Telangana state Medical Counseling
-
నాడే చిక్కిన నాగమణి!
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) డేటాబేస్ ట్యాంపరింగ్ చేసి, అనర్హులను రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేసిన కేసు దర్యాప్తును సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో కౌన్సిల్ సీనియర్ అసిస్టెంట్ అనంతకుమార్‌తో సహా ముగ్గురు నిందితులను గురువారం అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ కేసులో మరో అనుమానితురాలిగా ఉన్న నాగమణి 2015లోనే అరెస్టు అయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ►విజయవాడకు చెందిన భూక్యా నాగమణి, విజయనగరానికి చెందిన గంట రాంబాబు సన్నిహితులు. వీరిద్దరూ కలిసి 2015లో నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్తో పాటు ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ పత్రాన్ని డీటీపీలో రూపొందించారు. గుంటూరు జిల్లా నిజాంపట్నానికి చెందిన చెన్ను నాగమణి 2012లో ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేయించుకున్నారు. ఈమెకు చెందిన 65699 నంబర్‌నే వినియోగించిన ఈ ద్వయం నకిలీ పత్రాలు రూపొందించింది. ►వీటి ఆధారంగా నాగమణి నగరానికి చెందిన రమేష్ ద్వారా ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో ఉన్న లక్ష్మీ నర్సింగ్ హోమ్‌లో గైనకాలజిస్ట్‌గా చేరారు. తన విద్యార్హత పత్రాల్లో ఎంబీబీఎస్, ఎంఎస్ (ఓబీజీ) అంటూ పొందుపరచడంతో ఆస్పత్రి యాజమాన్యం ఉద్యోగం ఇచ్చింది. ఈమె వ్యవహారశైలి, రాస్తున్న మందులు చూసిన సదరు హాస్పిటల్ పరిపాలనాధిపతి సుభాష్ అనుమానించారు. తన సందేహం నివృతి చేయాల్సిందిగా కోరుతూ మెడికల్ కౌన్సిల్‌కు లేఖ రాశారు. ►పూర్వాపరాలు పరిశీలించిన కౌన్సిల్ నాగమణి నకిలీ వైద్యురాలని తేల్చడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సుభాష్‌కు సూచించింది. దీంతో ఆయన చెన్నూరు పోలీసు లకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఆ పోలీసులు నాగమణితో పాటు రాంబాబును 2015 ఆగస్టు 22న అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. ►ఇంతవరకు బాగానే ఉన్నా... ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంలో చెన్నూరు పోలీసులు విఫలయ్యారు. నాగమణి, రాంబాబు కలిసి డీటీపీ ద్వారా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేశారని తేల్చారు. ఉమ్మడి రాష్ట్రంలోని ఏపీ మెడికల్ కౌన్సిల్లో నిజాంపట్నానికి చెందిన చెన్ను నాగమణి రిజిస్టర్ చేసుకున్నారని, ఆమె రిజిస్ట్రేషన్ నంబర్ 65699 అని వీరికి ఎలా తెలిసిందనేది ఆరా తీయలేదు. ఇప్పుడు ఈ కోణంపై దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. -
‘ట్యాంపరింగ్’ కేసు వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) డేటాబేస్‌లో వెలుగుచూసిన రికార్డుల ట్యాంపరింగ్ వ్యవహారంపై తమకు పూర్తి వివరాలు, రికార్డులు అందించాలని ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సిటీ సైబర్ క్రైం పోలీసులు ఆదేశించారు. డాక్టర్ల రిజిస్ట్రేషన్ విధివిధానాలు, డేటాబేస్ నిర్వహణ, సాంకేతిక అంశాలను తమకు సమర్పించాలని టీఎస్ఎంసీకి శుక్రవారం నోటీసులు జారీ చేశారు. వివరాలన్నీ అందితేనే సాంకేతికంగా దర్యాప్తు చేయడానికి, కేసులో ముందుకు వెళ్లడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 2016లో కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకొని నంబర్ పొందిన ముగ్గురు ఎంబీబీఎస్ డాక్టర్ల రికార్డులను కొందరు ‘ఇంటిదొంగలు’ ట్యాంపర్ చేసి వేరే వ్యక్తుల పేర్లతో డేటాబేస్‌లో నమోదు చేసినట్లు వెలుగులోకి రావడం తెలిసిందే. డాక్టర్ నాగమణి అర్హతల విషయంలో తొలుత గందరగోళం ఏర్పడటంతో ఆమె వివరాలు ట్యాంపర్ అయినట్లు తొలుత భావించిన కౌన్సిల్... పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆ అంశాన్నీ చేర్చింది. అయితే నాగమణి దరఖాస్తులో పొరపాటు రావడం వల్లే అలా జరిగిందని, ఆమె అంశంలో ఎలాంటి ట్యాంపరింగ్ లేదని శుక్రవారం స్పష్టమైంది. -
నిఖిల్ రెడ్డి కేసు..డాక్టర్‌పై రెండేళ్ల నిషేధం
హైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిఖిల్ రెడ్డి ఎత్తు పెరగడం కోసం శస్త్ర చికిత్స చేసిన గ్లోబల్ ఆసుపత్రికి చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ చంద్రభూషణ్‌పై తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్(టీఎస్ఎంసీ) రెండేళ్ల పాటు నిషేధం విధించింది. తల్లిదండ్రుల అనుమతి లేకుండా..నిబంధనలకు విరుద్ధంగా ఆపరేషన్ చేశాడని, నిఖిల్ తండ్రి గోవర్ధన్ రెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో వాదనలు విన్న హైకోర్టు, డాక్టర్ చంద్రభూషన్ నిర్లక్ష్యం ఉందని భావించి ఆయనపై చర్యలు తీసుకోవాలని టీఎస్ఎంసీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో టీఎస్ఎంసీ ఆయనపై రెండు సంవత్సరాల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే మరో కేసుకు సంబంధించి కేపీహెచ్‌బీలోని శృతి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌కు చెందిన డాక్టర్ నమ్రతపై కూడా టీఎస్ఎంసీ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. సరోగసీ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆమెపై ఈ చర్యలు తీసుకున్నట్లుగా తెలిసింది. -
ఆందోళనల నడుమ మెడికల్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్/విజయవాడ/వరంగల్: విద్యార్థి సంఘాల ఆందోళనల నడుమ తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సెలింగ్ బుధవారం ప్రారంభమైంది. పెంచిన మెడికల్ ఫీజులను తగ్గించాలని, 39, 41 జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు హైదరాబాద్‌లోని జేఎన్టీయూ, ఉస్మానియా వర్సిటీలోని కౌన్సెలింగ్ కేంద్రాల వద్ద ఆందోళనకు దిగారు. కౌన్సెలింగ్‌ను అడ్డుకుని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరే కంగా నినాదాలు చేశారు. సుమారు అరగంట పాటు కౌన్సెలింగ్‌కు వచ్చిన విద్యార్థులను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఒక దశలో నాయకులు గోడెక్కి కౌన్సెలింగ్ కేంద్రంలోకి దూకారు. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఫలితంగా జేఎన్టీయూహెచ్లో 45 నిమిషాలు, ఉస్మానియాలో రెండు గంటలపాటు కౌన్సెలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఓయూలో 12, 28 ర్యాంకు విద్యార్థులకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేష్ కుమార్ ఎంబీబీఎస్ అడ్మిషన్ కార్డులు అందజేశారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ, తెలంగాణ డీఎంఈ ఎం.రమణి జేఎన్టీయూహెచ్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. విద్యార్థి సంఘాల ఆందోళనలపై వీసీ స్పందిస్తూ.. ప్రస్తుతం జరుగుతున్న కౌన్సెలింగ్ కేవలం ప్రభుత్వ కళాశాలల్లో, ‘ఏ’ కేటగిరీ సీట్ల కోసమేనని చెప్పారు. గతేడాది మాదిరిగానే ఈసారి ఫీజులు ఉన్నాయని పేర్కొన్నారు. మేనేజ్మెంట్ కోటా విషయంలో ప్రైవేటు కాలేజీల్లో సీట్ల కేటాయింపు కోసం జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షను నిర్వహించి, కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం తెలంగాణలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని డీఎంఈ తెలిపారు. కాగా, వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో, విజయవాడలో కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. విజయవాడ కేంద్రంలో 118 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తొలి సీటును ఆరో ర్యాంకర్ పి.తేజేశ్వరరావు ఉస్మానియా మెడికల్ కళాశాలలో సీటు తీసుకున్నారు. గురువారం జరిగే కౌన్సెలింగ్‌కు 1001 నుంచి 3వేల ర్యాంకుల వరకు ఓపెన్ కేటగిరీ సీట్లకు అభ్యర్థులను ఆహ్వానించారు. జేఎన్టీయూహెచ్లో 256, ఉస్మానియా వర్సిటీలో 184, కేయూలో 55, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 118 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కాగా.. తొలి రోజు 498 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ అయినట్లు హెల్త్ యూనివర్సిటీ క్యాంపు ఆఫీసర్ డాక్టర్ టి.మురళీమోహన్ తెలిపారు.