సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ (టీఎస్‌ఎంసీ) డేటాబేస్ ట్యాంపరింగ్ చేసి, అనర్హులను రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేసిన కేసు దర్యాప్తును సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో కౌన్సిల్ సీనియర్ అసిస్టెంట్ అనంతకుమార్‌తో సహా ముగ్గురు నిందితులను గురువారం అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ కేసులో మరో అనుమానితురాలిగా ఉన్న నాగమణి 2015లోనే అరెస్టు అయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
►విజయవాడకు చెందిన భూక్యా నాగమణి, విజయనగరానికి చెందిన గంట రాంబాబు సన్నిహితులు. వీరిద్దరూ కలిసి 2015లో నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్‌తో పాటు ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ పత్రాన్ని డీటీపీలో రూపొందించారు. గుంటూరు జిల్లా నిజాంపట్నానికి చెందిన చెన్ను నాగమణి 2012లో ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేయించుకున్నారు. ఈమెకు చెందిన 65699 నంబర్‌నే వినియోగించిన ఈ ద్వయం నకిలీ పత్రాలు రూపొందించింది.
►వీటి ఆధారంగా నాగమణి నగరానికి చెందిన రమేష్ ద్వారా ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో ఉన్న లక్ష్మీ నర్సింగ్ హోమ్‌లో గైనకాలజిస్ట్‌గా చేరారు. తన విద్యార్హత పత్రాల్లో ఎంబీబీఎస్, ఎంఎస్ (ఓబీజీ) అంటూ పొందుపరచడంతో ఆస్పత్రి యాజమాన్యం ఉద్యోగం ఇచ్చింది. ఈమె వ్యవహారశైలి, రాస్తున్న మందులు చూసిన సదరు హాస్పిటల్ పరిపాలనాధిపతి సుభాష్ అనుమానించారు. తన సందేహం నివృతి చేయాల్సిందిగా కోరుతూ మెడికల్ కౌన్సిల్‌కు లేఖ రాశారు.
►పూర్వాపరాలు పరిశీలించిన కౌన్సిల్ నాగమణి నకిలీ వైద్యురాలని తేల్చడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సుభాష్‌కు సూచించింది. దీంతో ఆయన చెన్నూరు పోలీసు లకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఆ పోలీసులు నాగమణితో పాటు రాంబాబును 2015 ఆగస్టు 22న అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది.
►ఇంతవరకు బాగానే ఉన్నా... ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంలో చెన్నూరు పోలీసులు విఫలయ్యారు. నాగమణి, రాంబాబు కలిసి డీటీపీ ద్వారా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేశారని తేల్చారు. ఉమ్మడి రాష్ట్రంలోని ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో నిజాంపట్నానికి చెందిన చెన్ను నాగమణి రిజిస్టర్ చేసుకున్నారని, ఆమె రిజిస్ట్రేషన్ నంబర్ 65699 అని వీరికి ఎలా తెలిసిందనేది ఆరా తీయలేదు. ఇప్పుడు ఈ కోణంపై దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment