
న్యూఢిల్లీ: జాతీయ క్రీడా పురస్కారాలకు సంబంధించి భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) శుక్రవారం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ షట్లర్, ప్రపంచ 12వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ పేరును ప్రతిష్టాత్మక ‘రాజీవ్ ఖేల్‌రత్న’ అవార్డు కోసం సిఫారసు చేసింది. మరోవైపు ‘అర్జున’ అవార్డు కోసం తన పేరును పంపకపోవడం పట్ల బహిరంగ విమర్శ చేసిన కేరళ ఆటగాడు, ప్రపంచ 28వ ర్యాంకర్ హెచ్‌ఎస్ ప్రణయ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
తప్పును అంగీకరించిన శ్రీకాంత్...
గత ఫిబ్రవరిలో మనీలాలో జరిగిన ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు సెమీఫైనల్‌కు చేరింది. అయితే సెమీస్ మ్యాచ్ ఆడకుండా శ్రీకాంత్, ప్రణయ్ చివరి నిమిషంలో తప్పుకొని బార్సిలోనాలో మరో టోర్నీ ఆడేందుకు వెళ్లిపోయారు. భారత్ సెమీస్‌లో పరాజయం పాలై పతకం గెలిచే అవకాశం కోల్పోయింది. దీనిని క్రమశిక్షణారాహిత్యంగా భావిస్తూ ‘బాయ్’ అవార్డుల కోసం వీరిద్దరి పేర్లను పరిశీలించకుండా పక్కన పెట్టింది. అయితే ఇప్పుడు ‘బాయ్’ అతడిని క్షమించేసింది. ‘శ్రీకాంత్ తన తప్పు ఒప్పుకుంటూ మాకు మెయిల్ పంపించాడు. భవిష్యత్తులో మళ్లీ ఇలా చేయనని హామీ ఇచ్చాడు. అతని ప్రతిభ, ఘనతలను దృష్టిలో ఉంచుకొని ఖేల్‌రత్నకు అతని పేరును ప్రతిపాదించాం’ అని ప్రధాన కార్యదర్శి అజయ్ సింఘానియా వెల్లడించారు. మరోవైపు ప్రణయ్ మాత్రం పదే పదే ‘బాయ్’పై విమర్శలకు దిగుతున్నాడని ఆయన అన్నారు. అర్జున అవార్డుకు తనను కాకుండా సమీర్ వర్మ పేరును ప్రతిపాదించడంతో అసంతృప్తి చెందిన ప్రణయ్ ‘మళ్లీ అదే పాత కథ’ అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై ప్రణయ్‌ను వివరణ కోరినట్లు సింఘానియా చెప్పారు. ‘గతంలోనూ ప్రణయ్ ఇలాగే చేశాడు. కానీ మేం చూసీ చూడనట్లు వదిలేశాం. ఈసారి మాత్రం అతని ప్రవర్తన మాకు ఆగ్రహం తెప్పించింది. అందుకే షోకాజ్ నోటీసు జారీ చేశాం. సంతృప్తికర సమాధానం ఇస్తే సరి. లేదంటే అతనిపై గట్టి చర్యలు తీసుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment