rohan kumar
-
బ్యాడ్మింటన్ క్రీడలో తప్పుడు డేట్ ఆఫ్ బర్త్‌లు.. వయసు మార్చి గోల్మాల్!
-శ్రీరంగం కామేష్, సాక్షి ప్రతినిధి బ్యాడ్మింటన్‌లో ఓ వయస్సు క్రీడాకారుడు అదే ఏజ్ గ్రూప్‌లో ఉండే మరో ఆటగాడితో పోటీ పడాలి. నిబంధనలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అలా జరిగినప్పుడే సరైన పోటీ అన్పించుకుంటుంది. వయస్సులో తేడాలున్నప్పుడు ఆటలోని అనుభవాన్ని బట్టి ప్రతిభా సామర్థ్యాల్లో సైతం తేడా ఉండేందుకు అవకాశం ఉంటుంది. పతకాలు, ర్యాంకుల్ని సైతం ప్రభావితం చేస్తుంది. ఇంతటి కీలకమైన వయస్సు నిబంధనకు తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు జాతీయ స్థాయి ఉత్తమ ర్యాంకర్లు తూట్లు పొడిచారు. తమ పుట్టిన తేదీ విషయంలో భారీ స్కామ్‌కు పాల్పడ్డారు. తమ వాస్తవ వయస్సును తగ్గించేసి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు (బీఏఐ) తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారు. ఈ మేరకు అందిన ఆకాశరామన్న ఉత్తరం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్ సెంట్రల్ క్రైౖమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు ముగ్గురి విషయంలో ఈ అక్రమాలను నిర్ధారించారు. సమగ్ర ఆధారాలతో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్‌కు లేఖ రాశారు. కానీ వారు ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఉత్తరం ఆధారంగా.. ఈ స్కామ్‌కు సంబంధించిన సమాచారాన్ని సిటీ సీసీఎస్ పోలీసులకు ఓ అజ్ఞాత వ్యక్తి లేఖ ద్వారా అందజేశారు. ఈ ఏడాది మార్చి 29న అందిన ఈ లేఖలో ఆరుగురు క్రీడాకారులపై ఆరోపణలున్నాయి. వీరు తమ అసలు వయస్సును దాచి పెట్టి నకిలీ సర్టిఫికెట్ల సృష్టించి బీఏఐకి సమర్పించారని, తద్వారా తమ కంటే చిన్న వారితో పోటీల్లో తలపడుతూ మెడల్స్, జాతీయ స్థాయి ర్యాంకులు సాధిస్తున్నారని అతను ఆరోపించారు. దీనివల్ల నిబంధనలు పాటించిన క్రీడాకారులకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే బీఏఐకి అనేకమంది నుంచి ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. సమగ్ర దర్యాప్తు చేసిన సీసీఎస్.. కేవలం ఈ ఆరుగురే కాకుండా దాదాపు 40 మంది బ్యాడ్మింటన్ ఆటగాళ్ల వయస్సు విషయంలో తమకు సందేహాలు ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తి ఆ లేఖలో పేర్కొన్నారు. వీరిలో చాలామంది 2005–10 మధ్య పుట్టారని, అయితే జనన ధ్రువీకరణ పత్రాలకు బదులుగా కొందరు వైద్యులు ఇచ్చిన బోగస్ మెడికల్ సర్టిఫికెట్లు దాఖలు చేసి తమ వయస్సు తగ్గించుకున్నారని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రీడాకారులకు తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది కోచ్‌లు, వారి తల్లిదండ్రులతో పాటు ఈ వైద్యుల సహకారం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ లేఖను సిటీ పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్ కె.చంద్రకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. చదవండి: BWF Rankings: తొమ్మిదో ర్యాంక్‌కు ప్రణయ్.. పీవీ సింధు మాత్రం.. ముగ్గురి విషయంలో ఆధారాలు లభ్యం... సీసీఎస్ ప్రత్యేక బృందానికి తొలి దశలోనే ముగ్గురు క్రీడాకారులకు సంబంధించిన సమగ్ర ఆధారాలు లభించాయి. బీఏఐ జాబితాలో అండర్–17 కేటగిరీలో 1176 పాయింట్లతో మూడో ర్యాంకులో ఉన్న రోహన్‌కుమార్ ఆనంద్‌దాస్ రాజ్‌కుమార్ తాను పుట్టిన తేదీని 2007 జనవరి 29గా పేర్కొంటూ బీఏఐకి సర్టిఫికెట్లు సమర్పించి టోర్నమెంట్లలో ఆడాడు. వాస్తవానికి రోహన్ పుట్టిన తేదీ 2005 అక్టోబర్ 29గా పోలీసులు నిర్ధారించారు. ఇదే కేటగిరీలో 92 పాయింట్లతో 44వ ర్యాంక్‌లో ఉన్న దవు వెంకట శివ నాగరామ్ మౌనీష్ తన పుట్టిన తేదీని 2007 జనవరి 29గా పేర్కొన్నారు. అయితే ఇతని అసలు పుట్టిన తేదీ 2006 జూన్4 అని దర్యాప్తులో తేలింది. అండర్–15 కేటగిరీలో 188 పాయింట్లతో 32వ ర్యాంక్‌లో ఉన్న భూక్యా నిషాంత్ తన పుట్టిన రోజును 2010 అక్టోబర్ 12గా పేర్కొనగా.. ఇతడి వాస్తవ పుట్టిన తేదీ 2007 జనవరి 12గా తేలింది. అయితే వీళ్లంతా మైనర్లు కావడంతో తమంతట తాముగా ఇలాంటి చర్యలకు పాల్పడలేరని, వాళ్ల కోచ్‌లు లేదా తల్లిదండ్రుల సహకారం, ప్రోద్బలంతోనే ఇలా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వారినే ఈ వ్యవహారంలో బాధ్యుల్ని చేయాలని భావిస్తున్నారు. ఏమాత్రం స్పందించని అసోసియేషన్.. ముగ్గురి బాగోతం బట్టబయలు కావడంతో ఇలాంటి వాళ్లు మరికొందరు ఉండి ఉంటారని పోలీసులు అనుమానించారు. అయితే ఈ వ్యవహారాన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలన్నా, బాధ్యుల్ని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఫిర్యాదు తప్పనిసరి. ఈ నేపథ్యంలో అన్ని వివరాలతో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్‌కు ఈ ఏడాది మే 25న ఓ లేఖ (నం.65/పీఈ/క్యాంప్/డీసీపీ/డీడీ/సీసీఎస్/డీడీ/2023) రాశారు. దీనిపై తగిన చర్యలు తీసుకుని తమకు తెలియజేయాల్సిందిగా డిటెక్టివ్ డిపార్ట్మెంట్ డీసీపీ కోరారు. కానీ అసోసియేషన్ ఇప్పటివరకు స్పందించక పోవడంతో వారికి తెలిసే ఈ స్కామ్ జరుగుతోందా? అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కామ్ దేశ వ్యాప్తంగా జరుగుతూ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. చదవండి: ఔటర్ చుట్టూ ఏడు ఇంటర్చేంజ్ మెట్రో స్టేషన్లు -
రోహన్ డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (అండర్–14) టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ కుమార్ సత్తా చాటాడు. మొయినాబాద్‌లోని శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన బాలుర సింగిల్స్ ఫైనల్లో రోహన్ కుమార్ 4–6, 6–3, 6–1తో జై అర్జున్‌పై గెలుపొందగా... బాలికల విభాగంలో అపూర్వ వేమూరి 6–3, 6–1తో మలిష్కను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. మరోవైపు బాలుర డబుల్స్ ఫైనల్లో రోహన్ కుమార్– సిద్ధార్థ్ ద్వయం 6–3, 6–3తో వరుస సెట్లలో వరుణ్–కుషాల్ జంటపై నెగ్గి టైటిల్‌ను దక్కించుకుంది. -
తెలంగాణ కెప్టెన్‌గా రోహన్
అండర్-15 జట్టు ఎంపిక హైదరాబాద్: తెలంగాణ అండర్-15 క్రికెట్ జట్టు సారథిగా వి. రోహన్ కుమార్ (హైదరాబాద్) ఎంపికయ్యాడు. ఇతని సారథ్యంలోని రాష్ట్ర జట్టు జాతీయ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్లో తలపడుతుంది. ఈటోర్నీ ఈ నెల 11 నుంచి న్యూఢిల్లీలో జరగనుంది. జట్టు: రోహన్ (కెప్టెన్), శివకుమార్, ఎం.డి. ఆదిల్, మోజిమ్ (మహబూబ్‌నగర్), అశ్రీత్ గౌడ్ (రంగారెడ్డి), శ్రవణ్ కుమార్, హరీశ్ సింగ్ ఠాకూర్, వినోద్, వేణు నాయక్ (ఆదిలాబాద్), బాబ్జి, లక్ష్మణమూర్తి (కరీంనగర్), రహ్మత్ హుస్సేన్ (నిజామాబాద్), తరుణ్ (మెదక్), సంజయ్, జశ్వంత్ రెడ్డి, అంకుర్ సింగ్ (ఖమ్మం); స్టాండ్‌బైస్: సుశాంత్ రెడ్డి (హైదరాబాద్), జయరాం కశ్యప్ (ఖమ్మం), సేవియా (మహబూబ్‌నగర్), అమీర్ (ఆదిలాబాద్). చాంప్ హైదరాబాద్ ఎస్ఎస్పీఎఫ్ అండర్-15 అంతర్ జిల్లా స్కూల్ క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ జట్టు... మహబూబ్‌నగర్‌పై విజయం సాధించింది. సాయ్ నిర్వహించే ఈ టోర్నీని రాష్ట్రంలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (క్యాట్) నిర్వహించింది. బహుమతి ప్రదానోత్స కార్యక్రమానికి టీఆర్ఎస్ సీనియర్ నేత వి. ప్రకాశ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేత జట్టుకు ట్రోఫీని అందజేశారు. ఇందులో క్యాట్ కార్యదర్శి సునీల్ బాబు, హెచ్‌సీఏ ఈసీ సభ్యుడు బాబురావు సాగర్ తదితరులు పాల్గొన్నారు.