జీహెచ్‌ఎంసీ మేయర్ క్యాంప్ కార్యాలయానికి (ఇంటి వద్ద) కానోపి షెడ్ నిర్మాణం కోసమంటూ దాదాపు రూ. 4.18 లక్షల అంచనా వ్యయంతో టెండరు పిలిచారు. ఇలా జీహెచ్‌ఎంసీలో మేయర్, డిప్యూటీ మేయర్, తదితరులు తాము ఏవి కావాలనుకుంటే అవి చేయించుకుంటున్నారు. ఓవైపు జీహెచ్‌ఎంసీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా.. వారు మాత్రం దేనికీ వెనుకాడటం లేరు. ప్రస్తుత పరిస్థితికి ఇది ఓ మచ్చుతునక ! – సాక్షి,సిటీబ్యూరో
బల్దియా అంటే అంతే మరి..
జీహెచ్‌ఎంసీ ఖజానాలో చేరాల్సిన సొమ్మును ఉద్యోగులు సొంతానికి వాడుకుంటారు. ఇతర శాఖల్లో పనిచేసినప్పుడు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించినా ఎలాంటి వాహనం లేనివారికి ఇక్కడికి రాగానే వాహనం వచ్చి వాలుతుంది. ఇక ఉన్నతాధికారులు, పాలకమండలి సభ్యులైతే బల్దియా భవనాన్ని తమ సొంత ఇల్లే అనుకుంటారు. ఇంటికైనా రంగులు వేయాలనుకుంటే వెనుకాముందు కాస్త ఆలోచిస్తారేమో కానీ.. ఇక్కడ మాత్రం బాగున్నవాటిని సైతం కూలగొట్టి గొప్పగా కట్టించుకుంటారు.
ఇలా ఎందుకంటే..
ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సిన అవసరం లేదు. వ్యయానికి నిధుల పరిమితి లేదు. అందుకే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సైతం ఖరీదైనవి కొంటారు. పాలకమండలి కొత్తదా, పాతదా అన్న తేడా లేదు. పదవి పోయాక వాటికి ఇంటికి తీసుకెళ్తారు. అధికారులూ ఆడంబరాలకు పోతారు. చేసిన అప్పులకు రోజుకు సగటున కోటి రూపాయల వడ్డీ కడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ దర్పం ఏమాత్రం తగ్గకుండా బాగున్నవి కూల్చి కొత్తగా కడుతుండటం చూసి ఎవరైనా ఆశ్చర్యపోవచ్చుకానీ.. వారికవి మామూలే.
ప్రధాన కార్యాలయ భవనంలో గత రెండు మూడేళ్లుగా ఎప్పుడూ ఏదో ఒక నిర్మాణ పని జరుగుతూనే ఉంది. కాళేశ్వరం, మిషన్ భగీరథల వంటి ప్రాజెక్టులు, ఎన్నో ఫ్లై ఓవర్లు పూర్తయినా.. ఇక్కడ ఎప్పుడూ ఏదో పని జరుగుతూనే ఉంటుంది. అందుకు కారణం .. వారికే తెలుసు. ఇక పనులే కాదు.. ఏవిషయంలోనూ ఖర్చులకు వెనుకాడరు. టీ , బిస్కెట్ల నుంచి ఉత్సవాల నిర్వహణల వరకు ఖర్చు గ్రాండ్‌గా ఉండాల్సిందే. పాత పాలకమండలి.. కొత్త పాలకమండలి.. అప్పటి అధికారులు, ఇప్పటి అధికారులు అనే తేడా ఏం లేదు. అందరూ అతిరథులే.. ఖర్చుల మహారథులే.
చెప్పుకుంటే.. ఎంతెంతో..
► బల్దియాలో చాలామంది ఘనాపాటీలే. జీహెచ్‌ఎంసీ ఏర్పాటయ్యాక తొలి పాలకమండలి (2009–14)లో రెండు పార్టీల ఫ్లోర్‌లీడర్లు బల్దియాకు చెందిన సోఫాలు, జనరేటర్లు వంటివి సైతం ఇళ్లకు తరలించుకు వెళ్లారు. వారి కార్యాలయాల్లో ఉన్న వాటిని తమ పదవి పోగానే వాటిని సైతం ఇళ్లకు తీసుకెవెళ్లారు.
► కాగిత రహిత పాలన కింద ల్యాప్‌టాప్‌లు తీసుకొని తిరిగి ఇచ్చేయని వారెందరో.
► అధ్యయన యాత్రల పేరిట..వాటికి వెళ్లకుండానే అందుకయ్యే ఖర్చు దాదాపు లక్ష రూపాయలకు పైగా సొంత జేబుల్లో వేసుకున్నవారున్నారు.
ప్రస్తుత పాలకమండలి అయితే..
► మేయర్ క్యాంప్ కార్యాలయంలో(ఇంట్లో) కరెంట్ లేదంటూ భారీ ఇన్వర్టర్‌ను కోరడం రచ్చ కావడంతో వెనక్కు తగ్గారు.
► డిప్యూటీ మేయర్ కార్యాలయం ఆధునీకరణ చేపట్టారు. గత డిప్యూటీ మేయర్ కంటే తక్కువేం కాదంటూ రూ. 20 లక్షలు ఖర్చుచేస్తున్నారు.
గత పాలక మండలి కూడా తక్కువేం కాదు..
► గత పాలకమండలి(2016–21)లో డిప్యూటీ మేయర్ చాంబర్ ఆధునీకరణ పేరిట దాదాపు రూ. 20 లక్షలు ఖర్చు చేశారు
► ఖరీదైన సెల్‌ఫోన్లు పాలక మండలి సభ్యులతోపాటు మేయర్ పేషీల్లోని ఉద్యోగులు సైతం పొందారు.
► మేయర్ కోసం ఒకటో అంతస్తులో ఒక చాంబర్ ఉండగా, పైన ఏడో అంతస్తులో మరొకటి ఏర్పాటు చేసుకున్నారు.
అధికారులూ అంతే..
► బాగున్న పన్వర్‌హాల్‌ను ఆధునీకరణ పేరిట లక్షలు ఖర్చు చేసి.. అసౌకర్యంగా మార్చారు.
► ప్రతి సోమవారం ప్రజావాణి, ఫేస్ టూ ఫేస్ వంటి కార్యక్రమాలేవీ లేకున్నా హాస్పిటాలిటీ ఖర్చులు మాత్రం భారీగా పెరిగాయి. పన్వర్ హాల్‌లో విలేకరుల సమావేశం పెట్టినా రూ. 20వేలు ఖర్చు చూపిస్తారు.
► ఎంతో మోజుపడి అద్దంలా చాంబర్లకు హంగులదుకున్న అధికారులు.. ఆ చాంబర్ల సౌఖ్యం పొందకుండానే బదిలీ అయి వెళ్లడం విచిత్రం.
► ఒక విభాగం ఆధునీకరణ పనుల కోసం దాదాపు రూ. 2 కోట్లు ఖర్చు చేశారు. కొన్ని విభాగాల పనులుఇంకా జరుగుతున్నాయి.
► చెప్పుకుంటూ పోతే.. బల్దియాలో ఇలాంటిచిత్రవిచిత్రాలింకా ఎన్నెన్నో !
పొదుపు పాటించాలి..
దుబారా ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటించాలి. ప్రస్తుతం నెలనెలా జీతాల చెల్లింపులకే ఇబ్బందులు పడుతున్న తరుణంలో వృథా ఖర్చుల్ని నిలిపివేస్తే మేలు. ప్రజలు చెల్లించిన పన్నుల నిధుల్ని ప్రజా సదుపాయాలకు వాడాలి.
– పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
బల్దియా చట్టంలో ఖర్చు చేయొచ్చని లేదు..
మేయర్, డిప్యూటీ మేయర్ల చాంబర్లకు ఖర్చుచేయాలని బల్దియా చట్టంలో లేదు. క్యాంప్ కార్యాలయ నిర్వహణకు ఖర్చు చేసుకోవచ్చుననీ లేదు. ఫ్లోర్‌లీడర్లు, వారికి కార్యాలయాలు, ఫర్నీచర్ వంటివి లేవు. హోదాకు తగ్గట్లు ఉండేందుకు గౌరవంతో చేసేవి మాత్రమే.
– సీనియర్ అధికారి, జీహెచ్‌ఎంసీ
మీసాలకు సంపెంగనూనె..
మింగ మెతుకు లేకున్నా.. మీసాలకు సంపెంగనూనె అన్నట్లుంది జీహెచ్‌ఎంసీ వ్యవహారం. జీహెచ్‌ఎంసీలో నిధులు లేక అభివృద్ధి కుంటుపడింది. బకాయిలు చెల్లించే పరిస్థితి లేదు. అయినా ఆడంబర ఖర్చులు, దుబారా వ్యయం తగ్గించుకునే పరిస్థితిలో లేరు. చాంబర్ల మార్పులు, అనవసర రిపేర్లు, వాహనాల వినియోగం, లగ్జరీ ఐటెమ్స్ కొనుగోలు, ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు తగ్గకపోగా, పెరుగుతున్నాయి. అవినీతి పెచ్చరిల్లి పోతున్నది.
– ఎం. శ్రీనివాస్, సీపీఎం నగర కార్యదర్శి
సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి నిర్మించాలి
బల్దియా కార్మికుల కోసం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కడితే ఎంతో ప్రయోజనం. పారిశుధ్య కార్మికుల స్వేదంతోనే నగరం పరిశుభ్రంగా ఉంటుంది. కోట్లకు కోట్ల దుబారా ఖర్చుల్ని తగ్గించాలి. డిప్యుటేషన్ మీద వచ్చి పాతుకుపోయిన వారిని మాతృసంస్థలకు పంపించాలి.
– యు.గోపాల్, అధ్యక్షుడు, జీహెచ్‌ఎంఈయూ
చదవండి: అంతా మీ ఇష్టమైపోయింది.. పిలవని కార్యక్రమానికి రాలేను..
Comments
Please login to add a commentAdd a comment