సాక్షి, కాకినాడ: ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మూడో రోజు యథేచ్ఛగా కోడి పందేలు(Kodi Pandem) కొనసాగుతున్నాయి. సంక్రాంతి సంబరాల పేరిట కూటమి నేతలు నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదే సమయంలో పాఠశాలలను సైతం టీడీపీ నేతలు వదలడం లేదు. స్కూల్స్‌లో కూడా కోడి పందేలు నిర్వహిస్తున్నారు. దీంతో, స్థానికులు మండిపడుతున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడి పందేలు జోరుగా జరుగుతున్నాయి. కూటమి నేతలే దగ్గరుండి అన్ని కార్యక్రమాలను చూసుకుంటున్నారు. అలాగే, కోడి పందేల బరుల దగ్గర జూదం కోసం స్పెషల్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. అడ్డు అదుపు లేకుండా గుండాట, పేకాట, గ్యాంబ్లింగ్, లోనాబయటా ఆడిపిస్తున్నారు. ఇక, జూద క్రీడలు కూటమి నేతలకు కాసులు కురిపిస్తున్నాయి. పేకాట ఆడేవాళ్లకు దగ్గరుండి మద్యం సరఫరా చేయిస్తున్నారు కూటమి నేతలు.
ఇదే సమయంలో కోడి పందేలా కోసం ప్రభుత్వ పాఠశాలలను సైతం కూటమి నేతలు వదిలిపెట్టడం లేదు. తుని రూరల్ వి.కొత్తూరులోని ప్రభుత్వ పాఠశాలలో కోడి పందేలు, జూదాలు నిర్వహించారు. ఇక, కూటమి నేతల ఒత్తిళ్ళతో కోడి పందేల వైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఎక్కడ చూసినా జూదం ఆడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి టీడీపీ, జనసేన నేతలు కోడి పందేలు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. కోడి పందేల బరుల వద్ద బెట్టింగ్‌ల ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. జూద క్రీడలు, కోడి పందేల కోసం లక్షల్లో బెట్టింగ్ కాస్తున్నారు.
ఇదిలా ఉండగా.. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు జనసేనలో కోడి పందేలు చిచ్చురేపాయి. రాజోలులో నడి రోడ్డుపై కోడి పందెం బరుల కోసం జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్‌పై టీడీపీ, జనసేన నాయకులు ఒత్తిడి తెచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే మాటలను బేఖాతరు చేస్తూ ఇష్టారీతిన బరులు ఏర్పాటు చేసుకున్నారు జనసేన, టీడీపీ నాయకులు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజోలులో విచ్చలవిడిగా కోడి పందేలు, గుండాట, రికార్డింగ్ డ్యాన్స్‌లు జరిగాయి. పలుచోట్ల రాత్రి సమయంలో కూటమి నేతలే రికార్డింగ్ డ్యాన్స్‌లను ప్రోత్సహించారు.
ఇంతటితో ఆగకుండా కూటమి నేతలు మరింత హల్‌చల్ చేశారు. ఇటీవలి కాలంలో బౌన్సర్లు ఏర్పాటు సాధారణంగా మారిన నేపథ్యంలో కోడి పందేల బరుల వద్ద బౌన్సర్లను ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ఓ అడుగు ముందుకేసిన నిర్వాహకులు మహిళా బౌన్సర్లను రంగంలోకి దింపారు.
Comments
Please login to add a commentAdd a comment