teachers JAC
-
పోస్టులు దాచుకున్నారు
సాక్షి, హైదరాబాద్ : సెకండరీ గ్రేడ్ టీచర్ల ఖాళీల ప్రదర్శనపై విద్యా శాఖలో దుమారం రేగుతోంది. తాజా బదిలీల ప్రక్రియలో పూర్తిస్థాయి ఖాళీలను చూపడం లేదంటూ టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీచర్ల బదిలీ ప్రక్రియలో ప్రస్తుతం ఎస్జీటీల వెబ్ కౌన్సెలింగ్ సాగుతోంది. బదిలీ కోసం దరఖాస్తు చేసుకుని కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్న ఎస్జీటీలు ఖాళీలను çసరిచూసుకుని అవాక్కవుతున్నారు. విద్యాశాఖ తొలుత ప్రకటించిన ప్రాథమిక ఖాళీల జాబితాతో పోల్చితే ప్రస్తుత ఖాళీల సంఖ్య భారీగా తగ్గింది. ముఖ్యంగా పట్టణ ప్రాంత పాఠశాలల్లో ఖాళీలు కనిపించడమే లేదు. బదిలీల ప్రక్రియ ఈ నెల 30తో ముగియనుంది. తర్వాత సాధారణ బదిలీలపై నిషేధం వస్తే దొడ్డిదారి బదిలీలకు మార్గం సులువవుతుందనే భావనతోనే కొందరు ప్రభుత్వ పెద్దలు కీలక ఖాళీలను దాచిపెట్టేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని, అందులో భాగంగానే పట్టణ ప్రాంత పోస్టులను చూపడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంగ్లిష్ మీడియం సాకుతో ప్రాథమిక జాబితాలో ఉన్న ఖాళీలను దాయడంపై విద్యా శాఖ అధికారులు వింత వాదన విన్పిస్తున్నారు. స్థానిక పరిస్థితులు, క్షేత్రస్థాయిలో పిల్లల తల్లిదండ్రుల డిమాండ్‌తో పలు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం తరగతులు నిర్వహిస్తున్నారు. అందుకు విద్యాశాఖ అనుమతిచ్చినా, అక్కడ పోస్టులపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కానీ వాటిని ఇంగ్లిష్ మీడియం వారికి కేటాయిస్తున్నట్లు ఇప్పుడు అధికారులు చెబుతున్నారు. ‘‘త్వరలో టీఆర్టీ నియామకాలు చేపట్టనుండటంతో వాటిని ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులకు కేటాయించనున్నాం. అందుకే వాటిని ప్రస్తుత ఖాళీల జాబితా నుంచి తొలగించాం’’అంటున్నారు. పోస్టులపై నిర్ణయం తీసుకోకుండానే ఇలా ఖాళీలను దాచిపెట్టడంపై ఉపాధ్యాయ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో మోడల్ స్కూల్ నియామకాలప్పుడు ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులకే అవకాశం కల్పిస్తామన్న నిర్ణయంపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అందరికీ అవకాశం కల్పించాలని, అవసరమైతే ఇంగ్లిష్ మీడియం బోధించేలా శిక్షణ ఇవ్వాలని కోర్టు సూచించింది. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకూ ఈ నిబంధనలే వర్తిస్తాయని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. సాధారణ బదిలీలకు ప్రత్యేక కోటాలో ముందు వందల సంఖ్యలో టీచర్లకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఏకంగా 80 మంది టీచర్లు రంగారెడ్డి జిల్లాలోని గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి బదిలీపై వచ్చారు. మరికొన్ని పెండింగ్‌లో ఉండగానే బదిలీల షెడ్యూల్ వచ్చేసింది. రంగారెడ్డి జిల్లాలో ప్రాథమిక ఖాళీల జాబితాలో 1,739 ఖాళీలు (క్లియర్ వేకెన్సీలు) చూపగా... ఇప్పుడు 1,501కు తగ్గించారు! మహబూబ్‌నగర్ జిల్లాలోనూ తుది జాబితాలో 52 పోస్టులను దాచేశారు. వరంగల్ జిల్లాలోనూ గ్రేటర్ వరంగల్ పరిధిలో 36 పోస్టులను గోప్యంగా ఉంచారు. నల్లగొండ జిల్లాలో 23 పోస్టులు, మెదక్‌లో 50 పోస్టులు దాచిపెట్టారు. ఖాళీలన్నీ ప్రదర్శించాలి : ఉపాధ్యాయ జేఏసీ డిమాండ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఖాళీలన్నింటినీ వెబ్ కౌన్సెలింగ్‌లో ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉపాధ్యాయ ఐక్య కార్యా చరణ సమితి (జేఏసీ)పాఠశాల విద్యాశాఖ సంచాలకుడి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. జాక్టో ప్రతినిధి జి.సదానంద్ గౌడ్ మాట్లాడుతూ సెకండరీ గ్రేడ్ టీచర్ ఖాళీల్లో పావువంతు దాచిపెట్టడంతో దీర్ఘకాలం ఒకేచోట పనిచేసిన టీచర్లకు తీవ్ర నష్టం కలుగు తుందన్నారు. కొన్నిచోట్ల ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో ఖాళీలను చూపడం లేదని, 30 శాతం హెచ్ఆర్ఏ ఉన్న పట్టణ ప్రాంతా ల్లోని ఖాళీలు సైతం ప్రదర్శించడం లేదని పేర్కొన్నారు. విద్యాశాఖ నివారణ చర్యలు చేపట్టకుంటే వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొన బోమని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. -
ఏకమైన ఉపాధ్యాయ సంఘాల జేఏసీలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విద్యాశాఖ పరిధిలోని మూడు ఉపాధ్యాయ జేఏసీలు, వాటిల్లోని 54 సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టాలని నిర్ణయించాయి. వేర్వేరు జేఏసీల పరిధిలోని ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమై పోరాటాలు సాగించాలని నిర్ణయించాయి. శనివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో జాయింట్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ యూనియన్‌గా (జేసీటీయూ) ఏర్పడ్డాయి. ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు 30 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశాయి. వచ్చే నెల 2 నుంచి జరగాల్సిన 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్‌ను బహిష్కరించాలని నిర్ణయించాయి. బహిష్కరణను విజయవంతం చేసేందుకు ఈనెల 28, 29 తేదీల్లో అన్ని జిల్లాల్లో సన్నాహక సదస్సులు నిర్వహించాలని నిర్ణ్ణయించాయి. దీనిపై ఈనెల 27న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసిచ్చేందుకు సిద్ధమయ్యాయి. మూడు జేఏసీలకు నాయకత్వం వహిస్తున్న పీఆర్టీయూ అ«ధ్యక్షుడు సరోత్తంరెడ్డి, ఎస్టీయూ అధ్యక్షుడు భుజంగరావు, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావా రవి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా 9 ప్రధాన సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో సంఘాల నేతలు విష్ణువర్ధన్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, రఘునందన్, చెన్నయ్య, అంజిరెడ్డి, రాజన్న పాల్గొన్నారు. ఇవీ ప్రధాన డిమాండ్లు.. సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమల్లోకి తేవాలి. ఏకీకృత సర్వీస్ రూల్స్ కోసం న్యాయపరమైన ఆటంకాలు తొలగించి, వేసవిలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి. కొత్త పీఆర్సీని 2018 జూలై 1 నుంచి అమలు చేసేలా చర్యలు చేపట్టాలి. రూ.398 వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. 2016 వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనం విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలి. ఎయిడెడ్, మోడల్ స్కూల్, కేజీబీవీ, గిరిజన, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను పునరుద్ధరించాలి. ఎస్సెస్సీ పరీక్షల విధులు, మూల్యాంకనం రేట్లను రెట్టింపు చేయాలి. -
సమస్యలు తీరే వరకూ పోరాడతాం
ఏలూరు సిటీ: ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించకూడదని, విద్యాధికారుల విధానాలకు వ్యతిరేకంగా 12 ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో శనివారం ఉదయం స్థానిక జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు మొదలయ్యాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ ఎల్.విద్యాసాగర్ ప్రారంభించారు. శిబిరానికి పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎల్వీ సాగర్ మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖాధికారి తన వైఖరి మార్చుకుని తక్షణమే జిల్లా విద్యాశాఖలో ప్రశాంత పరిస్థితులు ఏర్పడేందుకు కృషి చేయాలని, లేకుంటే అతడ్ని సస్పెండ్ చేసేవరకూ రాష్ట్ర అధికారులు, నాయకుల దష్టికి ఈ విషయాలను తీసుకువెళతామని హెచ్చరించారు. ఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి ఆర్ఎస్ హరనాథ్ మాట్లాడుతూ విద్యార్థులకు భారమైన, స్కూల్æక్యాలెండర్లో లేని పరీక్షలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను ఎటువంటి బోధనేతర పనులకు ఉపయోగించకూడదని కోరారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ Sసాబ్జీ మాట్లాడుతూ డీఈవో వైఖరిపై ఉపాధ్యాయులు తీవ్ర అసంతప్తితో ఉన్నారని చెప్పారు. దీక్షల్లో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపీమూర్తి, ఏపీటీఎఫ్ 1938 జిల్లా ప్రధాన కార్యదర్శి గుగ్గులోతు కృష్ణ, యూటీఎఫ్ కోశాధికారి పీవీ నరసింహారావు, జిల్లా మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు వి.కనకదుర్గ, రాష్ట్ర కౌన్సిలర్ సుభానీబేగం, జిల్లా కార్యదర్శి పి.శివప్రసాద్, డి.పద్మావతి, టి.పూర్ణశ్రీ, ఆర్.కమలారాణి, ఎన్.వేళాంగిణి, సీహెచ్ మణిమాల పాల్గొన్నారు. దీక్షలకు ఆపస్ జిల్లా అధ్యక్షుడు రాజకుమార్, పీఆర్టీయూ నగర అధ్యక్షులు నెరుసు రాంబాబు, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.నరహరి, వైఎస్సార్ టీఎఫ్ జిల్లా అధ్యక్షులు జి.సుధీర్ తదితరులు మద్దతు తెలిపారు. -
హెల్త్‌కార్డులతో వైద్యం అందట్లేదు: టీచర్ల జేఏసీ
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు అందించిన హెల్త్ కార్డులతో ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులలో ఎక్కడా తమకు వైద్యం అందడం లేదని టీచర్ల జేఏసీ నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో టీచర్ల జేఏసీ నాయకులు గురువారం సమావేశమయ్యారు. తమకు పదో పీఆర్సీని 63 శాతం ఫిట్మెంట్తో వెంటనే అమలుచేయాలని డిమాండు చేశారు. హెల్త్ కార్డులను తీసుకెళ్తే తమకు వైద్యం చేయడానికి ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయని తెలిపారు. వెంటనే ప్యాకేజి రేట్లను సవరించి, ఆస్పత్రులతో ఒప్పందాలు కుదుర్చుకుని.. వైద్యం అందించేలా చూడాలని కోరారు. ప్రతినెలా ప్రీమియం చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టీచర్ల జేఏసీ నాయకులు సీఎస్ రాజీవ్ శర్మకు తెలిపారు. సర్వీసు రూల్స్ లేని కారణంగా తమ పదోన్నతులు కూడా నిలిచిపోయాయని, వాటిని వెంటనే అమల్లోకి తేవాలని కోరారు. -
టీచర్లకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అంగీకరించం: జేఏసీ
హైదరాబాద్: టీచర్లకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అంగీకరించమని ఏపీ ఉపాధ్యాయసంఘాల జేఏసీ తెలిపింది. ప్రభుత్వం మమ్మల్ని దొంగల్లా చూస్తే సహించమని జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధ్యాయ సంఘాల ఆమోదం లేకున్నా హేతుబద్ధీకరణ చేపట్టడానికి వీళ్లేదని ఉపాధ్యాయ జేఏసీ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలిపింది. ప్రభుత్వం చేపట్టిన హేతుబద్ధీకరణ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రభుత్వ ఉపాధ్యాయులపై నియంత్రణలు విధించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రమంగా ఒక్కో చర్య మొదలుపెడుతోందని జేఏసీ ఆరోపించింది. పదివేల మందికి పైగా టీచర్లను హేతుబద్ధీకరించాలని (రేషనలైజేషన్) ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంపై అన్నివర్గాల నుంచి వ్యతిరేకత పెరుగుతోంది. -
61వ రోజూ కొనసాగిన నిరసన కార్యక్రమాలు
అప్పుడు భవిష్యత్తు రంగురంగుల కల.. ఇప్పుడు గుండెల్లో మెదిలే పీడకల.. నాడు అందరి కళ్ల ముందు ఆశలసౌధాలు.. నేడు కన్నుల సందుల నిరాశానిస్పృహలు.. ఈ రోజు నేను చూస్తున్నదేమిటి? విధి ఇన్ని కత్తులు దూస్తున్న దేమిటి? మానవునిగా శిరస్సెత్తుకుని తిరగలేను.. భావి తరాల ముందు తలదించుకోలేను.. జరిగిందంతా చూస్తూ ఏమీ ఎరగనట్లు పడి ఉండాలా? నేను సాక్షీభూతుడ్ని కాను.. సాక్షాత్తు మానవుణ్ని.. తెలతెల వారగానే భావితరాల భవిష్యత్తుపై నాకు బెంగ..కలపండోయ్ భుజం.. భుజం.. కదలండోయ్ గజం..గజం.. అంటూ ప్రతి మనిషీ సమైక్య ఉద్యమంలో వినూత్న రీతిలో తన నిరసన తెలియజేస్తున్నాడు. విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్య ఉద్యమం ఉరకలెత్తుతోంది. రాష్ట్ర విభజ న ప్రకటన వచ్చినప్పటి నుంచి పలు రూపాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులతో పాటు రైతులు, ఆటోవాలాలు, అర్చకులు ఉద్యమంలో పాల్గొంటూ యూపీఏ తీరును ఎండగడుతున్నారు. జిల్లావ్యాప్తంగా జరుగుతున్న సమైక్య ఉద్యమం 61వ రోజు ఆదివారం కూడా కొనసాగింది. ఉద్యమంలో సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక (నాన్పొలిటిక ల్ జేఏసీ) కీలక పాత్ర పోషిస్తోంది. ఉద్యమం చేపట్టి రెండు నెలలు గడిచినా వేతనాలు రాకపోయినా... రోజురోజుకూ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. విజయనగరంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు చెవిలో పువ్వులు పెట్టుకు ని పట్టణంలో ర్యాలీ అనంతరం మంత్రి బొత్స ఇంటి ముందు ధర్నా చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపక, బోధనేతర సిబ్బంది జేఏసీ ఆధ్వర్యంలో సోనియా ఎదుట సమైక్యద్రోహుల భజన కార్యక్రమం చేశారు. మున్సిపల్ ఉద్యోగులు కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎర్రచెరువు వద్ద జలదీక్ష చేశారు. అలకానంద కాలనీ వాసుల ఆధ్వర్యంలో వంటావార్పు జరిగింది. మోటార్ సైకిల్ ర్యాలీ.. పార్వతీపురంటౌన్లో వైఎస్ఆర్సీపీ యువజన కన్వీనర్ మజ్జి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మోటార్‌సైకిల్ ర్యాలీ, వైఎస్ఆర్సీపీ వితరణతో పలుచోట్ల అన్నదానం చేశారు. అధ్యాపకులు,మున్సిపల్ ఉపాధ్యాయులు చేపలు విక్రయిస్తూ, పండ్లు అమ్ము తూ నిరసన తెలిపారు. సీమాంధ్ర కేంద్రమంత్రుల తీరును నిరసిస్తూ బెలగాంలో ఏపీఎన్జీఓ, జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర మం త్రుల దిష్టిబొమ్మలకు ఉరివేసి నిరసన తెలిపారు. ఉపాధ్యాయు లు జేఏసీ ఆధ్వర్యంలో ఆత్మఘోష, ఇంటర్‌విద్య జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏవిధంగా ఉంటుం ది, హైదరాబాద్‌లేని ఆంధ్రప్రదేశ్ ఏవిధంగా ఉంటుందో తెలి యజేస్తూ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. న్యాయవాదు లు ఒంటి కాళ్లతో కుర్చీలు ఎత్తి నిరసన తెలిపారు. సీతానగరంలో హనుమాన్జంక్షన్వద్ద 25మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో రిలేనిరాహార దీక్షలు కొనసాగించారు. జేఏసీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఆకులు మొలలకు కట్టుకుని నిరసన తెలిపారు. బొబ్బిలిలో వినూత్నంగా.. బొబ్బిలిలో ఉపాధ్యాయులు సమైక్యద్రోహుల మాస్కులు ధరిం చిన వారిని పొక్లెయినర్‌తో తొక్కిస్తున్నట్లు నిరసన వ్యక్తం చేస్తూ వారికి వ్యతిరేకంగా నినదించారు. ద్విచక్ర వాహనంపై పరారవుతున్న బొత్స దంపతుల సన్నివేశానికి ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు. కమ్మవలసలో అర్ధనగ్న ప్రదర్శనలు, పారాదిలో గేదెలు కడుగుతూ నిరసన తెలిపారు. బీజేపీ నేత సుష్మాస్వరాజ్ వ్యాఖ్యలకు నిరసనగా చీపురుపల్లి మూడు రోడ్ల జంక్షన్లో గంట సేపు ఉపాధ్యాయుల మానవహారం, ఆర్టీసీ, ఎన్జీవో, కోర్టు ఉద్యోగుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం మోకాళ్లపై నిరసన వ్యక్తం చేశారు. గరివిడి మేజర్ పంచాయతీ సర్పంచ్ బమ్మిడి కృష్ణమ్మ సమైక్యాంధ్రకు మద్దతుగా పంచాయతీ తీర్మానం చేయించి ఉపాధ్యాయ పోరాట కమిటీ కన్వీనర్ ఎ.సత్యశ్రీనివాస్‌కు తీర్మాన పత్రాలను అందజేశారు. నెల్లిమర్ల మండల కేంద్రంలో ఏపీ ఎన్జీవో ఆధ్వర్యంలో నగర పంచాయతీకి చెందిన 20 మంది రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పూసపాటిరేగ మండల కేంద్రంలో ఏపీ ఎన్జీవో ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రిక్షాలు తొక్కుతూ.. సాలూరులో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు జాతీయ రహదారిపై సామూహికంగా ఆసనాలు వేసి నిరసన తెలిపారు. గజపతినగరంలో ఎన్జీఓలు రిక్షాలు తొక్కి నిరసన తెలిపారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో జేఏసీ సభ్యులు చేపట్టిన దీక్షలకు విశ్వబ్రాహ్మణులు సంఘీభావం తెలిపారు. జియ్యమ్మవలస మండలంలో జేఏసీ ఆధ్వర్యంలో పెదమేరంగి జంక్షన్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. గురుగుబిల్లి మండలం పిట్టల మెట్టలో గ్రామస్తులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించా రు. కొమరాడ మండలం ఖేర్జల గ్రామస్తులు జాతీయరహదారిపై రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. కేంద్రం స్పందించే వరకూ పోరాటం కొనసాగిస్తామని జిల్లా ప్రజలు స్పష్టం చేస్తున్నారు. -
జోరుతగ్గని పోరు
సాక్షి నెట్వర్క్ : సమైక్యపోరు.. అలుపెరగకుండా 45రోజులుగా సాగుతున్న ఉద్యమం జోరు తగ్గడంలేదు. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఉద్యమాన్ని ఉరకలెత్తిస్తున్నారు. సమైక్య, సంఘటిత శక్తిని ప్రదర్శిస్తున్నారు. ధర్నాలు, ర్యాలీలు, రహదారుల దిగ్బంధం, మానవహారాలు, సమైక్య నినాదాలతో శుక్రవారం సీమాంధ్ర జిల్లాలు దద్దరిల్లాయి. అనంతపురంలో ఇటలీ దెయ్యాన్ని పారదోలుతామంటూ అధ్యాపక జేఏసీ నేతలు వేపమండలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. రామగిరి మండలం పేరూరు నుంచి సమైక్యవాదులు ధర్మవరానికి బైకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో వెయ్యిమీటర్ల జెండాతో ర్యాలీ చేపట్టారు. ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పోరుమామిళ్ల, ప్రొద్దుటూరు, రాజంపేటలలో వైఎస్సార్ సీపీ నేతృత్వంలో దీక్షలు సాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు పట్టణంలో వెనక్కి నడుస్తూ నిరసన తెలిపారు. రైల్వేకోడూరులో మోకాళ్లపై నడిచారు. చిత్తూరు జిల్లా పీలేరులో ఆర్యవైశ్యులు కుటుంబ సమేతంగా క్రాస్ రోడ్డులో బైఠాయించి శాస్త్రోక్తకంగా మంత్రాలు పఠించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పుత్తూరు బంద్ నిర్వహించారు. తిరుపతిలో రుయా వైద్యులు, నర్సులు విభజనపరుల మాస్క్‌లు ధరించి, విద్యుత్ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ కర్నూలులో సాయి భక్తులు ప్రార్థించారు. ఆత్మకూరులో మంత్రి ఏరాసు ఇంటి ఎదుట జేఏసీ నేతలు నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉపాధ్యాయులు 48 గంటల నిరవధిక దీక్ష చేశారు. చీరాలలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. యర్రగొండపాలెంలో యాదవులు భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరులో విద్యార్థి జేఏసీ నేతలపై దాడికి నిరసనగా సమైక్య రాష్ట్ర పరిరక్షణ కమిటీ ప్రతినిధులు ఎస్పీ కాార్యాలయాన్ని ముట్టడించారు. ఆర్టీసీ బంద్‌తో పాటు, విద్యుత్ ఉద్యోగుల 72 గంటల సమ్మె కొనసాగుతోంది. ఇంటింటా సమైక్య జెండా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహించారు. రాజానగరం నియోజకవర్గంలో ప్రతి ఇంటిపై సమైక్య జెండా ఎగురవేశారు. ఇంటర్ విద్యార్థిని సునంద ఎనిమిది కిలోమీటర్ల సమైక్య పరుగు చేపట్టింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వేస్టేషన్ సెంటరులో సమైక్యవాదులు మానవహారం నిర్వహించారు. ఏలూరులో పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. తాళ్లపూడిలో విద్యార్థులు కోలాట భేరి నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో పొలికేక పేరుతో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. విశాఖ జిల్లా అరకులో ఆకులు తింటూ జేఏసీ నిరసన వ్యక్తం చేసింది. నర్సీపట్నంలో మునిసిపాల్టీ పరిధిలోని డ్వాక్రా సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. నక్కపల్లి జేఏసీ దీక్షలు ముగిసాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో కాంగ్రెస్, టీడీపీల వ్యక్తిగత దూషణలు చేసుకుని పోటాపోటీగా దిష్టిబొమ్మలు దహనం చేయటంతో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామిని గరివిడిలో జేఏసీ ప్రతినిధులు అడ్డుకున్నారు. పలాసలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు గంగిరెద్దులతో ప్రదర్శన చేశారు. శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు ఆరుబయటే సేవలు అందించారు. టెక్కలిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రోడ్డుపైనే వంటావార్పు నిర్వహించారు. రాజాంలో మహిళా ఉపాధ్యాయులు కళ్లకు గంతలు కట్టుకొని ర్యాలీ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి ఏపీఎన్జీవో సంఘం పిలుపు మేరకు సీమాంధ్ర జిల్లాలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. బీఎస్ఎన్ఎల్, తపాలా, సెంట్రల్ ఎక్సైజ్, జీవితబీమా, భారత ఆహారసంస్థ, బ్యాంకులు తదితర కార్యాలయాల్లో కార్యకలాపాలను స్తంభింపచేశారు. కొన్నిచోట్ల కార్యాలయాలకు తాళాలు వేశారు. అందులో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది విధులను బహిష్కరించి ఉద్యమానికి మద్దతు తెలిపారు. జై సమైక్య నినాదాలు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఓఎన్జీసీ, రిలయన్స్ చమురు, గ్యాస్ ఉత్పత్తి కే ంద్రాలను ఏపీఎన్జీవోలు ముట్టడించారు. ఆయా కార్యాలయాల్లోకి చొచ్చుకుని వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. విశాఖలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయాన్ని ముట్టడించిన 12 మంది ఉద్యమకారులను అదుపులోకి తీసుకున్నారు. -
బీజేపీ సమావేశంపై భగ్గు
అనకాపల్లి, న్యూస్‌లైన్: బీజేపీ విశాఖ జిల్లా కార్యవర్గ సమావేశానికి సమైక్య సెగ తగిలింది. సమావేశం నిర్వహిస్తున్నారని తెలుసుకున్న ఉపాధ్యాయ జేఏసీ సభ్యులు అక్కడికి వెళ్లి సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని బీజేపీ నేతలను డిమాండ్ చేశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఉపాధ్యాయ జేఏసీ సభ్యులపై బీజేపీ నేతలు దాడి చేశారన్న ప్రచారంతో సమైక్యవాదులంతా పెద్దఎత్తున తరలివచ్చి మూకుమ్మడి దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బీజేపీ నేతలు క్షమాపణ చెప్పి సమైక్యాంధ్రకు మద్దతు పలికితేనే వెనుతిరుగుతామని సమైక్యవాదులు భీష్మించుకొని కూర్చొన్నారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోడిగుడ్లు విసరడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. బీజేపీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు కంభంపాటి హరిబాబు వాహనంపై సమైక్యవాదులు రాళ్లు విసరడంతో అద్దాలు పగిలాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమావేశం అర్ధంతరంగా రద్దయింది. మాకు భావప్రకటనా స్వేచ్ఛ లేదా? : బీజేపీ హైదరాబాద్ : బీజేపీ కార్యాలయాలపైనా, సమావేశాలపైనా దాడులను సహించబోమని ఆ పార్టీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ హెచ్చరించింది. ఈ తరహా దాడులు తమ భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడమేనని ప్రకటించింది. అనకాపల్లిలో జరిగిన దాడిని కమిటీ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్‌బాబు ఒక ప్రకటనలో ఖండించారు. -
‘సమైక్యం’తో మమేకం
ఒంగోలు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రతి ఒక్కరూ సమైక్య ఉద్యమంతో మమేకమవుతున్నారు. ర్యాలీలు, మానవహారాలు, నిరసన దీక్షలతో జిల్లా శుక్రవారం దద్దరిల్లింది. ఆర్టీసీ బస్సులు లేకపోవడం, పలు ప్రాంతాల్లో ఆటోవాలాలు సైతం సంఘీభావం ప్రకటిస్తూ బంద్‌కు పిలుపునివ్వడంతో సామాన్య జనజీవనం స్తంభించినట్లయింది. సీఎస్‌పురం మండలం డీజీపేటలో సమైక్యాంధ్రకు మద్దతుగా టీచర్లు పాఠశాలను వదిలి రోడ్డుపై పాఠ్యాంశాలు బోధించారు. సీఎస్‌పురంలో ఉపాధ్యాయ జేఏసీ కూడా ఇదే తరహాలో నిరసన వ్యక్తం చేసింది. రాష్ట్ర విభజన వల్ల విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారవుతుందని, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలియజేసేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఉపాధ్యాయ జేఏసీ ప్రకటించింది. అద్దంకిలో వ్యవసాయ శాఖ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మార్కెట్ కార్యాలయం నుంచి 3 వేల మందికిపైగా ఉద్యోగులు, ఆరోగ్య మిత్రలు ర్యాలీ నిర్వహించారు. ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు, పొక్లయినర్లతో ర్యాలీ సాగింది. అద్దంకి బస్టాండు సెంటర్లో ‘రాష్ట్ర విభజన చీడ పురుగు’ పేరుతో తయారు చేసిన దిష్టిబొమ్మను దహనం చేశారు. నూర్‌బాషా సంఘం కూడా ర్యాలీ నిర్వహించింది. పాత బస్టాండ్ సెంటర్లో మానవహారం, రాస్తారోకో చేశారు. భవన నిర్మాణ కార్మికులు రాస్తారోకో, మానవహారంతో పాటు శాంతిహోమం నిర్వహించారు. వినూత్న నిరసనలు: జిల్లా కేంద్రమైన ఒంగోలులో కవులు, రచయితలు నిరసన గళం వినిపించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు భీమనాథం హనుమారెడ్డి ఆధ్వర్యంలో కవితాగోష్ఠి నిర్వహించారు. జిల్లా కోర్టు ఎదుట, ఒంగోలు నగరపాలక సంస్థ ఉద్యోగులు చెవిలో పూలుపెట్టుకొని నిరసన తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు భారీగా చర్చి సెంటర్లో మానవహారం నిర్వహించారు. జిల్లాలోని ఎయిడెడ్ ఉపాధ్యాయులు జేఏసీగా ఏర్పడి సమైకా్యాంధ్రకు మద్దతుగా ప్రకాశం భవనం ముందు రిలే దీక్ష చేపట్టారు. ఎన్జీఓ సంఘ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ బషీర్, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి సంఘీభావం తెలిపారు. జే.పంగులూరు, సంతనూతలపాడు, మార్కాపురం, మద్దిపాడు, బేస్తవారిపేట, కొమరోలులో ఉపాధ్యాయ జేఏసీ నాయకులు నిరసన ర్యాలీలు, రిలే దీక్షలు కొనసాగించారు. పర్చూరులో మూడుబొమ్మల సెంటర్లో న్యాయవాదుల దీక్షలు కొనసాగాయి. ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి: గిద్దలూరులో ఉద్యమ జేఏసీ నాయకులు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కార్యాలయాన్ని ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాచర్లలో జర్నలిస్టులు చేపట్టిన రిలే దీక్షను వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సూరా పాండురంగారెడ్డి ప్రారంభించారు. యర్రగొండపాలెంలో గురుకుల పాఠశాల విద్యార్థులు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయ విద్యార్థులు భారీగా రోడ్డుపైకి వచ్చి సమైక్యవాదానికి సంఘీభావం ప్రకటించారు. ఎన్జీఓలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మార్కాపురంలో ఎన్జీఓలు, మున్సిపల్ ఉద్యోగులు, జర్నలిస్టులు సంయుక్తంగా సమైక్య ర్యాలీ చేశారు. కదం తొక్కిన విద్యార్థి లోకం: దర్శిలో పది వేల మందికిపైగా విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు దర్శి కూడలిలో సమైక్యాంధ్ర గర్జన నిర్వహించారు. జేఏసీ చైర్మన్ రాజకేశవరెడ్డి పాల్గొన్నారు. మార్టూరులో 10 వేల మందికిపైగా విద్యార్థులు జాతీయ రహదారిపైకి వచ్చి సమైక్యాంధ్రకు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించారు. పొన్నలూరు మండలం చవటపాలెం ఎస్సీకాలనీ వాసులు రోడ్డుపైనే వంటావార్పు చేశారు. జరుగుమల్లి మండలం చిరికూరపాడులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీతోపాటు మానవహారం నిర్వహించారు. కందుకూరులో 200 మంది ఆటోవాలాలు బంద్ పాటించి ర్యాలీ నిర్వహించారు. ఉలవపాడులో ఎంఈఓ బీ.శ్రీమన్నారాయణ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండోరోజుకు చేరింది. ఉలవపాడు ఎంపీడీఓ, తహసీల్దారు సంఘీభావం ప్రకటించారు. ఆటోవాలాలంతా తాము సమ్మెలో పాల్గొనడమే కాకుండా విద్యాసంస్థలను కూడా మూసేయించి బంద్ పాటించారు. వీరికి ముఠాకూలీలు సైతం సంఘీభావం ప్రకటించారు. చీరాలలో ఎల్ఐసీ ఏజెంట్లు చేపట్టిన రిలే దీక్షకు మెప్మా ఉద్యోగులు సంఘీభావం ప్రకటించారు. ఎన్జీఓలు, ఆర్టీసీ కార్మికులు క్యారమ్స్, వైకుంఠపాళీ ఆడుతూ నిరసన తెలిపారు. బీసీ ఫెడరేషన్ దీక్షలు కొనసాగాయి. కనిగిరిలో వ్యాయామ ఉపాధ్యాయులు రిలే దీక్ష, ఆర్టీసీ ఎన్ఎంయూ కార్మికులు ధర్నా నిర్వహించారు. వెలిగండ్ల మండలం రామగోపాలపురంలో గ్రామస్తులు స్వచ్ఛందంగా కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పామూరులో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అన్ని రహదారులను దిగ్బంధించారు. పామూరు, ఇనిమెర్ల గ్రామాల్లో వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. సింగరాయకొండలో జేఏసీ నాయకులు చండీయాగం నిర్వహించి సర్వమత ప్రార్థనలు చేశారు. ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం సింగరాయకొండలో శాంతి ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా పలు పాఠశాలల్లోని విద్యార్థులను బయటకు పంపి తాళాలు వేయించారు. -
రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వం
కురబలకోట, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వమని, అందుకోసం సైనికుల్లా ముందుకుసాగుతామని ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు ప్రతిజ్ఞచేశారు. కురబలకోట మండలం అంగళ్లు కూడలిలో మంగళవారం అరలక్ష జనగర్జన నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో జేఏసీ కన్వీనర్ సురేంద్రబాబు మాట్లాడుతూ ప్రజాభీష్టం లేకుండా రాష్ట్ర విభజనకు పాల్పడ్డ నాయకులు నాశనమై పోతారన్నారు. గోల్డన్‌వ్యాలీ రమణారెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగపరంగా ఏర్పడిన రాష్ట్రాన్ని రాజకీయంగా విభజన చేయడానికి సోనియా ఎవరన్నారు. బీటీ కళాశాల మాజీ వైస్ ప్రిన్సిపాల్ ఆర్ సుబ్బరామయ్య మాట్లాడుతూ హైదరాబాదును తెలంగాణకు ఇస్తే వండిపెట్టిన అన్నాన్ని కుక్క ఎత్తికెళ్లినట్లే అవుతుందని పేర్కొన్నారు. మిట్స్ ప్రిన్సిపాల్ కె శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉంటే మనకంతా బలమన్నారు. విశ్వం ప్రిన్సిపాల్ రఘునాథరెడ్డి మాట్లాడుతూ విభజన వల్ల సీమాంధ్రే కాదు తెలుగు జాతి నష్టపోతుందన్నారు. వివేకానంద హైస్కూల్ బయ్యారెడ్డి మాట్లాడుతూ దుష్టశక్తుల భరతం పట్టడానికి అందరూ సింహాలై గర్జించాలన్నారు. మాజీ సర్పంచ్ కె ప్రసాదరావు మాట్లాడుతూ జనోద్యమంలో ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మార్వో రామయ్య మాట్లాడుతూ జనం ఉద్యమంలో ఉంటే సీమాంధ్ర మంత్రులు రాజీనామాలు చేయకపోవడం సిగ్గు చేటన్నారు. ఎంపీడీఓ గంగయ్య మాట్లాడుతూ ఇటలీ సోనియా ముందు వీళ్లు మోకరించడం నీచమన్నారు. ట్రాన్స్‌కో ఏఈ డేవిడ్ మాట్లాడుతూ విభజనతో నిరుద్యోగం తాండవిస్తుందన్నారు. ఏఈ మునిరాజ మాట్లాడుతూ ఇలాంటి ఉద్యమాలతో ఢిల్లీ దిమ్మతిరగాలన్నారు. జేఏసీ నాయకులు వాసుదేవరెడ్డి మాట్లాడుతూ సమైక్యాంద్ర సాధించేవరకు ఉద్యోగాలను కూడా వదిలి ఉద్యమాన్ని సాగిస్తామన్నారు. కుట్రదారులను తిప్పికొట్టి సమైక్యాన్ని కాపాడుకోవాలని అంగళ్లు ఇన్చార్జి సర్పంచ్ బి దస్తగిరి అన్నారు. కార్యక్రమంలో జేఏసీ నేత చంద్రశేఖర్, మిట్స్ రవి, ఎంఈవో త్యాగరాజు, సతీష్‌రెడ్డి, ఫజరుల్లా, రహమాన్, గిరి, సుబ్బారావు, జయకుమార్, ముబారక్ పాల్గొన్నారు. -
అన్నదమ్ముల్లా విడిపోదాం..
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో శాంతి సద్భావన ర్యాలీ జరిగాయి. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రాజకీయ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు వనజారెడ్డి, భాగ్యలక్ష్మీ, దేవేందర్, సోగల సుదర్శన్, నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మహెమూద్ పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. పట్టణ పురవీధుల గుండా ర్యాలీ కొనసాగింది. తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. నిర్మల్ పట్టణంలో టీఎన్జీవో, టీజేఏసీ, వివిధ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శాంతి సద్భావన ర్యాలీ చేపట్టారు. అమరవీరుల స్తూపం వద్ద, అంబేద్కర్, రాంజీగోండు విగ్రహాలకు పూలమాలలు వేసి తెలంగాణ నినాదాలు చేశారు. ఇందులో టీజేఏసీ జిల్లా కన్వీనర్ కొట్టె శేఖర్, టీఎన్జీవో నిర్మల్ శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోయినొద్దీన్, వి.విద్యాసాగర్, కోశాధికారి ఏ.వి.రమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శంకర్ పాల్గొన్నారు. మంచిర్యాలలో ఐబీ నుంచి పట్టణంలోని ముఖ్యవీధుల మీదుగా ర్యాలీ నిర్వహించారు. బెల్లంపల్లి చౌరస్తాలో మానవహారం చేపట్టారు. రాజకీయ జేఏసీ తూర్పు జిల్లా చైర్మన్ గోనె శ్యాంసుందర్‌రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది. కన్వీనర్ రవీందర్రావు, జేఏసీ నాయకులు తన్వీర్‌ఖాన్, సుదమల్ల హరికృష్ణ, పెద్దపెల్లి పురుషోత్తం, మంగ, భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ నాయకులు నైనాల వెంకటేశ్వర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆసిఫాబాద్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయులు బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో సద్భావన ర్యాలీ చేపట్టారు. జేఏసీ కన్వీనర్ గందం శ్రీనివాస్, ఆసిఫాబాద్ సర్పంచ్ కోవ లక్ష్మీ, రాజన్‌బాబు పాల్గొన్నారు.కాగజ్‌నగర్‌లో ఐఎన్టీయూసీ కార్యాలయం నుంచి రాజీవ్ చౌరస్తా వరకు శాంతి సద్భావన ర్యాలీ నిర్వహించారు. జేఏసీ కన్వీనర్ కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జేఏసీ నాయకులు సుభాష్ పాల్గొన్నారు. -
మరింత పెరిగిన ఉద్యమ జోరు
కలెక్టరేట్, నూస్లైన్: జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమం అవిశ్రాంతంగా ఉవ్వెత్తున కొనసాగుతోంది. విభిన్న, వినూత్న ఆందోళన కార్యక్రమాలతో ఉద్యమకారులు హోరెత్తిస్తున్నారు. చిన్నా పెద్దా తేడాలేకుండా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సం ఘాలు బైక్ ర్యాలీలు నిర్వహించగా క్రైస్తవ సోదరులు ప్రదర్శన, ప్రార్థనలు జరిపారు. పాలకొండలో వందలాది ఎడ్లబళ్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. పట్టణాన్ని దిగ్బంధిం చారు. పాతపట్నంలో సమైక్యాంధ్ర, తెలంగాణ గుర్రాల పోటీ నిర్వహించగా పలు ప్రాంతాల్లో రాస్తారోకోలు, వంటావార్పు, మానవహారాలు కొనసాగాయి. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాలతోపాటు కుల సంఘాల వారు కూడా పాలుపంచుకున్నారు. శ్రీకాకుళంలో జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీ అరసవల్లిలో ప్రారంభమై.. సూర్యమహల్, రామలక్ష్మణ, డే అండ్ నైట్ జంక్షన్, వైఎస్ఆర్ కూడలి మీదుగా పొట్టిశ్రీరాములు విగ్రహం వద్దకు చేరుకుంది. పట్టణ దేవాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎన్జీవో హోం నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం మానవహారం నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్యవైశ్య సంఘం, వాసవీ క్లబ్, వాసవి వనిత క్లబ్, ఆవోపాల ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు కూడలి వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జేసీస్ ఫెమినా మహిళలు కొవ్వొత్తులతో ర్యాలీ జరిపారు. జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ చేపట్టిన ర్యాలీ, మహిళా కళాశాల రోడ్డులోని క్రైస్తవారాధన మందిరం నుంచి సూర్యామహల్, జీటీ రోడ్డు మీదుగా వైఎస్ఆర్ కూడలికి చేరుకుంది. సూర్యమహల్ , వైఎస్ఆర్ కూడళ్లలో క్రైస్తవులు మోకాళ్లపై కూర్చుని ప్రార్ధనలు చేశారు. అక్కడి నుంచి పాలకొండ రోడ్డు మీదుగా డే అండ్ నైట్ కూడలి చేరుకొని ప్రార్ధనలు నిర్వహించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక మహిళా విభాగం కన్వీనర్ వై.గీత ఆధ్వర్యంలో మహిళలు పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. ఆమదాలవలస మండలం వంజంగి గ్రామస్తులు పాలకొండ రోడ్డు జంక్షన్ వరకు ర్యాలీ జరిపి మానవహారం నిర్వహించారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం రోడ్డును దిగ్బంధించారు. వంజంగిపేట యువకులు గ్రామ సమీపంలోగల సెల్‌టవర్ ఎక్కి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. పొందూరు మండలం లోలుగులో ఉద్యమకారులు ర్యాలీ తీసి రోడ్డును దిగ్బంధించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సరుబుజ్జిలి సెంటర్లో యువకులు రోడ్డు దిగ్బంధం నిర్వహించారు. చిగురువలస, పురుషోత్తపురం, షళంత్రి గ్రామాల వద్ద రోడ్లపై ఉద్యమకారులు బైఠాయించారు. పాలకొండలో జైభీమ్ నాటుబండ్ల సంఘం ఆధ్వర్యంలో నాటుబండ్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలవారు పాల్గొన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో బైఠాయింపు, రాస్తారోకో, సోనియా దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు జరిగాయి. భామిని మండలం ఘనసరలో బంద్ నిర్వహించారు. బాలేరు గ్రామంలో రోడ్డుపై వంటావార్పు చేపట్టారు. అనంతరం భోజనాలు చేశారు. భామినిలో రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. రాజాంలో కొవ్వొత్తులతో ప్రదర్శన జరిపి నిరసన తెలిపారు. నరసన్నపేటలో దేవాంగులు, విద్యుత్ ఉద్యోగులు, జేఏసీ ప్రతినిధులు ర్యాలీ చేపట్టి ప్రధాన రహదారిపై బైఠాయించారు. కొత్తూరులో సమక్యవాదులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. వందలాదిమంది యువకులు నాలుగు రోడ్ల కూడలిలో మానవహరంగా ఏర్పడ్డారు. వంగర బస్టాండ్ ఆవరణలో వివిధ గ్రామాలకు చెందిన యువకులు, మహిళలు, ఉద్యోగులు ధర్నా చేశారు. రణస్థలంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రామతీర్థం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సారవకోట మండలం దబడులక్ష్మిపురంలో ర్యాలీ నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. లావేరు మండలం కేశవరాయునిపాలెంలో మానవహారం నిర్వహించారు. పలాస-కాశీబుగ్గలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మతో శవయాత్ర చేపట్టారు. మూడు రోడ్ల కూడలి వద్దకు చేరుకుని సోనియా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కాశీబుగ్గ మూడు రోడ్లు కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. పలాస కాశీబుగ్గ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నాలుగో రోజు కూడా రిలేనిరాహార దీక్షలు కొనసాగాయి.