ప్లేయర్లతో అరుణ్ విష్ణు
భారత బ్యాడ్మింటన్ మాజీ నంబర్‌వన్, కామన్వెల్త్ క్రీడల కాంస్య పతక విజేత అనూప్ శ్రీధర్ రిటైర్మెంట్ తర్వాత.. దాదాపు దశాబ్ద కాలంగా కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇన్నేళ్లలో కోచ్‌గా అతడికి మంచి పేరు ఉంది.
ఇటీవలి కాలంలో పీవీ సింధు, లక్ష్య సేన్‌లతో కూడా కలిసి అనూప్ పని చేశాడు. ఇప్పుడు అనూప్ సింగపూర్ జాతీయ జట్టు కోచింగ్ బృందంలో భాగం అవుతున్నాడు. సింగపూర్ టీమ్‌కు అదనపు సింగిల్స్ కోచ్‌గా అనూప్ శ్రీధర్ నియమితుడయ్యాడు.
ఇక వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన సాయిప్రణీత్ కూడా ఏడాది క్రితం ఆటకు రిటైర్మెంట్ పలికి అమెరికాలోని ఒక క్లబ్‌కు కోచ్‌గా వెళ్లాడు. కోచ్‌గా వ్యక్తిగతంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్‌లకు మెంటార్‌గా ఎన్నో ప్రతిష్టాత్మక టోర్నీ విజయాల్లో భాగంగా ఉన్న మొహమ్మద్ సియాదతుల్లా కూడా ఇదే బాటలో నడిచారు.
సంవత్సరం క్రితమే అమెరికాలోని ఒరెగాన్ అకాడమీలో కోచ్‌గా చేరాడు. శ్రీధర్, సియాదత్ భారత్‌కు చెందిన అగ్రశ్రేణి ఆటగాళ్లతో పని చేసిన వారే. అయితే ఆర్థికపరంగా భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నుంచి వీరికి తగినంత మద్దతు లభించలేదు. కోచ్‌లకు ‘బాయ్’ ఇచ్చే తక్కువ ఫీజుతో పని చేస్తూ వచ్చిన వీరు తగిన అవకాశాల కోసం వలస వెళ్లారు.
పారుపల్లి కశ్యప్, గురుసాయిదత్ కూడా కోచింగ్ వైపు
ఇప్పుడు పారుపల్లి కశ్యప్, గురుసాయిదత్ కూడా ఆడటాన్ని పక్కన పెట్టి కోచింగ్ వైపు వచ్చారు. ఇప్పటికే శ్రీకాంత్, ప్రణయ్, ప్రియాన్షు రజావత్‌లకు ట్రైనర్‌లుగా వ్యవహరిస్తున్న వీరు... చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ మార్గనిర్దేశనంలో యువ ఆటగాళ్లు తరుణ్ మన్నేపల్లి, అన్‌మోల్ ఖర్బ్, అనుపమ ఉపాధ్యాయ, రక్షితలకు శిక్షణ ఇస్తున్నారు.
మరోవైపు మాజీ ఆటగాళ్లు మను అత్రి, సుమీత్ రెడ్డి కూడా కోచింగ్ వైపు వచ్చేయగా... సీనియర్ కోచ్ అరుణ్ విష్ణు భారత జట్టును వీడి నాగపూర్‌లోని సొంత అకాడమీకి వెళ్లిపోయాడు. ప్రస్తుత స్థితిలో శిక్షణకు భారత కోచ్‌లు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉన్నా... ‘బాయ్’ ఇచ్చే స్వల్ప జీతాల కారణంగా వారు ముందుకు వచ్చి భారత జట్టులో కలిసి పని చేయలేకపోతున్నారు.
మాజీ ఆటగాళ్లను చూస్తే అరవింద్ భట్, చేతన్ ఆనంద్, గుత్తా జ్వాల సొంత అకాడమీలు నిర్వహించుకుంటున్నారు. ‘భారత కోచ్‌లకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. లేదంటే ఎవరూ ఎక్కువ కాలం సాగలేరు. దాదాపు 10 వేల డాలర్ల నెల జీతానికి విదేశీ కోచ్‌లను తీసుకోవడంలో తప్పు లేదు.
బాగా సంపాదించుకోవచ్చు
అయితే వారిలో నాలుగో వంతు కూడా భారత కోచ్‌లకు ఇవ్వడం లేదు. ఇటీవల పారిస్ ఒలింపిక్స్ సమయంలోనే జీతాలు పెంచి రూ.50 వేలు చేశారు. ఇది చాలా తక్కువ మొత్తం. అందుకే భారత జట్టుతో కలిసి పని చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. భారత కోచ్‌గా వ్యవహరించడం గొప్ప గౌరవమే.
కానీ ఏ అమెరికాలాంటి దేశానికి వెళితే బాగా సంపాదించుకోవచ్చు. సొంత అకాడమీ పెట్టినా మంచి అవకాశాలుంటాయి’ అని అరుణ్ విష్ణు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవల భారత మహిళల సింగిల్స్ కోచ్‌గా ఇర్‌వాస్యా ఆది ప్రతమ (ఇండోనేసియా), డబుల్స్ కోచ్‌గా టాన్ కిమ్ హర్ (మలేసియా)లను ‘బాయ్’ నియమించింది.
ఎంత కాలం విదేశీ కోచ్‌లను తెచ్చుకుంటారు?
‘సాంకేతిక అంశాలు నేర్పించడం మాత్రమే కోచ్ పని కాదు. టోర్నీలకు సంబంధించి సరైన మార్గనిర్దేశనం, గాయాల విషయంలో జాగ్రత్తలు వంటి అన్ని అంశాలు చూడాల్సి ఉంటుంది. ఇప్పుడైనా మన భారత కోచ్‌లపై విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉంది.
రిటైర్డ్ ఆటగాళ్లకు సరైన గుర్తింపు, జీతాలు, అవకాశాలు ఇస్తే మనమూ అత్యుత్తమ ప్లేయర్లను తయారు చేయవచ్చు. ఎంత కాలం విదేశీ కోచ్‌లను తెచ్చుకుంటారు’ అని పారుపల్లి కశ్యప్ ప్రశ్నించాడు.
జీతాలు పెంచుతాం
తాజా పరిస్థితి వాస్తవమేనని అంగీకరించిన ‘బాయ్’ కార్యదర్శి సంజయ్ మిశ్రా... దీనిని చక్కదిద్దేందుకు తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ‘నాలుగు నెలల క్రితం భారత జట్టు సహాయక సిబ్బంది జీతాలు పెంచాం.
ట్రైనర్లు, ఫిజియోథెరపిస్ట్‌లు అప్పటి వరకు తీసుకుంటున్న మొత్తంతో పోలిస్తే 50–75 శాతం పెంచాం. ఇక తర్వాతి వంతు కోచ్‌లదే. జాతీయ క్యాంప్‌లో ఉన్న కోచ్‌ల జీతాలను త్వరలోనే సవరిస్తాం’ అని ఆయన చెప్పారు.
చదవండి: విరాట్ కోహ్లి కీలక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment