
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా : రాష్ట్రంలో కూటమి పార్టీ ఎమ్మెల్యేలు పేట్రేగి పోతున్నారు. అధికార మదంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా, నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ రౌడీయిజానికి దిగారు. భీమవరంలో కోర్టు వివాదంలో ఉన్న ఓ ప్రైవేట్ స్థలంలో దాదా గిరి చేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూమి కబ్జా చేసే ప్రయత్నం చేశారు. తన అనుచరులతో యజమానులను బెదిరించారు. జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ రౌడీయిజంతో భయాందోళనకు గురైన బాధితుల్ని పోలీసుల్ని ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అనుచరులే కాదు.. గతంలో ఆ పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులు రెచ్చిపోయారు. మత్య్సకారుల దుకాణాలు కొనసాగాలంటే తమకు రూ.10లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. ఉప్పలంకలో మత్స్యకారుల దుకాణాలను అన్యాయంగా నేలమట్టం చేశారు. అయితే, మత్స్యకారుల జీవనోపాధి కోసం నాలుగేళ్ళ క్రితం ఉప్పలంక వద్ద ఐదు షాపులను అప్పటి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కట్టించారు. ఆ దుకాణాలపై నానాజీ అనుచరులు కన్ను పడింది. వెంటనే రంగంలోకి దిగిన జనసేన నాయకులు.. అక్కడ దుకాణాలు కొనసాగాలంటే తమకు రూ.10లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. లేనిపక్షంలో దుకాణాలను తొలగిస్తామని హెచ్చరించారు.

అనంతరం, ఎమ్మెల్యే నానాజీని బాధితులు కలిసి జరిగిన విషయం చెప్పి తమకు న్యాయం జరగాలని కోరారు. అయినప్పటికీ బాధితులకు న్యాయం జరగకపోగా తీవ్ర అన్యాయమే జరిగింది. దుకాణదారులు మూముళ్లు ఇవ్వలేదన్న కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనే నెపంతో ఆర్ అండ్ బీ అధికారులతో నానాజీ అనుచరులు కుమ్మకయ్యారు. అధికారులు, జనసేన నేతలు అక్కడికి చేరుకుని షాపులను నేలమట్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment