సాక్షి, హైదరాబాద్: అసోంలోని గువహటిలో గత ఏడాది ఆగస్టులో బ్యాడ్మింటన్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఎన్‌సీఈ) ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిభావంతులైన కుర్రాళ్లను గుర్తించి వారిని భవిష్యత్తు కోసం తీర్చిదిద్దడం కోసం భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రం ఇది.
ముందుగా అండర్–17 స్థాయిలో సెలక్షన్స్ ప్రక్రియ జరిగింది. ఇందులో ఏకంగా 858 మంది యువ షట్లర్లుపాల్గొన్నారు. వీరిలో టాప్–4కి మాత్రమే అక్కడ చోటు లభించింది. ఈ సెంటర్‌లో మొదటి విద్యార్థిగా అడుగు పెట్టిన కుర్రాడే హైదరాబాద్‌కు చెందిన తీగల సాయిప్రసాద్.
అప్పటికే తన ప్రతిభ తో ఆకట్టుకున్న సాయిప్రసాద్ ఎన్‌సీఈలో శిక్షణతో మరింత పదునెక్కాడు. తన ఆటలోని సత్తాను చూపిస్తూ ఇటీవల కీలక విజయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గత నెలలో ఇరాన్‌లో జరిగిన ఫజర్ జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్‌లో సాయి టైటిల్ సాధించి షటిల్ వేదికపై కొత్త కెరటంలా వెలుగులోకి వచ్చాడు.
తండ్రి ప్రోత్సాహంతో...
సాయి తండ్రి సూర్యారావు జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ప్లేయర్. ఆటగాడిగా కెరీర్‌ను ముగించిన తర్వాత ఆయన కోచ్‌గా మారారు. సుదీర్ఘ కాలం పాటు న్యూజిలాండ్‌లో వేర్వేరు క్లబ్‌లలో కోచింగ్ ఇచ్చిన సూర్య ఆ తర్వాత భారత్‌కు తిరిగొచ్చారు. చిన్నప్పటినుంచి తండ్రి ఆటను చూస్తూ వచ్చిన సాయి సహజంగానే షటిల్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. దాంతో సాయిని పూర్తిస్థాయిలో ఆటగాడిగా తీర్చిదిద్దాలని భావించిన సూర్య స్వయంగా తానే ఓనమాలు నేర్పించారు.
ఆ తర్వాత మరింత మెరుగైన శిక్షణ కోసం ప్రతిష్టాత్మక పుల్లెల గోపీచంద్ అకాడమీలో సాయి చేరాడు. అదే అకాడమీలో తండ్రి సూర్య కూడా ఒక కోచ్‌గా ఉండటం సాయికి మరింత సానుకూలాంశంగా మారింది. అటు గోపీచంద్ మార్గనిర్దేశనం, ఇటు తండ్రి శిక్షణ వెరిసి సాయి మంచి ఫలితాలు సాధించాడు.
అండర్–13 స్థాయిలో జాతీయస్థాయి నంబర్‌వన్ కావడంతోపాటు అండర్–15, అండర్–17లలో సాయిప్రసాద్ టాప్–5లో కొనసాగాడు. జాతీయ జూనియర్ ర్యాంకింగ్ టోర్నీలతో పాటు అండర్–13 స్థాయిలో సింగపూర్, థాయ్‌లాండ్‌లలో జరిగిన టోర్నీల్లో టైటిల్స్ సాధించాడు. అనంతరం కెరీర్‌లో ఎదుగుతున్న కీలక దశలో అతను గువహటి ఎన్‌సీఈలో ప్రవేశంతో తన ఆటకు మెరుగులు దిద్దుకున్నాడు.
కెరీర్‌లో కీలక విజయం...
అగ్రశ్రేణి కోచ్‌లు, అత్యుత్తమ సౌకర్యాలతో ఉన్న ఎన్‌సీఈలో సాయిప్రసాద్ సాధనకు మరింత మంచి అవకాశం దక్కింది. ఈ క్రమంలో అతని పురోగతి వేగంగా సాగింది. గత ఏడాది ఆగస్టులో సాయి జూనియర్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 1043వ స్థానంలో ఉన్నాడు. అక్కడి నుంచి మెరుగైన ప్రదర్శనతో ఈ ఏడాది జనవరి తొలి వారంలో మొదటి సారి టాప్–100లోకి అడుగు పెట్టాడు. మంగళవారం ప్రకటించిన తాజా బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ ర్యాంకింగ్స్‌లో అతను 37వ స్థానంలో నిలిచాడు.
ఈ క్రమంలో జనవరిలో అతని కెరీర్‌లో చెప్పుకోదగ్గ విజయం దక్కింది. ఇరాన్‌లో జరిగిన జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్‌లో సాయిప్రసాద్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు. ఫైనల్ చేరడానికి ముందు చక్కటి ప్రదర్శనతో అతను వరుసగా మూడు మ్యాచ్‌లలో స్థానిక ఇరాన్ ఆటగాళ్లను ఓడించడం విశేషం. గత వారమే 17 ఏళ్లు పూర్తి చేసుకున్న సాయి ఇకపై అండర్–19 స్థాయి టోర్నీల్లోనే పాల్గొనబోతున్నాడు.
జూనియర్ విభాగంలో టాప్–10 ర్యాంకింగ్స్‌లోకి చేరడంపై సాయి దష్టి పెట్టాడు. ఆపై జూనియర్ వరల్డ్‌లాంటి పెద్ద టోర్నీని గెలవడం అతని ముందున్న ప్రస్తుత లక్ష్యం. సాయి ప్రతిభకు తోడు ఎన్‌సీఈ శిక్షణ అతని ప్రదర్శన స్థాయిని పెంచింది. ఇదే ఆటను కొనసాగిస్తే మున్ముందు ఈ అబ్బాయి అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో అద్భుత ఫలితాలు సాధించడం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment