నిధులు నీటిపాలు
నిధులు నీటిపాలు
Published Thu, Jun 1 2017 11:54 PM | Last Updated on Tue, Sep 5 2017 12:34 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : డెల్టా ఆధునికీకరణ పనులను ఎంత గొప్పగా చేస్తున్నారో పెరవలి మండలం కాకరపర్రు వద్ద కాలువ గర్భంలో పెరిగిన ఈ కర్రనాచును చూస్తే అర్థమవుతుంది. వేలివెన్ను నుంచి పెరవలి వరకు నరసాపురం ప్రధాన కాలువను 15 కిలోమీటర్ల మేర ఆధునికీకరించేందుకు రూ.90 లక్షలు, 14 కిలోమీటర్ల మేర బ్యాంక్ కెనాల్ ఆధునికీకరణకు రూ.50 లక్షలు మంజూరయ్యాయి. ఈ కాలువల్లో పూడిక తీసి గట్లను పటిష్ట పరచాల్సి ఉండగా.. తూతూమంత్రంగా పనులు చేశారు. గట్లపై ఉన్న పిచ్చిమొక్కలను, గడ్డిని తొలగించి.. కాలువ గర్భంలో పెరిగిన కర్రనాచును ఇలా వదిలేశారు. ఇది నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకంగా మారింది.
ఉండ్రాజవరం మండలం కాల్దరిలో అత్తిలి కాలువపై శెట్టిపేట–వేలివెన్ను మధ్య నిర్మిస్తున్న వంతెన ఇది. పనులు ఇంకా పిల్లర్ల దశలోనే ఉన్నాయి. డెల్టా ప్రధాన కాలువ నుంచి నీరు విడుదల చేశారు. వంతెన నిర్మాణానికి వీలుగా కాలువలో అడ్డుకట్టలు వేయడంతో అత్తిలి కాలువలో నీరు దిగువకు పారడం లేదు. ఇదే కాలువపై వడ్లూరు, కాల్దరి గ్రామాల పరిధిలో గట్ల పటిష్టత పనులు అసంపూర్తిగా ఉన్నాయి. తణుకు పట్టణ పరిధిలోని జీ అండ్ వీ కెనాల్‌పై చేపట్టిన గోడ నిర్మాణ పనులు నాలుగు రోజులుగా నిలిచిపోయాయి. ఈ పనుల వల్ల ప్రస్తుతానికి ప్రయోజనం లేకపోగా.. నీరు దిగువకు వెళ్లకుండా అడ్డుపడుతున్నాయి.
ప్రజాధనం నీటిపాలైంది. డెల్టా ఆధునికీకరణ పనులు సగం కూడా పూర్తికాకపోవడంతో ఈ దుస్థితి తలెత్తింది. అరకొర పనులతో సరిపెట్టడంతో ఆ ఏడాది కూడా ఆధునికీకరణ ప్రాజెక్ట్‌కు గ్రహణం పట్టింది. ఖరీఫ్ కోసం కాలువలకు గురువారం నీరు విడుదల చేయగా, ఎక్కడి పనులను అక్కడే నిలిపివేశారు. ముఖ్య మంత్రి చంద్రబాబు జిల్లాకు వచ్చినప్పుడల్లా ఒక్క సీజన్‌లోనే డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తామంటూ ప్రకటనలు గుప్పించారు. పనులు మాత్రం అందుకు భిన్నంగా సాగుతున్నాయి. ప్రస్తుత సీజన్‌లో చేయాల్సిన పనులకు ఏప్రిల్ చివరి వరకూ ఆమోదం లభించలేదు. ఆమోదం వచ్చి.. టెండర్లు పిలిచి.. పనులు మొదలు పెట్టేసరికి పుణ్యకాలం గడిచిపోయింది. ఈ ఏడాది 60 పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టకుంటే.. ఇప్పటివరకూ కేవలం 21 పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 39 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని పురోగతిలో ఉన్నట్టుగా అధికారులు రికార్డుల్లో చూపిస్తున్నారు.
కమీషన్ల కోసమే..
డెల్టా ఆధునికీకరణ పనులను కమీషన్ల కోసమే చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటితీరు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. కాలువలకు నీటిని విడుదల చేయడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి ఉండగా.. నీటి విడుదలతో సంబంధం లేదని, పనులు పూర్తి చేస్తామని జల వనరుల శాఖ ఇన్‌చార్జి ఎస్‌ఈ శ్రీనివాస్ యాదవ్ చెబుతున్నారు. దాళ్వా సీజన్ ముగిసిన వెంటనే పనులు చేపడితే సకాలంలో పూర్తయ్యేవి. దాళ్వా ముగిసిన తర్వాత చేపలు, రొయ్యల చెరువులకు ఏప్రిల్ నెలాఖరు వరకూ నీరిచ్చారు. ఈ కారణంగా ఆధునికీకరణ పనులు చేపట్టలేకపోయామని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు.
ప్రయోజనమేంటో..!
ఆధునికీకరణ పనులు చేసిన తీరు నవ్వుల పాలవుతోంది. కాలువ గర్భంలో పేరుకుపోయిన మట్టి, కర్రనాచును తొలగించలేదు. కేవలం గట్లపై ఉన్న పిచ్చిమొక్కలు, గడ్డిని పొక్లెయిన్లతో పైపైన చెక్కి వదిలేశారు. ఇరిగేషన్ అధికారులు పనులను పరిశీలించకపోవడంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంగా మారింది. కాలువల్లో పూడిక తొలగించి గట్లను పటిష్ట పరచాలని కాంట్రాక్ట్ ఒప్పందాల్లో ఉన్నా పట్టించుకోలేదు. కాలువ గర్భాల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించి ఉంటే.. కర్రనాచు సైతం ధ్వంసమై నీటి ప్రవాహానికి ఆటంకాలు తొలగిపోయేవి. చాలాచోట్ల ఆ పనులు చేయకపోవడంతో నిధులు వెచ్చించినా ఉపయోగం లేకుండాపోయింది. వెంకయ్య వయ్యేరు కాలువలో బెడ్ కాంక్రీట్‌పై మట్టి తొలగింపు తూతూమంత్రంగా సాగుతోంది. తొలగించిన మట్టిని గట్లపైనే వేయడంతో చిన్నపాటి వర్షానికే కాలువలోకి జారే పరిస్థితి కనిపిస్తోంది. గట్లపై మట్టి తిరిగి బెడ్ కాంక్రీట్‌పైకి చేరడం వల్ల కర్రనాచు సమస్య మొదటికి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
అంతంత మాత్రమే..
తణుకు పట్టణ పరిధిలోని జీ అండ్ వీ కెనాల్‌పై చేపట్టిన గోడ నిర్మాణ పనులు నాలుగు రోజులుగా నిలిచిపోయాయి. నరసాపురం మండలంలో ప్రధానంగా రూ.3.57 కోట్లతో ఎల్‌బీ చర్ల నుంచి తూర్పుతాళ్లు వరకు శేషావతారం కాలువను విస్తరించాల్సి ఉంది. ఈ పనులను ఆలస్యంగా ప్రారంభించారు. కాలువ వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మాణాలు ప్రారంభ దశలోనే ఉన్నాయి. నరసాపురం–నిడదవోలు ప్రధాన కాలువకు మొగల్తూరు శివారు ప్రాంతం. ఈ కాలువ నీరు లాకుల వరుకు వచ్చి.. అక్కడి నుంచి వృథాగా ఉప్పుటేరులోకి పోతోంది. ఈ నీటిని తీరప్రాంత గ్రామాలకు సాగు, తాగునీటిగా వినియోగించాలనే ఉద్దేశంతో 3.6 కిలోమీటర్ల మేర వియర్ చానల్ తవ్వాలని ప్రతిపాదించారు. ఈ పనులను నాలుగు రీచ్‌లుగా విభజించగా.. రెండు రీచ్‌లలో మాత్రమే మొదలయ్యాయి. మరోవైపు భీమవరంలో రూ.8 కోట్లతో చేపట్టిన అనాకోడేరు, బలుసుమూడి, యల్లమ్మ కాలువ రిటైనింగ్ వాల్స్ నిర్మాణం ముందుకు సాగడం లేదు. విస్సాకోడేరు లాకుల నుంచి భీమవరం లాకుల వరకూ జీ అండ్ వీ కెనాల్‌లో పూడిక తొలగింపు నేటికీ మొదలు కాలేదు. మిరావిుయా కోడు పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎక్కడ మట్టి అక్కడే ఉండటంతో ఏమాత్రం వర్షం కురిసినా నీటి పారుదలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Advertisement
Advertisement