FUNDS WASTAGE
-
సరిలేరు మాకెవ్వరూ... అనవసర ఖర్చుల్లో ‘ గ్రేటర్’
జీహెచ్ఎంసీ మేయర్ క్యాంప్ కార్యాలయానికి (ఇంటి వద్ద) కానోపి షెడ్ నిర్మాణం కోసమంటూ దాదాపు రూ. 4.18 లక్షల అంచనా వ్యయంతో టెండరు పిలిచారు. ఇలా జీహెచ్ఎంసీలో మేయర్, డిప్యూటీ మేయర్, తదితరులు తాము ఏవి కావాలనుకుంటే అవి చేయించుకుంటున్నారు. ఓవైపు జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా.. వారు మాత్రం దేనికీ వెనుకాడటం లేరు. ప్రస్తుత పరిస్థితికి ఇది ఓ మచ్చుతునక ! – సాక్షి,సిటీబ్యూరో బల్దియా అంటే అంతే మరి.. జీహెచ్ఎంసీ ఖజానాలో చేరాల్సిన సొమ్మును ఉద్యోగులు సొంతానికి వాడుకుంటారు. ఇతర శాఖల్లో పనిచేసినప్పుడు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించినా ఎలాంటి వాహనం లేనివారికి ఇక్కడికి రాగానే వాహనం వచ్చి వాలుతుంది. ఇక ఉన్నతాధికారులు, పాలకమండలి సభ్యులైతే బల్దియా భవనాన్ని తమ సొంత ఇల్లే అనుకుంటారు. ఇంటికైనా రంగులు వేయాలనుకుంటే వెనుకాముందు కాస్త ఆలోచిస్తారేమో కానీ.. ఇక్కడ మాత్రం బాగున్నవాటిని సైతం కూలగొట్టి గొప్పగా కట్టించుకుంటారు. ఇలా ఎందుకంటే.. ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సిన అవసరం లేదు. వ్యయానికి నిధుల పరిమితి లేదు. అందుకే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సైతం ఖరీదైనవి కొంటారు. పాలకమండలి కొత్తదా, పాతదా అన్న తేడా లేదు. పదవి పోయాక వాటికి ఇంటికి తీసుకెళ్తారు. అధికారులూ ఆడంబరాలకు పోతారు. చేసిన అప్పులకు రోజుకు సగటున కోటి రూపాయల వడ్డీ కడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ దర్పం ఏమాత్రం తగ్గకుండా బాగున్నవి కూల్చి కొత్తగా కడుతుండటం చూసి ఎవరైనా ఆశ్చర్యపోవచ్చుకానీ.. వారికవి మామూలే. ప్రధాన కార్యాలయ భవనంలో గత రెండు మూడేళ్లుగా ఎప్పుడూ ఏదో ఒక నిర్మాణ పని జరుగుతూనే ఉంది. కాళేశ్వరం, మిషన్ భగీరథల వంటి ప్రాజెక్టులు, ఎన్నో ఫ్లై ఓవర్లు పూర్తయినా.. ఇక్కడ ఎప్పుడూ ఏదో పని జరుగుతూనే ఉంటుంది. అందుకు కారణం .. వారికే తెలుసు. ఇక పనులే కాదు.. ఏవిషయంలోనూ ఖర్చులకు వెనుకాడరు. టీ , బిస్కెట్ల నుంచి ఉత్సవాల నిర్వహణల వరకు ఖర్చు గ్రాండ్‌గా ఉండాల్సిందే. పాత పాలకమండలి.. కొత్త పాలకమండలి.. అప్పటి అధికారులు, ఇప్పటి అధికారులు అనే తేడా ఏం లేదు. అందరూ అతిరథులే.. ఖర్చుల మహారథులే. చెప్పుకుంటే.. ఎంతెంతో.. ► బల్దియాలో చాలామంది ఘనాపాటీలే. జీహెచ్ఎంసీ ఏర్పాటయ్యాక తొలి పాలకమండలి (2009–14)లో రెండు పార్టీల ఫ్లోర్‌లీడర్లు బల్దియాకు చెందిన సోఫాలు, జనరేటర్లు వంటివి సైతం ఇళ్లకు తరలించుకు వెళ్లారు. వారి కార్యాలయాల్లో ఉన్న వాటిని తమ పదవి పోగానే వాటిని సైతం ఇళ్లకు తీసుకెవెళ్లారు. ► కాగిత రహిత పాలన కింద ల్యాప్‌టాప్‌లు తీసుకొని తిరిగి ఇచ్చేయని వారెందరో. ► అధ్యయన యాత్రల పేరిట..