IAS training
-
పూజా ఖేడ్కర్‌పై కేంద్రం సీరియస్
ముంబై: కంటిచూపు లోపాలు, మానసిక, శారీరక వైకల్యం ఉందంటూ యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్లు సమర్పించడం, నాన్ క్రీమీలేయర్ పత్రాల దురి్వనియోగం, ఎంబీబీఎస్‌లో చేరేందుకు తప్పుడు పత్రాల సృష్టి.. ఇలా పలు వివాదాలకు కేంద్రబిందువైన 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా మనోరమ దిలీప్ ఖేడ్కర్ వ్యవహారంపై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.తక్షణం మహారాష్ట్రలో ఆమెకు జిల్లా శిక్షణను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. తిరిగి ముస్సోరీలోని లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అడ్మిని్రస్టేషన్ అకాడమీలో రిపోర్ట్‌చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు పూజకు మహారాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి నితిన్ గాడ్రే లేఖ రాశారు. ‘‘ మహారాష్ట్రలో వాసిం జిల్లా సూపర్‌న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో ఉన్న మిమ్మల్ని తక్షణం ‘జిల్లా శిక్షణ’ నుంచి పక్కనపెడుతున్నాం. 23వ తేదీలోపు మళ్లీ ముస్సోరీ ఐఏఎస్ అకాడమీలో రిపోర్ట్చేయండి. అకాడమీ తీసుకునే చర్యలకు సిద్దంగా ఉండండి’’ అని ఆమెకు పంపిన లేఖలో నితిన్ పేర్కొన్నారు. ప్రత్యేక వసతులతో వార్తల్లోకి..ట్రైనీ అయినాసరే జిల్లా కలెక్టర్ స్థాయిలో తనకూ అధికారిక సదుపాయాలు, వసతులు కలి్పంచాలని డిమాండ్‌చేయడంతో పూజ వ్యవహార శైలి తొలిసారిగా వార్తల్లోకి ఎక్కింది. ప్రత్యేకంగా ఆఫీస్‌ను కేటాయించాలని, అధికారిక కారు ఇవ్వాలని డిమాండ్చేయడంతోపాటు సొంత ఖరీదైన కారుపై ఎర్ర బుగ్గను తగిలించుకుని తిరిగారు. దీంతో పుణెలో అసిస్టెంట్ కలెక్టర్ హోదా నుంచి ఆమెను వాసిమ్ జిల్లాలో సూపర్‌న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా ప్రభుత్వం బదిలీచేసింది.తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి సివిల్స్‌లో ఆమె ఆలిండియా 821వ ర్యాంక్ సాధించారని మీడియాలో వార్తలొచ్చాయి. దాంతో యూపీఎస్సీకి ఆమె సమర్పించిన వైకల్యం సర్టీఫికెట్లు, అఫిడవిట్ల విశ్వసనీయతపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో ఈ విషయంలో నిజానిజాలను నిగ్గుతేల్చాలని కేంద్రప్రభుత్వ ఏకసభ్య కమిటీని నియమించింది. రెండు వారాల్లోగా నివేదించాలని ఆదేశించింది. ఆదివారం పుణె పోలీసులు పూజ లగ్జరీకారును సీజ్‌చేశారు. తప్పుడు పత్రాలతో ఎంబీబీఎస్ సీటు సాధించారని విమర్శలు వెల్లువెత్తాయి. సోమవారం అర్ధరాత్రి పూజ ఇంటికి మహిళా పోలీసులు వెళ్లారు. కొంచెం పని ఉందని చెప్పి ఆమే వారిని పిలిపించినట్లు తెలుస్తోంది. అయితే పుణె కలెక్టర్ సుహాస్ దవాసే తనను వేధిస్తున్నారని ఫిర్యాదు చేసేందుకే వారిని ఇంటికి పిలిపించిందని పోలీసు అధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు. కాగా 2022 ఆగస్ట్‌లో పుణె జిల్లా పింప్రి ఆస్పత్రిలో ఎడమ మోకాలికి వైకల్యం ఉందని ఆమె వికలాంగ సర్టీఫికెట్ సంపాదించారని యశ్వంత్రావ్ చవాన్ స్మారక ప్రభుత్వాసుపత్రి డీన్ రాజేంద్ర వాబ్లే వెల్లడించారు. అయితే అదే నెలలో ఔధ్ ప్రభుత్వాసుపత్రిలో వైకల్య సరిఫికెట్ కోసం పెట్టుకున్న ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైందని తెలుస్తోంది. ‘‘కమిషనర్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఆదేశాల మేరకు పూజ గతంలో సమర్పించిన వైకల్య సర్టీఫికెట్లు అన్నింటినీ పరిశీలిస్తాం. ఆమెకు కంటి, మానసిక, అంగ వైకల్యం ఉందని ధ్రువపరిచిన ఆస్పత్రులు, వైద్యులెవరో తేలుస్తాం’ అని పుణె పోలీసు అధికారి వెల్లడించారు. పరారీలో తల్లిదండ్రులు ! తల్లిదండ్రులకు కోట్ల రూపాయల ఆస్తులున్న విషయాన్ని దాచి పెట్టి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్‌ను సంపాదించారనీ పూజపై ఆరోపణలున్నాయి. పూజ తల్లిదండ్రుల వ్యవహారశైలిపైనా మీడియాలో వార్తలొచ్చాయి. గ్రామ సర్పంచ్ అయిన పూజ తల్లి మనోరమ ఒక భూవివాదంలో కొందరిని గన్‌తో బెదిరిస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. క్రిమినల్ కేసులో తల్లిదండ్రుల జాడ కోసం పోలీసులు వెతుకుతున్నారు. వారిద్దరి మొబైల్స్ స్విచ్చాఫ్ చేసి ఉన్నాయి. పుణెలోని మెట్రో రైల్ కారి్మకులతో గొడవ పడుతున్న వీడియో కూడా సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
25న ముస్సోరి వెళ్లనున్న చంద్రబాబు
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 25వ తేదీన ముస్సోరి పర్యటనకు వెళ్లనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అఖిల భారత సర్వీసుల శిక్షణా సంస్థ నుంచి చంద్రబాబుకు ఆహ్వానం అందినట్లు తెలిపారు. శిక్షణలో ఉన్న ఐఏఎస్లనుద్దేశించి చంద్రబాబునాయుడు ప్రసంగించనున్నట్లు చెప్పారు. ఏపీలో పాలనా సంస్కరణలపై ఐఏఎస్‌లతో మాట్లాడనున్నట్లు తెలిపారు. చంద్రబాబు ఇన్ సర్వీస్ ఐఏఎస్‌లు, శిక్షణలో ఉన్న ఐఏఎస్‌ల..జాయింట్ సెషన్లో పాల్గొననున్నట్లు వివరించారు. -
ఐఏఎస్ శిక్షణలో శంకరన్ జీవితచరిత్ర
ఎస్ఆర్ శంకరన్ 6వ స్మారక సభలో ప్రొ. కేఎస్ చలం ► ప్రజాసేవకుడంటే ప్రజాసంపదను ప్రజలకు చేర వేసేవాడే ► సివిల్ సర్వెంట్స్ ఎవ్వరికీ భయపడనక్కర్లేదు సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగానికి అనుగుణంగా వ్యవహరించినంత కాలం సివిల్ సర్వెంట్స్ ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదనే విషయాన్ని ఎస్ఆర్ శంకరన్ నిరూపించి చూపారని, ఆయన జీవిత చరిత్రను ఐఏఎస్ శిక్షణలో పాఠ్యాంశంగా చేర్చేందుకు ప్రయత్నించాలని యూపీఎస్సీ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ కేఎస్ చలం సూచించారు. శనివారం రవీంద్రభారతిలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో దళిత ప్రజల ఆశాజ్యోతి, పేద ప్రజల ప్రియతమ నాయకుడు ఎస్ఆర్ శంకరన్ ఆరో స్మార క సభ జరిగింది. ఈ సందర్భంగా ‘సివిల్ సర్వెంట్స్ రోల్ ఇన్ డెమొక్రసీ అండ్ డెవ లప్మెంట్’ అనే అంశంపై ప్రొఫెసర్ చలం స్మారకోపన్యాసం చేశారు. ప్రజాసేవకుడంటే ప్రజాసంపదను ప్రజలకు చేరేవేసేవాడేనని, నిర్భీతితో కూడిన స్వేచ్ఛయే నిజమైన అభివృద్ధి అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల మేలు కోసం దేనికీ భయపడని శంకరన్‌లాంటి సివిల్ సర్వెంట్స్ ఆవశ్యకత దేశానికి చాలా ఉందన్నారు. బీడీ శర్మ కూడా అదే కోవలోకి వస్తారన్నారు. భారతదేశంలో సివిల్ సర్వెంట్స్‌కి ఉన్న భద్రత మరే దేశంలోనూ లేదన్నారు. అందుకే మనదేశంలోని సివిల్ సర్వెంట్స్ ప్రజాసేవ విషయంలో వెనక్కి తగ్గాల్సిన పనిలేదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 వారికి రక్షణ కవచంగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. అది నా అదృష్టం: ఎంవీ రెడ్డి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మేడ్చల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి మాట్లాడుతూ పేదలకోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి శంకరన్ అని, ఆయన బాటలో పయనించడం తాను అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. దళితుల కోసం పనిచేయడమంటే వారికి రావాల్సిన అవకాశాలు వారికి సరిగ్గా అందేలా చేయడమేనన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు, ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా సోషల్ వెల్ఫేర్ విద్యార్థులను తీర్చేదిద్దేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఐఏఎస్‌ల్లో చైతన్యం తీసుకురావడానికి తొలిదశలోనే వారికి ప్రజలపట్ల, సామాజిక న్యాయం పట్ల అవగాహన కల్పించాలన్నారు. అందుకుగాను ఐఏఎస్‌ల సెలక్షన్ అయిపోయిన తర్వాత వారికి ఇచ్చే శిక్షణలో శంకరన్ జీవిత చరిత్రను తప్పనిసరిగా చేర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తొలిదశలోనే అధికారుల్లో సామాజిక చైతన్యం తీసుకొస్తే వారు తమ సర్వీస్‌లో అద్భుతాలు సృష్టించగలుగుతారని చెప్పారు. ఆ స్ఫూర్తి కొనసాగింపే నివాళి: మల్లెపల్లి సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ దళితుల కోసం పరితపించిన ప్రతి దళితేతరులను దళిత సమాజం సర్వదా మదిలో నిలుపుకుంటుందన్నారు. శంకరన్ స్ఫూర్తిని ఈతరం అధికారులు కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. సీడీఎస్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వి.కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ డెరైక్టర్ వైబీ సత్యనారాయణ మాట్లాడుతూ శంకరన్ నిబద్దతను నేటి తరం పుణికిపుచ్చుకోవాలన్నారు. శంకరన్ స్మృత్యర్థం సీనియర్ ఐఏఎస్ అధికారి, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి కేఆర్ వేణుగోపాల్ భార్య లక్ష్మీవేణుగోపాల్ అవార్డు, రూ. పది వేల నగదును మహబూబ్‌నగర్ జిల్లా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థిని ఉప్పెనకు కె.రామచంద్రమూర్తి అందజేశారు. ఉప్పెన పదో తరగతిలో 9.8 మార్కులతో అత్యున్నత ప్రతిభ కనపరిచింది. కార్యక్రమం ప్రారంభంలో శంకరన్ చిత్రపటానికి కేఆర్ వేణుగోపాల్, కాకి మాధవరావు, ఉపన్యాసకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
ఐఏఎస్ శిక్షణా కాలం తగ్గింపు!
న్యూఢిల్లీ: ఐఏఎస్ అధికారుల శిక్షణా కాలాన్ని తగ్గించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఐఏఎస్ ల శిక్షణాకాలాన్ని 103 వారాల నుంచి 75 వారాలకు తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. కిరణ్ అగర్వాల్ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ ప్రతిపాదనలు చేసింది. ఐఏఎస్ ప్రొఫెసనల్ కోర్సు(పేజ్ 1, 2)కు 7 వారాలు, అకాడమిక్ ఇన్స్ట్రక్షన్ కు 4 వారాలు, జిల్లా శిక్షణకు 21 వారాలు ఉండాలని కమిటీ సిఫార్సు చేసింది. దీన్ని అమలు చేయాలంటే 1954 నాటి ఐఏఎస్(ప్రొబెషన్) చట్టానికి సవరణ చేయాల్సివుంటుంది. శిక్షణా కాలాన్ని తగ్గిస్తూ కేంద్రం చేసిన ప్రతిపాదనలపై స్పందనలు, అభిప్రాయాలు నవంబర్ 30లోగా తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాలను డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ) శుక్రవారం కోరింది. ఈ మేరకు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సమాచారం ఇచ్చింది.