జ్వాలను ఆడించాల్సిందే.. తేల్చి చెప్పిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న డబుల్ స్టార్ గుత్తా జ్వాలకు ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం లభించింది. జ్వాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ నివేదిక వెలువరించేదాకా ఆమెను రాబోయే టోర్నీల్లో ఆడేందుకు అనుమతించాల్సిందేనని ఆదేశించింది. జ్వాల పిటిషన్‌ను స్వీకరించి జస్టిస్ వీకే జైన్ ఈమేరకు తీర్పునిచ్చారు. ఐబీఎల్‌లో ఢిల్లీ స్మాషర్స్ ఆటగాళ్లను ప్రత్యర్థి జట్టుతో ఆడనీయకుండా అడ్డుకుందని జ్వాలపై ఆరోపణలున్నాయి. గతంలోనే బాయ్ ఈ అంశంపై ఆమెకు షోకాజ్ నోటీస్ జారీ చేసి క్రమశిక్షణ కమిటీని నియమించింది.
ఈ కమిటీ జ్వాలపై జీవిత కాల నిషేధాన్ని ప్రతిపాదించింది. అయితే ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు రావడంతో వెనక్కి తగ్గి... ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని నియమించింది. ఈ సమయంలో నెల రోజులపాటు ఆమె ఎలాంటి టోర్నీలు ఆడకూడదని స్పష్టం చేసింది. ఈ అంశంపై జ్వాల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. మరోవైపు అంతిమంగా విచారణ కమిటీలో తేలే విషయాన్ని కూడా కోర్టు పరిశీలిస్తుందని ఈ సందర్భంగా న్యాయమూర్తి చెప్పారు. ఈనెల 15 నుంచి 20 వరకు డెన్మార్క్ ఓపెన్, 22 నుంచి 27 వరకు ఫ్రెంచ్ ఓపెన్‌లో జ్వాల, అశ్వని పొన్నప్పతో కలిసి డబుల్స్ బరిలోకి దిగాల్సి ఉంది. అయితే బుధవారం డెన్మార్క్ ఓపెన్ నుంచి ఈ జోడి పేరును బాయ్ ఉపసంహరించింది.
కోర్టు తీర్పును గౌరవిస్తాం: బాయ్
గుత్తా జ్వాల విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తమకు గౌరవం ఉందని, పూర్తి సమాచారం వచ్చాకే తదుపరి నిర్ణయం తీసుకుంటామని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) తెలిపింది. ‘కోర్టు నిర్ణయంపై మాకు గౌరవం ఉంది. మేమిప్పటికే డెన్మార్క్ టోర్నీలో జ్వాల ఎంట్రీపై పునరాలోచించాలని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యుఎఫ్)ను కోరాం. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది వారే. మేం జ్వాలపై కోర్టు తీర్పుననుసరించి ముందుకెళతాం’ అని బాయ్ ప్రధాన కార్యదర్శి విజయ్ సిన్హా అన్నారు.