అమ్మకానికి సర్టిఫికెట్లు | Fake Certificate Scam In Madurai Kamaraj University Distance Education | Sakshi
Sakshi News home page

అమ్మకానికి సర్టిఫికెట్లు

Published Wed, Sep 25 2019 10:13 AM | Last Updated on Wed, Sep 25 2019 10:13 AM

Fake Certificate Scam In Madurai Kamaraj University Distance Education - Sakshi

మదురై కామరాజ్‌ వర్సిటీ

సాక్షి, చెన్నై: పరీక్షలకు హాజరు కాకుండానే, దూరవిద్య కోర్సుల్ని అభ్యసించిన వేలాది మంది విద్యార్థులకు పాస్‌ సర్టిఫికెట్లు మంజూరు చేసిన మదురై కామరాజ్‌ వర్సిటీ దూర విద్యా విభాగం అధికారుల గుట్టురట్టు అయింది. సర్టిఫికెట్లను ఈ అధికారులు అమ్ముకున్నట్టు నిర్ధారణ కావడంతో ముగ్గుర్ని సస్పెండ్‌ చేస్తూ మంగళవారం ఆ వర్సిటీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉన్న అన్నావర్సిటీలో రీవాల్యుయేషన్‌లో మార్కుల మాయాజాలం ఇది వరకు వెలుగులోకి వచ్చి పెద్ద కలకలాన్ని   సృష్టించిన విషయం తెలిసిందే.

ఈ పరిస్థితుల్లో మదురైకామరాజ్‌వర్సిటీలో సర్టిఫికెట్ల స్కాం వెలుగులోకి రావడం మరో చర్చకు దారి తీసింది. ఏసీబీకి అందిన సమాచారం మేరకు అధికార వర్గాలు కామరాజర్‌ వర్సిటీపై నిఘా వేశాయి. ఇందులో ఆ వర్సిటీ దూరవిద్యా విభాగంలో నోట్లు ఉంటే చాలు సర్టిఫికెట్లు చేతికి వచ్చినట్టే అన్నట్టుగా పరిస్థితి ఉండడాన్ని గుర్తించి ఉన్నారు. దూరవిద్యా విభాగం ద్వారా ఏకంగా వేలాది మంది మంది విద్యార్థులు  సర్టిఫికెట్లను పొంది ఉన్నట్టుగా విచారణలో తేలింది. ఒక్కో విద్యార్థి నుంచి రూ.లక్షల మేరకు వసూళ్లు చేసి సర్టిఫికెట్లను అమ్మకానికి పెట్టి ఉండడం తేట తెల్లమైంది. 

ముగ్గురు సస్పెన్షన్‌..విద్యార్థులపై గురి
తమకు అందిన సమాచారం మేరకు ఓ వైపు ఏసీబీ విచారణను ముమ్మరం చేసింది. మరో వైపు ఆ వర్సిటీ పాలక మండలి రిటైర్డ్‌ న్యాయమూర్తి అక్బర్‌ అలీ నేతృత్వంలోని బృందం ద్వారా విచారణ చేపట్టింది. 2014 నుంచి దూర విద్యా విభాగంలో సాగిన వ్యవహారాలపై అక్బర్‌ అలీ బృందం దృష్టి పెట్టింది. అదే సమయంలో అక్రమాలు జరిగినట్టు, సర్టిఫికెట్లను అమ్ముకున్నట్టుగా ఏసీబీ తేల్చడంతో ఆ వర్సిటీ వర్గాల్లో కలవరం బయలుదేరింది. దూర విద్యా విభాగం అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ రాజరాజన్, పర్యవేక్షణాధికారి సత్యమూర్తి, మరో అధికారి కార్తిక్‌సెల్వన్‌లను విచారించేందుకు ఏసీబీ సిద్ధమైంది. ఈ ముగ్గుర్ని ఏసీబీ తమ అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితుల్లో అక్బర్‌ అలీ బృందం విచారణలో ఇప్పటివరకు అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చినట్టు పాలక మండలి దృష్టికి చేరింది.

విద్యార్థులు పరీక్షలు రాయకుండానే, సర్టిఫికెట్లను పొంది ఉన్నట్టు తేల్చారు. ఐదు వేల మందికి పైగా విద్యార్థులకు సర్టిఫికెట్లను అమ్మకున్నట్టు విచారణలో వెలుగు చూసింది. దీంతో ఏసీబీ విచారణకు మరింత మార్గాన్ని చూపించే రీతిలో ఆ వర్సిటీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. తమ విచారణలో వెలుగుచూసిన అంశాల ఆధారంగా రాజరాజన్, సత్యమూర్తి, కార్తిక్‌ సెల్వన్‌లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో ఆ ముగ్గుర్ని తమ అదుపులోకి తీసుకుని, సర్టిఫికెట్ల అమ్మకాల వ్యవహారంలో ఉన్న మరికొంత మంది అదృశ్య శక్తులు, వాటిని కొనుగోలు చేసిన విద్యార్థుల భరతం పట్టే దిశగా ఏసీబీ దూకుడు పెంచేందుకు సిద్ధం అవుతోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement