ప్రొద్దుటూరు టౌన్: విద్యాబుద్ధులు నేర్పి పిల్లలను సమాజానికి ఉపయోగ పడేవిధంగా తీర్చి దిద్దాల్సిన గురువులే తప్పు చేస్తే...పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పాఠశాలల్లో సెకండరీగ్రేడ్ టీచర్లుగా పని చేస్తున్న నలుగురు ఏకంగా కుల సర్టిఫికెట్లు నకిలీవి పెట్టి ఉద్యోగాలు పొందారన్న సమాచారం బయటకు పొక్కడంతో తీవ్ర చర్చ జరుగుతోంది. వీరిలో ఒకరికి ప్రమోషన్ కూడా వచ్చిందంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నకిలీ కుల సర్టిఫికెట్ల దందా కొనసాగుతున్నా అధికారులకు తెలియకపోవడం ఏమిటన్న విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. నాలుగు పాఠశాలల్లో పని చేస్తున్న ఎస్‌జీటీలపై ఇటీవలే మున్సిపల్ అధికారులకు తెలియడంతో షాక్‌కు గురైనట్లు సమాచారం.
చెంచులుగా...కమ్మరట్రైబల్‌గా...
కొందరు ఉపాధ్యాయులు చెంచులుగా, మరి కొందరు కమ్మర ట్రైబల్‌గా ఉద్యోగాలు పొందారు. ఈ తతంగం ఏళ్ల తరబడి గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది. రూ.35వేల నుంచి రూ.45 వేలు జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయుల కుల సర్టిఫికెట్లపై విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరిలో 1992, 1994, 2000 సంవత్సరాల బ్యాచ్‌లకు చెందిన వారు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరిలో కొందరు చెంచులుగా, మరి కొందరు కమ్మర ట్రైబుల్‌గా కుల సర్టిఫికెట్లను పొందు పరిచినట్లు తెలిసింది.
కడప జిల్లాలో చెంచులు ఉన్నారా...?
అయితే రెవెన్యూ రికార్డుల ప్రకారం కడప జిల్లాలో చెంచులు ఎక్కడా లేరన్న విషయాన్ని రెవెన్యూ అధికారులు రూఢీ చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో చెంచులు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే వీరికి చెంచులుగా గుర్తించి కుల సర్టిఫికెట్లను ఏ రెవెన్యూ అధికారి ఇచ్చారన్న విషయంపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగాలి.
నకిలీ సర్టిఫికెట్లపై ఉన్నత స్థాయిలో విచారణ జరగాలి...
నకిలీ సర్టిఫికెట్ల ఉదంతంపై ఉన్నత స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సర్టిఫికెట్లు రెవెన్యూ అధికారులే జారీ చేశారా, లేక వాటిని కూడా నకిలీవి సృష్టించారా అన్న విషయం తేలాల్సి ఉంది. ఉద్యోగం కోసం జరిగిన ఇంటర్వ్యూలలో అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారన్న విషయంపై కూడా విచారణ జరగాలి. ఒక్క ప్రొద్దుటూరులోనేనా లేక మరే ప్రాంతంలోనైనా ఈ విధంగా ఉద్యోగాలను ఏఏ శాఖల్లో పొందారన్న విషయంపై కూడా విచారణ జరిగితే ఎంత మంది ఈ దందాలో పాలుపంచుకున్నారో తేలుతుంది.
మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం
నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన విషయంపై మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్‌ను వివరణ కోరగా, తమ దృష్టికి రాలేదన్నారు. ఏ పాఠశాలలో ఇలాంటి వారు ఉన్నారో సమాచారం ఇస్తే వారికి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
నకిలీ గురువులు
Published Tue, Apr 28 2015 2:35 AM | Last Updated on Sat, Sep 15 2018 8:33 PM
Advertisement
Advertisement