ఉవ్వెత్తున ఉద్యమం | all are participated in jai samaikyandhra movement | Sakshi
Sakshi News home page

ఉవ్వెత్తున ఉద్యమం

Published Tue, Aug 13 2013 4:33 AM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM

all are participated in jai samaikyandhra movement


 సాక్షి, కడప : జిల్లాలో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. అన్ని వర్గాల ప్రజలు స్వచ్చందంగా రోడ్లపైకి చేరి వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు, వంటా వార్పులతో సమైక్యవాణిని బలంగా వినిపిస్తున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే తమ పోరు ఆగదని ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం మంగళవారం నుంచి సమ్మెసైరన్ మోగించడంతో జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. కడపలో గెజిటెడ్ ఉద్యోగులు సైతం తమ నిరసనను తెలియజేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి గాంధీజీ విగ్రహం వరకుర్యాలీని నిర్వహించారు. ఉపాధ్యాయ దీక్షలకు తమ మద్దతు తెలియజేశారు. కార్యచరణపై సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చర్చించారు. ఈ సమావేశంలో ఏజేసీ సుదర్శన్‌రెడ్డి, డీఆర్వో ఈశ్వరయ్యతోపాటు గెజిటెడ్ ఉద్యోగులందరూ పాల్గొన్నారు. మున్సిపల్ ఉద్యోగులు, పశుసంవర్ధకశాఖ ఉద్యోగులు సమావేశమై ఉద్యమ కార్యచరణను రూపొందించారు. ఇరిగేషన్ ఉద్యోగులు కార్యాలయం వద్ద వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. కళాకారులు, విద్యార్థులు నగరంలో పెద్ద ఎత్తునర్యాలీ చేపట్టి ఉపాధ్యాయ దీక్షలకు మద్దతు పలికారు. ఆర్టీసీ ఎన్‌ఎంయూ ఆధ్వర్యంలో కార్మికులు మోటారుసైకిల్ ర్యాలీ చేపట్టారు. న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతల్లో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, కాల్‌టెక్స్ హఫీజుల్లా, సంపత్‌కుమార్, పాండురంగారెడ్డిలు కలెక్టరేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వీరికి సంఘీభావం తెలిపేందుకు జనాలు భారీగా తరలి రావడంతో కలెక్టరేట్ ప్రాంగణం జనసంద్రంగా మారింది. అక్కడే వంటా వార్పును చేపట్టారు. ఈ దీక్షలకు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు, వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలక మండలిసభ్యుడు డీసీ గోవిందరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డిలు తమ సంఘీబావాన్ని తెలిపి మాట్లాడారు.
 
  పులివెందులలో నల్లపురెడ్డిపల్లె నుంచి భారీ సంఖ్యలో గ్రామస్తులు పాదయాత్రగా పట్టణానికి చేరుకుని కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. వీరికి వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలు తమ సంఘీభావాన్ని తెలియజేశారు. నలంద పాఠశాల విద్యార్థులు బోనాలు తలపై పెట్టుకుని సోనియాను దున్నపోతు ఆకారంలో తయారు చేసి పూల అంగళ్ల కూడలిలో వైఎస్ అవినాష్‌రెడ్డిచేత నరికించారు. పూల అంగళ్ల సర్కిల్‌లో దాదాపు 5 నుంచి 6 వేల మందికి పైగా విద్యార్థులతో మానవహారం నిర్మించారు. వీరికి టీడీపీ,కాంగ్రెస్ నాయకులు తమ మద్దతును తెలియజేశారు.  
 
  రాయచోటిలో వినూత్న రీతిలో జేఏసీ నాయకులు జోలె పట్టుకుని భిక్షాటన చేశారు.
  జమ్మలమడుగులో రైతులు 100కు పైగా ఎడ్ల బండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.  సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో వేపరాలలో జ్యోతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.  ఎర్రగుంట్లలో ఐసీఎల్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించి వంటా వార్పు చేపట్టారు. వీరికి ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి తమసంఘీభావాన్ని తెలియజేశారు.
  రాజంపేటలో మినీ ట్యాక్సీల యజమానులు భారీ ర్యాలీని నిర్వహించారు. రైల్వేకోడూరులో ఉద్యోగ, పొలిటికల్‌జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించి బస్సులను నిలిపి వేశారు.  
  మైదుకూరులో ట్రాన్స్‌కో ఉద్యోగుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి వంటా వార్పు చేపట్టారు.
  బద్వేలులో ఆర్సీఎం, సీఎస్‌ఐ, బెస్థకా ప్రార్థనా మందిరాల ఆధ్వర్యంలో ఫాస్టర్లు, క్రైస్తవుల అసోసియేషన్ సభ్యులు శాంతి ర్యాలీని నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ప్రార్థనలు చేపట్టారు.  అట్లూరులో జరిగిన సమైక్య ఉద్యమంలో మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి పాల్గొన్నారు.  
  కమలాపురంలోని రామ్‌నగర్‌కాలనీ నుంచి పెద్ద ఎత్తున మహిళలు సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను ఊరేగింపుగా క్రాస్‌రోడ్డు వద్దకు ర్యాలీగా తీసుకొచ్చి చెప్పులు, పొరకలతో కొడుతూ దహనం చేశారు.
  ప్రొద్దుటూరులో గౌతమి మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఆ కళాశాల కరస్పాండెంట్, సిబ్బంది శివాలయం వీధిలో 35 మంది రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు ఎమ్మెల్యే లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకుడు ఈవీ సుధాకర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.  పొద్దుటూరు ముస్లిం ఫోరం ఆధ్వర్యంలో కోనేటి కాల్వ వీధిలో 25 మంది నిరాహార దీక్షలను చేపట్టారు. అన్ని మసీదు కమిటీల ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు వన్‌టౌన్ పోలీసుస్టేషన్ నుంచి పుట్టపర్తి సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement