ఐఏఎస్ శిక్షణ నిలిపివేత
మళ్లీ ముస్సోరీ అకాడమీకి వెళ్లాలని కేంద్రం ఆదేశం
ముంబై: కంటిచూపు లోపాలు, మానసిక, శారీరక వైకల్యం ఉందంటూ యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్లు సమర్పించడం, నాన్ క్రీమీలేయర్ పత్రాల దురి్వనియోగం, ఎంబీబీఎస్‌లో చేరేందుకు తప్పుడు పత్రాల సృష్టి.. ఇలా పలు వివాదాలకు కేంద్రబిందువైన 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా మనోరమ దిలీప్ ఖేడ్కర్ వ్యవహారంపై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
తక్షణం మహారాష్ట్రలో ఆమెకు జిల్లా శిక్షణను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. తిరిగి ముస్సోరీలోని లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అడ్మిని్రస్టేషన్ అకాడమీలో రిపోర్ట్‌చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు పూజకు మహారాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి నితిన్ గాడ్రే లేఖ రాశారు. ‘‘ మహారాష్ట్రలో వాసిం జిల్లా సూపర్‌న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో ఉన్న మిమ్మల్ని తక్షణం ‘జిల్లా శిక్షణ’ నుంచి పక్కనపెడుతున్నాం. 23వ తేదీలోపు మళ్లీ ముస్సోరీ ఐఏఎస్ అకాడమీలో రిపోర్ట్‌చేయండి. అకాడమీ తీసుకునే చర్యలకు సిద్దంగా ఉండండి’’ అని ఆమెకు పంపిన లేఖలో నితిన్ పేర్కొన్నారు.
ప్రత్యేక వసతులతో వార్తల్లోకి..
ట్రైనీ అయినాసరే జిల్లా కలెక్టర్ స్థాయిలో తనకూ అధికారిక సదుపాయాలు, వసతులు కలి్పంచాలని డిమాండ్‌చేయడంతో పూజ వ్యవహార శైలి తొలిసారిగా వార్తల్లోకి ఎక్కింది. ప్రత్యేకంగా ఆఫీస్‌ను కేటాయించాలని, అధికారిక కారు ఇవ్వాలని డిమాండ్‌చేయడంతోపాటు సొంత ఖరీదైన కారుపై ఎర్ర బుగ్గను తగిలించుకుని తిరిగారు. దీంతో పుణెలో అసిస్టెంట్ కలెక్టర్ హోదా నుంచి ఆమెను వాసిమ్ జిల్లాలో సూపర్‌న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా ప్రభుత్వం బదిలీచేసింది.
తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి సివిల్స్‌లో ఆమె ఆలిండియా 821వ ర్యాంక్ సాధించారని మీడియాలో వార్తలొచ్చాయి. దాంతో యూపీఎస్సీకి ఆమె సమర్పించిన వైకల్యం సర్టీఫికెట్లు, అఫిడవిట్ల విశ్వసనీయతపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో ఈ విషయంలో నిజానిజాలను నిగ్గుతేల్చాలని కేంద్రప్రభుత్వ ఏకసభ్య కమిటీని నియమించింది. రెండు వారాల్లోగా నివేదించాలని ఆదేశించింది. ఆదివారం పుణె పోలీసులు పూజ లగ్జరీకారును సీజ్‌చేశారు. తప్పుడు పత్రాలతో ఎంబీబీఎస్ సీటు సాధించారని విమర్శలు వెల్లువెత్తాయి.
సోమవారం అర్ధరాత్రి పూజ ఇంటికి మహిళా పోలీసులు వెళ్లారు. కొంచెం పని ఉందని చెప్పి ఆమే వారిని పిలిపించినట్లు తెలుస్తోంది. అయితే పుణె కలెక్టర్ సుహాస్ దవాసే తనను వేధిస్తున్నారని ఫిర్యాదు చేసేందుకే వారిని ఇంటికి పిలిపించిందని పోలీసు అధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు. కాగా 2022 ఆగస్ట్‌లో పుణె జిల్లా పింప్రి ఆస్పత్రిలో ఎడమ మోకాలికి వైకల్యం ఉందని ఆమె వికలాంగ సర్టీఫికెట్ సంపాదించారని యశ్వంత్‌రావ్ చవాన్ స్మారక ప్రభుత్వాసుపత్రి డీన్ రాజేంద్ర వాబ్లే వెల్లడించారు. అయితే అదే నెలలో ఔధ్ ప్రభుత్వాసుపత్రిలో వైకల్య సరిఫికెట్ కోసం పెట్టుకున్న ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైందని తెలుస్తోంది. ‘‘కమిషనర్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఆదేశాల మేరకు పూజ గతంలో సమర్పించిన వైకల్య సర్టీఫికెట్లు అన్నింటినీ పరిశీలిస్తాం. ఆమెకు కంటి, మానసిక, అంగ వైకల్యం ఉందని ధ్రువపరిచిన ఆస్పత్రులు, వైద్యులెవరో తేలుస్తాం’ అని పుణె పోలీసు అధికారి వెల్లడించారు.
పరారీలో తల్లిదండ్రులు !
తల్లిదండ్రులకు కోట్ల రూపాయల ఆస్తులున్న విషయాన్ని దాచి పెట్టి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్‌ను సంపాదించారనీ పూజపై ఆరోపణలున్నాయి. పూజ తల్లిదండ్రుల వ్యవహారశైలిపైనా మీడియాలో వార్తలొచ్చాయి. గ్రామ సర్పంచ్ అయిన పూజ తల్లి మనోరమ ఒక భూవివాదంలో కొందరిని గన్‌తో బెదిరిస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. క్రిమినల్ కేసులో తల్లిదండ్రుల జాడ కోసం పోలీసులు వెతుకుతున్నారు. వారిద్దరి మొబైల్స్ స్విచ్చాఫ్ చేసి ఉన్నాయి. పుణెలోని మెట్రో రైల్ కారి్మకులతో గొడవ పడుతున్న వీడియో కూడా సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment