జనవరిలో ఐబీఎల్-2
బరిలో ఆరు జట్లు 15 రోజుల పాటు పోటీలు
న్యూఢిల్లీ: రెండేళ్ల విరామం తర్వాత ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) రెండో సీజన్‌కు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 17 వరకు ఈ టోర్నీని నిర్వహిస్తున్నట్లు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా గురువారం ప్రకటించారు. స్టార్ షట్లర్లు సైనా, సింధు, శ్రీకాంత్, జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ సమక్షంలో టోర్నీకి సంబంధించి వివరాలను వెల్లడించారు.
15 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌లో మొత్తం ఆరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఆరింటిలో రెండు ఫ్రాంచైజీలను నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు. ఢిల్లీ జట్టును ఇన్ఫినిటి సొల్యుషన్స్ తీసుకోగా, లక్నో టీమ్‌ను సహారా పరివార్ చేజిక్కించుకుంది. అయితే ఐబీఎల్ తొలి సీజన్‌ను నిర్వహించిన స్పోర్టీ సొల్యూషన్స్ ఐబీఎల్‌పై హక్కులు తమవేనంటూ ఢిల్లీలో కోర్టుకెక్కింది.