United Andhra Movement
-
ప్రజల కోసమే పనిచేయాలి
ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు ఈడుపుగల్లు (కంకిపాడు) : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ. అశోక్‌బాబు పిలుపునిచ్చారు. ఏపీ ఎన్జీవోల సంఘం కంకిపాడు తాలూకా యూనిట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈడుపుగల్లులోని శ్రీ వెంకటేశ్వర కల్యాణ మండపంలో సోమవారం రాత్రి జరిగింది. అశోక్‌బాబు హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగటానికి సహకరించిన ప్రజలకు ఉద్యోగులంతా రుణపడి ఉన్నారన్నారు. విభజన ప్రభావం మరో ఇరవై ఏళ్లు ఉంటుందని, అప్పటి వరకూ ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలపై స్పందించి పనిచేయాల్సిన బాధ్యత తమపై ఉందనే విషయాన్ని ఉద్యోగులు గుర్తించాలని సూచించారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగుల అండదండలతోనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్జీవో హోమ్‌కు 5 సెంట్ల స్థలం అందించేందుకు కృషి చేస్తానన్నారు. తోట్లవల్లూరు జెడ్పీటీసీ, వైఎస్సార్సీపీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి మాట్లాడుతూ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధుల హక్కులను గౌరవిస్తూ ప్రజా సమస్యలపై పని చేయాలని సూచించారు. రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంఘం అధ్యక్షుడు తుమ్మలపల్లి హరికృష్ణ, రాష్ట్ర గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు, ఏడీ, డాక్టర్ నగేష్‌బాబు , ఎన్జీవో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, కంకిపాడు జెడ్పీటీసీ గొంది శివరామకృష్ణ ప్రసాద్, ఈడుపుగల్లు, కోలవెన్ను సర్పంచులు షేక్ మాబు సుబాని, తుమ్మల చంద్రశేఖర్, రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రామ్మోహన్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు లాం విద్యాసాగర్, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చండ్ర కృష్ణమోహన్ పాల్గొన్నారు. తొలుత కంకిపాడు తాలూకా యూనిట్ కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. -
సమైక్య హోరు
కొనసాగుతున్న ఎన్జీఓల దీక్షలు విధులు బహిష్కరించిన ప్రభుత్వ ఉద్యోగులు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు సాక్షి, నెల్లూరు: జిల్లాలో సమైక్య ఉద్యమం హోరెత్తుతోంది. ఐదో రోజైన సోమవారం ఎన్జీఓలు, సమైక్యవాదులు ధర్నాలు, మానవహారాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్జీఓల దీక్షలు కొనసాగుతున్నాయి. ఎన్జీఓల ఆధ్వర్యంలో నెల్లూరులో ఎన్జీఓ హోం నుంచి ర్యాలీగా బయల్దేరి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసి వేయించారు. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నగరంలోని వీఆర్సీ సెంటర్లో తెలంగాణ బిల్లు ప్రతులను దహనం చేశారు. అనంతరం నిరసన ప్రదర్శన నిర్వహించారు. సమైక్యాంద్ర సాధనే అందరి ధ్యేయమని గూడూరులో ఎన్జీఓల సం ఘం నాయకుడు మస్తానయ్య అన్నారు. పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కావలి తాలూకా ఎన్జీఓ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని కేంద్రప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. సమైక్యాంధ్ర కోసం కావలి కోర్టుకు చెందిన న్యాయవాదులు విధులను బహిష్కరించారు. -
ఉద్యమం చల్లారిందనుకోవడం అపోహే
ఏపీఎన్జీవోల సంఘం స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ‘‘సమైక్య ఉద్యమం చల్లారిందని, విభజన అంశాన్ని ప్రజలు మర్చిపోయారని అనుకోవడం అపోహే. సరైన దిశానిర్దేశం చేసే నాయకత్వం కోసం, మరోమారు ఉద్యమ పిలుపు కోసం వారంతా సిద్ధంగా ఉన్నారు. ఎట్టిపరిస్థితుల్లో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు’’అని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. ఏపీఎన్జీవో భవన్లో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. విభజన అంశం అసెంబ్లీలో చర్చకు వచ్చినపుడు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని భావించామని, అయితే ప్రస్తుతం బిల్లుపై చర్చ మూడు దఫాలుగా జరిగే అవకాశం ఉన్నందున ఏదశలో ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించాలనే అంశంపై యోచిస్తున్నామని చెప్పారు.తాము నిర్వహించాలనుకున్న అఖిలపక్ష భేటీని 21కి వాయిదా వేసినట్లు తెలిపారు. రాజకీయ పక్షాల సహకారంతో మరో పెద్ద ఉద్యమానికి కార్యాచరణ ప్రణాళికను సమావేశంలో ప్రకటించే యోచన ఉందన్నారు. తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తమ అభిప్రాయాలను చెప్పాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలదేనని చెప్పారు. రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలుస్తామని, విభజన వలన ఉద్యోగులకు ఎదురయ్యే ఇబ్బందులను తెలిపే ప్రయత్నం చేస్తామన్నారు. 30 రకాల మొండి వ్యాధులకు అన్ని ఆస్పత్రుల్లో ఓపీ సదుపాయం ఉండే విధంగా హెల్త్ కార్డు నిబంధనలను మార్చాలని కోరామన్నారు. సమావేశంలో ఏపీఎన్జీవోల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు తదితరులున్నారు. -
విశాలాంధ్ర మహాసభ ఏఐసిసి కార్యాలయ ముట్టడి
-
సమైక్యానికి జై
సాక్షి ప్రతినిధి, గుంటూరు : గ్రామీణ ప్రాంతాల్లో శుక్రవారం సమైక్య నినాదం మారుమోగింది. దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు గ్రామ సభలు నిర్వహించి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేశారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఎడారిగా మారుతుందని, విద్యార్థులు, నిరుద్యోగుల తోపాటు అన్ని వర్గాలకు సమస్యలు ఏర్పడతాయని ఆ తీర్మానంలో ఆందోళన వ్యక్తం చేశారు. మరికొన్ని గ్రామాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు ప్రజల సమక్షంలో గ్రామ సభలు నిర్వహించి తీర్మానం చేయించారు. ఈ కాపీలను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తల ద్వారా జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్‌కు పంపించారు. అనంతరం ఆ తీర్మానాల కాపీలను ఫ్యాక్స్ ద్వారా రాష్ట్రపతి, ప్రధానమంత్రికి పంపారు. రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య రాష్ట్ర విభజనకు సహకరించిన నేతల (సోనియా, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స సత్యనా రాయణ, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తదితరుల ) దిష్టిబొమ్మలను వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు దహనం చేశారు. చిలకలూరిపేటలో పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ అధ్వర్యంలో కళామందిర్ సెంటరులో, కృష్ణా, గుంటూరు జిల్లాల కోఆర్డినేటర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆధ్వర్యంలో మంగళగిరిలో , గురజాల నియోజకవర్గ సమన్వయకర్త జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో దాచేపల్లిలోని బంగ్లా సెంటరులో దిష్టిబొమ్మలను దహనం చేశారు. మాచర్లలోని పొట్టిశ్రీరాములు విగ్రహం ఎదుట పార్టీ నాయకులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు సమైక్యానికి మద్దతుగా, విభజనకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేశారు. గుంటూరులో మానవహారం విద్యానగర్,(గుంటూరు) : రాష్ట్ర విభజన ప్రక్రియ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవాల్సిందేనని వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ అర్బన్ కమిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం హిందూ కళాశాల సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యఅతిథి అప్పిరెడ్డి మాట్లాడుతూ జగన్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణను తగ్గించేందుకు రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆరోపించారు. అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. రోడ్డుపై బైఠాయించి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. -
‘సమైక్య శంఖారావాని’కి పెల్లుబుకుతున్న మద్దతు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్ తో 26న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న ‘సమైక్య శంఖారావం’ సభకు అన్ని వర్గాల నుంచీ మద్దతు పెల్లుబుకుతోంది. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం మొదలుకుని.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు మంగళవారం సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేసేందుకు కృషిచేయాలని ఆయా సంఘాలు పిలుపునిస్తున్నాయి. ‘‘సమైక్యాంధ్ర కోసం ఏ రాజకీయపార్టీ కార్యక్రమాలు చేపట్టినా మద్దతిస్తామని మేం ముందే చెప్పాం. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్రకోసం 26వ తేదీన హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో సమైక్య శంఖారావం సభ పెట్టాలని నిర్ణయించింది. ఉద్యోగులంతా హాజరై ఈ సభను విజయవంతం చేయాలని నిర్ణయించాం’’ అని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ మురళీకృష్ణ ప్రకటించారు. ‘‘ఉద్యోగులు ఓ స్థాయి వరకే ఉద్యమం చేయగలరు. చట్టసభల్లో పోరాడాల్సింది రాజకీయపక్షాలే. అందుకే మేం సమైక్యాంధ్రకోసం పాటుపడాలని అన్ని రాజకీయ పక్షాల నేతలను కలిసి విన్నవించాం..’’ అని చెప్పారు. ‘‘ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమానికీ ఫోరం అన్ని రాజకీయపక్షాల నేతల్ని ఆహ్వానించింది. ఇందులో వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా స్వయంగా పాల్గొన్నారు. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచేందుకు చట్టసభల్లో పోరాడాల్సింది రాజకీయపార్టీల నేతలే. అందుకే పార్టీలను ఉద్యమంలో కీలకపాత్ర పోషించాలని మొదట్నుంచీ కోరుతూ వస్తున్నాం. 26న హైదరాబాద్‌లో వైఎస్సార్సీపీ నిర్వహించే సమైక్య శంఖారావం సభకు సచివాలయ గెజిటెడ్ అధికారుల సంఘం తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. గెజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధులంతా ఈ సభలో పాల్గొంటారు’’ అని సచివాలయ సీమాంధ్ర గెజి టెడ్ ఉద్యోగుల సంఘం చైర్మన్ కృష్ణయ్య తెలిపారు. సమైక్య శంఖారావం సభకు సంపూర్ణ మద్దతిస్తున్నామని సచివాలయ హౌసింగ్ సొసైటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి చెప్పారు. వీరితోపాటు పలువురు నేతలు మీడియా సమావేశంలో పాల్గొన్నా రు. సమైక్య శంఖారావానికి వివిధ జిల్లాల ఉద్యోగుల జేఏసీ లు, కార్మిక సంఘాలు కూడా పూర్తి మద్దతు ప్రకటించాయి. సమైక్యం కోసం పార్టీలన్నీ ఐక్యంగా రావాలి... సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణ కోసం వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తున్న సమైక్య శంఖారావానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. సమైక్య రాష్ట్రం పరిరక్షణకు జెండాలను పక్కన పెట్టి ఐకమత్యంగా కలసిరావాలని జగన్ రాజకీయ పార్టీలకు ఇచ్చిన పిలుపును మెడికల్ జేఏసీ స్వాగతిస్తోంది. - పి.శ్యామ్‌సుందర్, మెడికల్ జేఏసీ కన్వీనర్, విశాఖపట్నం ఈ సభ ఢిల్లీని కదిలించాలి... హైదరాబాద్‌లో 26న వైఎస్సార్ సీపీ నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభ విజయవంతం చేయడానికి ఉద్యోగులు సిద్ధం. ఈ సభ ఢిల్లీని కదిలించాలి. - ఎస్.నాగేశ్వరరెడ్డి, ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు, విశాఖపట్నం సమైక్య శంఖారావాన్ని ఆహ్వానిస్తున్నాం సమైక్యాంధ్ర కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం నిర్వహించడాన్ని ఆహ్వానిస్తున్నాం. సమైక్య రాష్ట్రానికి మద్దతుగా సభలు, సమావేశాలు పెట్టే ప్రతి పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధం. - కె.ఈశ్వరరావు, ఏపీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు, విశాఖపట్నం ఆర్టీసీ ఉద్యోగుల సంపూర్ణ సహకారం సమైక్యాంధ్ర సాధన కోసం ఆది నుంచీ కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ. ఆ పార్టీ హైదరాబాద్‌లో సమైక్య శ ంఖారావం పూరించడాన్ని ఆహ్వానిస్తున్నాం. పార్టీలకతీతంగా ఏ ఒక్కరు సమైక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా ఆర్టీసీ ఉద్యోగులు పూర్తి సహకారాలు అందిస్తారు. - వై.శ్రీనివాసరావు, ఆర్టీసీ ఎన్ఎంయూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, విశాఖపట్నం ప్రజల మనోభావాలకు అనుగుణంగా... సమైక్యాంధ్ర సాధన కోసం ఎవరు ముందుకు వచ్చినా స్వాగతిస్తాం. మా కార్మిక సంఘం తరపున పూర్తి మద్దతును తెలియజేస్తాం. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆందోళన చేయాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉంది. - డి.ఆదినారాయణ, ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు, విశాఖపట్నం శంఖారావం అభినందనీయం సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా హైదరాబాద్‌లో సమైక్య భేరిని నిర్వహించాలని నిర్ణయించడం అభినందనీయం. ప్రజల మనోభావాలను తెలుసుకొని ప్రభుత్వం సమైక్యాంధ్రపై సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం. -మంత్రి రాజశేఖర్, జాతీయ ఇంటక్ కార్యదర్శి, విశాఖపట్నం అందరూ హాజరుకావాలి... సమైక్య శంఖారావం సభకు ఎన్జీవోలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. రాష్ట్ర విభజన నిర్ణయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పోరాడుతోంది. శంఖారావం సభకు అందరూ హాజరై విజయవ ంతం చేయాల్సిన అవసరం ఉంది. - ఎల్.విద్యాసాగర్, అధ్యక్షుడు, పశ్చిమగోదావరి జిల్లా ఎన్జీవో సంఘం అన్ని వర్గాల వారూ అశేషంగా తరలిరండి సమైక్య శంఖారావానికి ఎన్జీవోలు, రైతులు, విద్యార్థులు హాజరై జయప్రదం చేయూలని కోరుతున్నాం. సమైక్య రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో వివిధ కార్యక్రమాలు చేస్తున్న పార్టీ వైఎస్సార్ సీపీయే. అందరూ రాజధాని తరలి వెళ్లి సమైక్య వాదాన్ని చాటాలి. - ఆర్.ఎస్.హరనాథ్, అధ్యక్షుడు, పే అండ్ అకౌంట్స్ ఎంప్లాయూస్ అసోసియేషన్ సమైక్య శంఖారావం సభకు ప్రజలు వెళతారు సమైక్య శంఖారావం సభకు సమైక్య రాష్ట్రం కోరుకునే ప్రజలు వెళతారు. సీమాంధ్రు ల మనోభావాలు గౌరవించకుండా విభజించటం తగదు. సభకు హాజరయ్యే విషయమై ఏపీఎన్జీవో, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. - కత్తి నరసింహారెడ్డి, రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ), చిత్తూరు పది వేల మందితో తరలివెళ్తాం సమైక్య శంఖారావం బహిరంగ సభకు ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులు పది వేల మందితో హాజరవుతాం. ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులు సమైక్య శంఖారావానికి స్వచ్ఛందంగా తరలి రావాలి. సమైక్యాంధ్ర సాధన వైఎస్సార్‌సీపీతోనే సాధ్యం. - క్రిష్టఫర్ దేవకుమార్, జిల్లా గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు, అనంతపురం విజయవంతం చేసే బాధ్యత అందరిదీ.. సమైక్య శంఖారావం బహిరంగ సభను విజయవంతం చేసే బాధ్యత ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరిపై ఉంది. సమైక్యవాదాన్ని ఢిల్లీకి బలంగా చాటి చెప్పాలంటే ఈ శంఖారావం బహిరంగ సభను విజయవంతం చేయాలి. - వి.సి.హెచ్.వెంగళ్‌రెడ్డి, జేఏసీ చైర్మన్, అనంతపురం సమైక్యవాదులంతా హాజరుకావాలి సమైక్యవాదులందరూ ఈ సభకు హాజరై రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులందరూ హాజరై సభను విజయవంతం చేయాలి. - బండి శ్రీనివాసరావు, ఏపీఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శి ఉద్యోగులంతా విజయవంతం చేయాలి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ప్రజల ఆకాంక్షను బలంగా వినిపించనున్న సమైక్య శంఖారావ సభను విజయవంతం చేయాలి. - రాజకుమార్, ట్రెజరీ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధిక సంఖ్యలో హాజరై సమైక్యవాణి వినిపించాలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం సభను విజయవంతం చేసేందుకు ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరుకావాలి. అన్ని వర్గాల ప్రజలూ సభకు హాజరై తమ ఆకాంక్షను తెలియజేయాలి. - ఆర్.సి.హెచ్.కృష్ణారెడ్డి, నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘ కార్యదర్శి -
మంత్రి శత్రుచర్ల కాన్వాయ్‌పై చెప్పులు
-
సమైక్య ఉద్యమ పోరు
సాక్షి, కడప : సమైక్య ఉద్యమంలో ప్రజలు అలుపెరగని పోరును కొనసాగిస్తున్నారు. రోజురోజుకు ఆందోళనలు ఉధృతం చేస్తూనే ఉన్నారు. తెలంగాణ విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు మండిపడుతూనే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, మానవహారాలు, రిలే దీక్షలతో ప్రజలు సమైక్య నినాదాన్ని హోరెత్తిస్తున్నారు. తమకు ఎన్ని కష్టాలు ఎదురైనా ఉద్యమబాట వీడబోమని, విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని వినూత్న రీతిలో ఆందోళనలు చేపడుతూనే ఉన్నారు. ఆర్టీసీ కార్మికుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో 350 బస్తాల బియ్యం, కడపలో 650 మంది ఆర్టీసీ కార్మికులకు పారా మెడికల్, మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో బియ్యం, బేడలు, నూనెను పంపిణీ చేసి తమవంతు చేయూత అందించారు. కడప నగరంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్ష భగ్నాన్ని నిరసిస్తూ వేలాది మంది విద్యార్థులు జగన్ ఫ్ల కార్డులు చేతబూని పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తూ కదం తొక్కారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. 650 మంది ఆర్టీసీ కార్మికులకు మెడికల్, పారా మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో బియ్యం, బేడలు, నూనె లాంటి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వీటితోపాటు మున్సిపల్ ఉద్యోగులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, పంచాయతీరాజ్, సాగునీటిపారుదల, వాణిజ్య పన్నులశాఖ, సమైక్య రాష్ట్ర పరిరక్షణ, వృత్తి విద్య కళాశాలల సమాఖ్య ఆధ్వర్యంలో సమైక్య వాదుల దీక్షలు కొనసాగాయి. జమ్మలమడుగు పట్టణంలో ఎన్జీఓల ఆధ్వర్యంలో వైద్యులు, నర్సులు భారీ ర్యాలీ నిర్వహించారు. అంధులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఆర్టీపీపీలో విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు చేపట్టారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. పులివెందుల పట్టణంలో ఎన్జీఓలు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీని చేపట్టారు. పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. ర్యాలీలో ప్రభుత్వ వైద్యులు, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రైతు దీక్షలకు సంఘీభావం తెలిపారు. ప్రొద్దుటూరులో క్రైస్తవుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ప్రైవేటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, న్యాయవాదుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. ఆస్పత్రుల్లో ఓపీని బయటే నిర్వహించి నిరసన తెలిపారు. కమలాపురం నియోజకవర్గంలోని వల్లూరులో జేఏసీ ఆధ్వర్యంలో సోనియా, షిండే దిష్టిబొమ్మలకు మాస్క్‌లు తొడిగి చెప్పులు, పొరకలతో కొడుతూ నిరసన తెలిపారు. చెన్నూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. రాజంపేటలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రైల్వేకోడూరులో ఉపాధ్యాయులు, ఎన్జీఓల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మోకాళ్లపై, వెనక్కి నడుస్తూ ఆందోళనలు చేపట్టారు. హెచ్ఎంఎం హైస్కూలు విద్యార్థులు విభజన జరిగితే కలిగే నష్టాలను వివరించే ఫ్ల కార్డులను చేతబూని ర్యాలీ నిర్వహించారు. మైదుకూరులో బాలశివ హైస్కూలు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి, నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. న్యాయవాదులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు దీక్షల్లో పాల్గొన్నారు. బద్వేలులో రాజుపాలెం సర్పంచ్ గుత్తి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో 50 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పోరుమామిళ్లలో వెంగమాంబ విద్యార్థులు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. పిరమిడ్ ఆకారంలో నిరసన తెలిపారు. కాశినాయన, కలసపాడులలో ఆందోళనలు కొనసాగాయి. రాయచోటి పట్టణంలో ఆర్టీసీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో దాతలు ఆర్టీసీ కార్మికులకు 350 బియ్యం బస్తాలను ఉచితంగా పంపిణీ చేశారు. సమైక్య జేఏసీ, న్యాయవాదుల దీక్షలు కొనసాగాయి. -
విద్యుత్ కోతతో విలవిల
అనంతపురం అగ్రికల్చర్, అర్బన్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా విద్యుత్ ఉద్యోగులు సేవలు నిలిపివేయడంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సోమవారం గంటల తరబడి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఫలితంగా బ్యాం కులు, ఆసుపత్రుల్లో కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. అనంతపురంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మధ్యాహ్నం 1.30 నుంచి రాత్రి 7 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలచిపోవడంతో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. ఎంఏసీ, సీఓటీ మినహా మిగతా అన్ని వార్డుల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఓ వైపు ఉక్కపోత, మరో వైపు దోమల రొదతో రోగులు సతమతమయ్యారు. ఐసీయూ రోగుల ఆర్తనాదాలతో నిండిపోయింది. ఎమర్జెన్సీ వార్డులోనూ అదే దుస్థితి. ప్రసూతి వార్డులో ప్రసవం జరుగుతున్న సమయంలో కరెంటు పోవడంతో వైద్యులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాలిన గాయాలతో చికిత్సలు పొందుతున్న రోగులు గాలి తగలక నరకయాతన అనుభవించారు. ప్రభుత్వంతో విద్యుత్ జే ఏసీ చర్చలు విఫలం అనంతపురం న్యూటౌన్: విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో ఆ శాఖ సీఎండీ నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరించడంతో సీమాంధ్ర ప్రాంతంలో విద్యుత్ సరఫరా ఆగిపోయి పలు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి మూడు సార్లు ట్రాన్స్‌కో సీఎండీ, రైల్వే అధికారులు జేఏసీ నాయకులతో జరిపిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో ఉద్యోగులెవరూ విధులకు హాజరు కావద్దని జేఏసీ నాయకులు సూచించారు. విద్యుత్ జేఏసీ రాష్ట్ర కోకన్వీనర్ రవిశంకర్, జిల్లా విద్యుత్ జేఏసీ చైర్మన్ సంపత్‌కుమార్ న్యూస్‌లైన్‌తో మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర అధికారులతో చర్చలు విఫలం కావడంతో సమ్మె కొనసాగిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ ఉపకేంద్రం ముట్టడి పరిగి, న్యూస్‌లైన్:మండల పరిధిలోని సేవామందిర్ కూడలిలో ఉన్న 220/132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని విద్యుత్ జేఏసీ నాయకులు సోమవారం ముట్టడించారు. ఈ సందర్భంగా జేఏసీ ైచైర్మన్ నాగరాజు మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంతంలోని ఉద్యోగులు జీతాలు అందవని తెలిసినా, శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తున్నామన్నారు. టీనోట్ ఆమోదించిన కేంద్ర కేబినేట్ దానిని తిరస్కరించేంత వరకు విధులకు హాజరుకామన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీలు విజయరాజు, రాజశేఖర్, ఏఈలు వెంకటేశులు, చెన్నకృష్ణయ్య, వేణుగోపాల్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
కేంద్ర మంత్రి పదవికి చిరంజీవి రాజీనామా!
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలుపడాన్ని నిరసిస్తూ కేంద్ర టూరిజం శాఖ మంత్రి కె. చిరంజీవి గురువారం రాత్రి తన పదవికి రాజీనామా సమర్పించినట్టు సమాచారం. తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి కార్యాలయానికి ఫ్యాక్ ద్వారా పంపినట్టు ఆయన వ్యక్తిగత కార్యదర్శి వెల్లడించారు. తెలంగాణ నోట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నారు. గత రెండు నెలలుగా సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమకారుల ఆగ్రహానికి చిరంజీవి గురైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ వర్కింగ్ కమిటి జూలై 30న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయానికి నిరసనగా చిరంజీవి రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సీమాంధ్ర జేఏసీ నేతలు పలుమార్లు చేసిన డిమాండ్ చేశారు. -
వైఎస్ఆర్సీపీ సమైక్యోద్యమం
సాక్షి, కర్నూలు: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ఢిల్లీ పెద్దల కళ్లు తెరిపించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. ఇప్పటికే సమైక్యోద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్న పార్టీ.. రానున్న నెల రోజుల్లోనూ తీవ్రత పెంచేందుకు కార్యాచరణ రూపొందించింది. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జాతీయోద్యమాన్ని శాంతియుత వాతావరణంలో నడిపించిన గాంధీజీ స్ఫూర్తితో నేటి నుంచి పార్టీ శ్రేణులు ఆందోళనబాట పట్టనున్నాయి. బుధవారం నుంచి జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు 48 గంటల నిరవధిక దీక్ష చేపట్టనున్నారు. తద్వారా ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న ప్రజలకు బాసటగా నిలిచేందుకు నిర్ణయించారు. సమైక్యాంధ్రకు ఆది నుంచి కట్టుబడిన పార్టీగా దీక్షలతో కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు నిర్ణయిస్తూ తాను కూడా ఆళ్లగడ్డలో దీక్ష చేపడుతున్నట్లు వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్ష ఉపనేత, ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి తెలిపారు. నంద్యాలలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్త భూమ నాగిరెడ్డి నేతృత్వంలో 65 మంది దీక్ష చేపట్టనున్నారు. కర్నూలులో నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి సతీమణి విజయమ్మ స్థానిక శ్రీకృష్ణదేవరాయల కూడలిలో చేపట్టనున్న దీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాణ్యం నియోజకవర్గ సమన్వయకర్త గౌరు చరిత ఆధ్వర్యంలో కర్నూలు-నంద్యాల రోడ్డులోని గౌరు శంకర్ ఆస్పత్రి వద్ద దీక్ష కొనసాగనుంది. ఆదోనిలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సాయిప్రసాద్‌రెడ్డి స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్ద 50 మందితో రిలే నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి తనయుడు జగన్మోహన్రెడ్డి సోమప్ప సర్కిల్లో నిరవధిక దీక్ష చేపట్టనున్నారు. మంత్రాలయంలోని రాఘవేంద్ర కూడలిలో తాజా మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నిరవధిక దీక్షకు సిద్ధం కాగా.. ఆయన సోదరుడు సీతారామిరెడ్డి కూమారుడు ప్రదీప్‌రెడ్డి ఆమరణ దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. నందికొట్కూరులోని పటేల్ సెంటర్లో పార్టీ ప్రచార కార్యదర్శి ఐజయ్య.. కోడుమూరులోని పాతబస్టాండ్ వద్ద నియోజకవర్గ సమన్వయకర్త మణిగాంధీ నిరవధిక దీక్షలో కూర్చొంటున్నారు. ఆలూరులో నియోజకవర్గ సమన్వయకర్త గుమ్మనూరు జయరాం అంబేద్కర్ సర్కిల్లో.. శ్రీశైలం డ్యాం వద్ద నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా రాజశేఖరరెడ్డి.. పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణిరెడ్డి వెల్దుర్తిలో దీక్ష చేపట్టనున్నారు. బనగానపల్లెలో నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రబోతుల వెంకటరెడ్డి, డోన్‌లో నియోజకవర్గ సమన్వయకర్త బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిలు నిరవధిక దీక్షకు ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైఎస్ఆర్సీపీ కార్యాచరణ అక్టోబర్ 2 నుంచి నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తల రిలే నిరవధిక దీక్షలు. 7న మంత్రులు, కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాల ఎదుట రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుత ధర్నాలు. 10న మండల కేంద్రాల్లో రైతులతో దీక్షలు. 17న నియోజకవర్గ కేంద్రాల్లో ఆటోలు, రిక్షాలతో ర్యాలీలు. 21న నియోజకవర్గ కేంద్రాల్లో మహిళలతో కార్యక్రమాలు, మానవహారాలు. 24న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు. 26న జిల్లాలోని సర్పంచ్‌లు, సర్పంచ్ పదవికి పోటీ చేసిన అభ్యర్థులతో కర్నూలులో ఒక రోజు దీక్ష. 29న నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువకులతో శాంతి ర్యాలీలు. నవంబర్ 1న జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు, సమైక్యాంధ్ర కోసం తీర్మానం. -
61వ రోజూ కొనసాగిన నిరసన కార్యక్రమాలు
అప్పుడు భవిష్యత్తు రంగురంగుల కల.. ఇప్పుడు గుండెల్లో మెదిలే పీడకల.. నాడు అందరి కళ్ల ముందు ఆశలసౌధాలు.. నేడు కన్నుల సందుల నిరాశానిస్పృహలు.. ఈ రోజు నేను చూస్తున్నదేమిటి? విధి ఇన్ని కత్తులు దూస్తున్న దేమిటి? మానవునిగా శిరస్సెత్తుకుని తిరగలేను.. భావి తరాల ముందు తలదించుకోలేను.. జరిగిందంతా చూస్తూ ఏమీ ఎరగనట్లు పడి ఉండాలా? నేను సాక్షీభూతుడ్ని కాను.. సాక్షాత్తు మానవుణ్ని.. తెలతెల వారగానే భావితరాల భవిష్యత్తుపై నాకు బెంగ..కలపండోయ్ భుజం.. భుజం.. కదలండోయ్ గజం..గజం.. అంటూ ప్రతి మనిషీ సమైక్య ఉద్యమంలో వినూత్న రీతిలో తన నిరసన తెలియజేస్తున్నాడు. విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్య ఉద్యమం ఉరకలెత్తుతోంది. రాష్ట్ర విభజ న ప్రకటన వచ్చినప్పటి నుంచి పలు రూపాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులతో పాటు రైతులు, ఆటోవాలాలు, అర్చకులు ఉద్యమంలో పాల్గొంటూ యూపీఏ తీరును ఎండగడుతున్నారు. జిల్లావ్యాప్తంగా జరుగుతున్న సమైక్య ఉద్యమం 61వ రోజు ఆదివారం కూడా కొనసాగింది. ఉద్యమంలో సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక (నాన్పొలిటిక ల్ జేఏసీ) కీలక పాత్ర పోషిస్తోంది. ఉద్యమం చేపట్టి రెండు నెలలు గడిచినా వేతనాలు రాకపోయినా... రోజురోజుకూ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. విజయనగరంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు చెవిలో పువ్వులు పెట్టుకు ని పట్టణంలో ర్యాలీ అనంతరం మంత్రి బొత్స ఇంటి ముందు ధర్నా చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపక, బోధనేతర సిబ్బంది జేఏసీ ఆధ్వర్యంలో సోనియా ఎదుట సమైక్యద్రోహుల భజన కార్యక్రమం చేశారు. మున్సిపల్ ఉద్యోగులు కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎర్రచెరువు వద్ద జలదీక్ష చేశారు. అలకానంద కాలనీ వాసుల ఆధ్వర్యంలో వంటావార్పు జరిగింది. మోటార్ సైకిల్ ర్యాలీ.. పార్వతీపురంటౌన్లో వైఎస్ఆర్సీపీ యువజన కన్వీనర్ మజ్జి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మోటార్‌సైకిల్ ర్యాలీ, వైఎస్ఆర్సీపీ వితరణతో పలుచోట్ల అన్నదానం చేశారు. అధ్యాపకులు,మున్సిపల్ ఉపాధ్యాయులు చేపలు విక్రయిస్తూ, పండ్లు అమ్ము తూ నిరసన తెలిపారు. సీమాంధ్ర కేంద్రమంత్రుల తీరును నిరసిస్తూ బెలగాంలో ఏపీఎన్జీఓ, జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర మం త్రుల దిష్టిబొమ్మలకు ఉరివేసి నిరసన తెలిపారు. ఉపాధ్యాయు లు జేఏసీ ఆధ్వర్యంలో ఆత్మఘోష, ఇంటర్‌విద్య జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏవిధంగా ఉంటుం ది, హైదరాబాద్‌లేని ఆంధ్రప్రదేశ్ ఏవిధంగా ఉంటుందో తెలి యజేస్తూ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. న్యాయవాదు లు ఒంటి కాళ్లతో కుర్చీలు ఎత్తి నిరసన తెలిపారు. సీతానగరంలో హనుమాన్జంక్షన్వద్ద 25మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో రిలేనిరాహార దీక్షలు కొనసాగించారు. జేఏసీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఆకులు మొలలకు కట్టుకుని నిరసన తెలిపారు. బొబ్బిలిలో వినూత్నంగా.. బొబ్బిలిలో ఉపాధ్యాయులు సమైక్యద్రోహుల మాస్కులు ధరిం చిన వారిని పొక్లెయినర్‌తో తొక్కిస్తున్నట్లు నిరసన వ్యక్తం చేస్తూ వారికి వ్యతిరేకంగా నినదించారు. ద్విచక్ర వాహనంపై పరారవుతున్న బొత్స దంపతుల సన్నివేశానికి ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు. కమ్మవలసలో అర్ధనగ్న ప్రదర్శనలు, పారాదిలో గేదెలు కడుగుతూ నిరసన తెలిపారు. బీజేపీ నేత సుష్మాస్వరాజ్ వ్యాఖ్యలకు నిరసనగా చీపురుపల్లి మూడు రోడ్ల జంక్షన్లో గంట సేపు ఉపాధ్యాయుల మానవహారం, ఆర్టీసీ, ఎన్జీవో, కోర్టు ఉద్యోగుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం మోకాళ్లపై నిరసన వ్యక్తం చేశారు. గరివిడి మేజర్ పంచాయతీ సర్పంచ్ బమ్మిడి కృష్ణమ్మ సమైక్యాంధ్రకు మద్దతుగా పంచాయతీ తీర్మానం చేయించి ఉపాధ్యాయ పోరాట కమిటీ కన్వీనర్ ఎ.సత్యశ్రీనివాస్‌కు తీర్మాన పత్రాలను అందజేశారు. నెల్లిమర్ల మండల కేంద్రంలో ఏపీ ఎన్జీవో ఆధ్వర్యంలో నగర పంచాయతీకి చెందిన 20 మంది రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పూసపాటిరేగ మండల కేంద్రంలో ఏపీ ఎన్జీవో ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రిక్షాలు తొక్కుతూ.. సాలూరులో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు జాతీయ రహదారిపై సామూహికంగా ఆసనాలు వేసి నిరసన తెలిపారు. గజపతినగరంలో ఎన్జీఓలు రిక్షాలు తొక్కి నిరసన తెలిపారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో జేఏసీ సభ్యులు చేపట్టిన దీక్షలకు విశ్వబ్రాహ్మణులు సంఘీభావం తెలిపారు. జియ్యమ్మవలస మండలంలో జేఏసీ ఆధ్వర్యంలో పెదమేరంగి జంక్షన్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. గురుగుబిల్లి మండలం పిట్టల మెట్టలో గ్రామస్తులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించా రు. కొమరాడ మండలం ఖేర్జల గ్రామస్తులు జాతీయరహదారిపై రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. కేంద్రం స్పందించే వరకూ పోరాటం కొనసాగిస్తామని జిల్లా ప్రజలు స్పష్టం చేస్తున్నారు. -
అందరూ కలసికట్టుగా విభజనను అడ్డుకోవాలి: జగన్ పిలుపు
-
ఉద్యమం దారిమళ్లించేందుకు టిడిపి కుట్ర:శోభానాగిరెడ్డి
హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని దారిమళ్లించడానికి టీడీపీ కుట్ర చేస్తుందని వైఎస్ఆర్ సిపి శాసనసభ్యురాలు శోభానాగి రెడ్డి ఆరోపించారు. విభజన లేఖను వెనక్కి తీసుకోకుండా ఉండేందుకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఎస్ కుటుంబంపై అడ్డగోలు వార్తలు రాపిస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మపై ఆరోపణలు రుజువు చేయలేకపోతే, సిఎం రమేశ్ శాశ్వతంగా పదవి నుంచి తప్పుకోవాలని సవాల్ విసిరారు. తమని ఎన్ని తిట్టిన పర్వాలేదని చంద్రబాబు విభజన లేఖను మాత్రం వెనక్కి తీసుకోవాలని కోరారు. రాష్ట్రం సమైక్యంగా ఉండడానికి చంద్రబాబు ముందుకు వస్తే తాము కూడా సహకరిస్తామని శోభానాగిరెడ్డి చెప్పారు. -
కర్నూలులో రేపే ‘సమైక్య’ సభ
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న ప్రజాగర్జన బహిరంగ సభ నిర్వహణకు వేదిక జిల్లా నేతల ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. 29వ తేదీ ఉదయానికే జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో శనివారం నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో నేతలు పని చేస్తున్నారు. వేదిక చైర్మన్ అశోక్‌బాబుతో పాటు 30 మంది రాష్ట్ర నాయకులు కార్యక్రమంలో పాల్గొననున్న దృష్ట్యా బహిరంగసభను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న సభకు సంబంధించిన ఏర్పాట్లను సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నేతలు వి.సి.హెచ్.వెంగల్రెడ్డి, క్రిష్టఫర్ దేవకుమార్, సంపత్‌కుమార్, శ్రీరాములు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న సభకు ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ ఉద్యోగులతో పాటు విద్యార్థులు, మేధావులు, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, రైతులను ఆహ్వానించారు. శుక్రవారం ఉదయం సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నేతలు జిల్లా ఎస్పీని కలసి బహిరంగ సభకు తగిన బందోబస్తు కల్పించాలని కోరారు. ఆదివారం ఉదయం 11 గంటలకే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రముఖ ప్రజా గాయకుడు వంగపండు ఆధ్వర్యంలో మొదలుపెట్టనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. బహిరంగ సభకు.. సాంస్కృతిక కార్యక్రమాలకు వేర్వేరుగా వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. సభ సజావుగా సాగేందుకు 500 మంది వాలంటీర్లను ఏర్పాటు చేయగా.. 60వేల మంది కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. వేలాదిమంది బహిరంగ సభ వేదిక ముందు భాగంలో కూర్చునేందుకు తగిన చర్యలు చేపడుతున్నారు. ఈనెల 29న తెలంగాణవాదులు హైదరాబాద్‌లో సకలజనుల సదస్సు నిర్వహించనుండటంతో.. దానికి దీటుగా కర్నూలులో సమైక్య రాష్ట్ర పరిరక్షణ బహిరంగ సభకు ఏర్పాట్లను నిర్వాహకులు ముమ్మరం చేశారు. జిల్లా చరిత్రలో ఇప్పటివరకు లేనివిధంగా చేపడుతున్న సభతో సమైక్యవాదాన్ని బలంగా వినిపించేందుకు జిల్లావాసులు సన్నద్ధులవుతున్నారు. ప్రజాగర్జన ఏర్పాట్లను వేదిక జిల్లా అధ్యక్షుడు వెంగళ్‌రెడ్డితో పాటు ఉద్యోగ సంఘాల నేతలు రమణ, ఇజ్రాయిల్, శ్రీనివాసులు, లక్ష్మన్న, పి.రామకృష్ణారెడ్డి, సర్దార్ అబ్దుల్ హమీద్ తదితరులు పరిశీలించారు. -
సమైక్యోద్యమం
సాక్షి, కర్నూలు: బిగిసిన ఉద్యమ పిడికిళ్లు.. గర్జించే గళాలు.. పోరుబాట వీడని అడుగులు.. జిల్లాలో సమైక్యోద్యమం ఉద్ధృతమవుతోంది. రెండు నెలలు గడిచినా.. ఆందోళనలతో ఇబ్బందులు తలెత్తుతున్నా భావి తరాల భవిష్యత్ దృష్ట్యా మౌనంగా భరిస్తూనే అన్ని వర్గాల ప్రజలు.. ఉద్యోగులు.. కార్మికులు సమైక్య వాణిని బలంగా వినిపిస్తున్నారు. విద్యార్థులు మేము సైతం అంటూ కదంతొక్కుతున్నారు. శుక్రవారం కర్నూలులో ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు సమరభేరి మ్రోగించారు. నంద్యాలలో ఇరిగేషన్ అధికారులు గంజి పంపిణీ చేసి విభజన జరిగితే మిగిలేది ఇదేనంటూ నిరసన తెలిపారు. పట్టణంలో చేపట్టిన రిలే దీక్షలో తెలుగుగంగ, ఎస్సార్బీసీ-1, 2 ఎస్ఈలు జయప్రకాష్, నరసింహమూర్తి, వెంకటరమణతో పాటు కడప, కర్నూలు జిల్లాలకు చెందిన ఈఈలు, డీఈలు పాల్గొన్నారు. ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించగా.. ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. ఆదోనిలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులు, సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలతో శవయాత్ర చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించి ఉద్యోగులు రోడ్డుపైనే స్నానాలు చేశారు. ఆళ్లగడ్డలో చిన్నకందుకూరు రైతులు ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నాలుగు రోడ్ల కూడలిలో మానవహరం నిర్మించారు. చాగలమర్రిలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు. శిరివెళ్ల మండలం యర్రగుంట్ల గ్రామంలో శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆలూరులో గ్రామ పంచాయతీ కాంట్రాక్టు కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టగా.. ఉపాధ్యాయ జేఏసీ నాయకులు మద్దతు పలికారు. హొళగుందలో పోస్టాఫీసు, టెలికం కార్యాలయాలను ఉపాధ్యాయ జేఏసీ నాయకులు ముట్టడించారు. ఎమ్మిగనూరులో ఏపీ ఎన్జీవోస్, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు.. తపాలా, బ్యాంక్‌లు, ఎల్ఐసీ కార్యలయాలను మూసివేయించారు. ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో విద్యార్థులకు రోడ్లపైనే పాఠాలు బోధించారు. వివిద పాఠశాలల విద్యార్థులు ర్యాలీగా వచ్చి సోమప్ప సర్కిల్లో మానవహరంగా ఏర్పడ్డారు. మార్కెట్ యార్డ్ కమిటీ ఆధ్యర్యంలో ఉద్యోగులు, వ్యాపారులు, హమాలీల ఆధ్వర్యంలో ముఖానికి నల్ల రిబ్బన్లు కట్టుకుని పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఆత్మకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు కర్నూలు-గుంటూరు రహదారిపైనే బోధన నిర్వహించి నిరసన తెలిపారు. డోన్‌లో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు 59వ రోజుకు చేరుకున్నాయి. ముస్లింలు ర్యాలీ నిర్వహించగా.. పీఈటీ టీచర్ల ఆధ్వర్యంలో విద్యార్థులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. -
ఎరువు.. బరువు
సాక్షి, ఏలూరు : ‘పశ్చిమ’ రైతులను ఖరీఫ్‌లోనూ కష్టా లు వదలడం లేదు. సకాలంలో సాగునీరు విడుదల చేయకపోవడం.. తగినంత వర్షపాతం నమోదైనా అదునులో కురవకపోవడం.. తెగుళ్లు, ఎలుకల బెడద వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతులను తాజాగా ఎరువుల ధరలు బెంబేలెత్తిస్తున్నారుు. సమైక్యాంధ్ర ఉద్యమం పేరుచెప్పి విక్రేతలు ఎరువుల ధరల్ని పెంచేశారు. ఏటా భారీగా పెరుగుతున్న ధరలు రైతుకు భారంగా మారుతుంటే.. తాజాగా సమైక్య ఉద్యమం కారణంగా రవాణా ఖర్చులు ఎక్కువవుతున్నాయంటూ ఆ భారాన్ని కూడా రైతుల నెత్తిమీదే వేస్తున్నారు. వ్యవసాయ శాఖ సిబ్బంది సమ్మెలో ఉండటం వ్యాపారులకు కలిసొచ్చింది. మరోవైపు అధిక ధర చెల్లించి ఎరువులు కొనలేక రైతులు వాటి వాడకాన్ని తగ్గిస్తున్నారు. ఫలితంగా వరిపైర్ల ఎదుగుదలమందగిస్తోంది. మరోవైపు పంటలపై చీడపీడలు విజృంభిస్తున్నాయి. వీటివల్ల దిగుబడి తగ్గిపోతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. బస్తాకు రూ.50 నుంచి రూ.100 అదనం జిల్లాలో 2.43 లక్షల హెక్టార్లలో వరి సాగు చేశారు. ఖరీఫ్ కాలానికి 2.75 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం. అంతకంటే ఎక్కువగానే ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు ముందునుంచీ చెబుతున్నారు. కానీ వాటిని కొనాలంటే మాత్రం రైతులు భయపడుతున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం రెండు నెలలుగా ప్రజలు ఉద్యమం చేస్తుండగా, దానిని తమకు అనుకూలంగా మార్చుకుని ఎరువుల విక్రేతలు ధరలు పెంచేశారు. రవాణా చేయడం చాలా కష్టంగా ఉందని, ఎరువులు కావాలంటే ఆ ఖర్చు భరించక తప్పదని రైతులకు చెబుతున్నారు. బస్తాకు రూ.50 నుంచి రూ.100 వరకూ అదనంగా వసూలు చేస్తున్నారు. అప్పులు చేసి కొందరు అధిక ధరకే ఎరువులు కొంటుంటే, మరికొందరు గత్యంతరం లేక వాటి వాడకాన్ని తగ్గిస్తున్నారు. ఏటా పెరుగుతున్న ధరలు పరిస్థితులతో సంబంధం లేకుండా ఏటా ఎరువుల ధరలు పెరుగుతూనే ఉన్నారుు. నాలుగేళ్ల క్రితం రూ.250 ఉన్న యూరియా ధర 2010 ఖరీఫ్‌లో రూ.275కి చేరింది. 2011 నాటికి రూ.278కి, 2012కి రూ.281కి ధర పెరిగింది. డీఏపీ 2010లో రూ.485 నుంచి రూ.571కు, 2011లో రూ.624కు, 2012లో రూ.950కు పెరిగిపోయింది. ఇదే కొన్ని కంపెనీలు రూ.1260కి అమ్ముతున్నాయి. ఇలా ప్రతి ఎరువు ధర గతంతో పొంతన లేకుండా పెరిగిపోయింది. ఈసారి సమైక్యాంధ్ర కోసం వ్యవసాయ శాఖ ఉద్యోగులు సమ్మె చేయడం కూడా ఎరువుల వ్యాపారులకు అనుకూలంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రైతుల నుంచి ఇష్టానుసారం ధరలు వసూలు చేస్తున్నారు. -
బోసిపోయిన అమ్మవారి ఆలయం
తిరుచానూరు, న్యూస్‌లైన్: పద్మావతీదేవి కొలువైన తిరుచానూరులోని ఆలయానికి మంగళవారం సమైక్య సెగ తగిలింది. అమ్మవారి ఆలయం భక్తులు లేక వెలవెలబోయింది. సమైక్య రాష్ట్రం కోరుతూ మంగళవారం జిల్లాలో బంద్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉద్యోగ జేఏసీతో పాటు వివిధ ప్రజా సంఘాలు బంద్‌లో పాల్గొని హైవేలలో వాహనాలను దిగ్బంధం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలో తిరుపతికి చేరుకున్న భక్తులు సైతం బస్సులు, ఇతరత్రా వాహనాలు లేకపోవడంతో ఆలయానికి చేరుకోలేక ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో అమ్మవారి ఆలయం భక్తులు లేక బోసిపోయింది. క్యూలు ఖాళీగా దర్శనమిచ్చాయి. కొందరు కాలినడకతో ఆలయానికి చేరుకున్నారు. రద్దీ లేకపోవడంతో భక్తులు పద్మావతి అమ్మవారిని తనివి తీరా దర్శించుకున్నారు. -
సమైక్య ఉద్యమానికి విద్యార్థులే స్ఫూర్తి
అనంతపురం సీటీ/ఎస్కేయూ, న్యూస్‌లైన్ : ‘రాష్ట్రాన్ని విభజిస్తూ 2009 డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించగానే మొట్టమొదటిసారి సమైక్య ఉ ద్యమానికి ఊపిరి పోసింది విద్యార్థులే.. ఆ స్ఫూర్తితోనే ప్రస్తుతం ఉద్యమ బాట పట్టాం’. ‘ప్రజా స్వామ్యాన్ని శాసిస్తున్న రాజకీయ పార్టీల నిర్ణయాలను తిరగరాసి.. స్వార్థ రాజకీయాలను ఎండగట్టాల్సిన ప్రథమ బాధ్యత విద్యార్థులపై ఉం ది’ అని ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు పిలుపునిచ్చారు. వర్సిటీలో సోమవారం నిర్వహించిన ‘ఎస్కే యూ సమైక్య భేరి’లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ముందుగా స మైక్య ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల ఆత్మ శాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో కొందరు నేతలు తీసుకుంటున్న స్వార్థ రాజకీయ నిర్ణయాల ద్వారా విద్యార్థులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాజకీ య పార్టీల నిర్ణయాలను తిరగరాసే నిర్ణయాత్మక శక్తిగా విద్యార్థులు అవతరించాలన్నారు. విభజనతో ఎక్కు వ శాతం నష్టపోయేది విద్యార్థులే న న్నారు. సీమాంధ్రలోని 13 జిల్లాల పరిధిలో 17 వర్శిటీలు ఉన్నాయని, ఏటా రూ.600 కోట్ల నిధులు అవసరమవుతాయన్నారు. విభజన జరిగి తే హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలోకి వెళ్తే నిధుల మంజూరులో కోత ఏర్పడుతుందన్నారు. వర్శిటీలు బలహీన పడుతాయన్నారు. ప్రభుత్వం నుంచి విద్యార్థులకు అందాల్సిన ఫీజు రియింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు, సంక్షేమ పథకాలకు నిధులు ప్రశ్నార్థకమవుతాయన్నారు. ఫలితంగా ఇంజినీరింగ్ విద్యార్థుల భవిత అంధకారం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిఏటా రాష్ట్ర ఆదాయం రూ.80 వేల కోట్లైతే కేవలం హైదరాబాద్ నుంచే రూ.40 వేల కోట్లు లభిస్తుండగా మిగిలిన జిల్లాల నుంచి రూ.40 వేలు వస్తోందన్నారు. హైదరాబాద్ తమదని తెలంగాణ వేర్పాటువాదులు వాదించడం సిగ్గుచేట న్నా రు. ప్రస్తుతం ప్రపంచ దే శాలు గుర్తించే స్థాయిలో హైదరాబాద్ ఖ్యాతి గడిం చిందన్నారు. సమైక్య ఉద్యమంలో వి ద్యార్థులు శాంతియుత ఆందోళనలు నిర్వహించాలని సూచించారు. రాజ కీయ నాయకులు చేయాల్సిన ఉద్యమాన్ని ఏడు లక్షల మంది ఉద్యోగులు త మ జీతాలను త్యాగం చేసి ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. సమైక్య ఉద్యమాన్ని 2014 వరకూ నడిపిస్తామని ఆపై ఉద్యమానికి ఊపిరి పోయాల్సిన బా ధ్యత విద్యార్థులపైనే ఉందన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే సమర్థ నాయకునికే 2014 ఎన్నికల్లో పట్టం కట్టల న్నారు. ఏపీ ఎన్జీఓ సంఘం ప్రధాన కా ర్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా సంయుక్త జేఏసీ చైర్మన్ హేమసాగర్, వివిధ జేఏసీల నాయకులు విశ్వనాథ్‌రెడ్డి, దేవరాజ్, నర్సయ్య, నరసింహులు, పుల్లారెడ్డి, చిరంజీవిరెడ్డి, రమణారెడ్డి, రామసుబ్బారావ్, అషఫ్అ్రలి, సంపత్‌కుమా ర్, గిరిధర్రావ్, రాజేశ్వరరావ్, సదాశివరెడ్డి, లింగారెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు. -
రాష్ట్రపతిని కలిసిన ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు.
-
సమైక్యతే లక్ష్యంగా..
సాక్షి, రాజమండ్రి : పాలపొంగులా అణగిపోతుందన్న పాలకపక్షం అంచనాను తలకిందులు చేస్తూ సమైక్య ఉద్యమం నానాటికీ తీవ్రతరమవుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయంపై కన్నెర్రజేస్తున్న సమైక్యవాదులు ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకూ విశ్రమించేది లేదంటున్నారు. శుక్రవారం జిల్లాలోని ఓఎన్జీసీ, రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి కే ంద్రాలను ముట్టడించారు. బీఎస్ఎన్ఎల్, తపాలా, ఎల్ఐసీ, సెంట్రల్ ఎక్సైజ్, జీవిత బీమా, ఎఫ్‌సీఐ తదితర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలను స్తంభింపజేశారు. కోనసీమ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, రైతులు, ఉపాధి కూలీలు, కార్మికులు, విద్యార్థులు, ఇతర వర్గాలకు చెందిన సుమారు 5000 మంది ఉదయం ఓడలరేవులోని ఓఎన్జీసీ టెర్మినల్‌ను ముట్టడించారు. ప్లాంటు లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. ప్లాంటు మూసివేసి సమైక్యాంధ్ర పరిరక్షణకు సహకరించాలని డిమాండ్ చేశారు. చర్చల అనంతరం చివరికి ఉత్పత్తి నిలిపివేస్తున్నట్టు అధికారులు లిఖితపూర్వకంగా ప్రకటించారు. మరోవైపు తాళ్లరేవు మండలం గాడిమొగలోని రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని సమైక్యవాదులు ముట్టడించి ఉత్పత్తి నిలుపు చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ, కోనసీమ ప్రాంతాల నుంచి ప్లాంటు వద్దకు చేరుకుని సమైక్య నినాదాలు చేశారు. ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ ప్లాంటులోని ‘ఎ’ షిఫ్టులో ఉత్పత్తి నిలుపు చేస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పడంతో సమైక్యవాదులు వెనుదిరిగారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ ప్లాంటులో ఉత్పత్తి నిలుపుచేశారు. కాగా ఈ నెల 16 నుంచి నిరవధికంగా ఉత్పత్తి నిలుపు చేసేలా ఈ ప్లాంటుపై ఒత్తిడి తెస్తామని జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు. సమైక్యవాదులు జిల్లావ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి, కార్యకలాపాలను స్తంభింప చేశారు. రాజమండ్రిలో ఏపీఎన్జీఓలు ఓఎన్జీసీ, గెయిల్, సెంట్రల్ ఎక్సైజ్, ఎల్ఐసీ, బీఎస్ఎన్ల్, తపాలా శాఖ కార్యాలయాలను ముట్టడించి ఉద్యోగులను బయటికి పంపారు. ఎన్జీఓల సంఘం అధ్యక్షులు గెద్దాడ హరిబాబు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ధవళేశ్వరంలో ఏపీఎన్జీఓలు ఓఎన్జీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. అమలాపురంలో ఆదాయపు పన్ను శాఖ, పోస్టాఫీసు, బీఎస్ఎన్ల్ కార్యాలయాలను ముట్టడించారు. ముమ్మిడివరంలో టెలిఫోన్ ఎక్సేంజి, పోస్టల్ కార్యాలయాలు, బ్యాంకులను ముట్టడించి సమైక్య నినాదాలు చేశారు. సామర్లకోటలో భారత ఆహార సంస్థ కార్యాలయాన్ని, పెద్దాపురంలో జీవిత బీమా సంస్థ కార్యాలయాలను ఎన్జీఓల ఆధ్వర్యంలో సమైక్యవాదులు మూయించారు. ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగులు జిల్లావ్యాప్తంగా విద్యుత్తు ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. రాజమండ్రిలో విద్యుత్తు ఉద్యోగుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈపీడీసీఎల్ సర్కిల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. కార్యాలయం గేటుకు తాళం వేసి సమైక్య నినాదాలు చేశారు. ఓ పక్క అత్యవసర సర్వీసులను పర్యవేక్షిస్తూ సిబ్బంది సమ్మె కొనసాగిస్తున్నారు. బొమ్మూరు 220 కేవీ విద్యుత్తు సబ్‌స్టేషన్ వద్ద ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేశారు. కాకినాడ రామారావుపేట విద్యుత్తు సబ్‌స్టేషన్ ఎదుట దీక్షలు చేపట్టారు. అమలాపురం డివిజన్‌కు చెందిన 200 మంది విద్యుత్తు ఉద్యోగులు కోనసీమ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో సబ్ స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన చేశారు. ఈదరపల్లి వంతెన వద్ద విద్యుత్తు ఉద్యోగులు రాస్తారోకోచేశారు. వీరికి ఆర్డీఓ సంపత్‌కుమార్ సంఘీభావం తెలిపారు. ఉద్యోగులు ర్యాలీగా వెళ్లి ఆర్టీసీ బస్టాండ్ వద్ద మానమహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. కాకినాడ రూరల్ రాయుడుపాలెం వద్ద విద్యుత్తు శాఖ ఉద్యోగులు నిరసన ర్యాలీ చేసి దీక్షల్లో పాల్గొన్నారు. రాజానగరంలో విద్యుత్తు ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షల్లో పాల్గొన్నారు. వారికి స్థానిక జేఏసీలతో పాటు రాజమండ్రి నుంచి మోటార్ సైకిళ్లపై విద్యుత్తు ఉద్యోగులు ర్యాలీగా వచ్చి సంఘీభావం తెలిపారు. విద్యుత్తు ఉద్యోగులు జగ్గంపేట సెంటర్లో మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. ప్రదర్శనలు, బంద్‌లు.. రాజమండ్రి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉద్యోగులు సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, వీరపాండ్య కట్టబ్రహ్మన్న, శ్రీనాథ కవిసార్వభౌముడు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు, తెలుగు తల్లి తదితర వేషధారణలతో సమైక్య నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. అంబాజీపేటలో పదిమంది సర్పంచ్‌లు కళ్లకు గంతలతో జేఏసీ దీక్షల్లో పాల్గొన్నారు. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం సెంటర్లో ఉపాధ్యాయుల జేఏసీ భిక్షాటన చేపట్టింది. పి.గన్నవరంలో భారీ జాతీయ పతాకంతో ఉపాధ్యాయులు ర్యాలీ చేశారు. షణ్యుఖ, సీతారామ యోగ శిక్షణా కేంద్రాల అభ్యాసకులు రోడ్డుపై యోగాసనాలు వేసి నిరసన తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో పిఠాపురంలో సమైక్యవాదులు బంద్ నిర్వహించారు. వ్యాపార సంస్థలు, విద్యాలయాలను మూయించారు. రోడ్లపై ర్యాలీచేసి నినాదాలు చేశారు. సామర్లకోట, పెద్దాపురం పట్టణాల్లో బంద్ సందర్భంగా ప్రధాన కూడళ్లలో సమైక్యవాదులు రాస్తారోకోలు చేశారు. మోటార్ సైకిల్ ర్యాలీ చేసి బంద్‌కు సహకరించాలని పిలుపునిచ్చారు. బంద్‌కు మద్దతుగా పెద్దాపురంలో తోపుడు బండ్ల సంఘం రోడ్డుపై తోపుడు బండ్లు పెట్టి ఐదు గంటల పాటు రాస్తారోకో చేశారు. జేఏసీ పిలుపు మేరకు ఏలేశ్వరంలో 48 గంటల బంద్ కొనసాగుతోంది. అంతటా సమైక్య నాదమే రాజమండ్రిలో ఆర్టీసీ ఉద్యోగులు డిపో వద్ద రిలే దీక్షలు ప్రారంభించారు. కంబాలచెరువు వద్ద విద్యార్థులు ర్యాలీ చేసి సమైక్య నినాదాలు చేశారు. బొమ్మూరు పాలిటెక్నిక్ ఉద్యోగులు ఒక్కరోజు రిలే దీక్ష చేపట్టారు. మోరంపూడి సెంటర్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగుతున్నాయి. కాకినాడలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన ర్యాలీ చేశారు, జెడ్పీ సెంటర్లో రాస్తారోకో చేశారు. జేఏసీ శిబిరం వద్ద ఉపాధ్యాయులు మోకాళ్లపై నిలబడి ఆందోళన చేశారు. అమలాపురం మండలం ఎన్.కొత్తపల్లిలో టైలర్లు ర్యాలీ చేసి జేఏసీ దీక్షల్లో పాల్గొన్నారు. ఉప్పలగుప్తంలో వాయిద్య కళాకారులు రాస్తారోకో చేశారు. రాజోలులో ఎల్ఐసీ ఏజెంట్లు రిలే దీక్షలు ప్రారంభించారు. సఖినేటి పల్లి మండలం టేకిశెట్టిపాలెంలో ఉద్యోగులు కార్లు తుడిచి నిరసన తెలిపారు. ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో టేకిశెట్టిపాలెంలో కొవ్వొత్తుల ప్రదర్శ చేశారు. తుని పట్టణంలో టాటా మేజిక్ వాహన నిర్వాహకులు ర్యాలీ చేసి చాంబర్ ఆఫ్ కామర్స్ జేఏసీ చేపట్టిన దీక్షల్లో పాల్గొన్నారు. దీక్షా శిబిరాలను ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు సందర్శించి సంఘీభావం తెలిపారు. శంఖవరం మండలం కత్తిపూడి వద్ద జాతీయ రహదారిపై ఆటో కార్మికులు రాస్తారోకో చేశారు. రౌతులపూడిలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు ర్యాలీ చేశారు. జ గ్గంపేటలో వివేకానంద పాఠశాల విద్యార్థులు రోడ్డుపై డ్రిల్లు చేస్తూ సమైక్య నినాదాలు చేశారు. గోకవరంలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులురోడ్డు ఊడ్చి నిరసన తెలిపారు. మండపేట కలువపువ్వు సెంటర్లో విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆకారంలో మానవ హారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. విద్యార్థిని సమైక్య పరుగు రామచంద్రపురం కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సునంద అనే విద్యార్థిని రామచంద్రపురం మండలం జువ్విపాడు నుంచి ఎల్ఐసీ భవనం వరకూ ఎనిమిది కిలోమీటర్లు సమైక్య పరుగు చేపట్టింది. ఆమెకు మద్దతుగా ఉపాధ్యాయులు మోటార్ సైకిల్ ర్యాలీ చేశారు. ఎరుకుల సంఘం ఆధ్వర్యంలో రామచంద్రపురంలో ర్యాలీ, రాస్తారోకో చేపట్టారు. కె.గంగవరం మండలం కుందూరులో ఉపాధ్యాయులు పాదయాత్ర చేశారు. రాజవొమ్మంగిలో ఉపాధ్యాయులు మోటారు సైకిల్ ర్యాలీ చేశారు. రంపచోడవరం అంబేద్కర్ సెంటర్లో ముస్లింలు వంటా వార్పూ చేపట్టారు. ఇంటింటా సమైక్య పతాకాలు ప్రతి ఇంటిపై సమైక్య జెండా ఎగుర వేయాలన్న లక్ష్యంలో భాగంగా జేఏసీ రాజానగరం మండల కలవచర్ల నుంచి కార్యక్రమం ప్రారంభించింది. మహిళలు ప్రతి ఇంటికీ వెళ్లి ఆ ఇంటి ఇల్లాలికి బొట్టు పెట్టి వారికి సమైక్య పతాకాన్ని అందించారు. కలవచర్లలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని ముట్టడించి ప్రధాన గేటుకు తాళం వేశారు. సీతానగరం మండలం ముగ్గళ్లలో సమైక్యవాదులు వంటా వార్పూ చేపట్టారు. సీతానగరంలో కొనసాగుతున్న జేఏసీ రిలే దీక్షల్లో 9 మంది సర్పంచ్, ఉప సర్పంచ్‌లు దీక్షలు చేపట్టారు. -
ముఖ్యమంత్రి కిరణ్‌పై ఎమ్మెల్యే శ్రీకాంత్ ప్రశ్నల వర్షం
-
నిధులున్నా నిలిచిన పింఛన్ల పంపిణీ
సాక్షి, కాకినాడ : సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్న ఉద్యోగులు, కార్మికులకు జీతాలే కాదు... వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఈనెల పింఛన్లు అందని పరిస్థితి నెలకొంది. సమైక్యాంధ్ర ఉద్యమం మొదలై 36 రోజులైంది. ఉవ్వెత్తున సాగుతున్న సమైక్య ఉద్యమం బడుగు జీవుల పాలిట ఆశనిపాతంగా మారింది.. జిల్లాలో ప్రస్తుతం 4,38,560 పింఛన్లు ఉండగా, వీటిలో 2,04, 703 వృద్దాప్య, 1,29,107 వితంతు, 60,094 వికలాంగ, 8331 చేనేత, 2377 కల్లుగీత పింఛన్లు ఉండగా,వైఎస్సార్ అభయహస్తం పథకం కింద మరో 33,948 పింఛన్లు అందజేస్తు న్నారు. వీటి కోసం ప్రతీఏటా రూ.12కోట్ల ఖర్చు చేస్తున్నారు. 35 మండలాల పరిధిలోని 2.30 లక్షల మందితో పాటు కార్పొరేషన్లు, మున్సిపాల్టీ పరిధిలోని 70వేలమందితో పాటు ఐ.పోలవరం, కాకినాడ రూరల్ మండలాల పరిధిలోని మరో 10వేల మంది పింఛన్‌దారులకు సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా పంపిణీ జరుగుతుండగా, ఇక మిగిలిన 21 మండలాల పరిధిలోని లక్షా 28వేల మందికి ఎంపీడీఒల ద్వారా పంపిణీ జరిగేది. పంపిణీపై సమ్మె ప్రభావం సమైక్య ఉద్యమం కారణంగా పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా తయారైంది. పింఛన్ కేటాయింపులు గ్రీన్‌చానల్ పరిధిలో ఉండడంతో నిధుల కేటాయింపులో ఇబ్బందుల్లేవు. నేరుగా సంబంధిత బ్యాంకులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ల అకౌంట్లలో పింఛన్‌దారుల సంఖ్యను బట్టి జమవుతుంది. అదే విధంగా ఈ నెల కూడా పింఛన్ మొత్తం వారి అకౌంట్లలో జమైంది. దీంతో సర్వీస్ప్రొవైడర్స్ ద్వారా పంపిణీకి బ్యాంకులు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ సమైక్య వాదులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కొన్ని మండలాల్లో గతరెండురోజులుగా పంపిణీకి సర్వీస్ ప్రొవైడర్స్ శ్రీకారం చుట్టగా, తామందరం సమ్మెలో ఉంటే తమ పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చి ఏ విధంగా పంపిణీ చేస్తారంటూ కార్యదర్శులు, ఇతర రెవెన్యూ సిబ్బంది వారిని అడ్డుకొని వెనక్కి పంపించేస్తున్నారు. దీంతో డబ్బులున్నప్పటికీ పంపిణీ చేయలేని పరిస్థితి నెలకొందని పలువురు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో ఈనెల 6 నుంచి పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ సమైక్యవాదుల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. సమ్మెకు తెరపడే వరకు పింఛన్ల పంపిణీ సజావుగా జరిగే సూచనలు కన్పించడం లేదు. పింఛన్ల పంపిణీపై సమ్మెప్రభావం పింఛన్ల పంపిణీపై సమ్మె ప్రభావం తీవ్రంగానే ఉంది. సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా పంపిణీకి ఆయా బ్యాంకులు ఏర్పాట్లు చేస్తున్నాయి. సమైక్యవాదులు అడ్డుకుంటున్న విషయం మా దృష్టికి రాలేదు. పింఛన్ల పంపిణీ జరిగేటట్టు సహకరించాల్సిందిగా సమ్మెలో ఉన్న ఎంపీడీఓలను కూడా కోరాం. సమ్మెలో ఉన్నందున వీలుపడదని వారు తేల్చి చెప్పారు. ఈ నెల 10వ తేదీ వరకు ఆగుతాం. ఆ తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా పంపిణీకి చర్యలు తీసుకుంటాం. - పి.చంద్రశేఖరరాజు, డీఆర్డీఏ పీడీ -
విభజనపై హైకమాండ్ తర్జన భర్జన: మంత్రి పితాని
-
ముప్ఫైరోజులైనా జోరు తగ్గని పోరు
సాక్షి, రాజమండ్రి : విభజించి లాభం పొందాలనే కుతంత్రంపై ‘తూర్పు’ కన్నెర్ర కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ ఏలికల దుర్నీతిపై జిల్లావాసులు ఒక్కొక్కరు ఒక్కో నిప్పుకణికలా మారి ముప్ఫైరోజులైనా వారిలో కాక అణుమాత్రం తగ్గలేదు. జిల్లాలో సమైక్య ఉద్యమం రగిలి గురువారం నాటికి నెల రోజులు పూర్తయింది. అయినా ఉద్యమం రోజు రోజుకూ ఉద్ధృతం అవుతూ, కొత్తపుంతలు తొక్కుతూ వస్తోంది. ప్రజలే నేతలుగా, సమైక్యత తప్ప వేరు భావన లేకుండా పోరు సాగుతోంది. ‘ఆత్మహత్యలు మా నైజం కాదు.. ఆత్మస్థైర్యమే మా యిజం’ అంటూ విద్యార్థులు, యువకులు గాంధేయ మార్గాల్లో సమైక్యరాష్ట్ర పరిరక్షణ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. మహాత్ముడు ఆదర్శంగా సత్యాగ్రహాలు, అమరజీవి స్ఫూర్తితో నిరాహార దీక్షలను సాగిస్తూ స్వాతంత్య్ర పోరాటాన్ని తలపింప చేస్తున్నారు. ప్రాణాలైనా పణంగా పెడతాం తప్ప రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వం అంటున్నారు. కాకినాడలో జేఎన్టీయూకే విద్యార్థులు డి.శ్రీనివాస్, ఎం వెంకటేశ్వర్లు, ఎం.లోకేష్, జి.అనిల్‌కుమార్, అనిల్‌కుమార్, కాకినాడ రూరల్ పరిధిలోని సర్పవరం జంక్షన్లో చందు యూత్ ఆధ్వర్యంలో చందు, ప్రసాద్, కృష్ణంరాజు, శ్రీనివాస్ చేపట్టిన ఆమరణ దీక్షలు రెండో రోజైన గురువారం కూడా జరిగాయి. రాజమండ్రి రూరల్ పిడింగొయ్యి పంచాయతీ బుచ్చియ్యనగర్‌లో ఉపాధి హామీ పథకం ఫీల్డు అసిస్టెంట్ గిరజాల చంద్రశేఖర్ గురువారం ఆమరణ దీక్ష ప్రారంభించాడు. ముమ్మిడివరంలో యువకుల ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేసి, ఆస్పత్రికి తరలించారు. విజయవంతంగా బంద్ హైదరాబాద్‌లో జేఏసీ నేతలపై తెలంగాణవాదులు అనుచితంగా ప్రవర్తించడానికి నిరసనగా జేఏసీ పిలుపునిచ్చిన బంద్ జిల్లాలో గురువారం విజయవంతమైంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, వ్యాపార వర్గాల జేఏసీలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. అన్ని మండల కేంద్రాల్లో బంద్ పాటించిన సమైక్య వాదులు రహదారులపై ర్యాలీలు చేపట్టి సమైక్యాంధ్ర నినాదాలను మారుమోగించారు. వ్యాపార సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూత పడ్డాయి. రాజమండ్రిలో జేఏసీ చేపట్టిన రెండు రోజుల సకల జనుల సమ్మె జయప్రదంగా ముగిసింది. ఐక్యతే బలమని చాటిన కలాలు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా రాజమండ్రి కంబాలచెరువు వద్ద వైఎస్సార్సీపీ నాయకుడు జక్కంపూడి రాజా చేపట్టిన ఆమరణ దీక్షా శిబిరం వద్ద.. పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్వంలో కవి సమ్మేళనం జరిగింది. పలువురు కవులు సమైక్యాంధ్ర ఆవశ్యకతను, ఐకమత్యం ఇచ్చే బలాన్ని, అభివృద్ధిని తమ కవితల్లో చాటారు. సమైక్యతను చాటుతూ విజయలక్ష్మి వినిపించిన కవిత జేజేలు అందుకుంది. పశువుల ఆస్పత్రి వద్ద ఆ శాఖ ఉద్యోగినులు తెలుగుతల్లి వేషధారణతో నిరసన దీక్షలు చేపట్టారు. పిఠాపురంలో న్యాయశాఖ ఉద్యోగుల సంఘం, వీఆర్వోలు, మున్సిపల్ ఉద్యోగులు చేపట్టిన నిరాహార శిబిరాల్లో తెలుగు భాషా దినోత్సవాలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు కాకినాడ జగన్నాథపురం అన్నమ్మ ఘాటీ నుంచి జేఎన్టీయూకే వరకూ బైక్ ర్యాలీ చేశారు. కోనసీమ మండలాల నుంచి ఉపాధ్యాయులు ముందు అమలాపురం చేరుకుని అక్కడి నుంచి సమైక్య నినాదాలతో కాకినాడ వచ్చారు. గ్రామ రెవెన్యూ అధికారులు కూడా కాకినాడలో ర్యాలీ చేశారు. మలికిపురంలో ర్యాలీని ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్సీ రవికిరణ్ వర్మను.. రాజీనామా చేసి ఉద్యమాల్లో పాల్గొనాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. తమతో భాగస్వాములైతేనే ర్యాలీని ప్రారంభించేందుకు అంగీకరిస్తామని చెప్పడంతో ఎమ్మెల్సీ వెనుదిరిగారు. రాజాకు విద్యార్థుల సంఘీభావం రాజమండ్రిలో గురువారం సిమెంటు వర్తకుల సంఘం సభ్యులు నగర వీధుల్లో ర్యాలీ చేసి కంబాలచెరువు వద్ద జక్కంపూడి రాజా దీక్షకు మద్దతు పలికారు. వివిధ కళాశాలలకు చెందిన సుమారు 5 వేల మంది విద్యార్థులు ప్రదర్శన చేసి రాజాకు సంఘీభావం తెలిపారు. వివిధ ప్రైవేట్ పాఠశాలల బస్సులతో నగర వీధుల్లో ర్యాలీ చేశారు. వ్యాపారులు మెయిన్‌రోడ్డులోని శాంతినివాస్ సెంటర్లో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి రిలే దీక్షలు చేశారు. కడియం మండలం పొట్టిలంక నుంచి వేమగిరి వరకూ మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ పాదయాత్ర చేశారు. అమలాపురంలో కొబ్బరి ఒలుపు, దింపు కార్యికులు ర్యాలీ చేసి గడియారస్తంభం సెంటర్లో రాస్తారోకో చేశారు. పశువులతో రహదారి దిగ్బంధం అల్లవరం మండలం బెండమూరులంకలో రైతులు రోడ్డుపై పశువులను నిలిపి దిగ్బంధం చేశారు. రాజోలులో వ్యవసాయ శాఖ ఉద్యోగులు, రైతులు రోడ్డుపై వరినాట్లు వేశారు. ముమ్మిడివరలో విద్యార్థులు రోడ్డుపై ఖోఖో, కబడ్డీ ఆడి రాష్ట్ర విభజన పట్ల నిరసన వ్యక్తం చేశారు. కొత్తపేట, రావులపాలెం, ఆలమూరు మండలాల్లో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలు ర్యాలీలు చేశాయి. మామిడికుదురు, అయినవిల్లి గ్రామాల్లో యూటీఎఫ్ రిలే దీక్షలు చేపట్టింది. పెద్దాపురం తహశీల్దారు కార్యాలయం వద్ద సమైక్యవాదులు ఉట్టి కొట్టి కృష్ణాష్టమి వేడుకలు చేశారు. ఏలేశ్వరం జూనియర్ కళాశాల విద్యార్థులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. రాజానగరంలో జాతీయ రహదారిపై జర్నలిస్టు సంఘాలు, జేఏసీ ప్రతినిధులు కలిసి వంటా వార్పు చేశారు. అనపర్తిలో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. మండపేటలో జేఏసీ ఆధ్వర్యంలో మోకాళ్లపై నిలుచుని నిరసన తెలిపారు -
పయ్యావుల కేశవ్‌ను అడ్డుకున్న సమైక్యవాదులు
అనంతపురం: టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను కల్యాణదుర్గంలో సమైక్యవాదులు అడ్డుకున్నారు. విభజనకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే కారణమని ఉద్యోగులు పయ్యావులతో వాగ్వాదానికి దిగారు. పయ్యావుల గో బ్యాక్ అంటూ సమైక్యవాదులు నినాదాలు చేశారు. దాంతో కల్యాణదుర్గంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రాన్ని విడగొట్టాలని కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడని సీమాంధ్రవాసులు భావిస్తున్నారు. చంద్రబాబు మద్దతుతోనే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దాంతో అందరూ టిడిపిపైన, చంద్రబాబుపైన ఆగ్రహంతో ఉన్నారు. -
ప్రశాంతంగా ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్
కర్నూలు (ఓల్డ్‌సిటీ), న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్య ఉద్యమం సాగుతున్నా ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌కు ఎలాంటి అంతరాయం లేదు. రాయలసీమ విశ్వ విద్యాలయంలోని ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ సెంటర్లో శనివారం 326 మంది విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలించి వారికి స్క్రాచ్‌కార్డులు అందజేశారు. ఒకటో ర్యాంకు నుంచి లక్ష ర్యాంకు వరకు విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలిచారు. సెంటర్ కోఆర్డినేటర్ సంజీవరావు పర్యవేక్షణలో ఆర్యూ ఆచార్యులు, అధ్యాపకులు ఆచార్య చక్రవర్తి, డాక్టర్ ఎన్. నరసింహులు, డాక్టర్ డి.వి.శేషయ్య, డాక్టర్ గీతానాథ్, జి.సురేంద్రబాబు, డాక్టర్ ఎం. రవిశంకర్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖల అధికారులు, ఉద్యోగులు జె. రవికుమార్, నాగలక్ష్మి, మహేశ్వర సింగ్, ధనుంజయ, వి. రాఘవేంద్ర, ఎ.ఎం.ప్రసాద్, అఫ్జల్ఖాన్ ధృవపత్రాల పరిశీలనలో పాల్గొన్నారు. వీసీ కృష్ణానాయక్ కౌన్సిలింగ్‌ను పరిశీలించారు. ఆదివారం 80 వేల నుంచి 90 వేల ర్యాంకుల వారికి మాత్రమే సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతుందని కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ సంజీవరావు తెలిపారు. తాలుకా సీఐ వీవీ నాయుడు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. -
చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న ఆందోళనలు
చిత్తూరు: సమైక్యాంధ్ర ఉద్యమం చిత్తూరు జిల్లాలో ఉధృతంగా కొనసాగుతోంది. వరదయ్యపాలెం బస్టాండ్‌లో ఆమరణ దీక్షలు 5వరోజు కొనసాగుతున్నాయి. జిల్లాలో 22 రోజులుగా ఆర్టీసి బస్సులు డిపోలకే పరిమితమైయ్యాయి. ఈ కారణంగా తిరుపతి ఆర్టీసి రీజియన్ 28 కోట్ల 30 లక్షల రూపాయల మేర ఆదాయం నష్టపోయింది. తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద జేఏసీ దీక్షలు 20వ రోజుకు చేరుకున్నాయి. ఎస్వీయూలో విద్యార్థుల జాక్ దీక్షలు 17వ రోజుకు చేరుకున్నాయి. ఆర్డీఓ కార్యాలయం వద్ద రెవెన్యూ ఉద్యోగుల దీక్షలు ఆరో రోజుకు, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్జీవోల దీక్ష 5వ రోజుకు, టీటీడీ కార్యాలయం వద్ద టీటీడీ ఉద్యోగుల దీక్షలు 17వ రోజుకు , న్యాయవాదుల దీక్షలు 4వ రోజుకు, కేబుల్ ఆపరేటర్ల దీక్షలు 18వ రోజుకు చేరుకున్నాయి. రుయా వద్ద వైద్యుల దీక్షలు కూడా కొనసాగుతున్నాయి.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన సమరదీక్షకు సంఘీభావంగా తుడా సర్కిల్ వద్ద కార్యకర్తలు చేపట్టిన దీక్ష 2వ రోజుకు చేరుకుంది. టీటీడీ నిర్వహించే మన గుడి కార్యక్రమంపై సమ్మె ప్రభావం పడింది. ఉద్యోగులు సమ్మె కారణంగా టీటీడీ అధికారులు నానా తంటాలు పడుతున్నారు. శ్రీవారి సేవకులతో మనగుడి కార్యక్రమం నిర్వహించారు. కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నిరాహార దీక్షలు చేస్తున్నారు. కార్యకర్తల ఆరోగ్య పరిస్థితి విషమించింది. దాంతో వైఎస్ఆర్సీపీ కుప్పం బంద్‌కు పిలుపునిచ్చింది. -
'ప్రజల గుండెల్లోంచి వచ్చిన సమైక్యాంధ్ర ఉద్యమం'
-
'ప్రజల గుండెల్లోంచి వచ్చిన సమైక్యాంధ్ర ఉద్యమం'
హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజల గుండెల్లోంచి వచ్చిందని, నాయకుల నుంచి కాదని టిడిపి రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ స్పష్టం చేశారు. తాను సమైక్యాంధ్రకే కట్టుబడిఉన్నానని ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర విభజన ప్రకటన ద్వారా రాక్షస రాజకీయ క్రీడకు యుపిఏ చైర్పర్స్న్ సోనియా గాంధీ తెరలేపారని విమర్శించారు. పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలను సోనియా అడ్డుకుని దమననీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తొలుత రాష్ట్ర విభజనను స్వాగతిస్తున్నట్లు ప్రకటించిన హరికృష్ణ ఆ తరువాత రాష్ట్ర విభజన తీరు బాగాలేదని నిరసన వ్యక్తం చేస్తూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అన్ని ప్రాంతాలకు సమ న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం ప్రతి తెలుగు వాడిని దిగ్భ్రాంతికి గురి చేస్తోందన్నారు. తెలుగు వారంతా కలిసి ఉండాలని ఎన్టీఆర్ కోరుకున్నారని, ఎవరిని అడిగి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ప్రశ్నించారు. తెలుగువారిని విడగొట్టే హక్కు సోనియా గాంధీకి ఎవరిచ్చారని హరికృష్ణ ప్రశ్నించారు. -
కొనసాగుతున్న సమైక్యవాదుల ఆందోళనలు
హైదరాబాద్: సీమాంధ్ర అంతటా సమైక్యవాదుల ఆందోళనా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్ర కోసం విశాఖ వాసులు చేపట్టిన నిరసనలు ఈరోజు కూడా కొనసాగుతున్నాయి. విశాఖ జిల్లాలో సమైక్యవాదు సమ్మె కారణంగా 1060 ఆర్టీసి బస్సులు డిపోలకే పరిమితమైయ్యాయి. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఏయూలో వంటావార్పు చేపడుతున్నారు. మద్దెలపాలెం సెంటర్లో తెలుగుతల్లి విగ్రహం ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, తిరుమలకు 106 బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు చెప్పారు. -
విభజనకు కారకుడు బాబు: కొడాలి నాని
-
సీమాంధ్రలో సకల బంద్
-
ఉవ్వెత్తున ఉద్యమం
సాక్షి, కడప : జిల్లాలో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. అన్ని వర్గాల ప్రజలు స్వచ్చందంగా రోడ్లపైకి చేరి వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు, వంటా వార్పులతో సమైక్యవాణిని బలంగా వినిపిస్తున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే తమ పోరు ఆగదని ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం మంగళవారం నుంచి సమ్మెసైరన్ మోగించడంతో జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. కడపలో గెజిటెడ్ ఉద్యోగులు సైతం తమ నిరసనను తెలియజేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి గాంధీజీ విగ్రహం వరకుర్యాలీని నిర్వహించారు. ఉపాధ్యాయ దీక్షలకు తమ మద్దతు తెలియజేశారు. కార్యచరణపై సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చర్చించారు. ఈ సమావేశంలో ఏజేసీ సుదర్శన్‌రెడ్డి, డీఆర్వో ఈశ్వరయ్యతోపాటు గెజిటెడ్ ఉద్యోగులందరూ పాల్గొన్నారు. మున్సిపల్ ఉద్యోగులు, పశుసంవర్ధకశాఖ ఉద్యోగులు సమావేశమై ఉద్యమ కార్యచరణను రూపొందించారు. ఇరిగేషన్ ఉద్యోగులు కార్యాలయం వద్ద వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. కళాకారులు, విద్యార్థులు నగరంలో పెద్ద ఎత్తునర్యాలీ చేపట్టి ఉపాధ్యాయ దీక్షలకు మద్దతు పలికారు. ఆర్టీసీ ఎన్ఎంయూ ఆధ్వర్యంలో కార్మికులు మోటారుసైకిల్ ర్యాలీ చేపట్టారు. న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతల్లో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, కాల్టెక్స్ హఫీజుల్లా, సంపత్‌కుమార్, పాండురంగారెడ్డిలు కలెక్టరేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వీరికి సంఘీభావం తెలిపేందుకు జనాలు భారీగా తరలి రావడంతో కలెక్టరేట్ ప్రాంగణం జనసంద్రంగా మారింది. అక్కడే వంటా వార్పును చేపట్టారు. ఈ దీక్షలకు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు, వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలిసభ్యుడు డీసీ గోవిందరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డిలు తమ సంఘీబావాన్ని తెలిపి మాట్లాడారు. పులివెందులలో నల్లపురెడ్డిపల్లె నుంచి భారీ సంఖ్యలో గ్రామస్తులు పాదయాత్రగా పట్టణానికి చేరుకుని కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. వీరికి వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలు తమ సంఘీభావాన్ని తెలియజేశారు. నలంద పాఠశాల విద్యార్థులు బోనాలు తలపై పెట్టుకుని సోనియాను దున్నపోతు ఆకారంలో తయారు చేసి పూల అంగళ్ల కూడలిలో వైఎస్ అవినాష్రెడ్డిచేత నరికించారు. పూల అంగళ్ల సర్కిల్లో దాదాపు 5 నుంచి 6 వేల మందికి పైగా విద్యార్థులతో మానవహారం నిర్మించారు. వీరికి టీడీపీ,కాంగ్రెస్ నాయకులు తమ మద్దతును తెలియజేశారు. రాయచోటిలో వినూత్న రీతిలో జేఏసీ నాయకులు జోలె పట్టుకుని భిక్షాటన చేశారు. జమ్మలమడుగులో రైతులు 100కు పైగా ఎడ్ల బండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో వేపరాలలో జ్యోతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఎర్రగుంట్లలో ఐసీఎల్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించి వంటా వార్పు చేపట్టారు. వీరికి ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి తమసంఘీభావాన్ని తెలియజేశారు. రాజంపేటలో మినీ ట్యాక్సీల యజమానులు భారీ ర్యాలీని నిర్వహించారు. రైల్వేకోడూరులో ఉద్యోగ, పొలిటికల్జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించి బస్సులను నిలిపి వేశారు. మైదుకూరులో ట్రాన్స్‌కో ఉద్యోగుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి వంటా వార్పు చేపట్టారు. బద్వేలులో ఆర్సీఎం, సీఎస్ఐ, బెస్థకా ప్రార్థనా మందిరాల ఆధ్వర్యంలో ఫాస్టర్లు, క్రైస్తవుల అసోసియేషన్ సభ్యులు శాంతి ర్యాలీని నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ప్రార్థనలు చేపట్టారు. అట్లూరులో జరిగిన సమైక్య ఉద్యమంలో మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి పాల్గొన్నారు. కమలాపురంలోని రామ్నగర్కాలనీ నుంచి పెద్ద ఎత్తున మహిళలు సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను ఊరేగింపుగా క్రాస్‌రోడ్డు వద్దకు ర్యాలీగా తీసుకొచ్చి చెప్పులు, పొరకలతో కొడుతూ దహనం చేశారు. ప్రొద్దుటూరులో గౌతమి మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఆ కళాశాల కరస్పాండెంట్, సిబ్బంది శివాలయం వీధిలో 35 మంది రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు ఎమ్మెల్యే లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు ఈవీ సుధాకర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. పొద్దుటూరు ముస్లిం ఫోరం ఆధ్వర్యంలో కోనేటి కాల్వ వీధిలో 25 మంది నిరాహార దీక్షలను చేపట్టారు. అన్ని మసీదు కమిటీల ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు వన్‌టౌన్ పోలీసుస్టేషన్ నుంచి పుట్టపర్తి సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. -
సమ్మె వల్ల సమస్యలు: మంత్రి ఆనం
హైదరాబాద్: ఏపీ ఎన్జీవోల సమ్మెవల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. మంత్రుల బృందంతో ఏపీ ఎన్జీవో నేతల చర్చలు ముగిసిన తరువాత మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఏపీ ఎన్జీవోల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బహిష్కరించడం సరికాదని మంత్రి అన్నారు. సమ్మె వాయిదా వేసుకోవడం కుదరదని ఎపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పిన విషయం తెలిసిందే. ఏపి ఎన్జీఓలు ఈ రోజు అర్ధ రాత్రి నుంచి సమ్మె చేయనున్నారు. -
సమ్మెవిరమించమని కోరాం: ఆనం
-
మరింత పెరిగిన ఉద్యమ జోరు
కలెక్టరేట్, నూస్లైన్: జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమం అవిశ్రాంతంగా ఉవ్వెత్తున కొనసాగుతోంది. విభిన్న, వినూత్న ఆందోళన కార్యక్రమాలతో ఉద్యమకారులు హోరెత్తిస్తున్నారు. చిన్నా పెద్దా తేడాలేకుండా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సం ఘాలు బైక్ ర్యాలీలు నిర్వహించగా క్రైస్తవ సోదరులు ప్రదర్శన, ప్రార్థనలు జరిపారు. పాలకొండలో వందలాది ఎడ్లబళ్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. పట్టణాన్ని దిగ్బంధిం చారు. పాతపట్నంలో సమైక్యాంధ్ర, తెలంగాణ గుర్రాల పోటీ నిర్వహించగా పలు ప్రాంతాల్లో రాస్తారోకోలు, వంటావార్పు, మానవహారాలు కొనసాగాయి. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాలతోపాటు కుల సంఘాల వారు కూడా పాలుపంచుకున్నారు. శ్రీకాకుళంలో జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీ అరసవల్లిలో ప్రారంభమై.. సూర్యమహల్, రామలక్ష్మణ, డే అండ్ నైట్ జంక్షన్, వైఎస్ఆర్ కూడలి మీదుగా పొట్టిశ్రీరాములు విగ్రహం వద్దకు చేరుకుంది. పట్టణ దేవాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎన్జీవో హోం నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం మానవహారం నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్యవైశ్య సంఘం, వాసవీ క్లబ్, వాసవి వనిత క్లబ్, ఆవోపాల ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు కూడలి వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జేసీస్ ఫెమినా మహిళలు కొవ్వొత్తులతో ర్యాలీ జరిపారు. జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ చేపట్టిన ర్యాలీ, మహిళా కళాశాల రోడ్డులోని క్రైస్తవారాధన మందిరం నుంచి సూర్యామహల్, జీటీ రోడ్డు మీదుగా వైఎస్ఆర్ కూడలికి చేరుకుంది. సూర్యమహల్ , వైఎస్ఆర్ కూడళ్లలో క్రైస్తవులు మోకాళ్లపై కూర్చుని ప్రార్ధనలు చేశారు. అక్కడి నుంచి పాలకొండ రోడ్డు మీదుగా డే అండ్ నైట్ కూడలి చేరుకొని ప్రార్ధనలు నిర్వహించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక మహిళా విభాగం కన్వీనర్ వై.గీత ఆధ్వర్యంలో మహిళలు పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. ఆమదాలవలస మండలం వంజంగి గ్రామస్తులు పాలకొండ రోడ్డు జంక్షన్ వరకు ర్యాలీ జరిపి మానవహారం నిర్వహించారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం రోడ్డును దిగ్బంధించారు. వంజంగిపేట యువకులు గ్రామ సమీపంలోగల సెల్‌టవర్ ఎక్కి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. పొందూరు మండలం లోలుగులో ఉద్యమకారులు ర్యాలీ తీసి రోడ్డును దిగ్బంధించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సరుబుజ్జిలి సెంటర్లో యువకులు రోడ్డు దిగ్బంధం నిర్వహించారు. చిగురువలస, పురుషోత్తపురం, షళంత్రి గ్రామాల వద్ద రోడ్లపై ఉద్యమకారులు బైఠాయించారు. పాలకొండలో జైభీమ్ నాటుబండ్ల సంఘం ఆధ్వర్యంలో నాటుబండ్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలవారు పాల్గొన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో బైఠాయింపు, రాస్తారోకో, సోనియా దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు జరిగాయి. భామిని మండలం ఘనసరలో బంద్ నిర్వహించారు. బాలేరు గ్రామంలో రోడ్డుపై వంటావార్పు చేపట్టారు. అనంతరం భోజనాలు చేశారు. భామినిలో రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. రాజాంలో కొవ్వొత్తులతో ప్రదర్శన జరిపి నిరసన తెలిపారు. నరసన్నపేటలో దేవాంగులు, విద్యుత్ ఉద్యోగులు, జేఏసీ ప్రతినిధులు ర్యాలీ చేపట్టి ప్రధాన రహదారిపై బైఠాయించారు. కొత్తూరులో సమక్యవాదులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. వందలాదిమంది యువకులు నాలుగు రోడ్ల కూడలిలో మానవహరంగా ఏర్పడ్డారు. వంగర బస్టాండ్ ఆవరణలో వివిధ గ్రామాలకు చెందిన యువకులు, మహిళలు, ఉద్యోగులు ధర్నా చేశారు. రణస్థలంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రామతీర్థం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సారవకోట మండలం దబడులక్ష్మిపురంలో ర్యాలీ నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. లావేరు మండలం కేశవరాయునిపాలెంలో మానవహారం నిర్వహించారు. పలాస-కాశీబుగ్గలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మతో శవయాత్ర చేపట్టారు. మూడు రోడ్ల కూడలి వద్దకు చేరుకుని సోనియా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కాశీబుగ్గ మూడు రోడ్లు కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. పలాస కాశీబుగ్గ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నాలుగో రోజు కూడా రిలేనిరాహార దీక్షలు కొనసాగాయి. -
సమైక్యాంధ్ర కోసం అర్ధనగ్న ప్రదర్శన
విజయవాడ: సమైక్యాంధ్ర కోసం ఈరోజు సీమాంధ్రలో పలు చోట్ల ఉద్యమకారులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కృష్ణా జిల్లా పెడనలో సమైక్యాధ్ర కోసం వైఎస్ఆర్సీపీ నేత ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష 4 వ రోజుకు చేరింది. సమైక్యాంధ్రకు మద్దతుగా మైలవరంలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో సమైక్యాంధ్రకు మద్ధతుగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో దేవిచౌక్ వద్ద సమైక్యవాదులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండీలో సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నేతలు సర్రాజు, వెంకటేశ్వరరాజు, రమేష్‌రాజు పాల్గొన్నారు. అనంతపురంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విద్యార్ధుల ర్యాలీ నిర్వహించారు. అధ్యాపకులు రిలే నిరాహర దీక్షలో పాల్గొన్నారు. -
12 అర్ద రాత్రి నుంచి ఉధృతంగా ఉద్యమం: ఎపీఎన్జీఓ
విజయవాడ: ఈ నెల 12వ తేదీ అర్ద రాత్రి నుంచి ఉద్యమం ఉధృతం చేస్తామని ఎపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు హెచ్చరించారు. 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఎపీ ఎన్జీఓలు సమ్మె చేయనున్న విషయం తెలిసిందే. 1986 తర్వాత రాష్ట్ర వ్యవస్థ మొత్తం సమ్మెలోకి వెళ్లడం ఇదే మొదటిసారని ఆయన తెలిపారు. విభజన కేవలం రాజకీయ నిర్ణయం మాత్రమేనన్నారు. సిడబ్ల్యూసి తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు ప్రకటించిన రోజు నుంచి ఏపి ఎన్జీఓలు ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తరువాత వారు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. 12 నుంచి ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేయాలన్న యోచనలో ఉన్నారు. -
ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: నగరంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలన్న కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒంగోలు బ్రాంచ్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల గ్రౌండ్ నుంచి సిబ్బంది బయలుదేరి ఆర్టీసీ బస్టాండు, అద్దంకి బస్టాండు, ట్రంకురోడ్డు, మిరియాలపాలెం మీదుగా చర్చి సెంటర్ వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం మానవహారం నిర్వహించారు. సమైక్యాంధ్ర డాక్టర్స్ జేఏసీ జిల్లా కన్వీనర్ డాక్టర్ కే సీతారామయ్య మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని సోనియాగాంధీ అగౌరవపరుస్తోందని మండిపడ్డారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడమే ఆమె ఎజెండా అని మండిపడ్డారు. డాక్టర్ వెంకయ్య మాట్లాడుతూ తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆశయాన్ని కాపాడాలని కోరారు. ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ నల్లూరి రాఘవరావు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒంగోలు బ్రాంచ్ ప్రతినిధులు సీహెచ్ చలమయ్య, కేశవ, కృష్ణారావు, ఆలూరి భాస్కరరావు, జయకిషోర్, రవికుమార్, యామినేని శ్రీధర్, విజయ్‌కుమార్, నామినేని కిరణ్‌కుమార్, పోలవరపు హరీష్, వెంకటరావు, నరసింహారావు, హనుమారెడ్డి, మెడికల్ కాలేజీ విద్యార్థుల జేఏసీ కన్వీనర్ రాహుల్ రాథోడ్, నాయకులు పీ వెంకటేశ్వర్లు, సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ రాయపాటి జగదీష్, నగర కన్వీనర్ సీహెచ్ అశోక్, నాయకులు జగన్నాథం, మహేష్, నర్సింగ్ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం
విజయవాడ: సీమాంధ్ర వ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమం వరుసగా 9వ రోజు కూడా కొనసాగుతోంది. వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలతోపాటు ప్రజా సంఘాల నేతలు కార్యకర్తలు కూడా ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నారు. విజయవాడ నగరంలోని బెంజ్‌సర్కిల్ సెంటర్లో కృష్ణాజిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ మానవహారం నిర్మించారు. అధికారులు పశువులతో వినూత్న ప్రదర్శన నిర్వహించారు. కృష్ణా జిల్లా గుడివాడ కోర్ట్ ఎదుట న్యాయవాదులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. నెహ్రు చౌక్ సెంటర్లో విద్యార్ధులు సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ ర్యాలీ చేశారు. వైఎస్ఆర్ జిల్లాలో పలు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. కడప కలెక్టరేట్ వద్ద ఆ పార్టీ నేతలు నిత్యానందరెడ్డి, వివేకానంద రెడ్డిలు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. జిల్లా కోర్టు వద్ద న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. రెవిన్యూ ఉద్యోగుల సంఘం విధులను బహిష్కరించి ర్యాలీ నిర్వహించింది. రిమ్స్‌లో డాక్టర్లు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. శంకరాపురంలో విద్యుత్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సర్కిల్లో సమక్యాంధ్రాకు మద్దతుగా ప్రైవేట్ స్కూల్స్ ఆధ్వర్యంలో వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. విశాఖ నగరంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నల్ల దుస్తులు దరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. సిటీ కన్వీనర్ ఉషా కిరణ్ ర్యాలీనీ ప్రారంభించారు. కాంగ్రెస్ చర్యల వల్లే రాష్ట్రం రావణకాస్టంలా మారిందని వారు మండిపడ్డారు. జేఏసీ ఏర్పాటుకు విశాఖ జర్నలిస్టులు నిర్ణయించారు. ఇక నుంచి సమైక్యాంధ్ర ఉద్యమానికి బాసటగా నిలుస్తామని సీనియర్ జర్నలిస్ట్ రమణ మూర్తి చెప్పారు. అనకాపల్లిలో ట్రాక్టర్ ఓనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర మంత్రి చిరంజీవి, టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు కనబడుటలేదని వాల్ పోస్టర్లు అతికంచారు. వెతికి అప్పగించిన వారికి లక్ష రూపాయల బహుమతి అని జెఎసి ప్రకటించింది. పాలకొల్లు గాంధీబొమ్మ సెంటర్లో సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్సీ మేక శేషుబాబు, ఎమ్మెల్యే బంగారు ఉషారాణిలు మద్దతు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో సమైక్యాంధ్రా ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు దీక్ష చేస్తున్నారు.