అప్పుడు భవిష్యత్తు రంగురంగుల కల.. ఇప్పుడు గుండెల్లో మెదిలే పీడకల.. నాడు అందరి కళ్ల ముందు ఆశలసౌధాలు.. నేడు కన్నుల సందుల నిరాశానిస్పృహలు.. ఈ రోజు నేను చూస్తున్నదేమిటి? విధి ఇన్ని కత్తులు దూస్తున్న దేమిటి? మానవునిగా శిరస్సెత్తుకుని తిరగలేను.. భావి తరాల ముందు తలదించుకోలేను.. జరిగిందంతా చూస్తూ ఏమీ ఎరగనట్లు పడి ఉండాలా? నేను సాక్షీభూతుడ్ని కాను.. సాక్షాత్తు మానవుణ్ని.. తెలతెల వారగానే భావితరాల భవిష్యత్తుపై నాకు బెంగ..కలపండోయ్ భుజం.. భుజం.. కదలండోయ్ గజం..గజం.. అంటూ ప్రతి మనిషీ సమైక్య ఉద్యమంలో వినూత్న రీతిలో తన నిరసన తెలియజేస్తున్నాడు.
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్య ఉద్యమం ఉరకలెత్తుతోంది. రాష్ట్ర విభజ న ప్రకటన వచ్చినప్పటి నుంచి పలు రూపాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులతో పాటు రైతులు, ఆటోవాలాలు, అర్చకులు ఉద్యమంలో పాల్గొంటూ యూపీఏ తీరును ఎండగడుతున్నారు. జిల్లావ్యాప్తంగా జరుగుతున్న సమైక్య ఉద్యమం 61వ రోజు ఆదివారం కూడా కొనసాగింది. ఉద్యమంలో సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక (నాన్‌పొలిటిక ల్ జేఏసీ) కీలక పాత్ర పోషిస్తోంది. ఉద్యమం చేపట్టి రెండు నెలలు గడిచినా వేతనాలు రాకపోయినా... రోజురోజుకూ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. విజయనగరంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు చెవిలో పువ్వులు పెట్టుకు ని పట్టణంలో ర్యాలీ అనంతరం మంత్రి బొత్స ఇంటి ముందు ధర్నా చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపక, బోధనేతర సిబ్బంది జేఏసీ ఆధ్వర్యంలో సోనియా ఎదుట సమైక్యద్రోహుల భజన కార్యక్రమం చేశారు. మున్సిపల్ ఉద్యోగులు కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎర్రచెరువు వద్ద జలదీక్ష చేశారు. అలకానంద కాలనీ వాసుల ఆధ్వర్యంలో వంటావార్పు జరిగింది.
మోటార్ సైకిల్ ర్యాలీ..
పార్వతీపురంటౌన్‌లో వైఎస్‌ఆర్‌సీపీ యువజన కన్వీనర్ మజ్జి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మోటార్‌సైకిల్ ర్యాలీ, వైఎస్‌ఆర్‌సీపీ వితరణతో పలుచోట్ల అన్నదానం చేశారు. అధ్యాపకులు,మున్సిపల్ ఉపాధ్యాయులు చేపలు విక్రయిస్తూ, పండ్లు అమ్ము తూ నిరసన తెలిపారు. సీమాంధ్ర కేంద్రమంత్రుల తీరును నిరసిస్తూ బెలగాంలో ఏపీఎన్‌జీఓ, జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర మం త్రుల దిష్టిబొమ్మలకు ఉరివేసి నిరసన తెలిపారు. ఉపాధ్యాయు లు జేఏసీ ఆధ్వర్యంలో ఆత్మఘోష, ఇంటర్‌విద్య జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏవిధంగా ఉంటుం ది, హైదరాబాద్‌లేని ఆంధ్రప్రదేశ్ ఏవిధంగా ఉంటుందో తెలి యజేస్తూ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. న్యాయవాదు లు ఒంటి కాళ్లతో కుర్చీలు ఎత్తి నిరసన తెలిపారు. సీతానగరంలో హనుమాన్‌జంక్షన్‌వద్ద 25మంది వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలతో రిలేనిరాహార దీక్షలు కొనసాగించారు. జేఏసీ, వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఆకులు మొలలకు కట్టుకుని నిరసన తెలిపారు.
బొబ్బిలిలో వినూత్నంగా..
బొబ్బిలిలో ఉపాధ్యాయులు సమైక్యద్రోహుల మాస్కులు ధరిం చిన వారిని పొక్లెయినర్‌తో తొక్కిస్తున్నట్లు నిరసన వ్యక్తం చేస్తూ వారికి వ్యతిరేకంగా నినదించారు. ద్విచక్ర వాహనంపై పరారవుతున్న బొత్స దంపతుల సన్నివేశానికి ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు. కమ్మవలసలో అర్ధనగ్న ప్రదర్శనలు, పారాదిలో గేదెలు కడుగుతూ నిరసన తెలిపారు. బీజేపీ నేత సుష్మాస్వరాజ్ వ్యాఖ్యలకు నిరసనగా చీపురుపల్లి మూడు రోడ్ల జంక్షన్‌లో గంట సేపు ఉపాధ్యాయుల మానవహారం, ఆర్టీసీ, ఎన్జీవో, కోర్టు ఉద్యోగుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం మోకాళ్లపై నిరసన వ్యక్తం చేశారు. గరివిడి మేజర్ పంచాయతీ సర్పంచ్ బమ్మిడి కృష్ణమ్మ సమైక్యాంధ్రకు మద్దతుగా పంచాయతీ తీర్మానం చేయించి ఉపాధ్యాయ పోరాట కమిటీ కన్వీనర్ ఎ.సత్యశ్రీనివాస్‌కు తీర్మాన పత్రాలను అందజేశారు. నెల్లిమర్ల మండల కేంద్రంలో ఏపీ ఎన్జీవో ఆధ్వర్యంలో నగర పంచాయతీకి చెందిన 20 మంది రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పూసపాటిరేగ మండల కేంద్రంలో ఏపీ ఎన్జీవో ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
రిక్షాలు తొక్కుతూ..
సాలూరులో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు జాతీయ రహదారిపై సామూహికంగా ఆసనాలు వేసి నిరసన తెలిపారు. గజపతినగరంలో ఎన్జీఓలు రిక్షాలు తొక్కి నిరసన తెలిపారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో జేఏసీ సభ్యులు చేపట్టిన దీక్షలకు విశ్వబ్రాహ్మణులు సంఘీభావం తెలిపారు. జియ్యమ్మవలస మండలంలో జేఏసీ ఆధ్వర్యంలో పెదమేరంగి జంక్షన్‌లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. గురుగుబిల్లి మండలం పిట్టల మెట్టలో గ్రామస్తులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించా రు. కొమరాడ మండలం ఖేర్జల గ్రామస్తులు జాతీయరహదారిపై రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. కేంద్రం స్పందించే వరకూ పోరాటం కొనసాగిస్తామని జిల్లా ప్రజలు స్పష్టం చేస్తున్నారు.
61వ రోజూ కొనసాగిన నిరసన కార్యక్రమాలు
Published Mon, Sep 30 2013 4:09 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
Advertisement
Advertisement