అడ్డదారుల్లో అందలమెక్కిన ప్రభుత్వ ఉపాధ్యాయుల మెడకు సీఐడీ ఉచ్చు బిగుస్తోంది. పదోన్నతి కోసం నకిలీ నర్టిఫికెట్లను సమర్పించారనే ఆరోపణలపై జిల్లాలో 138 మంది టీచర్లపై కేసులు నమోదు చేసింది. ఈ మేరకు వివిధ డాక్యుమెంట్లతో కూడిన 44 పేజీల ఎఫ్‌ఐఆర్‌ను సీఐడీ అధికారులు కరీంనగర్ అదనపు జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్‌కు గురువారం సమర్పించారు. రేపోమాపో నిందితుల అరెస్టుకు సీఐడీ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దొడ్డిదారిన ప్రమోషన్లు కొట్టేసిన వారి గుండెల్లో రైళ్లుపరుగెడుతున్నాయి.
కరీంనగర్ లీగల్, న్యూస్‌లైన్ : సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ)లకు స్కూల్ అసిస్టెంట్(ఎస్‌ఏ)లుగా పదోన్నతి కల్పించడం కోసం ప్రభుత్వం 2009 జనవరి 26న జీవో జారీ చేసింది. ఆ జీవో ప్రకారం జిల్లా విద్యాశాఖ అధికారులు పదోన్నతి కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్‌కు హాజరయిన 267 మందిలో పలువురు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పలు పత్రికలలో పతాక శీర్షికన వార్తలు వెలువడ్డాయి. దీంతో 2010 జనవరి 18న జిల్లా విద్యాశాఖ అధికారితోపాటు నలుగురు సభ్యులతో కూడిన హైపవర్ కమిటీని విచారణ కోసం ప్రభుత్వం నియమించింది. బి.రవీందర్‌రెడ్డి అనే ఉపాధ్యాయుడు పలు యూనివర్సిటీలు, కాలేజీలకు సంబంధించిన ఉపాధ్యాయుల విద్యార్హతల సర్టిఫికెట్ల చెల్లుబాటుపై వివరణ కోరుతూ న్యాయపోరాటం చేశారు. అధికారులకు, రవీందర్‌రెడ్డికి సదరు యూనివర్సిటీలకు చెందిన అధికారుల ద్వారా అందిన సమాచారం మేరకు 138 మంది ఉపాధ్యాయులు బోగస్ సర్టిఫికెట్లు సృష్టించి పదోన్నతి పొందడానికి ప్రయత్నించినట్లు తేలింది. ఈ విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ సర్టిఫికెట్లలో మెజారిటీ సర్టిఫికెట్లు ఎంఏ ఇంగ్లిష్, ఫిజికల్‌సైన్స్ విభాగాలకు చెందినవే. తాము ఈ విభాగాలకు సంబంధించి దూరవిద్య కోర్సు నిర్వహించడం లేదని, ఉపాధాయులు తీసుకొచ్చినవని తప్పుడు సర్టిఫికెట్లని పలు సంస్థలు తేల్చిచెప్పాయి.
సదరు అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లను సంబంధిత మగధ, కువెంపు, రామకృష్ణ కాలేజ్, వినాయకమిషన్, మనోన్ మాన్యన్, సుందరనార్, అలగప్ప, మధురై కామరాజ్, భోజ్ యూనివర్సిటీలకు పంపించి రాతపూర్వక ఆధారాలు సేకరించి సీఐడీ అధికారులు కోర్టుకు సమర్పించారు. ఈ ఘటనకు కారకులైన ప్రభుత్వ టీచర్లందరూ ఉద్దేశపూర్వకంగా, మోసపూరితంగా పదోన్నతి పొందడం కోసం నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారని పేర్కొన్నారు. తాజాగా జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ ఎన్‌ఎస్‌ఎస్.ప్రసాద్ ఈ నెల 24న సీఐడీ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీఐడీ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.
సెక్షన్ 420(మోసం), 468(మోసం కోసం ఫోర్జరీ), 471 (ఫోర్జరీ డాక్యుమెంట్ అని తెలిసి వాడడం) రెడ్‌విత్ 34 ఐపీసీ కింద కేసు (ఎస్‌ఐఆర్ నంబర్ 11/2013) నమోదు అయింది. ఈ కేసు బాధ్యతలను కరీంనగర్ సీఐడీ డీఎస్పీ భాస్కర్‌కు అప్పగిస్తూ అడిషనల్ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో నిందితులయిన 138 మందిలో 15 మంది ఉపాధ్యాయినులు ఉన్నారు. మరో నిందితుడు ఉద్యోగ విరమణ పొందాడు. ఇరవై మందికి పైగా ఉపాధ్యాయులు తమపై కేసులు వద్దని, రివర్షన్ ఇవ్వాలని గతంలోనే అర్జీలు పెట్టుకోవడం విశేషం. చాలా రోజుల తర్వాత ఈ కేసు మళ్లీ తెరపైకి రావడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఉచ్చు బిగుస్తోంది
Published Fri, Sep 27 2013 3:19 AM | Last Updated on Sat, Sep 15 2018 8:33 PM
Advertisement