పైడికొండంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల అవకతవకలపై విచారణ చేస్తున్న అధికారులు
తొండంగి (తుని): వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ(ఐఎస్‌ఎల్) పథకంలో తొండంగి మండలం పైడికొండ పంచాయతీలో జరిగిన అవకతవకలను వెలికిస్తూ ‘సాక్షి’ గతేడాది ‘కనికట్టు’ పేరుతో కథనాన్ని ప్రచురించింది. మరోవైపు బాధిత లబ్ధిదారులు ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన నేప«థ్యంలో బుధవారం పైడికొండ, ఆనూరు గ్రామాల్లో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. పైడికొండ పంచాయతీ ఆనూరు గ్రామంలో లబ్ధిదారులకు తెలియకుండానే ఎన్జీఓ పేరుతో కాంట్రాక్టర్, పంచాయతీ కార్యదర్శి కలిసి నిధులు దుర్వినియోగం చేసిన వ్యవహారంపై కొంత కాలం క్రితం బాధిత గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ పంచాయతీలో 684 మరుగుదొడ్లు నిర్మించినట్టు ఆన్‌లైన్‌లో పేర్కొనడంతోపాటు తొంభైశాతం మరగుదొడ్లకు కాంట్రాక్టర్‌కు చెల్లింపులు జరిగాయి.
దాదాపుగా పంచాయతీలోనే 70 నుంచి 80 లక్షల వరకూ అవినీతి జరిగిందని అంచనా. కాగా దీనిపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జెడ్పీ సీఈవోను విచారణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఏవో సుబ్బారావు, ఇతర అధికారులను విచారణ చేయాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కాకినాడ నుంచి ఏఓ సుబ్బారావు కొద్ది రోజుల క్రితం మండల పరిషత్ కార్యాలయంలో ప్రాథమికంగా రికార్డులు పరిశీలించి నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టర్‌కు చెల్లింపు జరిగినట్టు నిర్ధారించుకున్నారు. అనంతరం బాధితులందరూ కలిసి విచారణ పక్కదారి పడుతుందన్న అనుమానంతో క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని మరో మారు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో పైడికొండ, ఆనూరు గ్రామల్లో 32 మందితో కూడిన అధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేసింది.
పంచాయతీ కార్యాలయం వద్ద అధికారులనునిలదీసిన గ్రామస్తులు
గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించామని నిధులు కాజేసిన వ్యవహారంపై కనీస సమాచారం ఇవ్వకుండా అధికారులు విచారణకు రావడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కచ్చితంగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీఓ భమిడి శివమూర్తితో సహా, విచారణ అధికారుల బృందాన్ని గ్రామస్తులు నిలదీశారు. దీనిపై అధికారులు వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఏమి జరిగిందో తెలుసుకోవడానికే పరిశీలనకు వచ్చామని గ్రామస్తులకు వివరించారు. గ్రామంలో వారు విచారణ నిర్వహించారు. పైడికొండ పంచాయతీ ఆనూరు గ్రామంలో ఎనిమిది మంది నాలుగు బృందాలుగా, మిగిలిన దాదాపు 11 బృందాలు పైడికొండ గ్రామంలో ఇంటింటా తిరిగి పరిశీలన జరిపారు. వాస్తవంగా మరుగుదొడ్డి ఉందా? ఎప్పుడు నిర్మించుకున్నారు?, ఎవరు నిర్మించారు?, నిధులు అందాయలా? లేదా? అన్న విషయాలపై విచారణ జరుపుతున్నట్టు విచారణ అధికారి ఏవో సుబ్బారావు తెలిపారు. నిధులు దుర్వినియోగం అయినట్టు ప్రాథమికంగానే గుర్తించామని, ఏ స్థాయిలో జరిగిందనేది క్షేత్రస్థాయి పరిశీలనలో తేలుతుందని ఆయన వివరించారు. దీనిపై సమగ్రమైన నివేదికను జిల్లా పరిషత్ సీఈవోకు అందజేస్తామన్నారు.
నాకు తెలియకుండా నిధులు దుర్వినియోగం చేశారు
మా పంచాయతీలో ఐఎస్‌ఎల్ నిర్మాణాలు చేపట్టారు. దీనిపై నాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా కార్యదర్శి, ఎంపీడీవో కలిసి నిధులు ఖర్చు చేశారు. జాయింట్ చెక్ పవర్ ఉన్నా నా ప్రమేయం లేకుండా ఖర్చు చేశారు. దీనిపై 19న జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాను.– పైడికొండ సర్పంచ్ భవిరిశెట్టి లోవ
విచారణకు వచ్చిన అధికారులకు ఫిర్యాదు
ఆనూరులో ఐఎస్‌ఎల్‌పై పరిశీలనకు వచ్చిన అధికారుల బృందానికి లబ్ధిదారులు కొంత మంది నిధులు అందలేదని ఫిర్యాదు చేశారు. తాము సొంత ఖర్చులతో మరుగుదొడ్లు నిర్మించుకున్నామని తెలిపారు. మరికొంత మంది మరుగుదొడ్డే నిర్మించుకోలేదని, కానీ తమపేరున తమకు తెలియకుండానే నిధులు విడుదల చేసుకున్నట్టు వచ్చిన అధికారులకు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment