సాక్షి, సిటీబ్యూరో: నకిలీ సర్టిఫికెట్లు ముద్రిస్తున్న సూత్రధారితో పాటు వాటిని కొనుగోలు చేసిన మరో ఐదుగురిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మీర్‌పేట్, ఆర్‌ఎన్‌రెడ్డినగర్‌కు చెందిన హస్మతుల్హా ఓపెన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం తమ బంధువులకు చెందిన సాదన్ ఒకేషనల్ జూనియర్ కాలేజీలో కొన్నాళ్లు ఫ్యాకల్టీగా పనిచేశాడు. ఈ నేపథ్యంలో ఒకేషనల్ కాలేజీ నిర్వహణపై పట్టు సాధించిన అతను వివిధ రాష్ట్రాల నుంచి దూరవిద్యా కోర్సులను అందిస్తున్న పలు వర్సిటీల సిబ్బందితో పరిచయాలు పెంచుకున్నాడు. దీంతో 2009 నుంచి 2014 వరకు హిమాయత్‌నగర్‌లో స్కోప్ పేరుతో ఒకేషనల్ జూనియర్ కాలేజీని నిర్వహించాడు. అనంతరం చార్మినార్ ప్రాంతంలో చార్మినార్ కాలేజీ పేరుతో దూరవిద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన అతను అమాయకులు, విద్యార్హత సర్టిఫికెట్లు అవసరమున్న వారిని తమ కాలేజీలో చేర్పించుకొని, వారికి వివిధ యూనివర్శిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను అందిస్తూ రూ.లక్షలు వసూలు చేస్తున్నాడు.
ఇందుకు బెంగుళూరు యూనివర్సిటీ, ఢిల్లీలోని కళింగ యూనివర్సిటీ, రాజస్థాన్‌లోని నిమ్స్ యూనివర్సిటీకి సంబంధించి నకిలీ సర్టిఫికెట్లను తయారుచేసి సరఫరా చేసేందుకు ఐజాజ్, సందీప్ అనే వ్యక్తులను ఏజెంట్లను నియమించుకున్నాడు. సర్టిఫికెట్ల కోసం తన వద్దకు వచ్చిన వారి డాటాను సేకరించి వారి పేర్లను ఐజాజ్, సందీప్‌లకు పంపించేవారు. వారు ఆయా యూనివర్సిటీల నకిలీ సర్టిఫికెట్లను ముద్రించి కొరియర్ ద్వారా హైదరాబాద్‌కు పంపేవారు. బీకాం, ఎంకామ్, ఎం,ఏ, బీటెక్, బీబీఏ, బీఎస్సీ, ఇంజినీరింగ్, డిప్లామా సర్టిఫికెట్లకు రూ. 30 వేల నుంచి రూ. 1.5 లక్షల వరకు వసూలు చేసేవాడు. ఇతనిపై గుల్బార్గ, హైదరాబాద్‌లోని మొగల్‌పురా ఠాణాలో రెండు కేసులు నమోదయ్యాయి. శుక్రవారం చార్మినార్ కాలేజీలో సయ్యద్ అద్నాన్ అరీఫ్, అబ్దుల్హా సలీం, మన్సురాబాద్‌కు చెందిన సందీప్, మహ్మద్ షా అక్రమ అలీ, మహ్మద్ కలీముద్దీన్‌లకు నకిలీ సర్టిఫికెట్లు అందజేస్తున్నట్లు సమాచారం అందడంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావు నేతృత్వంలో దాడులు నిర్వహించిన పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ సందర్బంగా చత్తీస్‌ఘడ్ కళింగ యూనివర్సిటీ పేరుతో ఉన్న 45, బెంగుళూరు యూనివర్సిటీకి చెందిన 30, నిమ్స్ యూనివర్సిటీ పేరుతో ఉన్న 5 నకిలీ సర్టిఫికెట్లు, చార్మినార్ కాలేజీ కరపత్రాలు, పలువురు విద్యార్థుల బయోడెటాలు, రబ్బర్ స్టాంప్‌లు, కంప్యూటర్, స్కానర్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తదుపరి చర్యల నిమిత్తం మొగల్‌పురా పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment