ఆందోళనల నడుమ మెడికల్ కౌన్సెలింగ్ | Concerns Between Medical counseling | Sakshi
Sakshi News home page

ఆందోళనల నడుమ మెడికల్ కౌన్సెలింగ్

Published Thu, Jul 30 2015 2:28 AM | Last Updated on Sun, Sep 3 2017 6:24 AM

ఆందోళనల నడుమ మెడికల్ కౌన్సెలింగ్

ఆందోళనల నడుమ మెడికల్ కౌన్సెలింగ్

సాక్షి, హైదరాబాద్/విజయవాడ/వరంగల్: విద్యార్థి సంఘాల ఆందోళనల నడుమ తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సెలింగ్ బుధవారం ప్రారంభమైంది. పెంచిన మెడికల్ ఫీజులను తగ్గించాలని, 39, 41 జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాల నాయకులు హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ, ఉస్మానియా వర్సిటీలోని కౌన్సెలింగ్ కేంద్రాల వద్ద ఆందోళనకు దిగారు. కౌన్సెలింగ్‌ను అడ్డుకుని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరే కంగా నినాదాలు చేశారు. సుమారు అరగంట పాటు కౌన్సెలింగ్‌కు వచ్చిన విద్యార్థులను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు.

ఒక దశలో నాయకులు గోడెక్కి కౌన్సెలింగ్ కేంద్రంలోకి దూకారు. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఫలితంగా జేఎన్‌టీయూహెచ్‌లో 45 నిమిషాలు, ఉస్మానియాలో రెండు గంటలపాటు కౌన్సెలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఓయూలో 12, 28 ర్యాంకు విద్యార్థులకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేష్ కుమార్ ఎంబీబీఎస్ అడ్మిషన్ కార్డులు అందజేశారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ, తెలంగాణ డీఎంఈ ఎం.రమణి జేఎన్‌టీయూహెచ్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని సందర్శించారు.

విద్యార్థి సంఘాల ఆందోళనలపై వీసీ స్పందిస్తూ.. ప్రస్తుతం జరుగుతున్న కౌన్సెలింగ్ కేవలం ప్రభుత్వ కళాశాలల్లో, ‘ఏ’ కేటగిరీ సీట్ల కోసమేనని చెప్పారు. గతేడాది మాదిరిగానే ఈసారి ఫీజులు ఉన్నాయని పేర్కొన్నారు. మేనేజ్‌మెంట్ కోటా విషయంలో ప్రైవేటు కాలేజీల్లో సీట్ల కేటాయింపు కోసం జేఎన్‌టీయూహెచ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షను నిర్వహించి, కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం తెలంగాణలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని డీఎంఈ తెలిపారు.

కాగా, వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో, విజయవాడలో కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. విజయవాడ  కేంద్రంలో 118 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తొలి సీటును ఆరో ర్యాంకర్ పి.తేజేశ్వరరావు ఉస్మానియా మెడికల్ కళాశాలలో సీటు తీసుకున్నారు. గురువారం జరిగే కౌన్సెలింగ్‌కు 1001 నుంచి 3వేల ర్యాంకుల వరకు ఓపెన్ కేటగిరీ సీట్లకు అభ్యర్థులను ఆహ్వానించారు.

జేఎన్‌టీయూహెచ్‌లో 256, ఉస్మానియా వర్సిటీలో 184, కేయూలో 55, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 118 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కాగా.. తొలి రోజు 498 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ అయినట్లు హెల్త్ యూనివర్సిటీ క్యాంపు ఆఫీసర్ డాక్టర్ టి.మురళీమోహన్ తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement