Secondary Grade Teacher (SGT)
-
బీఎడ్.. గో ఎహెడ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం సహా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రాథమిక పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు కూడా బీఎడ్ అభ్యర్థులకు అర్హత కల్పించింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా టెట్ నిబంధనలను ఇటీవలే సవరించింది. బీఎడ్ అభ్యర్థులు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించాలంటే ప్రైమరీ స్కూల్ టీచర్‌గా ఎంపికైన రెండేళ్లలోగా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌పై 6 నెలల బ్రిడ్జి కోర్సు చేయాలన్న షరతు విధించింది. దీంతో 2011లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను అమల్లోకి తెచ్చినప్పుడు విధించిన నిబంధన కారణంగా ప్రాథమిక పాఠశాలల్లోని టీచర్ పోస్టులకు దూరమైన బీఎడ్ అభ్యర్థులు ఇకపై ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వీలు ఏర్పడింది. సీ–టెట్ నుంచే అమలు.. డిగ్రీతోపాటు బీఎడ్ చేసిన అభ్యర్థులను ప్రైమరీ టీచర్ పోస్టులకు అర్హులను చేస్తూ మార్పు చేసిన విధానాన్ని జూలై 7న నిర్వహించనున్న సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నుంచే అమలుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. అందుకు అనుగుణంగా మార్పులతో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఇటీవల సీ–టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్సీటీఈ షరతుకు లోబడి డిగ్రీతోపాటు బీఎడ్ చేసిన వారు ప్రైమరీ టీచర్ పోస్టులకు, 6, 7, 8 తరగతులకు బోధించే ఎలిమెంటరీ టీచర్ (స్కూల్ అసిస్టెంట్) పోస్టులకు అర్హులుగా పరిగణనలోకి తీసుకునేలా సీ–టెట్ నిబంధనలను పొందుపరిచింది. దీని ప్రకారం ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ప్రైమరీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియెట్‌తోపాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) చేసిన వారు, డీఎడ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు, నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్ఈడీ) చివరి సంవత్సరం, డీఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) చివరి సంవత్సరం చదువుతున్న వారంతా అర్హులే. వారితోపాటు తాజాగా డిగ్రీలో 50 శాతం మార్కులు సాధించి బీఎడ్ పూర్తి చేసిన వారు కూడా అర్హులేనని నోటిఫికేషన్లో ఎన్సీటీఈ వెల్లడించింది. దీంతో బీఎడ్ అభ్యర్థులు కూడా టెట్ పేపర్–1 పరీక్ష రాసేందుకు అర్హులయ్యారు. మరోవైపు 6వ తరగతి నుంచి 8వ తరగతికి బోధించే టీచర్ పోస్టులకు డిగ్రీతోపాటు బీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు, డిగ్రీతో డీఎడ్ పూర్తయిన వారు, ఇంటర్మీడియెట్‌తో నాలుగేళ్ల బీఈఎల్ఈడీ పూర్తి చేసిన వారు లేదా ఫైనల్ ఇయర్ వారు, ఇంటర్మీడియెట్‌తో ఇంటిగ్రీటెడ్ బీఎడ్ (బీఏబీఈడీ, బీఎస్సీ బీఈడీ) పూర్తి చేసిన వారంతా అర్హులేనని పేర్కొంది. అలాగే డీఎడ్ చేసిన వారికి డిగ్రీ ఉంటే వారు కూడా 6, 7, 8 తరగతుల బోధనకు అర్హులుగా పరిగణనలోకి తీసుకుంది. దీంతో వారు కూడా టెట్ పేపర్–2 పరీక్ష రాయవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డిగ్రీతో డీఎడ్ చేసిన వారిని టెట్ పేపర్–2కు పరిగణనలోకి తీసుకోవట్లేదు. అయితే తమను పేపర్–2కు పరిగణనలోకి తీసుకోవాలని డిగ్రీతో డీఎడ్ చేసిన అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సీ–టెట్ దరఖాస్తుల స్వీకరణను సీబీఎస్ఈ ప్రారంభించింది. వచ్చే నెల 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తుల సబ్మిషన్కు, 8వ తేదీ వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించింది. 2010కి ముందు అర్హత ఉన్నా.. ఎన్సీటీఈ 2010లో టెట్ నిబంధనలను జారీ చేయకముందు ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులను కూడా అర్హులుగానే పరిగణన లోకి తీసుకునేవారు. అయితే బీఎడ్ అభ్యర్థులకు చైల్డ్ సైకాలజీ, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన సబ్జెక్టు లేనందున వారిని పరిగణనలోకి తీసుకోవద్దని డీఎడ్ అభ్యర్థులు అంతకు ముందే కోర్టులో కేసు వేశారు. ఆ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. సుప్రీంకోర్టు డీఎడ్ అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో బీఎడ్ అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులకు అనర్హులుగా ఎన్సీటీఈ ప్రకటించింది. ఆ తరువాత టెట్ రావడంతో అందులో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు బీఎడ్ అభ్యర్థులు అర్హులు కాదన్న నిబంధన విధించింది. కేవలం 6, 7, 8 తరగతులకు బోధించేందుకే బీఎడ్ వారు అర్హులని పేర్కొంది. దీంతో బీఎడ్ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. పైగా రాష్ట్రంలో ప్రస్తుతం బీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు 5 లక్షల మందికిపైగా ఉంటే డీఎడ్ పూర్తి చేసిన వారు లక్షన్నర మంది వరకు ఉన్నారు. ఈ నేపథ్యంలో వారు అనేకసార్లు కేంద్రం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో కేంద్రం వారికి అర్హత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. -
పోస్టులు దాచుకున్నారు
సాక్షి, హైదరాబాద్ : సెకండరీ గ్రేడ్ టీచర్ల ఖాళీల ప్రదర్శనపై విద్యా శాఖలో దుమారం రేగుతోంది. తాజా బదిలీల ప్రక్రియలో పూర్తిస్థాయి ఖాళీలను చూపడం లేదంటూ టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీచర్ల బదిలీ ప్రక్రియలో ప్రస్తుతం ఎస్జీటీల వెబ్ కౌన్సెలింగ్ సాగుతోంది. బదిలీ కోసం దరఖాస్తు చేసుకుని కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్న ఎస్జీటీలు ఖాళీలను çసరిచూసుకుని అవాక్కవుతున్నారు. విద్యాశాఖ తొలుత ప్రకటించిన ప్రాథమిక ఖాళీల జాబితాతో పోల్చితే ప్రస్తుత ఖాళీల సంఖ్య భారీగా తగ్గింది. ముఖ్యంగా పట్టణ ప్రాంత పాఠశాలల్లో ఖాళీలు కనిపించడమే లేదు. బదిలీల ప్రక్రియ ఈ నెల 30తో ముగియనుంది. తర్వాత సాధారణ బదిలీలపై నిషేధం వస్తే దొడ్డిదారి బదిలీలకు మార్గం సులువవుతుందనే భావనతోనే కొందరు ప్రభుత్వ పెద్దలు కీలక ఖాళీలను దాచిపెట్టేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని, అందులో భాగంగానే పట్టణ ప్రాంత పోస్టులను చూపడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంగ్లిష్ మీడియం సాకుతో ప్రాథమిక జాబితాలో ఉన్న ఖాళీలను దాయడంపై విద్యా శాఖ అధికారులు వింత వాదన విన్పిస్తున్నారు. స్థానిక పరిస్థితులు, క్షేత్రస్థాయిలో పిల్లల తల్లిదండ్రుల డిమాండ్‌తో పలు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం తరగతులు నిర్వహిస్తున్నారు. అందుకు విద్యాశాఖ అనుమతిచ్చినా, అక్కడ పోస్టులపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కానీ వాటిని ఇంగ్లిష్ మీడియం వారికి కేటాయిస్తున్నట్లు ఇప్పుడు అధికారులు చెబుతున్నారు. ‘‘త్వరలో టీఆర్టీ నియామకాలు చేపట్టనుండటంతో వాటిని ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులకు కేటాయించనున్నాం. అందుకే వాటిని ప్రస్తుత ఖాళీల జాబితా నుంచి తొలగించాం’’అంటున్నారు. పోస్టులపై నిర్ణయం తీసుకోకుండానే ఇలా ఖాళీలను దాచిపెట్టడంపై ఉపాధ్యాయ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో మోడల్ స్కూల్ నియామకాలప్పుడు ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులకే అవకాశం కల్పిస్తామన్న నిర్ణయంపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అందరికీ అవకాశం కల్పించాలని, అవసరమైతే ఇంగ్లిష్ మీడియం బోధించేలా శిక్షణ ఇవ్వాలని కోర్టు సూచించింది. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకూ ఈ నిబంధనలే వర్తిస్తాయని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. సాధారణ బదిలీలకు ప్రత్యేక కోటాలో ముందు వందల సంఖ్యలో టీచర్లకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఏకంగా 80 మంది టీచర్లు రంగారెడ్డి జిల్లాలోని గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి బదిలీపై వచ్చారు. మరికొన్ని పెండింగ్‌లో ఉండగానే బదిలీల షెడ్యూల్ వచ్చేసింది. రంగారెడ్డి జిల్లాలో ప్రాథమిక ఖాళీల జాబితాలో 1,739 ఖాళీలు (క్లియర్ వేకెన్సీలు) చూపగా... ఇప్పుడు 1,501కు తగ్గించారు! మహబూబ్‌నగర్ జిల్లాలోనూ తుది జాబితాలో 52 పోస్టులను దాచేశారు. వరంగల్ జిల్లాలోనూ గ్రేటర్ వరంగల్ పరిధిలో 36 పోస్టులను గోప్యంగా ఉంచారు. నల్లగొండ జిల్లాలో 23 పోస్టులు, మెదక్‌లో 50 పోస్టులు దాచిపెట్టారు. ఖాళీలన్నీ ప్రదర్శించాలి : ఉపాధ్యాయ జేఏసీ డిమాండ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఖాళీలన్నింటినీ వెబ్ కౌన్సెలింగ్‌లో ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉపాధ్యాయ ఐక్య కార్యా చరణ సమితి (జేఏసీ)పాఠశాల విద్యాశాఖ సంచాలకుడి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. జాక్టో ప్రతినిధి జి.సదానంద్ గౌడ్ మాట్లాడుతూ సెకండరీ గ్రేడ్ టీచర్ ఖాళీల్లో పావువంతు దాచిపెట్టడంతో దీర్ఘకాలం ఒకేచోట పనిచేసిన టీచర్లకు తీవ్ర నష్టం కలుగు తుందన్నారు. కొన్నిచోట్ల ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో ఖాళీలను చూపడం లేదని, 30 శాతం హెచ్ఆర్ఏ ఉన్న పట్టణ ప్రాంతా ల్లోని ఖాళీలు సైతం ప్రదర్శించడం లేదని పేర్కొన్నారు. విద్యాశాఖ నివారణ చర్యలు చేపట్టకుంటే వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొన బోమని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. -
ఎస్జీటీ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుల రాత పరీక్షల ఫలితాలను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. 8 మీడియాలకు సంబంధించిన 82,537 మంది అభ్యర్థుల ర్యాంకులను ప్రకటిం చింది. వాటిని తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. హాల్‌టికెట్ నంబర్, బుక్లెట్ సిరీస్ వంటి వాటికి సంబంధించి తప్పుడు బబ్లింగ్ చేసిన వారిని రిజెక్ట్ చేశామని, మెరిట్ జాబితాలో చేర్చలేదని పేర్కొంది. కోర్టును ఆశ్రయించి, జాబితాలో చేర్చాలని కోర్టు ఇచ్చిన వారి పేర్లను మాత్రమే చేర్చామని వెల్లడించింది. కోర్టు తుది తీర్పునకు లోబడి వారి ర్యాంకింగ్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది. రెండు, మూడు రోజుల తర్వాత జిల్లాల వారీగా ఆయా కేటగిరీల్లో పోస్టులకు 1:3 రేషియోలో అభ్యర్థుల మెరిట్ జాబితాలను ప్రకటించేందుకు టీఎస్పీఎస్సీ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం టీచర్ల బదిలీల ప్రక్రియ కొనసాగుతున్నందున జిల్లాల్లో వెరిఫికేషన్ చేపట్టే పరిస్థితి లేదని విద్యాశాఖ ఇప్పటికే తెలిపింది. వెరిఫికేషన్‌కు 1:3 రేషియోలో అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి ఉంచాలని, వారు ఎప్పుడు అడిగితే అప్పుడు జిల్లా కలెక్టర్లకు పంపించేలా టీఎస్పీఎస్సీ సిద్ధం చేస్తోంది. అభ్యర్థుల వివరాలిలా.. మీడియం అభ్యర్థులు తెలుగు 52,452 ఇంగ్లిష్ 27,924 ఉర్దూ 2,033 కన్నడ 54 మరాఠీ 44 హిందీ 28 బెంగాళీ 1 తమిళ్ 1 -
జంబో డీఎస్సీ లేనట్లే..!
పరిమితంగానే ఖాళీల భర్తీ 8 వేల పోస్టులకే నోటిఫికేషన్? 5 వేల స్కూల్ అసిస్టెంట్, 3 వేల ఎస్జీటీ పోస్టుల భర్తీకే చాన్స్ హైదరాబాద్: రాష్ట్రంలో డీఎస్సీ ద్వారా భారీగా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తారని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న 3.5 లక్షల మంది నిరుద్యోగులకు నిరాశ తప్పేలా లేదు. వచ్చే డీఎస్సీలో మొత్తంగా 5 వేల వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, మరో 3 వేల వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులను మాత్రమే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల చేపట్టిన హేతుబద్ధీకరణలో (రేషనలైజేషన్) విద్యాశాఖ ఈ లెక్కలు తేల్చింది. నివాస ప్రాంతాల్లోని కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలల విలీనాన్ని ప్రస్తుతం చేపట్టలేదు. అది కూడా చేపడితే ఇక భవిష్యత్తులో ఉపాధ్యాయ పోస్టుల అవసరం పెద్దగా ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం నాలుగు జిల్లాలు మినహా మిగతా ఆరు జిల్లాల్లో ఎస్జీటీ పోస్టులే వచ్చే పరిస్థితి లేదు. ఆరు జిల్లాల్లో ఇప్పటికే ఎస్జీటీ పోస్టులు మిగులుగానే ఉన్నాయి. ఫలితంగా ఎస్జీటీ పోస్టులు భారీగా వస్తాయని ఎదురుచూస్తున్న డీఎడ్ పూర్తి చేసిన నిరుద్యోగులు తీవ్ర నిరాశకు లోనయ్యే పరిస్థితి నెలకొంది. ఇక స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా పరిమితంగానే వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో దాదాపు 17 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గతంలో విద్యాశాఖ లెక్కలు తేల్చినా వాటిల్లో చాలా పోస్టులు అవసరానికి మించి ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో త్వరలో డీఎస్సీ వస్తుందని, కనీసం 12 వేల వరకు పోస్టులను భర్తీ చేస్తారన్న ఆశతో ఇప్పటికే కోచింగ్‌లలో చేరిన నిరుద్యోగులకు నిరాశ తప్పేలా లేదు. ఒక్కో జిల్లాలో మిగులు పోస్టులు పోగా ఖాళీగా ఉండే ఎస్జీటీ పోస్టులు నోటిఫికేషన్ నాటికి రెండంకెలకు మించి ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలవారీగా ఖాళీలు ఇవీ... హేతుబద్ధీకరణ తరువాత ఆదిలాబాద్ జిల్లాలో 551 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉండగా మెదక్ జిల్లాలో 458 పోస్టులు, మహబూబ్‌నగర్ జిల్లాలో 931 పోస్టులు, రంగారెడ్డి జిల్లాలో 1,894 వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా దాదాపు 4 వేల వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇందులో ఎస్జీటీ పోస్టులకు 75 శాతం ఖాళీ ఉండగా, 25 శాతం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు మిగతా ఆరు జిల్లాల్లో ప్రస్తుతం సర్దుబాటు చేయగా ఎక్కువ మొత్తంలో ఎస్జీటీ పోస్టులు, కొన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అవసరానికి మించి ఉన్నట్లు లెక్కలు తేల్చారు. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో 623, నల్లగొండ జిల్లాలో 848, హైదరాబాద్‌లో 909, ఖమ్మంలో 450, వరంగల్‌లో 440, కరీంనగర్ జిల్లాలో 826 పోస్టులు అవసరానికి మించి ఉన్నట్లు సమాచారం. ఈ జిల్లాల్లో నోటిఫికేషన్ ఇచ్చే నాటికి ఎస్జీటీ పోస్టుల అవసరం రెండంకెలకు మించి ఉండకపోవచ్చని, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా ఉండొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. -
అమ్మతనం..
చంటి బిడ్డను ఒడిలో పెట్టుకుని పరీక్ష రాస్తున్న ఈమె పేరు ఇస్లావతుల రాణి. కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం చుండ్రుపట్ల గ్రామానికి చెందిన రాణి ఏలూరులోని ఎస్‌పీడీబీటీ కాలేజీలో శనివారం సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష రాయడానికి వచ్చింది. ఆమె భర్త కూడా డీఎస్సీ పరీక్ష రాస్తుండటంతో బిడ్డను చూసే వారు లేక తనతో పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చింది. మరోవైపు టీచర్ నియామకాలకు (డీఎస్సీ-2014) సంబంధించి శనివారం నిర్వహించిన పరీక్షకు 88.66 శాత ం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఎస్జీటీ ప్రశ్నపత్రంలో చైల్డ్ సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు అభ్యర్థులను బాగా తికమకపెట్టాయి. - నేడు మదర్స్ డే -
'ఎస్జీటీ పోస్టుల అర్హతపై కేంద్రానికి లేఖ రాస్తాం'
-మానవవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కర్నూలు : సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులకు బీఈడీ చేసిన అభ్యర్థులను అర్హులుగా గుర్తించాలని కోరుతూ ఈ నెలాఖరులోపు కేంద్రానికి లేఖ రాయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం కర్నూలుకు వచ్చిన మంత్రిని బీఈడీ అభ్యర్థులు కలసి తమకు ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పించాలని కోరారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ లో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అర్హులుగా గుర్తించిన విషయాన్ని వారు మంత్రి దృష్టికి తీసుకురాగా.. అందుకు ఆయన స్పందించి ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తాను చర్చించానని, కేంద్రానికి లేఖ రాయమని సలహా ఇచ్చినట్లు చెప్పారు. ఈ నెలాఖరులో తానే ఢిల్లీకి వెళ్లి మానవ వనరుల శాఖాధికారులను కలసి పశ్చిమ బెంగాల్‌కు అనుమతి ఇచ్చిన విధంగానే ఏపీకి ఇవ్వాలని కోరతానన్నారు. ఒకవేళ కేంద్రం ఏస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అర్హులుగా గుర్తిస్తే ప్రస్తుతం ప్రకటించిన డీఎస్సీలోనే అమలు చేయాలని బీఈడీ అభ్యర్థులు కోరగా దానిపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మే 9,10,11 తేదీల్లో డీఎస్సీ-2015 పరీక్షలు జరిపేందుకు నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటికే ఆ పరీక్షలకు సంబంధించిన హాల్‌టిక్కెట్లు కూడా అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకున్నారని, పరీక్షలను వాయిదా వేయకపోవచ్చునని మంత్రి సూచన ప్రాయంగా తెలిపారు. రాష్ట్ర విద్యార్థినులకు ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, సైకిళ్లు ఇచ్చే యోచనలో ఉన్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. -
నకిలీ గురువులు
ప్రొద్దుటూరు టౌన్: విద్యాబుద్ధులు నేర్పి పిల్లలను సమాజానికి ఉపయోగ పడేవిధంగా తీర్చి దిద్దాల్సిన గురువులే తప్పు చేస్తే...పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పాఠశాలల్లో సెకండరీగ్రేడ్ టీచర్లుగా పని చేస్తున్న నలుగురు ఏకంగా కుల సర్టిఫికెట్లు నకిలీవి పెట్టి ఉద్యోగాలు పొందారన్న సమాచారం బయటకు పొక్కడంతో తీవ్ర చర్చ జరుగుతోంది. వీరిలో ఒకరికి ప్రమోషన్ కూడా వచ్చిందంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నకిలీ కుల సర్టిఫికెట్ల దందా కొనసాగుతున్నా అధికారులకు తెలియకపోవడం ఏమిటన్న విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. నాలుగు పాఠశాలల్లో పని చేస్తున్న ఎస్జీటీలపై ఇటీవలే మున్సిపల్ అధికారులకు తెలియడంతో షాక్‌కు గురైనట్లు సమాచారం. చెంచులుగా...కమ్మరట్రైబల్‌గా... కొందరు ఉపాధ్యాయులు చెంచులుగా, మరి కొందరు కమ్మర ట్రైబల్‌గా ఉద్యోగాలు పొందారు. ఈ తతంగం ఏళ్ల తరబడి గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది. రూ.35వేల నుంచి రూ.45 వేలు జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయుల కుల సర్టిఫికెట్లపై విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరిలో 1992, 1994, 2000 సంవత్సరాల బ్యాచ్‌లకు చెందిన వారు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరిలో కొందరు చెంచులుగా, మరి కొందరు కమ్మర ట్రైబుల్‌గా కుల సర్టిఫికెట్లను పొందు పరిచినట్లు తెలిసింది. కడప జిల్లాలో చెంచులు ఉన్నారా...? అయితే రెవెన్యూ రికార్డుల ప్రకారం కడప జిల్లాలో చెంచులు ఎక్కడా లేరన్న విషయాన్ని రెవెన్యూ అధికారులు రూఢీ చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో చెంచులు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే వీరికి చెంచులుగా గుర్తించి కుల సర్టిఫికెట్లను ఏ రెవెన్యూ అధికారి ఇచ్చారన్న విషయంపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. నకిలీ సర్టిఫికెట్లపై ఉన్నత స్థాయిలో విచారణ జరగాలి... నకిలీ సర్టిఫికెట్ల ఉదంతంపై ఉన్నత స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సర్టిఫికెట్లు రెవెన్యూ అధికారులే జారీ చేశారా, లేక వాటిని కూడా నకిలీవి సృష్టించారా అన్న విషయం తేలాల్సి ఉంది. ఉద్యోగం కోసం జరిగిన ఇంటర్వ్యూలలో అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారన్న విషయంపై కూడా విచారణ జరగాలి. ఒక్క ప్రొద్దుటూరులోనేనా లేక మరే ప్రాంతంలోనైనా ఈ విధంగా ఉద్యోగాలను ఏఏ శాఖల్లో పొందారన్న విషయంపై కూడా విచారణ జరిగితే ఎంత మంది ఈ దందాలో పాలుపంచుకున్నారో తేలుతుంది. మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన విషయంపై మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్‌ను వివరణ కోరగా, తమ దృష్టికి రాలేదన్నారు. ఏ పాఠశాలలో ఇలాంటి వారు ఉన్నారో సమాచారం ఇస్తే వారికి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. -
వేతన వ్యత్యాసంపై టీచర్ల ఆందోళన
హైదరాబాద్:స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీ) వేతనాల్లో భారీ వ్యత్యాసం ఉండడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలోని దాదాపు 80 వేలమంది ఎస్జీటీల వేతన వ్యత్యాసం భారీగా ఉంది. స్కూల్ అసిస్టెంట్లతో పోల్చితే ప్రతి పీఆర్సీకి పెద్ద మొత్తంలో అంతరం ఏర్పడుతోందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి.ఒకే రకమైన పని చేస్తున్న టీచర్ల వేతనాల్లో భారీ వ్యత్యాసం పెరుగుతుండటాన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. పదో పీఆర్సీలోనైనా ఈ వేతన వ్యత్యాసాలను తొలగించాలని పీఆర్టీయూ-తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం పీఆర్సీ హైపవర్ కమిటీ చైర్మన్ ప్రదీప్‌చంద్రను కలసి వేతన వ్యత్యాసాలను తగ్గించాలని డిమాండ్ చేశారు. -
బీఈడీలకునిరాశే
ఒంగోలు వన్‌టౌన్: సెకండరీ గ్రేడ్ పోస్టుల భర్తీ విషయంలో బీఈడీ అభ్యర్థులకు కూడా అవకాశం కల్పిస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తరువాత వారికి మొండిచేయి చూపారు. దీంతో జిల్లాలో 10వేల మందికి పైగా బీఈడీ అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు డీఈడీ/టి.టి.సి. విద్యార్హతలున్న వారిని అర్హులుగా గతంలోనే సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన గత రెండు డీఎస్సీలో సెకండరీ గ్రేడు పోస్టులను కేవలం డి.ఇ.డి. అభ్యర్థులకే కేటాయించారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు బీఈడీ అభ్యర్థులకు కూడా సెకండరీ గ్రేడు పోస్టులకు అర్హులుగా ప్రకటిస్తామని ఎస్.జి.టి.పోస్టుల్లో బీఈడీలను నియమిస్తామని వాగ్ధానం చేశారు. బీఈడీలకు ఎస్.జి.టి. పోస్టులకు అనుమతించాలని కోరుతూ ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ’(ఎన్‌సిటిఇ)కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అయితే ఎస్జిటి పోస్టులకు డీఈడీలను మాత్రమే అనుమతించాలని బీఈడీలను అనుమతించరాదని కేంద్రం నుంచి రాష్ట్రానికి స్పష్టమైన ఆదేశాలందాయి. దీంతో ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో సెకండరీ గ్రేడు పోస్టులకు డీఈడీ అభ్యర్థులు మాత్రమే అర్హులుగా ప్రకటించింది. దీంతో అర్హత లభిస్తుందని గంపెడాశతో ఎదురుచూసిన బీఈడీలకు తీవ్ర నిరాశే మిగిలింది. 839 పోస్టులు మాత్రమే భర్తీ జిల్లాలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి ఎట్టకేలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించి గత మూడు నెలలుగా రకరకాల ప్రకటనలతో నిరుద్యోగ టీచర్లను అయోమయానికి గురిచేసిన ప్రభుత్వం ఎట్టకేలకు స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భర్తీ సంఖ్యను గణనీయంగా తగ్గించింది. జిల్లాలో కేవలం 839 టీచర్ పోస్టులను మాత్రమే డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. డీఎస్సీతోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రెండింటినీ కలిసి ఒకే పరీక్షగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతంలోనే టెట్ పరీక్ష రాసి అర్హత సాధించిన నిరుద్యోగ ఉపాధ్యాయులు తాజా నోటిఫికేషన్లో ఉపాధ్యాయ పోస్టుల పరీక్షతోపాటు టెట్ పరీక్ష కూడా మళ్ళీ రాయాల్సి ఉంది. అయితే ఈ ఏడాదే డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంలోనే కాలహరణం చేసింది. దీంతో 2014-15 విద్యాసంవత్సరంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ లేనట్లే. తాజాగా జారీ చేయనున్న నోటిఫికేషన్లో ఎంపికయ్యే ఉపాధ్యాయులకు 2015-16 విద్యాసంవత్సరంలోనే నియామకపు ఉత్తర్వులు ఇవ్వనున్నారు. అర్హత మార్కులివే... ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి నిర్వహించే డీఎస్సీ, టెట్ ఉమ్మడి రాతపరీక్షలో సెకండరీ గ్రేడ్ పోస్టులకు ఎస్జిటి, పీఈటీ పోస్టులకు 180 మార్కులకు, స్కూలు అసిస్టెంట్ పోస్టులకు 200 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఉద్యోగ నియమకాలకు ఓసీ అభ్యర్థులకు కనీసం 60 శాతానిపైగా, బీసీలకు 50 శాతంపైగా, ఎస్సీ, ఎస్టీలకు 40 శాతంపైగా మార్కులు సాధించిన వారిని అర్హులుగా పరిగణిస్తారు. మెరిట్ కమ్ రోస్టర్ విధానం ప్రకారం అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. వీరికి మాత్రమే ఉద్యోగాల అర్హులుగా పరిగణించి ఎలిజిబులిటీ సర్టిఫికేట్లు జారీ చేస్తారు. జిల్లాలో 839 పోస్టులు తాజాగా ప్రకటించే డీఎస్సీ నోటిఫికేషన్లో జిల్లాలో మొత్తం 839 పోస్టులను ప్రకటించనున్నారు. -
ఆశలన్నీ డీఎస్సీపైనే!
ఏలూరు సిటీ: డీఎస్సీ నోటిఫికేషన్ ఆలస్యమవున్న కొద్దీ.. అదే ఆశ.. శ్వాసగా శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు తీవ్ర మానసిక సంఘర్షణకు గురవుతున్నారు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం నాడే డీఎస్సీ ప్రకటిస్తానని చెప్పిన విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆనక పలు కారణాలు చెబుతూ దాటవేస్తున్నారు. చివరకు సెకండరీ గ్రేడ్ పోస్టుల్లో బీఎడ్ అభ్యర్థులకు అవకాశం కల్పించేందుకే ఈ ఆలస్యమంటూ చెబుతూ.. సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. బీఈడీలకు మొండి చెయ్యేనా? జిల్లాలో బీఈడీ అభ్యర్థులు 30 వేలకు పైగా ఉన్నారు. పోస్టుల సంఖ్య మాత్రం తక్కువగా ఉంది. జిల్లాలో డీఎస్సీలో 605 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందుల్లో 400 పోస్టులకు పైగా సెకండరీ గ్రేడ్ పోస్టులే ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో పోస్టులకు బీఎడ్ అభ్యర్థులు భారీ సంఖ్యలో ఉంటే డీఎడ్ అభ్యర్థులు తక్కువగానే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బీఎడ్ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టుల్లోనూ అవకాశం ఇవ్వకుంటే ఇబ్బందులు పడతామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ ప్రభుత్వం ఎస్జీటీ పోస్టుల్లో బీఎడ్‌లకూ అవకాశం ఇస్తామని మభ్యపెడుతూ వస్తోంది. కానీ కేంద్ర సర్కారు అనుమతి ఇవ్వకుంటే పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కేంద్రం ఒప్పుకొంటుందా? విద్యాహక్కు చట్టం మేరకు ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల భర్తీకి డీఎడ్ అభ్యర్థులనే భర్తీ చేయాలనే నిబంధన బీఎడ్ అభ్యర్థులకు శాపంలా మారింది. అసలు ఎస్జీటీ పోస్టుల్లో వీరికి అవకాశం ఇవ్వడమనేది కేంద్రం పరిధిలో ఉంది. పైగా జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాల్లో ఇదే సమస్య ఉంది. విద్యారంగంలోని మార్పుల్లో భాగంగానే ఎస్జీటీ పోస్టుల్లో డీఎడ్ అభ్యర్థులు, ఎస్ఏ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులు ఉండాలనే నిబంధన విధించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర సర్కారు చెబుతున్న విధంగా కేంద్రం అంగీకారం తెలుపుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. బీఈడీలకు అవకాశం దక్కేనా? విద్యాహక్కు చట్టం, ఎస్సీఈఆర్టీ ప్రతిపాదనల మేరకు ప్రాథమిక పాఠశాలల్లో భర్తీ చేసే పోస్టుల్లో డీఎడ్ అభ్యర్థులకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇప్పటికే పశ్చిమబెంగాల్లో బీఎడ్‌లకు ఎస్జీటీ పోస్టుల్లో అవకాశం ఇవ్వాలని కోరగా కేంద్రం తిరస్కరించింది. మరి ఏపీ రాష్ట్రానికి అనుమతి ఇస్తుందా అనే విద్యారంగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకూ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా తాత్సారం చేస్తూ వ స్తున్న రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా నోటిఫికేషన్ ఇస్తే ప్రయోజనం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అందరిలోనూ ఉత్కంఠే ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు డీఎస్సీ నోటిఫికేషన్ జాప్యంతో తీవ్ర ఉత్కంటకు గురవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సర్కారు హయాంలో డీఎస్సీ ప్రకటించినా నోటిఫికేషన్‌కు నోచుకోలేదు. రెండుసార్లు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)ను సైతం రాశారు. అప్పట్లో టెట్ పరీక్ష నిర్వహించబోమని చెప్పిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు మాటమార్చి నిర్వహిస్తామని చెబుతోంది. గతంలో టెట్‌లో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులు మళ్లీ టెట్ రాయాల్సి రావటం ఇబ్బందిగా మారింది. వేలకువేలు ఖర్చు చేసి ఉద్యోగాల కోసం వేచి చూస్తోన్న అభ్యర్థులు డీఎస్సీ జాప్యంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికైనా విద్యామంత్రి త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. -
డీఈడీ జోరులో బీఈడీ బేజారు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ)కు క్రమంగా ఆదరణ తగ్గిపోతోంది. సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టుకు బీఈడీ అభ్యర్థులు అర్హులు కాదని రెండేళ్ల క్రితం కోర్టు తేల్చినప్పటినుంచి కళాశాలల్లో ఏటా విద్యార్థుల సంఖ్య పడిపోతోంది. గతేడాది ఏకంగా 103 సీట్లు ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిజామాబాద్‌అర్బన్ : బీఈడీ కోర్సుకు ఒకప్పుడు చాలా డిమాండ్ ఉండేది. పోటీ తీవ్రంగా ఉండేది. మన రాష్ట్రంలో సీటు లభించనివారు ఇతర రాష్ట్రాలకు వెళ్లి లక్షల్లో ఫీజులు చెల్లించి బీఈడీ చదివేవారు. రాష్ట్రంలోనూ మేనేజ్మెంట్ కోటా కింద సీటు కోసం లక్ష రూపాయల వరకు వెచ్చించేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ఈ కోర్సును ఎంచుకునే వారి సంఖ్య పడిపోతోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం రెండేళ్ల పాటు ఉపాధ్యాయ శిక్షణపొందిన(డీఈడీ)వారే ఎస్జీటీ పోస్టులకు అర్హులని సుప్రీంకోర్టు రెండేళ్ల క్రితం తేల్చి చెప్పినప్పటినుంచి బీఈడీ కళాశాలలు వెలవెలపోతున్నాయి. ఈ ఏడాది బీఈడీ ఎంట్రెన్స్ పరీక్ష ఏడున్నర వేల మంది రాయగా.. డీఈడీ 26 వేల మంది రాయడం కోర్సుల డిమాండ్‌ను తెలియజేస్తోంది. 1,100 సీట్లు.. జిల్లాలో 11 బీఈడీ కళాశాలలున్నాయి. ఒక్కో కళాశాలలో వంద చొప్పున సీట్లున్నాయి. ఇందులో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద, 30 శాతం సీట్లను మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేస్తారు. గతంలో మేనేజ్మెంట్ సీట్లకోసం కూడా తీవ్ర పోటీ ఉండేది. కౌన్సెలింగ్ పూర్తి కాకముందే మేనేజ్మెంట్ కోటా సీట్లు అయిపోయేవి. లక్ష రూపాయలకుపైగా చెల్లించి సీటు పొందేవారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులన్న కోర్టు తీర్పు కారణంగా ఈ సీట్లు భర్తీ కావడం గగనంగా మారింది. మైనారిటీ కళాశాలల్లోనూ ఇదే పరిస్థితి. సీట్లు భర్తీ కావడం కోసం యాజమాన్యాలు నానా పాట్లు పడుతున్నాయి. ఉన్నత విద్యాశాఖ కన్వీనర్‌తో మాట్లాడి పలుమార్లు ప్రవేశాల గడువును పొడిగించుకుంటున్నా ప్రయోజనం ఉండడం లేదు. కన్వీనర్ కోటా కింద రూ. 16,500 ఫీజు వసూలు చేస్తారు. అదే రేటుకు మేనేజ్మెంట్ సీటు ఇస్తామన్నా కొన్ని సీట్లు మిగిలిపోతుండడం గమనార్హం. 2013-14 విద్యాసంవత్సరంలో జిల్లాలోని బీఈడీ కళాశాలల్లో 103 సీట్లు మిగిలిపోయాయి. ఇలా సీట్లు మిగిలిపోవడానికి బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులకు అర్హత లేకపోవడంతోపాటు జిల్లాలో స్కూల్ అసిస్టెంట్(ఎస్ఏ) పోస్టులు చాలా తక్కువగా ఉండడమూ కారణమే. 2012 డీఎస్సీలో జిల్లాలో 71 ఎస్ఏ పోస్టులను భర్తీ చేయగా 1,100 వరకు ఎస్జీటీ పోస్టులను భర్తీ చేశారు. ఎస్జీటీ పోస్టులకు పోటీ లేకపోగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు వేలాది మంది పోటీ పడ్డారు. డీఈడీకి పెరుగుతున్న ఆదరణ ఓవైపు బీఈడీ కళ తప్పుతుండగా మరోవైపు డీఈడీకి ఏటా ఆదరణ పెరుగుతోంది. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డైట్ కళాశాల ఒక్కటి మాత్రమే ఉంది. ఏడు ప్రైవేట్ కళాశాలలున్నాయి. ప్రతి ప్రైవేట్ కళాశాలలో 50 చొప్పున సీట్లున్నాయి. ఇందులో 40 సీట్లను కౌన్సెలింగ్ ద్వారా, మిగిలిన పది సీట్లను మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. రెండేళ్లుగా ఈ కోర్సుకు డిమాండ్ బాగా పెరిగింది. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు డీఈడీ అభ్యర్థులే అర్హులని కోర్టు తీర్పు ఇవ్వడం, పోస్టులు ఎక్కువ, పోటీ తక్కువ ఉండడంతో విద్యార్థులు ఈ కోర్సువైపు ఆసక్తి చూపుతున్నారు. డీఈడీకి పోటీ పెరుగుతోంది ఎస్జీటీ పోస్టులకు డీఈడీ చేసినవారే అర్హులని కోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ కోర్సుకు డిమాండ్ పెరిగింది. ఎస్ఏ పోస్టులకన్నా ఎస్జీటీ పోస్టులు ఎక్కువగా భర్తీ చేస్తుండడమూ ఈ కోర్సుకు డిమాండ్ పెరగడానికి కారణమే. - థామసయ్య, ప్రిన్సిపాల్, ఇందూరు బీఈడీ, డీఈడీ కళాశాల, బోధన్ ఎస్ఏ పోస్టులు పెంచాలి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువగా ఉన్నాయి. బీఈడీ పూర్తి చేసినవారు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఈ కోర్సు చేసినవారు చాలా మంది నిరుద్యోగులుగా ఉండిపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి ఎస్ఏ పోస్టులు పెంచాలి. - వెనిగల్ల సురేశ్, జిల్లా అధ్యక్షుడు,బీఈడీ టీచర్స్ అసోసియేషన్ ఇందూరు -
ఉచ్చు బిగుస్తోంది
అడ్డదారుల్లో అందలమెక్కిన ప్రభుత్వ ఉపాధ్యాయుల మెడకు సీఐడీ ఉచ్చు బిగుస్తోంది. పదోన్నతి కోసం నకిలీ నర్టిఫికెట్లను సమర్పించారనే ఆరోపణలపై జిల్లాలో 138 మంది టీచర్లపై కేసులు నమోదు చేసింది. ఈ మేరకు వివిధ డాక్యుమెంట్లతో కూడిన 44 పేజీల ఎఫ్ఐఆర్ను సీఐడీ అధికారులు కరీంనగర్ అదనపు జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్‌కు గురువారం సమర్పించారు. రేపోమాపో నిందితుల అరెస్టుకు సీఐడీ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దొడ్డిదారిన ప్రమోషన్లు కొట్టేసిన వారి గుండెల్లో రైళ్లుపరుగెడుతున్నాయి. కరీంనగర్ లీగల్, న్యూస్‌లైన్ : సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ)లకు స్కూల్ అసిస్టెంట్(ఎస్ఏ)లుగా పదోన్నతి కల్పించడం కోసం ప్రభుత్వం 2009 జనవరి 26న జీవో జారీ చేసింది. ఆ జీవో ప్రకారం జిల్లా విద్యాశాఖ అధికారులు పదోన్నతి కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్‌కు హాజరయిన 267 మందిలో పలువురు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పలు పత్రికలలో పతాక శీర్షికన వార్తలు వెలువడ్డాయి. దీంతో 2010 జనవరి 18న జిల్లా విద్యాశాఖ అధికారితోపాటు నలుగురు సభ్యులతో కూడిన హైపవర్ కమిటీని విచారణ కోసం ప్రభుత్వం నియమించింది. బి.రవీందర్‌రెడ్డి అనే ఉపాధ్యాయుడు పలు యూనివర్సిటీలు, కాలేజీలకు సంబంధించిన ఉపాధ్యాయుల విద్యార్హతల సర్టిఫికెట్ల చెల్లుబాటుపై వివరణ కోరుతూ న్యాయపోరాటం చేశారు. అధికారులకు, రవీందర్‌రెడ్డికి సదరు యూనివర్సిటీలకు చెందిన అధికారుల ద్వారా అందిన సమాచారం మేరకు 138 మంది ఉపాధ్యాయులు బోగస్ సర్టిఫికెట్లు సృష్టించి పదోన్నతి పొందడానికి ప్రయత్నించినట్లు తేలింది. ఈ విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ సర్టిఫికెట్లలో మెజారిటీ సర్టిఫికెట్లు ఎంఏ ఇంగ్లిష్, ఫిజికల్సైన్స్ విభాగాలకు చెందినవే. తాము ఈ విభాగాలకు సంబంధించి దూరవిద్య కోర్సు నిర్వహించడం లేదని, ఉపాధాయులు తీసుకొచ్చినవని తప్పుడు సర్టిఫికెట్లని పలు సంస్థలు తేల్చిచెప్పాయి. సదరు అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లను సంబంధిత మగధ, కువెంపు, రామకృష్ణ కాలేజ్, వినాయకమిషన్, మనోన్ మాన్యన్, సుందరనార్, అలగప్ప, మధురై కామరాజ్, భోజ్ యూనివర్సిటీలకు పంపించి రాతపూర్వక ఆధారాలు సేకరించి సీఐడీ అధికారులు కోర్టుకు సమర్పించారు. ఈ ఘటనకు కారకులైన ప్రభుత్వ టీచర్లందరూ ఉద్దేశపూర్వకంగా, మోసపూరితంగా పదోన్నతి పొందడం కోసం నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారని పేర్కొన్నారు. తాజాగా జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ ఎన్ఎస్ఎస్.ప్రసాద్ ఈ నెల 24న సీఐడీ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీఐడీ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 420(మోసం), 468(మోసం కోసం ఫోర్జరీ), 471 (ఫోర్జరీ డాక్యుమెంట్ అని తెలిసి వాడడం) రెడ్‌విత్ 34 ఐపీసీ కింద కేసు (ఎస్ఐఆర్ నంబర్ 11/2013) నమోదు అయింది. ఈ కేసు బాధ్యతలను కరీంనగర్ సీఐడీ డీఎస్పీ భాస్కర్‌కు అప్పగిస్తూ అడిషనల్ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో నిందితులయిన 138 మందిలో 15 మంది ఉపాధ్యాయినులు ఉన్నారు. మరో నిందితుడు ఉద్యోగ విరమణ పొందాడు. ఇరవై మందికి పైగా ఉపాధ్యాయులు తమపై కేసులు వద్దని, రివర్షన్ ఇవ్వాలని గతంలోనే అర్జీలు పెట్టుకోవడం విశేషం. చాలా రోజుల తర్వాత ఈ కేసు మళ్లీ తెరపైకి రావడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.