వాటికి వెళ్లకుండానే అందుకయ్యే ఖర్చు దాదాపు లక్ష రూపాయలకు పైగా సొంత జేబుల్లో వేసుకున్నవారున్నారు. ప్రస్తుత పాలకమండలి అయితే.. ► మేయర్ క్యాంప్ కార్యాలయంలో(ఇంట్లో) కరెంట్ లేదంటూ భారీ ఇన్వర్టర్ను కోరడం రచ్చ కావడంతో వెనక్కు తగ్గారు. ► డిప్యూటీ మేయర్ కార్యాలయం ఆధునీకరణ చేపట్టారు. గత డిప్యూటీ మేయర్ కంటే తక్కువేం కాదంటూ రూ. 20 లక్షలు ఖర్చుచేస్తున్నారు. గత పాలక మండలి కూడా తక్కువేం కాదు.. ► గత పాలకమండలి(2016–21)లో డిప్యూటీ మేయర్ చాంబర్ ఆధునీకరణ పేరిట దాదాపు రూ. 20 లక్షలు ఖర్చు చేశారు ► ఖరీదైన సెల్ఫోన్లు పాలక మండలి సభ్యులతోపాటు మేయర్ పేషీల్లోని ఉద్యోగులు సైతం పొందారు. ► మేయర్ కోసం ఒకటో అంతస్తులో ఒక చాంబర్ ఉండగా, పైన ఏడో అంతస్తులో మరొకటి ఏర్పాటు చేసుకున్నారు. అధికారులూ అంతే.. ► బాగున్న పన్వర్హాల్ను ఆధునీకరణ పేరిట లక్షలు ఖర్చు చేసి.. అసౌకర్యంగా మార్చారు. ► ప్రతి సోమవారం ప్రజావాణి, ఫేస్ టూ ఫేస్ వంటి కార్యక్రమాలేవీ లేకున్నా హాస్పిటాలిటీ ఖర్చులు మాత్రం భారీగా పెరిగాయి. పన్వర్ హాల్లో విలేకరుల సమావేశం పెట్టినా రూ. 20వేలు ఖర్చు చూపిస్తారు. ► ఎంతో మోజుపడి అద్దంలా చాంబర్లకు హంగులదుకున్న అధికారులు.. ఆ చాంబర్ల సౌఖ్యం పొందకుండానే బదిలీ అయి వెళ్లడం విచిత్రం. ► ఒక విభాగం ఆధునీకరణ పనుల కోసం దాదాపు రూ. 2 కోట్లు ఖర్చు చేశారు. కొన్ని విభాగాల పనులుఇంకా జరుగుతున్నాయి. ► చెప్పుకుంటూ పోతే.. బల్దియాలో ఇలాంటిచిత్రవిచిత్రాలింకా ఎన్నెన్నో ! పొదుపు పాటించాలి.. దుబారా ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటించాలి. ప్రస్తుతం నెలనెలా జీతాల చెల్లింపులకే ఇబ్బందులు పడుతున్న తరుణంలో వృథా ఖర్చుల్ని నిలిపివేస్తే మేలు. ప్రజలు చెల్లించిన పన్నుల నిధుల్ని ప్రజా సదుపాయాలకు వాడాలి. – పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ బల్దియా చట్టంలో ఖర్చు చేయొచ్చని లేదు.. మేయర్, డిప్యూటీ మేయర్ల చాంబర్లకు ఖర్చుచేయాలని బల్దియా చట్టంలో లేదు. క్యాంప్ కార్యాలయ నిర్వహణకు ఖర్చు చేసుకోవచ్చుననీ లేదు. ఫ్లోర్‌లీడర్లు, వారికి కార్యాలయాలు, ఫర్నీచర్ వంటివి లేవు. హోదాకు తగ్గట్లు ఉండేందుకు గౌరవంతో చేసేవి మాత్రమే. – సీనియర్ అధికారి, జీహెచ్ఎంసీ మీసాలకు సంపెంగనూనె.. మింగ మెతుకు లేకున్నా.. మీసాలకు సంపెంగనూనె అన్నట్లుంది జీహెచ్ఎంసీ వ్యవహారం. జీహెచ్ఎంసీలో నిధులు లేక అభివృద్ధి కుంటుపడింది. బకాయిలు చెల్లించే పరిస్థితి లేదు. అయినా ఆడంబర ఖర్చులు, దుబారా వ్యయం తగ్గించుకునే పరిస్థితిలో లేరు. చాంబర్ల మార్పులు, అనవసర రిపేర్లు, వాహనాల వినియోగం, లగ్జరీ ఐటెమ్స్ కొనుగోలు, ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు తగ్గకపోగా, పెరుగుతున్నాయి. అవినీతి పెచ్చరిల్లి పోతున్నది. – ఎం. శ్రీనివాస్, సీపీఎం నగర కార్యదర్శి సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి నిర్మించాలి బల్దియా కార్మికుల కోసం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కడితే ఎంతో ప్రయోజనం. పారిశుధ్య కార్మికుల స్వేదంతోనే నగరం పరిశుభ్రంగా ఉంటుంది. కోట్లకు కోట్ల దుబారా ఖర్చుల్ని తగ్గించాలి. డిప్యుటేషన్ మీద వచ్చి పాతుకుపోయిన వారిని మాతృసంస్థలకు పంపించాలి. – యు.గోపాల్, అధ్యక్షుడు, జీహెచ్ఎంఈయూ చదవండి: అంతా మీ ఇష్టమైపోయింది.. పిలవని కార్యక్రమానికి రాలేను.. -
‘కనికట్టు’పై క్షేత్రస్థాయి విచారణ
తొండంగి (తుని): వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ(ఐఎస్ఎల్) పథకంలో తొండంగి మండలం పైడికొండ పంచాయతీలో జరిగిన అవకతవకలను వెలికిస్తూ ‘సాక్షి’ గతేడాది ‘కనికట్టు’ పేరుతో కథనాన్ని ప్రచురించింది. మరోవైపు బాధిత లబ్ధిదారులు ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన నేప«థ్యంలో బుధవారం పైడికొండ, ఆనూరు గ్రామాల్లో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. పైడికొండ పంచాయతీ ఆనూరు గ్రామంలో లబ్ధిదారులకు తెలియకుండానే ఎన్జీఓ పేరుతో కాంట్రాక్టర్, పంచాయతీ కార్యదర్శి కలిసి నిధులు దుర్వినియోగం చేసిన వ్యవహారంపై కొంత కాలం క్రితం బాధిత గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ పంచాయతీలో 684 మరుగుదొడ్లు నిర్మించినట్టు ఆన్లైన్లో పేర్కొనడంతోపాటు తొంభైశాతం మరగుదొడ్లకు కాంట్రాక్టర్‌కు చెల్లింపులు జరిగాయి. దాదాపుగా పంచాయతీలోనే 70 నుంచి 80 లక్షల వరకూ అవినీతి జరిగిందని అంచనా. కాగా దీనిపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జెడ్పీ సీఈవోను విచారణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఏవో సుబ్బారావు, ఇతర అధికారులను విచారణ చేయాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కాకినాడ నుంచి ఏఓ సుబ్బారావు కొద్ది రోజుల క్రితం మండల పరిషత్ కార్యాలయంలో ప్రాథమికంగా రికార్డులు పరిశీలించి నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టర్‌కు చెల్లింపు జరిగినట్టు నిర్ధారించుకున్నారు. అనంతరం బాధితులందరూ కలిసి విచారణ పక్కదారి పడుతుందన్న అనుమానంతో క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని మరో మారు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో పైడికొండ, ఆనూరు గ్రామల్లో 32 మందితో కూడిన అధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. పంచాయతీ కార్యాలయం వద్ద అధికారులనునిలదీసిన గ్రామస్తులు గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించామని నిధులు కాజేసిన వ్యవహారంపై కనీస సమాచారం ఇవ్వకుండా అధికారులు విచారణకు రావడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కచ్చితంగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీఓ భమిడి శివమూర్తితో సహా, విచారణ అధికారుల బృందాన్ని గ్రామస్తులు నిలదీశారు. దీనిపై అధికారులు వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఏమి జరిగిందో తెలుసుకోవడానికే పరిశీలనకు వచ్చామని గ్రామస్తులకు వివరించారు. గ్రామంలో వారు విచారణ నిర్వహించారు. పైడికొండ పంచాయతీ ఆనూరు గ్రామంలో ఎనిమిది మంది నాలుగు బృందాలుగా, మిగిలిన దాదాపు 11 బృందాలు పైడికొండ గ్రామంలో ఇంటింటా తిరిగి పరిశీలన జరిపారు. వాస్తవంగా మరుగుదొడ్డి ఉందా? ఎప్పుడు నిర్మించుకున్నారు?, ఎవరు నిర్మించారు?, నిధులు అందాయలా? లేదా? అన్న విషయాలపై విచారణ జరుపుతున్నట్టు విచారణ అధికారి ఏవో సుబ్బారావు తెలిపారు. నిధులు దుర్వినియోగం అయినట్టు ప్రాథమికంగానే గుర్తించామని, ఏ స్థాయిలో జరిగిందనేది క్షేత్రస్థాయి పరిశీలనలో తేలుతుందని ఆయన వివరించారు. దీనిపై సమగ్రమైన నివేదికను జిల్లా పరిషత్ సీఈవోకు అందజేస్తామన్నారు. నాకు తెలియకుండా నిధులు దుర్వినియోగం చేశారు మా పంచాయతీలో ఐఎస్ఎల్ నిర్మాణాలు చేపట్టారు. దీనిపై నాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా కార్యదర్శి, ఎంపీడీవో కలిసి నిధులు ఖర్చు చేశారు. జాయింట్ చెక్ పవర్ ఉన్నా నా ప్రమేయం లేకుండా ఖర్చు చేశారు. దీనిపై 19న జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాను.– పైడికొండ సర్పంచ్ భవిరిశెట్టి లోవ విచారణకు వచ్చిన అధికారులకు ఫిర్యాదు ఆనూరులో ఐఎస్ఎల్పై పరిశీలనకు వచ్చిన అధికారుల బృందానికి లబ్ధిదారులు కొంత మంది నిధులు అందలేదని ఫిర్యాదు చేశారు. తాము సొంత ఖర్చులతో మరుగుదొడ్లు నిర్మించుకున్నామని తెలిపారు. మరికొంత మంది మరుగుదొడ్డే నిర్మించుకోలేదని, కానీ తమపేరున తమకు తెలియకుండానే నిధులు విడుదల చేసుకున్నట్టు వచ్చిన అధికారులకు వివరించారు. -
నిధులు నీటిపాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : డెల్టా ఆధునికీకరణ పనులను ఎంత గొప్పగా చేస్తున్నారో పెరవలి మండలం కాకరపర్రు వద్ద కాలువ గర్భంలో పెరిగిన ఈ కర్రనాచును చూస్తే అర్థమవుతుంది. వేలివెన్ను నుంచి పెరవలి వరకు నరసాపురం ప్రధాన కాలువను 15 కిలోమీటర్ల మేర ఆధునికీకరించేందుకు రూ.90 లక్షలు, 14 కిలోమీటర్ల మేర బ్యాంక్ కెనాల్ ఆధునికీకరణకు రూ.50 లక్షలు మంజూరయ్యాయి. ఈ కాలువల్లో పూడిక తీసి గట్లను పటిష్ట పరచాల్సి ఉండగా.. తూతూమంత్రంగా పనులు చేశారు. గట్లపై ఉన్న పిచ్చిమొక్కలను, గడ్డిని తొలగించి.. కాలువ గర్భంలో పెరిగిన కర్రనాచును ఇలా వదిలేశారు. ఇది నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకంగా మారింది. ఉండ్రాజవరం మండలం కాల్దరిలో అత్తిలి కాలువపై శెట్టిపేట–వేలివెన్ను మధ్య నిర్మిస్తున్న వంతెన ఇది. పనులు ఇంకా పిల్లర్ల దశలోనే ఉన్నాయి. డెల్టా ప్రధాన కాలువ నుంచి నీరు విడుదల చేశారు. వంతెన నిర్మాణానికి వీలుగా కాలువలో అడ్డుకట్టలు వేయడంతో అత్తిలి కాలువలో నీరు దిగువకు పారడం లేదు. ఇదే కాలువపై వడ్లూరు, కాల్దరి గ్రామాల పరిధిలో గట్ల పటిష్టత పనులు అసంపూర్తిగా ఉన్నాయి. తణుకు పట్టణ పరిధిలోని జీ అండ్ వీ కెనాల్‌పై చేపట్టిన గోడ నిర్మాణ పనులు నాలుగు రోజులుగా నిలిచిపోయాయి. ఈ పనుల వల్ల ప్రస్తుతానికి ప్రయోజనం లేకపోగా.. నీరు దిగువకు వెళ్లకుండా అడ్డుపడుతున్నాయి. ప్రజాధనం నీటిపాలైంది. డెల్టా ఆధునికీకరణ పనులు సగం కూడా పూర్తికాకపోవడంతో ఈ దుస్థితి తలెత్తింది. అరకొర పనులతో సరిపెట్టడంతో ఆ ఏడాది కూడా ఆధునికీకరణ ప్రాజెక్ట్‌కు గ్రహణం పట్టింది. ఖరీఫ్ కోసం కాలువలకు గురువారం నీరు విడుదల చేయగా, ఎక్కడి పనులను అక్కడే నిలిపివేశారు. ముఖ్య మంత్రి చంద్రబాబు జిల్లాకు వచ్చినప్పుడల్లా ఒక్క సీజన్లోనే డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తామంటూ ప్రకటనలు గుప్పించారు. పనులు మాత్రం అందుకు భిన్నంగా సాగుతున్నాయి. ప్రస్తుత సీజన్లో చేయాల్సిన పనులకు ఏప్రిల్ చివరి వరకూ ఆమోదం లభించలేదు. ఆమోదం వచ్చి.. టెండర్లు పిలిచి.. పనులు మొదలు పెట్టేసరికి పుణ్యకాలం గడిచిపోయింది. ఈ ఏడాది 60 పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టకుంటే.. ఇప్పటివరకూ కేవలం 21 పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 39 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని పురోగతిలో ఉన్నట్టుగా అధికారులు రికార్డుల్లో చూపిస్తున్నారు. కమీషన్ల కోసమే.. డెల్టా ఆధునికీకరణ పనులను కమీషన్ల కోసమే చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటితీరు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. కాలువలకు నీటిని విడుదల చేయడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి ఉండగా.. నీటి విడుదలతో సంబంధం లేదని, పనులు పూర్తి చేస్తామని జల వనరుల శాఖ ఇన్చార్జి ఎస్ఈ శ్రీనివాస్ యాదవ్ చెబుతున్నారు. దాళ్వా సీజన్ ముగిసిన వెంటనే పనులు చేపడితే సకాలంలో పూర్తయ్యేవి. దాళ్వా ముగిసిన తర్వాత చేపలు, రొయ్యల చెరువులకు ఏప్రిల్ నెలాఖరు వరకూ నీరిచ్చారు. ఈ కారణంగా ఆధునికీకరణ పనులు చేపట్టలేకపోయామని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. ప్రయోజనమేంటో..! ఆధునికీకరణ పనులు చేసిన తీరు నవ్వుల పాలవుతోంది. కాలువ గర్భంలో పేరుకుపోయిన మట్టి, కర్రనాచును తొలగించలేదు. కేవలం గట్లపై ఉన్న పిచ్చిమొక్కలు, గడ్డిని పొక్లెయిన్లతో పైపైన చెక్కి వదిలేశారు. ఇరిగేషన్ అధికారులు పనులను పరిశీలించకపోవడంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంగా మారింది. కాలువల్లో పూడిక తొలగించి గట్లను పటిష్ట పరచాలని కాంట్రాక్ట్ ఒప్పందాల్లో ఉన్నా పట్టించుకోలేదు. కాలువ గర్భాల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించి ఉంటే.. కర్రనాచు సైతం ధ్వంసమై నీటి ప్రవాహానికి ఆటంకాలు తొలగిపోయేవి. చాలాచోట్ల ఆ పనులు చేయకపోవడంతో నిధులు వెచ్చించినా ఉపయోగం లేకుండాపోయింది. వెంకయ్య వయ్యేరు కాలువలో బెడ్ కాంక్రీట్‌పై మట్టి తొలగింపు తూతూమంత్రంగా సాగుతోంది. తొలగించిన మట్టిని గట్లపైనే వేయడంతో చిన్నపాటి వర్షానికే కాలువలోకి జారే పరిస్థితి కనిపిస్తోంది. గట్లపై మట్టి తిరిగి బెడ్ కాంక్రీట్పైకి చేరడం వల్ల కర్రనాచు సమస్య మొదటికి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతంత మాత్రమే.. తణుకు పట్టణ పరిధిలోని జీ అండ్ వీ కెనాల్‌పై చేపట్టిన గోడ నిర్మాణ పనులు నాలుగు రోజులుగా నిలిచిపోయాయి. నరసాపురం మండలంలో ప్రధానంగా రూ.3.57 కోట్లతో ఎల్బీ చర్ల నుంచి తూర్పుతాళ్లు వరకు శేషావతారం కాలువను విస్తరించాల్సి ఉంది. ఈ పనులను ఆలస్యంగా ప్రారంభించారు. కాలువ వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మాణాలు ప్రారంభ దశలోనే ఉన్నాయి. నరసాపురం–నిడదవోలు ప్రధాన కాలువకు మొగల్తూరు శివారు ప్రాంతం. ఈ కాలువ నీరు లాకుల వరుకు వచ్చి.. అక్కడి నుంచి వృథాగా ఉప్పుటేరులోకి పోతోంది. ఈ నీటిని తీరప్రాంత గ్రామాలకు సాగు, తాగునీటిగా వినియోగించాలనే ఉద్దేశంతో 3.6 కిలోమీటర్ల మేర వియర్ చానల్ తవ్వాలని ప్రతిపాదించారు. ఈ పనులను నాలుగు రీచ్‌లుగా విభజించగా.. రెండు రీచ్‌లలో మాత్రమే మొదలయ్యాయి. మరోవైపు భీమవరంలో రూ.8 కోట్లతో చేపట్టిన అనాకోడేరు, బలుసుమూడి, యల్లమ్మ కాలువ రిటైనింగ్ వాల్స్ నిర్మాణం ముందుకు సాగడం లేదు. విస్సాకోడేరు లాకుల నుంచి భీమవరం లాకుల వరకూ జీ అండ్ వీ కెనాల్లో పూడిక తొలగింపు నేటికీ మొదలు కాలేదు. మిరావిుయా కోడు పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎక్కడ మట్టి అక్కడే ఉండటంతో ఏమాత్రం వర్షం కురిసినా నీటి పారుదలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు.