ బాత్ వినాలని ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ సూచించారు. మరోవైపు తనను ఉరి తీసినా పర్వాలేదని, రెజ్లింగ్ పోటీలు మాత్రం ఆగరాదని బ్రిజ్‌భూషణ్ అన్నాడు. ‘గత నాలుగు నెలలుగా రెజ్లింగ్ కార్యకలాపాలు ఆగిపోయాయి. పిల్లల భవిష్యత్తుతో ఆడుకోకండి. తక్షణం ఎవరి ఆధ్వర్యంలోనైనా క్యాడెట్ నేషనల్స్ నిర్వహించండి. లేదంటే వయసు పెరిగి కుర్రాళ్లు అవకాశం కోల్పోతారు. నన్ను ఉరి తీయండి కానీ ఆట మాత్రం ఆగవద్దు’ అని బ్రిజ్‌భూషణ్ చెప్పాడు. -
శ్రీకాంత్‌పై అనుగ్రహం.. ప్రణయ్‌పై ఆగ్రహం
న్యూఢిల్లీ: జాతీయ క్రీడా పురస్కారాలకు సంబంధించి భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) శుక్రవారం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ షట్లర్, ప్రపంచ 12వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ పేరును ప్రతిష్టాత్మక ‘రాజీవ్ ఖేల్‌రత్న’ అవార్డు కోసం సిఫారసు చేసింది. మరోవైపు ‘అర్జున’ అవార్డు కోసం తన పేరును పంపకపోవడం పట్ల బహిరంగ విమర్శ చేసిన కేరళ ఆటగాడు, ప్రపంచ 28వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. తప్పును అంగీకరించిన శ్రీకాంత్... గత ఫిబ్రవరిలో మనీలాలో జరిగిన ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు సెమీఫైనల్‌కు చేరింది. అయితే సెమీస్ మ్యాచ్ ఆడకుండా శ్రీకాంత్, ప్రణయ్ చివరి నిమిషంలో తప్పుకొని బార్సిలోనాలో మరో టోర్నీ ఆడేందుకు వెళ్లిపోయారు. భారత్ సెమీస్‌లో పరాజయం పాలై పతకం గెలిచే అవకాశం కోల్పోయింది. దీనిని క్రమశిక్షణారాహిత్యంగా భావిస్తూ ‘బాయ్’ అవార్డుల కోసం వీరిద్దరి పేర్లను పరిశీలించకుండా పక్కన పెట్టింది. అయితే ఇప్పుడు ‘బాయ్’ అతడిని క్షమించేసింది. ‘శ్రీకాంత్ తన తప్పు ఒప్పుకుంటూ మాకు మెయిల్ పంపించాడు. భవిష్యత్తులో మళ్లీ ఇలా చేయనని హామీ ఇచ్చాడు. అతని ప్రతిభ, ఘనతలను దృష్టిలో ఉంచుకొని ఖేల్‌రత్నకు అతని పేరును ప్రతిపాదించాం’ అని ప్రధాన కార్యదర్శి అజయ్ సింఘానియా వెల్లడించారు. మరోవైపు ప్రణయ్ మాత్రం పదే పదే ‘బాయ్’పై విమర్శలకు దిగుతున్నాడని ఆయన అన్నారు. అర్జున అవార్డుకు తనను కాకుండా సమీర్ వర్మ పేరును ప్రతిపాదించడంతో అసంతృప్తి చెందిన ప్రణయ్ ‘మళ్లీ అదే పాత కథ’ అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై ప్రణయ్‌ను వివరణ కోరినట్లు సింఘానియా చెప్పారు. ‘గతంలోనూ ప్రణయ్ ఇలాగే చేశాడు. కానీ మేం చూసీ చూడనట్లు వదిలేశాం. ఈసారి మాత్రం అతని ప్రవర్తన మాకు ఆగ్రహం తెప్పించింది. అందుకే షోకాజ్ నోటీసు జారీ చేశాం. సంతృప్తికర సమాధానం ఇస్తే సరి. లేదంటే అతనిపై గట్టి చర్యలు తీసుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు. -
‘బాయ్’ అధ్యక్షుడు అఖిలేష్ దాస్‌గుప్తా కన్నుమూత
లక్నో: భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షులు, కాంగ్రెస్ కేంద్ర మాజీ మంత్రి అఖిలేష్ దాస్‌గుప్తా బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 56 ఏళ్ల దాస్‌గుప్తా ‘బాయ్’తో పాటు భారత ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షులుగా, యూపీ ఒలింపిక్ సంఘం అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు. 2012లో వీకే వర్మ స్థానంలో ‘బాయ్’ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన ఆయన 2014లో మళ్లీ ఎన్నికయ్యారు. ఆయన హయాంలో దేశంలో బ్యాడ్మింటన్ క్రీడ కొంత పుంతలు తొక్కింది. థామస్, ఉబెర్ కప్ టోర్నీలకు ఆతిథ్యమివ్వడంతో పాటు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ ఏర్పాటులో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. ఆయన ఆకస్మిక మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు, కేంద్ర మంత్రులు, క్రీడాకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. ‘ఎంపీగా, కేంద్ర మంత్రిగా ప్రజా జీవితంలో ఆయన అందించిన క్రియాశీల సహకారం మరువలేనిది’ అని మోదీ ట్వీట్ చేశారు. దాస్‌గుప్తా మృతి భారత బ్యాడ్మింటన్‌కు తీవ్రమైన లోటు అని కేంద్ర మంత్రి విజయ్ గోయల్‌తో పాటు భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్టార్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, గుత్తా జ్వాల, పారుపల్లి కశ్యప్ సంతాపం వ్యక్తం చేశారు. -
జనవరిలో ఐబీఎల్-2
బరిలో ఆరు జట్లు 15 రోజుల పాటు పోటీలు న్యూఢిల్లీ: రెండేళ్ల విరామం తర్వాత ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) రెండో సీజన్‌కు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 17 వరకు ఈ టోర్నీని నిర్వహిస్తున్నట్లు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా గురువారం ప్రకటించారు. స్టార్ షట్లర్లు సైనా, సింధు, శ్రీకాంత్, జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ సమక్షంలో టోర్నీకి సంబంధించి వివరాలను వెల్లడించారు. 15 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్లో మొత్తం ఆరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఆరింటిలో రెండు ఫ్రాంచైజీలను నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు. ఢిల్లీ జట్టును ఇన్ఫినిటి సొల్యుషన్స్ తీసుకోగా, లక్నో టీమ్‌ను సహారా పరివార్ చేజిక్కించుకుంది. అయితే ఐబీఎల్ తొలి సీజన్‌ను నిర్వహించిన స్పోర్టీ సొల్యూషన్స్ ఐబీఎల్‌పై హక్కులు తమవేనంటూ ఢిల్లీలో కోర్టుకెక్కింది. -
‘టాప్’లోకి జయరామ్?
న్యూఢిల్లీ : గత వారం కొరియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన షట్లర్ అజయ్ జయరామ్‌ను ‘టాప్’ స్కీంలోకి చేర్చాలని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రతిపాదించనుంది. అంచనాలకు మించి రాణించిన తను ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ మరోసారి టాప్-25కి చేరాడు. ‘జయరామ్ ప్రొఫైల్‌ను సేకరించమని టెక్నికల్ కమిటీకి తెలిపాం. టాప్ స్కీమ్‌లోకి అతడి పేరును చేర్చాలని ప్రతిపాదిస్తాం’ అని బాయ్ అధ్యక్షుడు డాక్టర్ అఖిలేష్ దాస్ గుప్తా తెలిపారు. -
కొరియా ఓపెన్ లో ముగిసిన భారత్ పోరాటం
సియోల్: కొరియా ఓపెన్ లో భారత బ్యాడ్మింటన్ పోరాటం ముగిసింది. డబుల్స్ విభాగంలో గురువారం జరిగిన రెండో రౌండ్ లో భారత్ షట్లర్లు గుత్తా జ్వాల-అశ్విన్ పొన్నప్ప జోడీలకు పరాభవం ఎదురుకావడంతో టోర్నీ నుంచి నిష్ర్కమించారు. యా నా జాంగ్, యంగ్ కిమ్ ల జోడీ చేతిలో 21-18,21-12 తేడాతో జ్వాల-అశ్వినిలు ఓటమి పాలైయ్యారు. మరోప్రక్క మిక్సిడ్ డబుల్స్ లో తరుణ్- కోనా జంట 10-21, 15-21 తేడాతో జర్మనీ జంట మైఖేల్ ఫక్స్, బిర్జిట్ మైఖేల్స్ చేతిలో చుక్కెదురైంది. వీరి ఓటమితో భారత్ పోరు ఆదిలోనే ముగిసినట్టయ్యింది. ముందురోజు మహిళల విభాగంలో మెరుపించి రెండో రౌండ్ కు చేరుకున్నగుత్తా జ్వాల-అశ్విని పొనప్ప జోడి ఈ గేమ్ లో కనీసం పోరాట పటిమను కూడా కనబరచకుండా ఓటమి చెందారు. అయితే పురుషుల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాతీయ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్, గురుసాయిదత్ తొలి రౌండ్లోనే నిష్ర్కమించారు. -
జ్వాల జోడి శుభారంభం
సియోల్: బ్యాడ్మింటన్ సీజన్‌లోని తొలి సూపర్ సిరీస్ టోర్నమెంట్ కొరియా ఓపెన్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప జోడి... మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొనప్ప-తరుణ్ కోనా జంట శుభారంభం చేశాయి. అయితే పురుషుల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాతీయ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్, గురుసాయిదత్ తొలి రౌండ్లోనే నిష్ర్కమించారు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)తో నెలకొన్న వివాదాలు పరిష్కారం కావడంతో ఈ టోర్నీలో బరిలోకి దిగిన జ్వాల తొలి మ్యాచ్‌లో ఆకట్టుకుంది. భాగస్వామి అశ్వినితో కలిసి జ్వాల కేవలం 19 నిమిషాల్లో 21-10, 21-7తో అనా రాన్‌కిన్-మెడిలిన్ స్టాపిల్టన్ (న్యూజిలాండ్) జోడిని చిత్తు చేసింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని-తరుణ్ జోడి 22-20, 21-17తో జోన్స్ ష్కోట్లెర్-జోనా గోలిస్జ్యూస్కీ (జర్మనీ) జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ 10-21, 11-21తో ఐదో సీడ్ కెనిచి టాగో (జపాన్) చేతిలో; గురుసాయిదత్ 11-21, 11-21తో టకుమా ఉయెదా (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యారు. టాగోతో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ ఏదశలోనూ ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయాడు. రెండు గేముల్లోనూ ఆరంభదశలో తప్పించి మిగతా సమయాల్లో పూర్తిగా వెనుకబడ్డాడు. గురువారం జరిగే రెండో రౌండ్లో మూడో సీడ్ యె నా జాంగ్-సో యంగ్ కిమ్ (కొరియా) జోడితో జ్వాల-అశ్విని; మైకేల్ ఫచ్స్-బిర్గిట్ మిచెల్స్ (జర్మనీ) ద్వయంతో అశ్విని-తరుణ్ పోటీపడతారు. వచ్చే వారం జరిగే మలేసియా ఓపెన్‌కు సన్నాహాల్లో భాగంగా కొరియా ఓపెన్‌లో సైనా, సింధు, కశ్యప్ బరిలోకి దిగలేదు. -
జ్వాలను ఆడించాల్సిందే.. తేల్చి చెప్పిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న డబుల్ స్టార్ గుత్తా జ్వాలకు ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం లభించింది. జ్వాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ నివేదిక వెలువరించేదాకా ఆమెను రాబోయే టోర్నీల్లో ఆడేందుకు అనుమతించాల్సిందేనని ఆదేశించింది. జ్వాల పిటిషన్‌ను స్వీకరించి జస్టిస్ వీకే జైన్ ఈమేరకు తీర్పునిచ్చారు. ఐబీఎల్‌లో ఢిల్లీ స్మాషర్స్ ఆటగాళ్లను ప్రత్యర్థి జట్టుతో ఆడనీయకుండా అడ్డుకుందని జ్వాలపై ఆరోపణలున్నాయి. గతంలోనే బాయ్ ఈ అంశంపై ఆమెకు షోకాజ్ నోటీస్ జారీ చేసి క్రమశిక్షణ కమిటీని నియమించింది. ఈ కమిటీ జ్వాలపై జీవిత కాల నిషేధాన్ని ప్రతిపాదించింది. అయితే ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు రావడంతో వెనక్కి తగ్గి... ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని నియమించింది. ఈ సమయంలో నెల రోజులపాటు ఆమె ఎలాంటి టోర్నీలు ఆడకూడదని స్పష్టం చేసింది. ఈ అంశంపై జ్వాల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. మరోవైపు అంతిమంగా విచారణ కమిటీలో తేలే విషయాన్ని కూడా కోర్టు పరిశీలిస్తుందని ఈ సందర్భంగా న్యాయమూర్తి చెప్పారు. ఈనెల 15 నుంచి 20 వరకు డెన్మార్క్ ఓపెన్, 22 నుంచి 27 వరకు ఫ్రెంచ్ ఓపెన్‌లో జ్వాల, అశ్వని పొన్నప్పతో కలిసి డబుల్స్ బరిలోకి దిగాల్సి ఉంది. అయితే బుధవారం డెన్మార్క్ ఓపెన్ నుంచి ఈ జోడి పేరును బాయ్ ఉపసంహరించింది. కోర్టు తీర్పును గౌరవిస్తాం: బాయ్ గుత్తా జ్వాల విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తమకు గౌరవం ఉందని, పూర్తి సమాచారం వచ్చాకే తదుపరి నిర్ణయం తీసుకుంటామని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) తెలిపింది. ‘కోర్టు నిర్ణయంపై మాకు గౌరవం ఉంది. మేమిప్పటికే డెన్మార్క్ టోర్నీలో జ్వాల ఎంట్రీపై పునరాలోచించాలని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యుఎఫ్)ను కోరాం. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది వారే. మేం జ్వాలపై కోర్టు తీర్పుననుసరించి ముందుకెళతాం’ అని బాయ్ ప్రధాన కార్యదర్శి విజయ్ సిన్హా అన్నారు.