అస్సాం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) గువాహటిలో కొత్తగా నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (ఎన్‌సీఈ)ను అధునాతన సొబగులు, క్రీడా సదుపాయాలతో తీర్చిదిద్దింది. దీనికి హెడ్ కోచ్‌గా ఇండోనేసియాకు చెందిన ప్రఖ్యాత కోచ్ ముల్యో హండోయోను ‘బాయ్’ నియమించింది. హండోయోకు భారత షట్లర్లతో విజయవంతమైన అనుబంధముంది.
హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, గురుసాయిదత్ తదితరుల ప్రతిభకు మెరుగులు దిద్ది... చైనా షట్లర్లకు ఎదురునిలిచే నైపుణ్యాన్ని ముల్యోనే నేర్పారు. ఆయన కోచింగ్ హయాంలోనే శ్రీకాంత్ ప్రపంచ నంబర్‌వన్‌గా ఎదిగాడు. అలాగే మరో ఇద్దరు విదేశీ కోచ్‌లను కూడా ఎన్‌సీఈకి నియమించారు.
మాజీ ఆల్‌ఇంగ్లండ్ చాంపియన్ ఇవాన్ సొజొనొవ్ (రష్యా) డబుల్స్ కోచ్‌గా, కొరియాకు చెందిన సింధు మాజీ కోచ్ పార్క్ తే సంగ్ కోచ్‌గా వ్యవహరిస్తారు. అస్సాం, బాయ్ ఉమ్మడి భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఎన్‌సీఈలో 24 కోర్టులున్నాయి. 3000 మంది ప్రేక్షకులు వీక్షించవచ్చు. శిక్షణపొందే షట్లర్లు, సిబ్బంది కోసం సౌకర్యవంతమైన వసతి గదులు, కసరత్తుకు జిమ్, ఇతరత్రా అధునాతన సదుపాయాలెన్నో ఉన్నాయి. ఈ సెంటర్‌ను శుక్రవారం లాంఛనంగా ప్రారంభిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment