పోస్టులు దాచుకున్నారు | Education Ministry No Response On Secondary Grade Teachers Posts | Sakshi
Sakshi News home page

పోస్టులు దాచుకున్నారు

Published Fri, Jun 29 2018 2:26 AM | Last Updated on Thu, Jul 11 2019 5:20 PM

Education Ministry No Response On Secondary Grade Teachers Posts - Sakshi

పాఠశాల విద్యాశాఖ సంచాలకుడి కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ జేఏసీ ఆందోళన

సాక్షి, హైదరాబాద్‌ :  సెకండరీ గ్రేడ్‌ టీచర్ల ఖాళీల ప్రదర్శనపై విద్యా శాఖలో దుమారం రేగుతోంది. తాజా బదిలీల ప్రక్రియలో పూర్తిస్థాయి ఖాళీలను చూపడం లేదంటూ టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీచర్ల బదిలీ ప్రక్రియలో ప్రస్తుతం ఎస్జీటీల వెబ్‌ కౌన్సెలింగ్‌ సాగుతోంది. బదిలీ కోసం దరఖాస్తు చేసుకుని కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్న ఎస్జీటీలు ఖాళీలను çసరిచూసుకుని అవాక్కవుతున్నారు. విద్యాశాఖ తొలుత ప్రకటించిన ప్రాథమిక ఖాళీల జాబితాతో పోల్చితే ప్రస్తుత ఖాళీల సంఖ్య భారీగా తగ్గింది. ముఖ్యంగా పట్టణ ప్రాంత పాఠశాలల్లో ఖాళీలు కనిపించడమే లేదు. బదిలీల ప్రక్రియ ఈ నెల 30తో ముగియనుంది. తర్వాత సాధారణ బదిలీలపై నిషేధం వస్తే దొడ్డిదారి బదిలీలకు మార్గం సులువవుతుందనే భావనతోనే కొందరు ప్రభుత్వ పెద్దలు కీలక ఖాళీలను దాచిపెట్టేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని, అందులో భాగంగానే పట్టణ ప్రాంత పోస్టులను చూపడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇంగ్లిష్‌ మీడియం సాకుతో 
ప్రాథమిక జాబితాలో ఉన్న ఖాళీలను దాయడంపై విద్యా శాఖ అధికారులు వింత వాదన విన్పిస్తున్నారు. స్థానిక పరిస్థితులు, క్షేత్రస్థాయిలో పిల్లల తల్లిదండ్రుల డిమాండ్‌తో పలు స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం తరగతులు నిర్వహిస్తున్నారు. అందుకు విద్యాశాఖ అనుమతిచ్చినా, అక్కడ పోస్టులపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కానీ వాటిని ఇంగ్లిష్‌ మీడియం వారికి కేటాయిస్తున్నట్లు ఇప్పుడు అధికారులు చెబుతున్నారు. ‘‘త్వరలో టీఆర్టీ నియామకాలు చేపట్టనుండటంతో వాటిని ఇంగ్లిష్‌ మీడియం అభ్యర్థులకు కేటాయించనున్నాం. అందుకే వాటిని ప్రస్తుత ఖాళీల జాబితా నుంచి తొలగించాం’’అంటున్నారు. పోస్టులపై నిర్ణయం తీసుకోకుండానే ఇలా ఖాళీలను దాచిపెట్టడంపై ఉపాధ్యాయ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

గతంలో మోడల్‌ స్కూల్‌ నియామకాలప్పుడు ఇంగ్లిష్‌ మీడియం అభ్యర్థులకే అవకాశం కల్పిస్తామన్న నిర్ణయంపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అందరికీ అవకాశం కల్పించాలని, అవసరమైతే ఇంగ్లిష్‌ మీడియం బోధించేలా శిక్షణ ఇవ్వాలని కోర్టు సూచించింది. ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లకూ ఈ నిబంధనలే వర్తిస్తాయని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. సాధారణ బదిలీలకు ప్రత్యేక కోటాలో ముందు వందల సంఖ్యలో టీచర్లకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఏకంగా 80 మంది టీచర్లు రంగారెడ్డి జిల్లాలోని గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రాంతానికి బదిలీపై వచ్చారు. మరికొన్ని పెండింగ్‌లో ఉండగానే బదిలీల షెడ్యూల్‌ వచ్చేసింది.

  • రంగారెడ్డి జిల్లాలో ప్రాథమిక ఖాళీల జాబితాలో 1,739 ఖాళీలు (క్లియర్‌ వేకెన్సీలు) చూపగా... ఇప్పుడు 1,501కు తగ్గించారు! 
  •  మహబూబ్‌నగర్‌ జిల్లాలోనూ తుది జాబితాలో 52 పోస్టులను దాచేశారు. 
  • వరంగల్‌ జిల్లాలోనూ గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో 36 పోస్టులను గోప్యంగా ఉంచారు. 
  • నల్లగొండ జిల్లాలో 23 పోస్టులు, మెదక్‌లో 50 పోస్టులు దాచిపెట్టారు.  

ఖాళీలన్నీ ప్రదర్శించాలి : ఉపాధ్యాయ జేఏసీ డిమాండ్‌ 
ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఖాళీలన్నింటినీ వెబ్‌ కౌన్సెలింగ్‌లో ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ఉపాధ్యాయ ఐక్య కార్యా చరణ సమితి (జేఏసీ)పాఠశాల విద్యాశాఖ సంచాలకుడి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. జాక్టో ప్రతినిధి జి.సదానంద్‌ గౌడ్‌ మాట్లాడుతూ సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ ఖాళీల్లో పావువంతు దాచిపెట్టడంతో దీర్ఘకాలం ఒకేచోట పనిచేసిన టీచర్లకు తీవ్ర నష్టం కలుగు తుందన్నారు. కొన్నిచోట్ల ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లలో ఖాళీలను చూపడం లేదని, 30 శాతం హెచ్‌ఆర్‌ఏ ఉన్న పట్టణ ప్రాంతా ల్లోని ఖాళీలు సైతం ప్రదర్శించడం లేదని పేర్కొన్నారు. విద్యాశాఖ నివారణ చర్యలు చేపట్టకుంటే వెబ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొన బోమని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement