సాక్షి ప్రతినిధి, గుంటూరు : గ్రామీణ ప్రాంతాల్లో శుక్రవారం సమైక్య నినాదం మారుమోగింది. దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు గ్రామ సభలు నిర్వహించి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేశారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఎడారిగా మారుతుందని, విద్యార్థులు, నిరుద్యోగుల తోపాటు అన్ని వర్గాలకు సమస్యలు ఏర్పడతాయని ఆ తీర్మానంలో ఆందోళన వ్యక్తం చేశారు. మరికొన్ని గ్రామాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు ప్రజల సమక్షంలో గ్రామ సభలు నిర్వహించి తీర్మానం చేయించారు. ఈ కాపీలను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తల ద్వారా జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్‌కు పంపించారు. అనంతరం ఆ తీర్మానాల కాపీలను ఫ్యాక్స్ ద్వారా రాష్ట్రపతి, ప్రధానమంత్రికి పంపారు. రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య రాష్ట్ర విభజనకు సహకరించిన నేతల (సోనియా, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స సత్యనా రాయణ, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తదితరుల ) దిష్టిబొమ్మలను వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు దహనం చేశారు.
చిలకలూరిపేటలో పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ అధ్వర్యంలో కళామందిర్ సెంటరులో, కృష్ణా, గుంటూరు జిల్లాల కోఆర్డినేటర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆధ్వర్యంలో మంగళగిరిలో , గురజాల నియోజకవర్గ సమన్వయకర్త జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో దాచేపల్లిలోని బంగ్లా సెంటరులో దిష్టిబొమ్మలను దహనం చేశారు. మాచర్లలోని పొట్టిశ్రీరాములు విగ్రహం ఎదుట పార్టీ నాయకులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు సమైక్యానికి మద్దతుగా, విభజనకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేశారు.
గుంటూరులో మానవహారం
విద్యానగర్,(గుంటూరు) : రాష్ట్ర విభజన ప్రక్రియ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవాల్సిందేనని వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ అర్బన్ కమిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం హిందూ కళాశాల సెంటర్‌లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యఅతిథి అప్పిరెడ్డి మాట్లాడుతూ జగన్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణను తగ్గించేందుకు రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆరోపించారు. అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. రోడ్డుపై బైఠాయించి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు.
సమైక్యానికి జై
Published Sat, Nov 2 2013 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM
Advertisement
Advertisement