ఐఏఎస్ శిక్షణలో శంకరన్ జీవితచరిత్ర | Sankaran Biography in IAS training | Sakshi
Sakshi News home page

ఐఏఎస్ శిక్షణలో శంకరన్ జీవితచరిత్ర

Published Sun, Oct 16 2016 3:11 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

ఐఏఎస్ శిక్షణలో శంకరన్ జీవితచరిత్ర

ఐఏఎస్ శిక్షణలో శంకరన్ జీవితచరిత్ర

ఎస్‌ఆర్ శంకరన్ 6వ స్మారక సభలో ప్రొ. కేఎస్ చలం
►  ప్రజాసేవకుడంటే ప్రజాసంపదను ప్రజలకు చేర వేసేవాడే
  సివిల్ సర్వెంట్స్ ఎవ్వరికీ భయపడనక్కర్లేదు

సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగానికి అనుగుణంగా వ్యవహరించినంత కాలం సివిల్ సర్వెంట్స్ ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదనే విషయాన్ని ఎస్‌ఆర్ శంకరన్ నిరూపించి చూపారని, ఆయన జీవిత చరిత్రను ఐఏఎస్ శిక్షణలో పాఠ్యాంశంగా చేర్చేందుకు ప్రయత్నించాలని యూపీఎస్‌సీ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ కేఎస్ చలం సూచించారు. శనివారం రవీంద్రభారతిలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో దళిత ప్రజల ఆశాజ్యోతి, పేద ప్రజల ప్రియతమ నాయకుడు ఎస్‌ఆర్ శంకరన్ ఆరో స్మార క సభ జరిగింది. ఈ సందర్భంగా ‘సివిల్ సర్వెంట్స్ రోల్ ఇన్ డెమొక్రసీ అండ్ డెవ లప్‌మెంట్’ అనే అంశంపై ప్రొఫెసర్ చలం స్మారకోపన్యాసం చేశారు.

ప్రజాసేవకుడంటే ప్రజాసంపదను ప్రజలకు చేరేవేసేవాడేనని, నిర్భీతితో కూడిన స్వేచ్ఛయే నిజమైన అభివృద్ధి అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల మేలు కోసం దేనికీ భయపడని శంకరన్‌లాంటి సివిల్ సర్వెంట్స్ ఆవశ్యకత దేశానికి చాలా ఉందన్నారు. బీడీ శర్మ కూడా అదే కోవలోకి వస్తారన్నారు. భారతదేశంలో సివిల్ సర్వెంట్స్‌కి ఉన్న భద్రత మరే దేశంలోనూ లేదన్నారు. అందుకే మనదేశంలోని సివిల్ సర్వెంట్స్ ప్రజాసేవ విషయంలో వెనక్కి తగ్గాల్సిన పనిలేదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 వారికి రక్షణ కవచంగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.

అది నా అదృష్టం: ఎంవీ రెడ్డి
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మేడ్చల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి మాట్లాడుతూ పేదలకోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి శంకరన్ అని, ఆయన బాటలో పయనించడం తాను అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. దళితుల కోసం పనిచేయడమంటే వారికి రావాల్సిన అవకాశాలు వారికి సరిగ్గా అందేలా చేయడమేనన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు, ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా సోషల్ వెల్ఫేర్ విద్యార్థులను తీర్చేదిద్దేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఐఏఎస్‌ల్లో చైతన్యం తీసుకురావడానికి తొలిదశలోనే వారికి ప్రజలపట్ల, సామాజిక న్యాయం పట్ల అవగాహన కల్పించాలన్నారు. అందుకుగాను ఐఏఎస్‌ల సెలక్షన్ అయిపోయిన తర్వాత వారికి ఇచ్చే శిక్షణలో శంకరన్ జీవిత చరిత్రను తప్పనిసరిగా చేర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తొలిదశలోనే అధికారుల్లో సామాజిక చైతన్యం తీసుకొస్తే వారు తమ సర్వీస్‌లో అద్భుతాలు సృష్టించగలుగుతారని చెప్పారు.

ఆ స్ఫూర్తి కొనసాగింపే నివాళి: మల్లెపల్లి
సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ దళితుల కోసం పరితపించిన ప్రతి దళితేతరులను దళిత సమాజం సర్వదా మదిలో నిలుపుకుంటుందన్నారు. శంకరన్ స్ఫూర్తిని ఈతరం అధికారులు కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. సీడీఎస్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వి.కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ డెరైక్టర్ వైబీ సత్యనారాయణ మాట్లాడుతూ శంకరన్ నిబద్దతను నేటి తరం పుణికిపుచ్చుకోవాలన్నారు.

శంకరన్ స్మృత్యర్థం సీనియర్ ఐఏఎస్ అధికారి, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి కేఆర్ వేణుగోపాల్ భార్య లక్ష్మీవేణుగోపాల్ అవార్డు, రూ. పది వేల నగదును మహబూబ్‌నగర్ జిల్లా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థిని ఉప్పెనకు కె.రామచంద్రమూర్తి అందజేశారు. ఉప్పెన పదో తరగతిలో 9.8 మార్కులతో అత్యున్నత ప్రతిభ కనపరిచింది. కార్యక్రమం ప్రారంభంలో శంకరన్ చిత్రపటానికి కేఆర్ వేణుగోపాల్, కాకి మాధవరావు, ఉపన్యాసకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement