బీఈడీలకునిరాశే | Dsc notification released | Sakshi
Sakshi News home page

బీఈడీలకునిరాశే

Published Fri, Nov 21 2014 1:32 AM | Last Updated on Sat, Sep 15 2018 8:33 PM

బీఈడీలకునిరాశే - Sakshi

బీఈడీలకునిరాశే

ఒంగోలు వన్‌టౌన్: సెకండరీ గ్రేడ్ పోస్టుల భర్తీ విషయంలో బీఈడీ అభ్యర్థులకు కూడా అవకాశం కల్పిస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తరువాత వారికి మొండిచేయి చూపారు. దీంతో జిల్లాలో 10వేల మందికి పైగా బీఈడీ అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు డీఈడీ/టి.టి.సి. విద్యార్హతలున్న వారిని అర్హులుగా గతంలోనే సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన గత రెండు డీఎస్సీలో సెకండరీ గ్రేడు పోస్టులను కేవలం డి.ఇ.డి. అభ్యర్థులకే కేటాయించారు.

అయితే ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు బీఈడీ అభ్యర్థులకు కూడా సెకండరీ గ్రేడు పోస్టులకు అర్హులుగా ప్రకటిస్తామని ఎస్.జి.టి.పోస్టుల్లో బీఈడీలను నియమిస్తామని వాగ్ధానం చేశారు. బీఈడీలకు ఎస్.జి.టి. పోస్టులకు అనుమతించాలని కోరుతూ ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ’(ఎన్‌సిటిఇ)కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.

అయితే ఎస్‌జిటి పోస్టులకు డీఈడీలను మాత్రమే అనుమతించాలని బీఈడీలను అనుమతించరాదని కేంద్రం నుంచి రాష్ట్రానికి స్పష్టమైన ఆదేశాలందాయి. దీంతో ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో సెకండరీ గ్రేడు పోస్టులకు డీఈడీ అభ్యర్థులు మాత్రమే అర్హులుగా ప్రకటించింది. దీంతో అర్హత లభిస్తుందని గంపెడాశతో ఎదురుచూసిన బీఈడీలకు తీవ్ర నిరాశే మిగిలింది.

 839 పోస్టులు మాత్రమే భర్తీ
  జిల్లాలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి ఎట్టకేలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించి గత మూడు నెలలుగా రకరకాల ప్రకటనలతో నిరుద్యోగ టీచర్లను అయోమయానికి గురిచేసిన ప్రభుత్వం ఎట్టకేలకు స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భర్తీ సంఖ్యను గణనీయంగా తగ్గించింది. జిల్లాలో కేవలం 839 టీచర్ పోస్టులను మాత్రమే డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.

డీఎస్సీతోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రెండింటినీ కలిసి ఒకే పరీక్షగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతంలోనే టెట్ పరీక్ష రాసి అర్హత సాధించిన నిరుద్యోగ ఉపాధ్యాయులు తాజా నోటిఫికేషన్‌లో ఉపాధ్యాయ పోస్టుల పరీక్షతోపాటు టెట్ పరీక్ష కూడా మళ్ళీ రాయాల్సి ఉంది. అయితే ఈ ఏడాదే డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంలోనే కాలహరణం చేసింది. దీంతో 2014-15 విద్యాసంవత్సరంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ లేనట్లే. తాజాగా జారీ చేయనున్న  నోటిఫికేషన్‌లో ఎంపికయ్యే ఉపాధ్యాయులకు 2015-16 విద్యాసంవత్సరంలోనే నియామకపు ఉత్తర్వులు ఇవ్వనున్నారు.

 అర్హత మార్కులివే...
 ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి నిర్వహించే డీఎస్సీ, టెట్ ఉమ్మడి రాతపరీక్షలో సెకండరీ గ్రేడ్ పోస్టులకు ఎస్‌జిటి, పీఈటీ పోస్టులకు 180 మార్కులకు, స్కూలు అసిస్టెంట్ పోస్టులకు 200 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఉద్యోగ నియమకాలకు ఓసీ అభ్యర్థులకు కనీసం 60 శాతానిపైగా, బీసీలకు 50 శాతంపైగా, ఎస్సీ, ఎస్టీలకు 40 శాతంపైగా మార్కులు సాధించిన వారిని అర్హులుగా పరిగణిస్తారు. మెరిట్ కమ్ రోస్టర్ విధానం ప్రకారం అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. వీరికి మాత్రమే ఉద్యోగాల అర్హులుగా పరిగణించి ఎలిజిబులిటీ సర్టిఫికేట్లు జారీ చేస్తారు.

 జిల్లాలో 839 పోస్టులు
 తాజాగా ప్రకటించే డీఎస్సీ నోటిఫికేషన్‌లో జిల్లాలో మొత్తం 839 పోస్టులను ప్రకటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement