kodi pandalu
-
అవినీతి వెలగపండు
భవ్య పరిపాలనా రాజధానిలో సూర్యోదయ దిక్కుకు ప్రాతినిధ్యం వహించే ఆ ఎమ్మెల్యే అవినీతికి అంతేలేదు. ఆయన పేరు చెబితే భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, దందాలే గుర్తొస్తాయి. కొండలు సైతం భయంతో కంపిస్తాయంటే అతిశయోక్తి కాదు. వరుసగా మూడుసార్లు ఎన్నికైనా ఆయన చేసిన అభివృద్ధి శూన్యం. అవినీతి, అక్రమాలు మాత్రం భారీగానే వెలగబెట్టారు. ఫలితంగా ‘రామ..రామ’.. ఇదేమి దోపిడీ అంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆరిలోవ(విశాఖ): విశాఖ నగర ప్రజలకు తెలియని కత్తికట్టి ఆడే కోడి పందేల విష సంస్కృతిని ఆ ఎమ్మెల్యే ఇక్కడి జూదరులకు పరిచయం చేశారు. ముడసర్లోవ రిజర్వాయర్ వెనుక జీవీఎంసీకి చెందిన పదెకరాల ఖాళీ స్థలంలో 2016 నుంచి 2020 వరకు సుమారు నాలుగేళ్లపాటు వరుసగా సంక్రాంతి సమయంలో బరులు ఏర్పాటు చేయించి భారీగానే వెనకేసుకున్నారు. ప్రజల జేబులు గుల్లచేశారు. ఆరిలోవ, జోడుగుళ్లపాలెం, అప్పూఘర్, జాలరిపేట ప్రాంతాల్లో మద్యం దుకాణాలను 2015లో ఎమ్మెల్యే ప్రారంభించారు. అప్పట్లో ఆరిలోవలో నిర్వహించిన మద్యం దుకాణం తొలగించాలని ఐద్వా ఆధ్వర్యంలో స్థానికులు, డ్వాక్రా సంఘాల మహిళలు ధర్నాలు చేసినా ఆయన పట్టించుకోలేదు. ► రుషికొండ ప్రాంతంలో రెవెన్యూకి చెందిన భూమిలో గెడ్డ భాగాన్ని ఆక్రమించి ఆ స్థలం రోడ్డు నిర్మాణంలో పోయినట్టు ఎమ్మెల్యే చూపించారు. ప్రత్యామ్నాయంగా వేరేచోట స్థలం పొందారు. ► 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక దందాలకు పాల్పడ్డారు. జోడుగుళ్లపాలెం వద్ద సుమారు ఎకరం స్థలాన్ని తన బంధువుల పేరుతో ఆక్రమించే యత్నం చేశారు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన యత్నానికి బ్రేక్ పడింది. ► ఎంవీపీ కాలనీలో సెక్టార్–2లో గెడ్డ స్థలాన్ని ఆక్రమించి ఓ బిల్డర్‌కు అపార్టుమెంట్ నిర్మాణం కోసం కట్టబెట్టారు. ఆ అపార్టుమెంట్లో కొన్ని ప్లాట్లు తనకు ఇవ్వడానికి బిల్డర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పట్లో దీనిపై తీవ్రమైన విమర్శలు రావడంతో జీవీఎంసీ అధికారులు ఆ అపార్టుమెంట్ నిర్మాణాన్ని నిలిపేశారు. అప్పటి వైఎస్సార్ సీపీ నాయకుడు (ప్రస్తుతం జనసేన కార్పొరేటర్) పీతల మూర్తియాదవ్ ఈ ఆక్రమణపై కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో ఉంది. ► రామకృష్ణాపురాన్ని ఆనుకొని ముడసర్లోవ రిజర్వాయర్ వెనుక 2017లో పెగదిలికి చెందిన ఎమ్మెల్యే అనుచరులు కొందరు సర్వే నంబర్లు 26, 27ల్లోని సుమారు ఎకరం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి 18 పాకలు వేశారు. దీనిపై ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అప్పట్లో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జీవీఎంసీ అధికారులు ఆ పాకలను తొలగించారు. అయినా పట్టువదలకుండా వేసిన పాకలను మూడుసార్లు అధికారులు తొలగించాల్సి వచి్చంది. దీంతో ఎమ్మెల్యే అనుచరులు పేదలకు చెందిన పాకలను తొలగించారని కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది. ఎమ్మెల్యేపై కేసులు ► 2020 మార్చి 15న ఎమ్మెల్యే నిర్వహించే మద్యం షాపుల్లో ఎక్సైజ్ పోలీసులు దాడులు చేపట్టారు. ఆ దుకాణాల్లో కల్తీ మద్యం బ్రాండ్లు విక్రయిస్తున్నట్లు గుర్తించి చర్యలు చేపట్టారు. దీంతో ఎమ్మెల్యే ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ముందు తన అనుచరులతో ధర్నా చేపట్టారు. ఎక్సైజ్ పోలీసులు తమ విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఐపీసీ 353, 501 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ► 2019 సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యేపై మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ► రుషికొండ వద్ద ప్రభుత్వానికి చెందిన స్థలంలో గెడ్డ భాగాన్ని ఆక్రమించినట్లు 2011లో రూరల్ రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యేపై భూ ఆక్రమణ కేసు పెట్టారు. అయితే ఆ తర్వాత అధికారులను బెదిరించి ఆయన కేసును కొట్టివేయించుకున్నారు. -
తగ్గని వేడి..పందెం కో‘ఢీ’
భీమవరం/అమలాపురం టౌన్: గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన కోడి పందేలు మూడో రోజైన మంగళవారం కూడా కొనసాగాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెదఅమిరం, సీసలి, పెన్నాడ, యలమంచిలి మండలం కలగంపూడి, పూలపల్లి, పోడూరు మండలం కవిటం, వీరవాసరం మండలం జొన్నలపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం ప్రాంతాల్లో పందేలు జోరుగా సాగాయి. ఏలూరు జిల్లా పరిధిలోని ఉంగుటూరు, కైకలూరు, నూజివీడు, దెందులూరు, చింతలపూడి, ఏలూరు తదితర నియోజకవర్గాల్లో పందేల జోరు కొనసాగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు రోజుల్లో దాదాపు రూ.500 కోట్లకు పైగా చేతులు మారినట్టు చెబుతున్నారు. కోడి పందేలతో పాటు గుండాట, పేకాట వంటి జూదాలు విచ్చలవిడిగా నిర్వహించారు. పందేల రాయుళ్లను ఆకర్షించేందుకు భీమవరం సమీపంలోని పెన్నాడ శిబిరం వద్ద ఎక్కువ పందేలు గెల్చుకున్న వారికి బుల్లెట్, స్కూటీ వంటి వాహనాలను బహుమతులుగా ఇచ్చారు. చిన్న గ్రామాల్లో సైతం కోడి పందేల జోరు కనిపించింది. తూర్పున 80 బరుల్లో.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దాదాపు 80 ప్రధాన బరుల్లో కోడి పుంజులు తలపడ్డాయి. హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాల్లో ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడ్డ వారంతా కుటుంబాలతో సహా సొంతూళ్లకు వచ్చి కోడి పందేల బరుల వద్దకు వెళ్లి ఆసక్తిగా తిలకించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గెద్దనపల్లిలో వెలిసిన భారీ పందెం బరిలో రూ.కోట్లు చేతులు మారాయి. మలికిపురం, రావులపాలెం, కొత్తపేట, అంబాజీపేట, అమలాపురం రూరల్, అల్లవరం, రాయవరం తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో వెలిసిన బరుల్లో కోడి పందేలు జోరుగా జరిగాయి. కాకినాడ జిల్లా వేట్లపాలెం, మేడపాడు, ఉండూరు, అచ్చంపేట, పులిమేరు, తూర్పుగోదావరి జిల్లాలో కోరుకొండ, గోకవరం, కొవ్వూరు, అనపర్తి తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో పందెం కోళ్లు సై అంటే సై అన్నాయి. కృష్ణా జిల్లాలోని ఈడుపుగల్లు, ఉప్పులూరు, గొడవర్రు, అంపాపురం, కంకిపాడు, కొత్తూరు తాడేపల్లి, మేకావానిపాలెం, ఎనీ్టఆర్ జిల్లా వెలగలేరు తదితర ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహించారు. -
సై అంటున్న కోడి పుంజులు..
అమలాపురం టౌన్/సాక్షి నెట్వర్క్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి కోడి పందేలు ఆదివారం మొదలయ్యాయి. పండగ మూడు రోజులూ జరిగే ఈ పందేలను వీక్షించేందుకు, రూ.వేలు, రూ.లక్షల్లో కాసేందుకు వేలాదిగా తరలివస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 80 బరులు ఏర్పాటైనట్టు సమాచారం. వీటిలో దాదాపు రూ.20 కోట్ల మేర పందేల రూపంలో చేతులు మారతాయని అంచనా వేస్తున్నారు. తొలి రోజే రూ.6 కోట్ల వరకూ పందేలు జరిగాయని తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఉద్యోగాలు, వ్యాపారాలతో స్థిరపడిన వారందరూ కార్లలో సొంతూళ్లకు వచ్చి మరీ కోడి పందేలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. బరుల వద్దకు మోటార్ సైకిళ్లు, కార్లలో అధిక సంఖ్యలో వస్తున్నారు. పలుచోట్ల బరుల వద్ద గుండాటలు కూడా ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల వీటిని పోలీసులు అడ్డుకున్నారు. ►డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గెద్దనపల్లిలో భారీ బరి ఏర్పాటైంది. ఇక్కడ రూ.కోట్లలో పందేలు కాస్తున్నారు. మండల కేంద్రమైన మలికిపురంలో కూడా భారీ బరి ఏర్పాటు చేశారు. లక్కవరం, కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, అల్లవరం, అమలాపురం రూరల్ మండలం కామనగరువు, ఇందుపల్లిలో సైతం పెద్ద బరులు ఏర్పాటయ్యాయి. ముమ్మిడివరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నిర్వాహకులు క్రికెట్ పోటీలను తలపించే రీతిలో కోడి పందేలు సాగిస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి, బారికేడ్లు, ఎల్ఈడీ స్క్రీన్లతో బరులు ఏర్పాటు చేసి మరీ పందేలు నిర్వహించారు. ►తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ, గోకవరం, కొవ్వూరు, అనపర్తి తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో కోడి పందేలు జరిగాయి. నల్లజర్ల మండలంలో పోలీసులు గుండాటకు ఎక్కడా అనుమతించలేదు. ఇక్కడ మధ్యాహ్నం తర్వాతే పందేలు ప్రారంభించారు. ఎక్కడా మునుపటి ఉత్సాహం కనపడలేదు. తాళ్లపూడి మండలంలోని పలు గ్రామాల్లో కోడి పందేలు ఉదయం కొంత ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఈ మండలంలోని మలకపల్లిలో ఏర్పాటు చేసిన బరి వద్ద బౌన్సర్లను పెట్టి మరీ పందేలు నిర్వహించారు. నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల్లోని 25 బరుల్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ►కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని వేట్లపాలెం, మేడపాడులో భారీ ఎత్తున పందేలు జరిగాయి. ఉండూరు, పులిమేరు, అచ్చంపేటల్లో కూడా బరులు ఏర్పాటు చేశారు. కాకినాడ రూరల్ సర్పవరం, గైగోలుపాడు తదితర చోట్ల కోడి పందేలపై పోలీసులు దాడి చేశారు. డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి, సీఐ వైఆర్కే శ్రీనివాస్ తదితరులు సిబ్బందితో వెళ్లి గుండాట బోర్డులను తొలగించి, పందేలు నిర్వహిస్తున్న వారిని హెచ్చరించారు. కరప మండలంలోని పలు గ్రామాల్లో కోడి పందేలు జరిగాయి. -
రంజుగా.. రారాజులా పెరిగి...కట్ చేస్తే..!
జనవరి వచ్చిందంటే చాలు సంక్రాంతి హడావిడి మొదలవుతుంది. పుట్టింటికి ఎపుడు పోదామా అని కొత్త పెళ్లి కూతుళ్లు ఎదురుచూస్తూ ఉంటారు. అటు కొత్త అల్లుళ్ళ మంచీ మర్యాదకోసం అత్తగారిళ్లు సిద్ధమవుతుంటాయి. రకరకాల పిండివంటల తయారీలో మునిగిపోతారు మహిళలు. ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు అబ్బో.. సంక్రాంతి సంబరాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇవన్నీ ఒక ఎత్తయితే ఎంత నిర్బంధం, ఆంక్షలున్నా కోడి పందాల సందడి మాత్రం మామూలుగా ఉండదు. సంక్రాంతి పండుగ మూడ్రోజుల పాటు కోస్తాకుర్రాళ్లలో కోడి పందాల జోష్ రేంజే వేరు. గతంలో సరాదాగా సాగిన ఈ వ్యవహారం ఇపుడు కోట్లాది రూపాయల వ్యాపారంగా మారిపోయింది. ఈ కోడి పందాల కథా కమామిష్షు ఏంటో ఒకసారి చూద్దాం. కోడి పందాలు, పందెం కోళ్లు కోడిపందెం అంటే.. స్పెషల్‌గా పెంచిపోషించిన, శిక్షణ ఇచ్చిన రెండు కోడి పుంజులు హోరాహోరీగా పోట్లాడుకోవడం. ఊపిరి ఆగేదాకా కాలు దూసి పోరాడటం. కాళ్లకు కట్టిన పదునైన కత్తులు దిగుతున్నా.. రక్త మోడుతున్నా వెన్ను చూపకూడదు. విజయమో వీర స్వర్గమో అన్నట్టు అయితే ప్రత్యర్థిని పడగొట్టాలి.. లేదంటే తన ప్రాణం పోవాలి. అదీ పందెం. కోడి పుంజులకు శిక్షణ ఇంత పకడ్బందీగా పందెం సాగాలి అంటూ ఏంతో కొంత ట్రైనింగ్ ఉండాలిగా. ప్రత్యర్థికి దీటుగా బలిష్టంగా ఉండాలిగా. అందుకే మరి పందెంకోళ్లకు ప్రత్యేక శిక్షణతోపాటు బలవర్ధక ఆహారాన్ని కూడా అందిస్తారు. అయితే ఇందులో పందేనికి పనికి వచ్చే పుంజు(మగకోళ్లను) గుర్తించడం ఒక కళ. ఇక్కడే తొలి అడుగు పడుతుంది. ఈకల రంగుని బట్టి కోడిపుంజు రకాలను, జాతులను గుర్తిస్తారు. నల్ల ఈకలున్న పుంజును “కాకి” అని, తెల్లని ఈకలు ఉంటే దానిని “సేతు” అని, మెడపై నలుపు, తెలుపు ఈకలు సమానంగా ఉంటే దానిని “పర్ల” అని, నల్లగా ఉండి, రెండు మూడు ఈకలు ఉన్న పుంజును కొక్కి రాయి అని దీనికి పెద్ద పురాణమే ఉంది. ముఖ్యంగా ఈకలు మొత్తం ఎర్రగా ఉంటే డేగ అని, రెక్కల పై లేదా వీపుపై పసుపు రంగు ఈకలు ఉంటే దానిని “నెమలి” అని పిలుస్తారు. ఇంకా మూడు రంగుల ఈకలు, నలుపు, ఎరుపు, పసుపు రంగుల్లో సమానంగా ఉంటే దానిని “కౌజు” అని పూల, నల్లబోర, ఎర్రపొడ, గేరువా లాంటివి ఇందులో ఉన్నాయి. డేగ, నెమలి, కాకి కోడి పందేలకు సంబంధించి డేగ, కాకి, నెమలి రకాలు పాపులర్. ఇలా తమకు నచ్చిన పందెం కోళ్లను గుర్తించి, వాటిని ప్రత్యేక షెడ్లలో సకల సదుపాయాలతో పెంచుతారు. ఉదయం లేచింది మొదలు వ్యాయామం, తైలాలతో మసాజ్‌లు, దాణా దాకా అన్నీ రాచమర్యాదలే. రోజుకు రెండు పూటలా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించిన అనంతరం పిస్తా, బాదం, జీడి పప్పు అక్రూట్ లాంటి డ్రైఫూట్స్ తినిపిస్తారు. మధ్యాహ్నం , సాయంత్రం తృణధాన్యాల, డ్రై ఫ్రూట్స్‌తో దాణా పెడతారు.అంతేకాదు కొద్దిగా మద్యాన్ని కూడా పోస్తారట. దీంతో పౌరుషానికి ప్రతీకగా, పందేనికి సిద్ధం అన్నట్టు తయారవుతాయి. కుక్కుట శాస్త్రం (కోళ్ల పంచాంగం) మనుషులకు పంచాంగం ఉన్నట్టు కోళ్లకూ ఉంది మరి. అదే కుక్కుట శాస్త్రం. కోడిని సంస్కృతంలో కుక్కుట అంటారు అలా ఈ కోళ్ల పంచాంగానికి కుక్కుట శాస్త్రం అని పేరు వచ్చింది. తిధి, వార,నక్షత్రాలు, కోళ్లపై గెలుపోటముల ప్రభావం చూపుతాయని నమ్ముతారు. కుక్కుట శాస్త్రంలో మొత్తం 27 నక్షత్రాలు ఉంటాయి. ఈ 27 నక్షత్రాలు వివిధ రకాల కోడిపుంజులపై వివిధ రకాల్లో ప్రభావం చూపుతాయట. వారం, తిధి, దిశ,నక్షత్ర బలంతోపాటు, తమ జాతకం బలానికి, కోడి జాతక బలంకూడా తోడైతే ఇక గెలుపు మాదేనని నమ్ముతారు పందెం రాయుళ్లు. చివరకు మిగిలేది చుట్టూ వేలాదిమంది గుమిగూడగా, యుద్ధ క్షేత్రంలోకి దిగుతాయి. యజమాని పట్ల విశ్వాసంతో, బాస్ నమ్మకాన్ని వమ్ము చేయకూడదన్నట్టు రంగంలోకి దిగుతాయి. రక్తం చిందించి మరీ పోరాడతాయి. ఈ క్రమంలో నెగ్గితే..వైభోగం. లేదంటే పరలోకం. అప్పటిదాకా రాజభోగాలు అనుభవించి, నేనే రాజు అన్నట్టుగా ఎదిగిన పుంజు కాస్తా.. చివరికి మందులోకి నంజులాగానో, అల్లుడుగారికి విందుగానో మారిపోతుంది. -
పుంజు భలే రంజుగా!
సాక్షి, భీమవరం: ఆంధ్రుల అతిపెద్ద పండుగ సంక్రాంతికి దాదాపు ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి సందడిని తెచ్చే కోడి పందేలకు అప్పుడే తెర లేచింది. రాష్ట్రంలో కోస్తా జిల్లాల్లో ఏటా సంక్రాంతి పండుగ మూడు రోజులు పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కోడి పందేలకు పెట్టింది పేరు. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, పరిసర ప్రాంతాల్లో నిర్వహించే కోడి పందేలను వీక్షించడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు కూడా వస్తారంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో కోడి పందేల నిర్వాహకులు తమ పుంజులను పందెం బరిలో నిలపడానికి సిద్ధం చేస్తున్నారు. కోడి పుంజుల ఎంపిక, వాటికి ప్రత్యేక శిక్షణ, మంచి పౌష్టికాహారం, శారీరక పటుత్వానికి ప్రత్యేక వ్యాయామాలు చేయిస్తూ పందెం బరిలో నిలపడానికి సై అంటున్నారు. మేత, శిక్షణ.. పెద్ద కసరత్తే ఏ వ్యక్తితో అయినా గొడవ పడి, కోపం వచ్చి నప్పుడు నిన్ను పందెం పుంజును మేపినట్టు మేపానని దెప్పడం గోదావరి జిల్లాల్లో సర్వసాధారణం. దీనినిబట్టి పందెం కోళ్లను ఇక్కడ ఏ విధంగా పెంచుతారో అర్థం చేసుకోవచ్చు. పది నిమిషాల పాటు ఉండే పందెం బరిలో ప్రత్యర్థి పుంజును మట్టికరిపించేందుకు కోళ్ల పెంపకందారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. సంక్రాంతికి మూడు నెలల ముందు నుంచే వాటికిచ్చే మేత, శిక్షణలో పెద్ద కసరత్తే చేస్తారు. పండుగ సమయంలో భీమవరం, కోనసీమ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కోడిపందేల కోలాహలమే కనిపిస్తుంది. ఆ మూడు రోజులు కోట్లాది రూపాయలు చేతులు మారతాయి. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే భారీ బరులు, గ్యాలరీలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పందేలను చూడటానికి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు భారీ ఎత్తున వస్తుంటారు. వారితో ముందుగానే హోటళ్లు, లాడ్జిలు నిండిపోతాయి. మటన్ నుంచి డ్రైప్రూట్స్ వరకు.. శిక్షణలో పుంజుకు శక్తి, సామర్థ్యం పెంచేందుకు, దాని శరీరంలో కొవ్వు చేరకుండా సులువుగా ఎగురుతూ ప్రత్యర్థిపై విరుచుకుపడేందుకు మూడు నెలలపాటు ప్రత్యేక మేతను అందిస్తారు. కోడి పరిమాణాన్ని బట్టి ఉదయం పూట 20 నుంచి 40 గ్రాముల వరకు ఉడకబెట్టిన మటన్, మూడు నుంచి ఐదు వరకు బాదం పప్పులు, రెండు వెల్లుల్లి, ఒక ఎండు ఖర్జూరం, ఉడికించిన కోడిగుడ్డు ముక్కలు పెడతారు. సాయంత్రం.. చోళ్లు, గంటులు, మెరికలు మొదలైన వాటిని ఆహారంగా అందిస్తారు. పుంజుకు నొప్పులు తగ్గేందుకు ప్రత్యేక శిక్షణ.. పండుగ దగ్గర పడుతున్నకొద్దీ పుంజు శరీరం గట్టిపడేందుకు, నొప్పులేమైనా ఉంటే తగ్గేందుకు ప్రత్యేక ట్రైనర్లతో నీళ్లపోతలు, శాఖలు చేయిస్తారు. ఇందుకు వేప, జామాయిల్, కుంకుడు, వెదురు, వాయిల తదితర ఆకులు, తుమ్మ బెరడు, తోక మిరియాలు, పసుపు కొమ్ములు తదితర 20 రకాల వాటిని నీటిలో వేసి గంటల కొద్దీ మరిగిస్తారు. ఈ ద్రావణాన్ని చిన్న తొట్టెలో కోడి తట్టుకునే వేడి వరకు చల్లార్చుతారు. ఆ తర్వాత అందులో పుంజును ఉంచి పైనుంచి ద్రావణం పోస్తూ వారం రోజుల వ్యవధిలో ఒకటి రెండుసార్లు నీళ్లపోతలు చేయిస్తారు. చివరిగా శాఖల కోసం పొయ్యిపై మూకుడిని వేడి చేస్తూ.. అందులో చీప్ లిక్కర్ చిమ్మినప్పుడు వచ్చిన ఆవిరిని మెత్తటి గుడ్డకు పట్టించి దాన్ని కోడి శరీరమంతా అద్దుతారు. వారానికి ఒకసారి చొప్పున, కొందరు.. రెండు మూడుసార్లు కూడా ఈ శాఖలు చేయిస్తుంటారు. ఏ ప్రక్రియ అయినా కోడి సామర్థ్యాన్ని బట్టి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉంటుంది. ఇవే కాకుండా పందెం పుంజు అనారోగ్యం, వైరస్ల బారిన పడకుండా తరచూ పశువైద్యుడిని తీసుకొచ్చి పరీక్షలు చేయిస్తారు. ఆయుర్వేద పద్ధతులను అనుసరించేవారూ ఉన్నారు. పందేలకు ముందు అలసిపోకుండా నాలుగైదు రోజుల ముందు నుంచి పుంజుకు పూర్తి విశ్రాంతిని ఇచ్చి మకాంలో కట్టేసి ఉంచుతారు. రూ.కోట్లలో వ్యాపారం మకాంల వద్ద పనిచేసే వారికి నెలకు రూ.15 వేలు నుంచి రూ.20 వేల వరకు జీతాలుంటాయి. ఒక్కొక్కరు 12 నుంచి 15 పుంజులను మాత్రమే పర్యవేక్షిస్తారు. నీళ్లపోతలు, శాఖల కోసం వచ్చే ట్రైనర్లు కొంత మొత్తం మాట్లాడుకుంటారు. ఇవికాకుండా కోడికి అందించే ప్రత్యేక మేత, మందులతో ఒక్కో పందెం పుంజును సిద్ధం చేసేందుకు మూడు నెలల్లో రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చవుతుంది. ఈ విధంగా పెంచిన పుంజులను వాటి రంగు, ఎత్తు, పోరాట పటిమను బట్టి రూ.50 వేల నుంచి లక్షల్లో అమ్ముతుంటారు. వీటిపై భారీస్థాయిలో పందేలు జరుగుతుంటాయి. మామూలుగా ఇళ్ల వద్ద పెంచిన పుంజులు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటాయి. పండుగల కోసం రెండు వేలకు పైగా పందెం కోళ్లు అమ్మకాలు జరుగుతుంటాయి. వీటి ద్వారా రూ.12 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. పండుగకు నెలరోజులు మాత్రమే గడువుండటంతో ఇప్పటికే భీమవరం, కోనసీమ ప్రాంతాల్లో పందెంకోళ్ల పెంపకం జోరుగా సాగుతోంది. పుంజుల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ.. బరిలో ప్రత్యర్థి కోడిని ఓడించడమే లక్ష్యంగా పందెంరాయుళ్లు పుంజుల పెంపకంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొందరు తమ ఇళ్లు, చెరువులు, పొలాల వద్ద పుంజులను పెంచితే అధిక శాతం మంది నాటుకోళ్ల కేంద్రాల్లో పుంజులను కొనుగోలు చేసి వాటిని పందేలకు సిద్ధం చేసే పనిని పెంపకందారులకు అప్పగిస్తారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాలతో పాటు విదేశాల నుంచి సంక్రాంతికి స్వస్థలాలకు వచ్చే ఔత్సాహికులు ఆన్లైన్లో పుంజులను ఎంపిక చేసుకుని పెంపకందారులకు ముందుగానే అడ్వాన్స్‌లు చెల్లిస్తుండటం విశేషం. పందెం పుంజులకు ఉన్న డిమాండ్‌తో ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 150కి పైగా నాటుకోళ్ల పెంపకం కేంద్రాలు ఉన్నట్టు అంచనా. కాకి, నెమలి, పచ్చకాకి, కేతువ, డేగ.. వివిధ రంగుల్లో కాకి, నెమలి, అబ్రాస్, డేగ, పచ్చకాకి, కేతువ తదితర జాతుల నుంచి రెండేళ్ల వయసు కలిగిన పుంజులను పందేలకు సిద్ధం చేస్తారు. ఎంపిక చేసుకున్న పుంజుకు పోరాట పటిమ, శరీర పటుత్వం, శక్తిని పెంచేందుకు మూడు నెలల ముందు నుంచి ఎవరికి వారు ఎన్నో సంప్రదాయ, ఆధునిక పద్ధతులు అవలంబిస్తారు. వాటికిచ్చే ఆహారం, మందుల నుంచి శిక్షణ వరకు ప్రతి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తాము ఎలా పెంచుతున్నది.. తమ పుంజు బలం, బలహీనత ఇతరులకు తెలియకుండా చాలా జాగ్రత్తలు పాటిస్తారు. పందెం పుంజు దినచర్య ఇలా.. ఉదయాన్నే పుంజును బయటకు తెచ్చి కొద్దిగా వేడి నీటిని పట్టిస్తారు. కాళ్లల్లో పటుత్వానికి, ఆయాసం రాకుండా ఉండేందుకు, అనారోగ్య సమస్యలుంటే గుర్తించేందుకు దాదాపు నెల పాటు రోజు విడిచి రోజు ఈత కొట్టిస్తారు. తదుపరి ప్రక్రియగా ‘వి’ ఆకారంలో నెట్లు కట్టి పుంజు అందులోనే తిరిగేలా బేటా (ని ర్ణీత పద్ధతిలో వాకింగ్) చేయిస్తారు. మరికొందరు ఖాళీ జాగాలో వాటి వెనుకే ఉండి తరుముతూ నడిచేలా చేస్తారు. కోడి నోటి నుంచి వచ్చే కఫాన్ని తొలగించి శుభ్రం చేయిస్తారు. తర్వాత మేత పెట్టి ఉదయం 11 గంటల వరకు ఎండలో కట్టేసిన తర్వాత మకాంలోకి మారుస్తారు. -
ఏపీ: ఈసారి ‘క్రాస్’ పుంజులతో..
కైకలూరు: సంక్రాంతి అంటేనే కోడిపందేలకు పెట్టింది పేరు. కత్తులతో కుత్తుకలు తెగే పుంజుల పోరాటాన్ని రక్తికట్టించేందుకు నిర్వాహకులు ఎప్పటిలాగే ఈ ఏడాదీ ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి విభిన్నంగా క్రాస్డ్ జనరేషన్ పుంజులను బరిలోకి దించుతున్నారు. ఈ రోమాంచిత పోటీలకు జస్ట్ ఆరు రోజులే గడువు మిగిలి ఉంది. టిక్..టిక్..టిక్.. గతేడాది జనవరిలో కోడిపందేల రూపంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.900 కోట్లు చేతులు మారాయన్నది ఓ అంచనా. ఇందులో కోడిపందేలకు పెట్టింది పేరైన ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల వాటా అత్యధికంగా రూ.500 కోట్లు ఉండొచ్చు. నోట్ల రద్దు, కరోనా ప్రభావంతో గతంలో పందేల జోరు తగ్గినా, ఈ ఏడాది పరిస్థితులు అనుకూలించడంతో రాష్ట్రంలో ఈ ఏడాది ఇంకా ఎక్కువగా పందేలు ఉంటాయని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో కోడిపందేల నిర్వాహకులు పందెపు బరులను సిద్ధంచేసే పనుల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు.. ఇప్పటికే పలు జిల్లాల్లో లాడ్జిలు, అతిథి గృహాలు బుక్కయిపోయాయి. కోడి పందేలు.. కొత్త పుంతలు.. ఈ ఏడాది కోడిపందేలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. క్రాస్ జనరేషన్ కోడిపుంజుల హవా కొనసాగుతోంది. అమెరికన్ గేమ్ పాల్, అమెరికన్ పెర్విన్, బ్రెజిల్ జాతి కోళ్లను తీసుకొచ్చి దేశీయ నెమలి, డేగ వంటి జాతి కోళ్లతో క్రాసింగ్ చేయిస్తున్నారు. పందేనికి సిద్ధమైన వీటి ధర రూ.లక్ష పైమాటగానే ఉంది. ఇక కోడిపుంజుల పెంపకాన్ని పలు జిల్లాల్లో నిర్వాహకులు కుటీర పరిశ్రమగా మార్చుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో దాదాపు 300 కోడిపుంజుల శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 18 నెలల పాటు పుంజులను పోటీలకు సిద్ధంచేయడానికి ఒక్కో శిక్షకుడికి రూ.15 వేలు జీతం ఇస్తున్నారు. యంత్రాలలో కోడిగుడ్లను పొదిగించి నాణ్యమైన పుంజు జాతులను తయారుచేస్తున్నారు. మార్పు కోసం పోలీసుల యత్నం హైకోర్టు ఆదేశాలతో కోడిపందేలను అడ్డుకోవడానికి గతంలో పోలీసులతో పాటు ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా రంగంలోకి దిగారు. పోలీసు యాక్ట్ 144 సెక్షన్‌ను విధించారు. బైండోవర్లు చేసి, వేలాదిగా కోడి కత్తులను సీజ్ చేశారు. ఈ ఏడాది కూడా భారీగా కోడికత్తులను సీజ్ చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోడిపందేలకు సంబంధించి 900 కేసులు నమోదు చేశారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్, క్రికెట్ వంటి పోటీలను మార్పు కోసం నిర్వహిస్తున్నారు. కమిటీలతో కట్టడి చేస్తాం.. సంక్రాంతి పండుగ సమయంలో కోడిపందేలు, జూదాలను కట్టడి చేయడానికి గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటుచేశాం. ఏలూరు జిల్లాలో కేవలం 15 రోజుల్లోనే 45 కేసులు నమోదు చేశాం. ఇప్పటికే పెట్రోలింగ్ టీంలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా జూదాల వైపు దృష్టి మళ్లకుండా పోలీస్స్టేషన్ల పరిధిలో వాలీబాల్, క్రికెట్ వంటి పోటీలను పోలీసు శాఖ ఏర్పాటుచేసింది. – రాహుల్‌దేవ్ శర్మ, ఎస్పీ, ఏలూరు జిల్లా -
పుంజు భలే రంజుగా! సంప్రదాయం నుంచి సంపాదనగా ‘కోడి పందేలు’
సాక్షి, అమరావతి: బరిలో తలపడే పుంజులు అత్యంత పౌరుషంతో పోరాడుతాయి. ఓడిపోయిన పుంజు తోక ముడిచి బరినుంచి పారిపోతే.. గెలిచిన పుంజు తన యజమాని ఉప్పొంగిపోయేంత గర్వాన్ని ఇచ్చేది. పుంజుల పోరాటం చూపరులకు సైతం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేది. తొలినాళ్లలో సరదా కోసం మొదలైన పందాలు ట్రెండ్ మార్చుకుంటున్నాయి. ఇప్పుడు కోడి పందాలంటే విశాలమైన మైదానం.. భారీ టెంట్లు.. ప్రేక్షకులు కూర్చుని వీక్షించేలా ప్రత్యేకంగా గ్యాలరీలు.. ఫ్లాష్లైట్ల కాంతులు.. భారీ సంఖ్యలో జన సందోహం నడుమ జాతరను తలపించేలా మారిపోయింది. ప్రత్యేక శిక్షణ పొందిన పుంజులను పహిల్వాన్ మాదిరిగా వాటి కాళ్లకు పదునైన కత్తులు కట్టి బరిలో దించుతున్నారు. రక్తమోడుతున్నా వీరోచితంగా పోరాడి ఒక కోడి గెలిస్తే.. మరో కోడి ప్రాణాలు విడుస్తుంది. ఆ తరువాత పెద్ద మొత్తంలో నగదు చేతులు మారుతుంది. సంక్రాంతి మూడు రోజుల్లోనే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.వందలాది కోట్లు కోడి పందాల మాటున చేతులు మారుతున్నాయి. తాజాగా ఒకచోట కోడి పందాలు వేసి.. వాటిని సోషల్ మీడియాలో లైవ్‌లో చూపించి బెట్టింగ్‌లు వేసుకునే స్థాయికి చేరింది. అలా మొదలై.. పూర్వం దేశంలోని అనేక ప్రాంతాల్లో కోడి పందాలు వినోదం కోసం మొదలై వీరోచిత పోరాటాలకు దారితీశాయని చరిత్ర చెబుతోంది. తొలినాళ్లలో అడవి కోళ్లు లేదా పెరటి కోళ్లు పోరాడుకునేలా ప్రేరేపించి వినోదం పొందేవారు. పల్నాడు యుద్ధం (1178–1182) కోడి పందాల్లో తలెత్తిన వివాదం వల్లే సంభవించినట్టు చరిత్ర చెబుతోంది. బొబ్బిలి యుద్ధంలోనూ కోడి పందాలు జరిగాయి. రానురాను కోడి పందాలు ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో జూదం తరహాలో మార్పు చెందాయి. సుమారు రెండున్నర దశాబ్దాలుగా సంక్రాంతి అంటే కోడి పందాలు అనేలా మారిపోయాయి. సంక్రాంతి మూడు రోజులపాటు నిర్వహించే కోడి పందాల కోసం ఐదు నెలల ముందు నుంచే ప్రత్యేకంగా ఎంపిక చేసిన కోడి పుంజులను తీర్చిదిద్దుతారు. వాటి పెంపకానికి రూ.లక్షల్లో వెచ్చిస్తున్నారు. ఇదీ చదవండి: ఆ ఒక్కటీ... అడక్కు..!! షాక్‌లో ఆడిట్ అధికారులు -
సంక్రాంతికి తగ్గేదేలే.. స్పెషల్ డైట్‌తో తర్ఫీదు.. పుంజు ధర ఎంతో తెలుసా?
సంక్రాంతి పండగ అంటే గోదావరి జిల్లాల్లో గుర్తొచ్చేది కోడిపందేలే. ఏటా ఎంతో సందడిగా జరిగే ఈ పందేలను తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఇక్కడకు వస్తుంటారు. పందేలలో రూ.కోట్లు చేతులు మారుతుంటాయి. అయితే సంక్రాంతి పండగకు ఇంకా రెండు నెలల సమయం ఉండగా అప్పుడే కోడిపుంజులను పందేలకు సిద్ధం చేస్తున్నారు. బరిలో బలంగా ఢీకొట్టేలా జాతి కోళ్లను జిల్లాలోని కొన్ని శిబిరాల్లో పెంచుతుండగా, వీటి ఖరీదు రూ.వేల నుంచి లక్షల్లో పలుకుతుండటం విశేషం. భీమవరం (ప్రకాశం చౌక్): సంక్రాంతి బరిలో దించే పుంజులపై పందెం రాయుళ్లు, అలాగే పుంజుల పెంపకందారులు భారీగా పెట్టుబడులు పెడతారు. పందేనికి పుంజును సిద్ధం చేయడం కోసం పెంపకందారులు చాలా శ్రమిస్తారు. పుంజును సుమారు ఏడాది పాటు పెంచుతారు. వీటి ఆహారం నుంచి ఆరోగ్యంగా, బలంగా ఉండేవరకు ఒక్కోక్క పుంజుపై సుమారు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేస్తారు. కొందరు ప్రత్యేకంగా కోసం స్థలం లీజుకు తీసుకుని మరీ 20 నుంచి 200 పుంజుల వరకు పెంచుతారు. పుంజుల సంఖ్య బట్టి ఏడాదికి సుమారు రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేస్తారు. మరి కొందరు అయితే తమ ఇంటి వద్ద ఉండే చిన్న పాటి ఖాళీ స్థలంలోనే పందెం పుంజులను పెంచుతూ పండగ సమయంలో వాటిని విక్రయించి ఉపాధి పొందుతారు. ఖరీదైనా దాణా.. నిత్యం వ్యాయామం పందెం పుంజుకు బలవర్థమైన ఆహారం పెడతారు. మటన్ కైమా, జీడిపప్పు, బాదం పప్పు, కోడిగుడ్డు, గంటులు, చోళ్లు, తదితర వాటిని ప్రతిరోజు వాటికి ఆహారంగా పెడతారు. తరచూ పుశువైద్యులకు చూపించి వారి సలహాలు మేరకు విటమిన్ మాత్రలు, అనారోగ్యానికి గురికాకుండా వైద్యం అందించడం చేస్తారు. పందెం బరిలో త్వరగా అలసిపోకుండా ఎక్కువ సేపు పోరాడేలా ప్రతి రోజు వ్యాయామం చేయిస్తారు. నీటిలో ఈత కొట్టిస్తారు. పుంజు ఎలా పోరాడుతుంతో తెలుసుకోవడానికి తరచూ ఇతర కోళ్లతో పందేలు వేసి గమనిస్తుంటారు. రూ.10 కోట్ల వ్యాపారంపైనే.. జిల్లాలో పందెం పుంజుల పెంపకం కలిగిన ప్రాంతాల చూస్తే ముఖ్యంగా భీమవరం, పాలకొల్లు, ఉండి, ఆకివీడు, కాళ్ల, వీరవాసరం, నర్సాపురం, ఆచంట, తణుకు, పాలకోడేరు, తాడేపల్లిగూడెం, తదితర ప్రాంతాల్లో భారీగా పుంజులను పెంచుతుంటారు. మొత్తం జిల్లాలో ఏటా సంక్రాంతి పండగకు పందెం పుంజుల కొనుగోలు కోసం పందెంరాయుళ్లు సుమారు రూ.10 కోట్ల వరకు ఖర్చు చేస్తుంటారని అంచనా. పుంజు ధర, రకాలు పందెం పుంజుల ధర విషయానికి వస్తే జాతి, రంగు, దెబ్బలాడే విధానాన్ని బట్టి ధర నిర్ణయిస్తారు. వీటి ధర సుమారుగా రూ.15 వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతాయి. వీటిలో నెమలి, కాకీ నెమలి, పచ్చ కాకి, సేతువా, పర్ల, డేగ, నెమలి డేగ, రసంగీ, మైలా, ఫింగలా, పెట్టమర్రు, తదితర రకాల పుంజులు ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు పందెం పుంజులను పెంపకందారులు పలు రకాలుగా విక్రయిస్తున్నారు. పుంజు కావాల్సిన వారు ముందుగా కొంత అడ్వాన్సు ఇచ్చి బుక్ చేసుకుని పందెం రోజు పూర్తి మొత్తం ఇచ్చి తీసుకువెళుతుంటారు. మరి కొందరు నేరుగా మకాం వద్దకు వెళ్లి వారికి కావాల్సిన పుంజులను ఎంచుకుని కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు అయితే పెంపకందారులు పుంజులను ఆన్లైన్లో కూడా విక్రయిస్తున్నారు. సంక్రాంతి పండగ సమయంలో పందేలు జరిగే ప్రాంతాలకు తీసుకువెళ్లి అక్కడ నేరుగా కూడా విక్రయిస్తుంటారు. జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, వీరవాసరం, కాళ్ల, ఉండి, ఆకివీడు, తాడేపల్లిగూడెం, అత్తిలి, తణుకు తదితర మండలాల్లో కోడి పుంజులను విక్రయాలు ఎక్కువగా విక్రయిస్తుంటారు. -
సంక్రాంతి : కత్తి దూసిన పుంజులు (ఫోటోలు)
-
Cockfights: కత్తి దూసిన పుంజులు: కోళ్లు.. కోట్లు
సాక్షి, అమరావతి: పందెం కోళ్లు జూలు విదిల్చి కత్తులు దూశాయి. భోగి రోజైన శుక్రవారం ఉభయ గోదావరితోపాటు పలు జిల్లాల్లో ఆంక్షలను అధిగమించి సంప్రదాయం పేరుతో నిర్వాహకులు పందెం పుంజులను బరుల్లోకి దించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంపలో ఒకరోజు ముందే పందెం కోళ్ల కూత మొదలైంది. తూర్పు గోదావరి జిల్లా పళ్లంకుర్రులో మూడు రోజులపాటు జరిగే కార్యక్రమంలో అత్యధిక పందాలు గెలిచిన కోడి పుంజు యజమానికి ఇన్నోవా కారు బహుమతిగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇక్కడ పందేలకు హాజరయ్యారు. బురదగా బరులు.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బరులు తడిసిపోయి బురదమయంగా మారడంతో పలుచోట్ల పందేలు ఆలస్యంగా మొదలయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా సీసలి, తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోట ప్రాంతాల్లో వాటర్ ప్రూఫ్ షామియానాలను ఏర్పాటు చేశారు. ఫ్లడ్‌లైట్ల వెలుగులతో వీఐపీ గ్యాలరీలు, సాధారణ బారికేడ్లుతో బరుల వద్ద ఏర్పాట్లు చేశారు. కొన్నిచోట్ల మాత్రం కత్తులు కట్టకుండా సంప్రదాయ కోడి పందాలను రాజకీయ నాయకులు ప్రారంభించారు. బరుల ధ్వంసం.. బైండోవర్లు పలు ప్రాంతాల్లో పోలీసులు కోడి పందాలను అడ్డుకునేందుకు బరులను ధ్వంసం చేశారు. నిర్వాహకులపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. పందెం కోళ్లకు కత్తులు కట్టేవారిని అదుపులోకి తీసుకుని చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మైక్‌లతో ప్రచారం నిర్వహించారు. ఈసారి కోడి పందాలను అడ్డుకోవడంలో వర్షం, కరోనా భయం కొంతమేర సహకరించాయి. పందెంరాయుళ్ల సంఖ్య కొంత పలచబడింది. పశ్చిమలో ‘తగ్గేదే లే’ పశ్చిమ గోదావరి జిల్లాలో పూలపల్లి, కలగంపూడి, మార్టేరు, ఉంగుటూరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, దొరమామిడి, బుట్టాయిగూడెం, దెందులూరు తదితర చోట్ల భారీ షామియానాలు ఏర్పాటు చేసి పందేలు నిర్వహించారు. బరుల వద్ద పేకాట, గుండాటతో కోలాహలం నెలకొంది. కోడి పకోడి, బిర్యాని విక్రయాలు పెద్ద ఎత్తున సాగాయి. జిల్లాలో సుమారు రూ.80 కోట్లు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. గుండెపోటుతో యువకుడు మృతి పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారంలో కోడిపందేలను తిలకిస్తూ ఆరేపల్లి వీర్రాజు (34) గుండెపోటుకు గురై కుప్పకూలాడు. భీమవరం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రూ.లక్షకు తగ్గకుండా.. కృష్ణా జిల్లాలోని కొత్తూరు, తాడేపల్లి, సింగ్‌నగర్ పైపుల రోడ్డు, అంబాపురం, నూజివీడు ప్రాంతాల్లో ఒక్కో పందెం రూ.లక్షకు తక్కువ కాకుండా జరిగాయి. గుంటూరు జిల్లా మాచర్లతోపాటు ఇతర ప్రాంతాల్లో ఒక మోస్తరు పందేలు కాశారు. పలుచోట్ల అరెస్టులు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, విశాఖపట్టణం జిల్లాల్లో పలుచోట్ల కోడి పందేల నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలం చింతలపాలెం, ఉదయగిరి మండలం క్రిష్ణంపల్లి బీసీ కాలనీ, వెంకటగిరిలో మాసాపేట ట్యాంకు, సైదాపురం మండలం చీకవోలు తదితర చోట్ల పొలాలు, ఇతర ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహిస్తున్న 13 మందిని అరెస్టు చేసి రూ.5 వేల నగదు, పుంజులను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ గంగవరం పోర్టు రోడ్ వై జంక్షన్‌లోని తోటల్లో కోడి పందాలు నిర్వహిస్తున్న పది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆరు కోళ్లు, రూ.10 వేలు స్వాధీనం చేసుకొన్నారు. -
సరిహద్దు జిల్లాల్లో జాతరే..
అశ్వారావుపేట/సత్తుపల్లి: కోడి పందేలతో ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు జాతరను తలపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పందెంరాయుళ్లు సరిహద్దుకు తరలివచ్చారు. అశ్వారావుపేట, సత్తుపల్లి, మధిర మండలాల్లో కోడి పందేలు జరిగే ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో వచ్చారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల మీదుగా ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని మండలాల్లో నిర్వహించే కోడిపందేల స్థావరాలకు కూడా బయలుదేరారు. ఇటు కృష్ణా జిల్లా తిరువూరు మండలం కోకిలంపాడు, కాకర్ల, మల్లేల గ్రామాలు, పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలంలోని కొన్ని గ్రామాలకు జిల్లా వాసులు వెళ్లారు. అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చంద్రుగొండతో పాటు ఏపీకి బదలాయించిన కుక్కునూరు, వేలేరుపాడుల్లోని పామాయిల్ తోటల్లో షెడ్లు ఏర్పాటు చేసి ఏడాది పాటు కోళ్లను పెంచారు. వీటితో కొందరు పందెంలో పాల్గొంటున్నారు. -
లుంగీ, షర్టు ధరించి మారు వేషంలో ఎస్ఐ.. ఏమైందో తెలుసా?
సాక్షి, విశాఖపట్నం: పోలీస్ డ్రెస్సులో దాడికి వెళుతుంటే కోడి పందేల నిర్వాహకులు ముందే అప్రమత్తమవుతున్నారని ఎస్ఐ మారు వేషంలో ప్రత్యక్షమయ్యారు. లుంగీ, షర్టు ధరించి సామాన్య గ్రామీణుడిలా వెళ్లడంతో ఆయననెవరూ గుర్తు పట్టలేదు. కోడి పుంజులతో సహా సునాయాసంగా నిందితులను పట్టుకున్నారు. ఈ ఘటన రోలుగుంటలో బుధవారం రాత్రి జరిగింది. చదవండి: సంక్రాంతి: గంగిరెద్దులతో మాట్లాడగల నేర్పరులు స్థానిక ఎస్ఐ బి.నాగకార్తీక్ సిబ్బందితో కలిసి ఇలా వినూత్న రీతిలో ఎం.కె.పట్నం పరిసర ప్రాంతంలోని కోడి పందెం స్థావరాలపై దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు పట్టుబడగా వారి నుంచి రెండు కోడి పుంజులు, రూ.510 లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. -
'పుంజు'కున్న ధరలు.. రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకూ
సాక్షి, పశ్చిమగోదావరి(నిడదవోలు): సంక్రాంతి బరిలో నిలిచే కోడి పుంజుల ధరలు ఔరా అనిపిస్తున్నాయి. పుంజు రకాన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ధర పలుకుతున్నాయి. బరిలో దిగితే నువ్వానేనా అన్నట్టు తలపడే రకాల్లో సేతువ జాతి ముందుంటుంది. దీని ధర రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంది. తర్వాత స్థానాల్లో పర్ల, పచ్చకాకి, డేగ, కాకి పుంజు, పెట్టమారు జాతులు ఉన్నాయి. పర్ల రూ. 50 వేలు, నెమలి రూ. 50 వేల నుంచి రూ.60 వేలు, కాకి డేగ పర్ల రూ.25 వేల నుంచి రూ.30 వేలు, ఎర్రకెక్కిరాయి రూ.40 వేలు, పచ్చకాకి డేగ రూ.30 వేల నుంచి రూ.40 వేలు ధరలు పలుకుతున్నాయి. వీటితో పాటు రసంగి, కెక్కరి, పూల, అబ్రస్, పండుడేగ, మైయిలా, సింగాలి, పెట్టమారు, పింగళ రకాలు రూ.25 వేల నుంచి రూ.30 వేల ధరలకు పందెంరాయుళ్లు కొనుగోలు చేస్తున్నారు. పుంజుల ప్రత్యేకతలు, సామర్థ్యం ఆధారంగా ధరలు ఉంటాయని పెంపకందారులు చెబుతున్నారు. చదవండి: (‘పిల్లలను చూసైనా బతకాలనిపించలేదా?’) -
కవన హేమంతం
హేమంత రుతువులో వచ్చే మకర సంక్రాంతి తెలుగువాళ్ల పెద్ద పండుగ. ముఖ్యంగా ఇది కృషీవలుౖరైన రైతుల పండుగ. పంటలు చేతికంది, ధాన్యరాశులు ముంగిళ్లలో పోగుపడే వేళ జరుపుకొనే అచ్చమైన అన్నదాతల పండుగ. అలాగని ఇది తెలుగువాళ్లకు మాత్రమే పరిమితమైన పండుగ కాదు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రజలు తమ తమ ఆచార సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి పండుగను వీలైనంత సంబరంగా జరుపుకొంటారు. తెలుగు సాహిత్యంలో ప్రాచీనులు మొదలుకొని ఆధునికుల వరకు ఎందరో కవులు తమ కావ్యాల్లో సంక్రాంతి హేలను, హేమంత రుతులీలను అత్యంత హృద్యంగా వర్ణించారు. వర్షరుతువు ప్రారంభంలో వేసిన పంటలు చేతికందే నాటికి హేమంత ప్రభావం తారస్థాయికి చేరుకుంటుంది. పగటి సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. చలి వణికిస్తుంది. కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు మరీ దారుణంగా వీధుల్లో మంచు గడ్డకట్టే స్థాయికి పడిపోతాయి. ఇది ప్రకృతి ధర్మం. ‘అహములు సన్నములయ్యెను/ దహనము హితమయ్యె దీర్ఘదశలయ్యె నిశల్;/ బహు శీతోపేతంబై/ యుహుహూ మని వడకె లోకముర్వీనాథా!’ అని పోతనామాత్యుడు తన భాగవత కావ్యంలో హేమంత శీతలతను కళ్లకు కట్టాడు. అలాగని, అంతటితోనే ఆగలేదు. ‘పొడుపు కొండ మీద పొడుచుట మొదలుగా/ బరువు లెట్టి యినుడు పశ్చిమాద్రి/ మరుగు జొచ్చెగాక మసలిన చలిచేత/ జిక్కె జిక్కెననగ జిక్కకున్నె?’ అంటూ, చలి తాకిడి నుంచి తప్పించుకోవడానికే సూర్యుడు ఉరుకులు పరుగులు పెట్టి పడమటి కొండల్లో దాక్కున్నాడని తీర్మానించాడు. హేమంతపు చలిధాటి సూర్యుడినే భయపెట్టిందంటే, ఇక మానవమాత్రుల సంగతి చెప్పేదేముంటుంది? ఇలాంటి హేమంత శీతవేళ వచ్చే పండుగ మకర సంక్రాంతి. చలి తీవ్రతను తట్టుకోవడానికి జనాలు చలిమంటలు వేసుకుంటూ ఉంటారు. సంక్రాంతి ముందురోజు భోగి పండుగనాడు వీధివీధినా ఊరుమ్మడి చలిమంటలు వేసుకోవడం ఆనవాయితీ. పుష్యమాసంలో వచ్చే మకర సంక్రాంతి వేళ ధాన్యరాశులు పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. ఒకవైపు గడగడ వణికించే చలి ఉన్నా, స్థూలంగా ప్రకృతి ఆహ్లాదభరితంగా ఉంటుంది. సంక్రాంతి శోభను ఎందరో ఆధునిక కవులు సైతం అత్యద్భుతంగా వర్ణించారు. ‘కళ్యాణకంఠి ఈ కన్నెసంక్రాంతి/ భోగాలబాల ఈ భోగి సంక్రాంతి/ వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి/ వచ్చింది వచ్చింది లచ్చి సంక్రాంతి’ అంటూ రాయప్రోలువారు సంక్రాంతి రాకడపై హర్షాతిరేకాలు ప్రకటించారు. సంక్రాంతికి కొత్త అల్లుళ్లను ఆహ్వానించడం, బంధుమిత్రులతో విందుభోజనాలు ఆరగించడం ఆనవాయితీ. ‘జిడ్డుదేఱిన వెన్నెలగడ్డ పెరుగు/ గరగిరకజాటు ముంగారు చెఱకురసము/ సంతరించితి విందుభోజనము సేయ/ రండురండని పిలిచె సంక్రమణ లక్ష్మి’ అని చవులూరించేలా వర్ణించారు ‘తెనుగు లెంక’ తుమ్మలవారు. సాహితీ ఉపాధ్యాయుడే కాక, స్వయంగా కృషీవలుడైన ఆయన సంక్రాంతిపై విరివిగా పద్యాలను అల్లారు. ఆధునికుల్లో జంటకవులైన పింగళి–కాటూరి ‘దినకరుడు శాంతుడై తోచె దినములింత/ కురుచలయ్యెను జలిగాలి చురుకు హెచ్చె/... మన గృహమ్ముల ధాన్య సంపదల నిల్పి/ సరస మధురమ్ము పుష్యమాసమ్ము వచ్చె’ అంటూ ‘తొలకరి’ కావ్యంలో పుష్య సౌభాగ్యాన్ని వర్ణించారు. వీరు ఇదే కావ్యంలో సంక్రాంతి వేడుకలను వర్ణిస్తూ, ‘రండు మాయింటి కీరు పేరంటమునకు/ బొమ్మలెత్తును మా పిల్లయమ్మలార’ అంటూ సంక్రాంతి బొమ్మల కొలువుల వేడుకను ప్రస్తావించారు. దసరాకే కాదు, కొన్నిప్రాంతాల్లో సంక్రాంతికి బొమ్మల కొలువులు పెట్టడమూ ఆనవాయితీ. సంక్రాంతి బొమ్మల కొలువుల్లో ప్రధాన దైవం సంక్రాంతి పురుషుడు. సంక్రాంతి పురుషుణ్ణే సంకురమయ్య అని పిలుచుకుంటారు. కాలపురుషుడే సంక్రాంతి పురుషుడిగా మకర సంక్రాంతినాడు భూమిపైకి దిగివచ్చి, భూలోక వాసులను పరిపాలిస్తాడని ఒక నమ్మకం. సంక్రాంతి రైతుల పండుగే కాదు, ముదితల పండుగ, ముగ్గుల పండుగ కూడా! ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి వీధుల్లో ప్రతి ముంగిటా ముగ్గులు కళకళలాడుతూ కనిపిస్తాయి. ముగ్గులు ప్రాచీన కళారూపాలు. కామశాస్త్రం ప్రస్తావించిన అరవైనాలుగు కళల జాబితాలో ముగ్గులు వేయడం కూడా ఒక కళ. తెలుగు కవిత్వంలో ముగ్గుల ప్రస్తావన నన్నయ నాటి నుంచే ఉంది. పాండవులు వారణావతంలోని లక్క ఇంటికి వెళుతున్నప్పుడు వారణావత పుర ప్రజలు వారికి భారీగా స్వాగతం పలికారట. స్వాగత మర్యాదల్లో భాగంగా ఇంటింటా ముంగిళ్లలో ముగ్గులు తీర్చిదిద్దారట. ఆ ఘట్టంలోనే నన్నయ ‘అంగుళల నొప్పె కర్పూర రంగవల్లులు..’ అంటూ ముచ్చటైన పద్యం రాశాడు. ‘పలనాటి వీరచరిత్ర’లో కవిసార్వభౌముడు శ్రీనాథుడూ ముగ్గు ముచ్చట్లు చెప్పాడు. సంక్రాంతి సంబరాల్లో కోడిపందాలు, పేకాటల సందళ్లు ఒకవైపు కోలాహలంగా కొన సాగుతుంటే, మరోవైపు కవి సమ్మేళనాల వంటి సాహితీ కార్యక్రమాలు కూడా సందడిగా జరుగుతుంటాయి. సంక్రాంతి కర్షకుల పండుగే కాదు, కవుల పండుగ కూడా! సంక్రాంతి నాటికి ధాన్యరాశులే కాదు, కవనరాశులు కూడా తెలుగునేల మీద భారీగానే పోగుపడతాయి. వాటి వాసిని నిర్ణయించాల్సింది మాత్రం ప్రజలే! -
సంక్రాంతి బరిలో తగ్గేదేలే...
సాక్షి, భీమవరం(ప్రకాశం చౌక్), ద్వారకాతిరుమల: సంక్రాంతి బరికి సై అంటూ పందెంకోళ్లు కాలు దువ్వుతున్నా యి. పండుగ దగ్గర పడుతున్న కొద్దీ సమరోత్సాహంతో కదం తొక్కు తున్నాయి. ప్రత్యేక శిక్షణ శిబిరాల్లో నిరంతర సాధనతో రాటుదేలుతూ ఈ సంక్రాంతికి నువ్వా నేనా అన్న రీతిలో సిద్ధమవుతున్నాయి. ఎలాగైనా పందెం కొట్టాలన్న కసితో పందెంరాయుళ్లు కూడా పందెం నీదా.. నాదా అంటూ ఎంత ఖర్చుకైనా వెనకాడడం లేదు. పందెంకోళ్ల వైభోగం చూసి ఒకపక్క జనం నోరెళ్లబెడుతుంటే.. మరోవైపు వాటి యజమానులు మాత్రం మురిసిపోతున్నారు. పందేల్లో పైచేయి కోసం తహతహలాడిపోతున్నారు. కోడి పందేలంటేనే గోదావరి జిల్లాలు.. ఇక భీమవరం, మెట్ట ప్రాంతాల్లో పండుగ మూడు రోజులు పందెం బరులు తిరునాళ్లను తలపిస్తాయి. భారీ ఎత్తున పందేలు నిర్వహిస్తారు. కోడి పందేలను వీక్షించేందుకు ఇతర రాష్ట్రాల నుంచే కాదు, దేశ విదేశాల నుంచి ఎన్నారైలు గోదావరి జిల్లాలకు తరలివస్తారు. పందేల్లో డబ్బు సంపాదించాలని కొందరు, తమ సత్తా చాటాలని మరికొందరు పుంజులను బరుల్లోకి దింపుతారు. ఈ ఏడాది కూడా పందేలు భారీ ఎత్తున నిర్వహించేందుకు భీమవరం, పాలకొల్లు, నరసాపురం, గణపవరం, వీరవాసరం, ఐ.భీమవరం, ద్వారకాతిరుమల, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, ఉంగుటూరు, భీమడోలు తదితర ప్రాంతాల్లోని పందెంరాయుళ్లు సిద్ధమవుతున్నారు. పండుగకు మరో రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఏడాది ముందు నుంచే కసరత్తులు ఎలాగైనా పందెం కొట్టాలనే లక్ష్యంతో సరైన పుంజును బరిలోకి దింపేందుకు పందెంరాయుళ్లు వాటి శిక్షణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. పుంజును పోటీలకు సిద్ధం చేసేందుకు దాదాపు ఏడాది ముందు నుంచే కసరత్తు ప్రారంభిస్తారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పందెం కోళ్ల శిక్షణ, పోషణకు యజమానులు సమయాన్ని వెచ్చిస్తున్నారు. ముందుగా వాటి గొంతులో నీటిని పోసి, కపం పోయేలా కళ్లి కొట్టడం, నోట్లో నీరు పోసి ఊదడం, ఒంట్లో కొవ్వు కరిగించేందుకు పొయ్యిపై అట్లపెనం పెట్టి, దానిపై నీరు చల్లి, ఆ నీటిని గుడ్డతో కోడి శరీరానికి రాయడం వంటివి చేస్తారు. కత్తిపోట్లు తట్టుకోవడానికి, ఒళ్లు గట్టిపడడానికి పసుపు, పిప్పళ్లు, వట్టివేర్లు, ఉక్కిసాయిలం, జామాయిల్ సీస, కుంకుళ్లు తదితర 20 రకాల ఆకులతో మరగబెట్టిన నీటిని పోత పోస్తున్నారు. నీటిలో ఈదించడం, వాకింగ్ చేయించడం వంటివి చేస్తారు. పుంజు బరిలో దిగినప్పుడు ఆవేశ పడకుండా ఢీకొట్టేందుకు ఈత కొట్టిస్తామని యజమానులు చెబుతున్నారు. రూ. 15 వేల నుంచి రూ.లక్ష వరకూ ధర జిల్లాలో ఏటా సంక్రాంతికి పందెం పుంజుల అమ్మకాలపై సుమారు రూ.10 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. పుంజు ధర సుమారు రూ.15 వేల నుంచి సుమారు రూ.లక్ష వరకు ఉంటుంది. నెమలి, కాకి నెమలి, పచ్చకాకి, సేతువ, పర్ల, డేగ, నెమలి డేగ, రసంగి, మైలా, ఫింగలా, పెట్టమర్రు తదితర రకాల పుంజులు ఉన్నాయి. గత మూడేళ్లుగా పెరూవియన్ జాతిని అభివృద్ధి చేస్తున్నారు. పెరూ దేశానికి చెందిన ఈ జాతి పుంజులు అమిత వేగంతో దెబ్బలాడతాయి. అవి చిన్నగా ఉండటం వల్ల స్వదేశీ కోళ్లతో సంకరం చేసి, వాటి ద్వారా వచ్చిన సెకండ్, థర్డ్ జనరేషన్ బ్రీడ్లను ప్రస్తుతం పందాలకు సిద్ధం చేస్తున్నారు. బలానికి డ్రై ఫ్రూట్ లడ్డూ, మటన్ కైమా బలం కోసం బాదం, పిస్తా, డ్రైఫ్రూట్ లడ్డూ, మటన్ కైమా, కోడిగుడ్లు పెడుతున్నారు. ఆహారంగా సోళ్లు, గంట్లు, మెరికలు అందిస్తున్నారు. పుంజును తరచూ పశువైద్యులకు చూపించి వారి సలహాల మేరకు విటమిన్ మాత్రలు అందిస్తారు. పుంజు సామర్థ్యం తెలుసుకునేందుకు తరుచూ ట్రయల్ పందాలు వేస్తారు. పుంజులపై భారీగా పెట్టుబడులు పెట్టి సంక్రాంతి పండుగకు రాబట్టుకోవాలని కొందరు, ప్రతిష్ట కోసం మరికొందరు శ్రమిస్తున్నారు. పందానికి పుంజును సిద్ధం చేసేందుకు సుమారు ఏడాది పాటు పెంచుతారు. ఒక్కొక్క పుంజుపై రూ.10 వేల నుంచి రూ.30 వేలు ఖర్చు చేస్తున్నారు. ముందుగా పుంజుల పెంపకం కోసం స్థలం లీజుకు తీసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఒక్కో శిబిరంలో 20 నుంచి 200 పుంజుల వరకు పెంచుతారు. వారి స్థాయిని బట్టి పుంజుల పెంపకం కోసం ఏడాదికి రూ.6 లక్షల నుంచి రూ.కోటి వరకూ ఖర్చు చేస్తున్నారు. -
సంక్రాంతి, ఉగాది సందర్భంగా పందేలకు అనుమతివ్వాలి
గోకవరం: సంక్రాంతి, ఉగాది పండుగలకు గ్రామాల్లో ఎడ్లు, గుర్రం, కోడి పందేలు వంటివాటికి ఇబ్బంది లేకుండా అనుమతి ఇవ్వాలని మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సోమవారం లేఖ రాశారు. లేఖ ప్రతులను తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో విడుదల చేశారు. ఈ ప్రాంత వాసులకు సంక్రాంతి, ఉగాది ఉత్సవాల్లో ఎడ్లు, గుర్రం, కోడి పందేలు, గోలీలు ఆడుకోవడం, ఎడ్లు బరువు లాగే పందేలు, ఆటల పోటీలు, జాతరలు తదితర వాటిని ఐదు రోజుల పాటు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ మధ్యకాలంలో పండుగ ఉత్సవాల్లో ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ఇబ్బందులు పెట్టడం, చివరిలో అనుమతిస్తుండడంతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సంక్రాంతి, ఉగాది పండుగలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఐదు రోజుల పాటు పూర్తిస్థాయిలో ఆటలకు అనుమతి ఇవ్వాలని, పండుగలప్పుడు ప్రజలను జైలుకి తీసుకెళ్లే పరిస్థితి ఉండకుండా చేయాలని కోరారు. -
మఫ్టీలో పోలీసులు.. అది తెలియని గ్రామస్తులు
భువనేశ్వర్ : మల్కన్‌గిరి జిల్లాలోని కలిమెల సమితిలో ఉన్న మారగాన్ పల్లి గ్రామంలో పోలీసులపై గ్రామస్తులు దాడికి దిగారు. ఈ ఘటనలో ఎస్డీపీ అభిలాష్ సహా మరో ఎనిమిది మంది పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కలిమెల పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. అనంతరం చికిత్స నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. సంక్రాంతి పండగ నేపథ్యంలో గ్రామ శివారులోని ఓ తోట వద్ద కొంతమంది గ్రామస్తులు మద్యం తాగడం, కోళ్ల పందేలు నిర్వహించడం వంటివి చేస్తుండగా అక్కడికి మఫ్టీలో చేరుకున్న పోలీసులు వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులను ఎవరో కొత్త వారు అని భావించిన గ్రామస్తులు.. ‘మా ప్రాంతానికి వచ్చి, మాకే ఎదురు తిరుగుతారా?’ అని వారిపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఆఖరికి వారు పోలీసులని తెలియటంతో అక్కడినుంచి గ్రామస్తులు పరారయ్యారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పలువురు గ్రామస్తులను నిర్భందంలోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు. -
వాడి తగ్గిన కోడి పందెం
సాక్షి, అమరావతి: సంక్రాంతి కోడి పందేల ముచ్చట గురువారంతో ముగిసింది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లోను మూడు రోజుల పాటు పందేలు జరిగాయి. గోదావరి జిల్లాల్లో కోడి పందేలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పందేల బరుల్లో కోళ్ల హంగామాతో పాటు సమీపంలో పేకాట, గుండాట, కోతాట వంటి జూదం, అనధికార మద్యం షాపులు లెక్కకు మిక్కిలి ఉండేవి. అయితే ఈఏడాది కోడి పందేలు గతానికంటే భిన్నంగా జరిగాయని నిర్వాహకులు చెబుతున్నారు. పోలీసులు గట్టి నిఘాతో జూదానికి బ్రేక్ పడింది. కోడి పుంజులకు కత్తులు కట్టకుండా పందేలు వేసుకోవాలని పోలీసులు సూచించారు. అలా జరపడం వల్ల ఉపయోగంలేదని, కత్తులు కట్టి పందెం వేస్తేనే త్వరగా గెలుపోటములు తేలుతాయని నిర్వాహకులు పట్టుబట్టారు. బరుల వద్ద జూదం, మద్యం విక్రయాలు జరిగితే సహించేది లేదని పోలీసు యంత్రాంగం అల్టిమేటం ఇచ్చింది. దీంతో పందేలు చప్పగా సాగాయని నిర్వాహకులు నిట్టూర్చారు. అయితే కొన్ని చోట్ల చాటుమాటుగా గుండాటలతో పాటు పేకాటలు నిర్వహించారు. మద్యంపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో దూర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ షాపుల్లో మద్యం కొని తెచ్చుకుని కొందరు బరుల వద్ద సేవించారు. భోగి రోజు మధ్యాహ్నం మొదలై.. కనుమ రోజున ముగిసిన పందేలలో ఈ ఏడాది క్రేజ్ తగ్గిందని, జూదం కూడా తగ్గడం మంచి పరిణామమని గోదావరి జిల్లాలకు చెందిన పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, కోడి పందెం బరులకు ఆనుకుని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పకోడి దుకాణాలు, బిర్యాని సెంటర్లు, కూల్‌డ్రింక్ షాప్‌లతో పాటు కార్లు, బైక్ పార్కింగ్‌లతో భారీ ఎత్తున వ్యాపారం జరిగింది. పందేలు తిలకించిన పలువురు ప్రముఖులు గోదావరి జిల్లాల్లో కోడి పందేలను చూసేందుకు గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా వస్తున్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఈసారి కూడా వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో జరిగిన కోడి పందేలను ఆయన తిలకించారు. ఉండి–భీమవరం రోడ్డు పక్కన ఉన్న కోట్ల ఆడిటోరియంలో ఆయనకు ప్రత్యేక బస ఏర్పాటు చేశారు. సినీ నటుడు శ్రీకాంత్‌తో పాటు పలువురు ప్రముఖులు గోదావరి జిల్లాలకు వచ్చి మూడు రోజులపాటు పండుగను సరదాగా గడిపారు. -
'కత్తి’ కడితే కటకటాలే..!
జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. పిండివంటల ఘుమఘుమలు.. బంధుమిత్రులు, ఆత్మీయుల కలయికలు, కొత్త అల్లుళ్ల సరదాలతో పండగ శోభ సంతరించుకుంది. మరోవైపు క్రీడల నిర్వహణ పేరుతో కొందరు కోడి పందేల బరులు ఏర్పాటు చేస్తున్నారు. భోగి వరకూ క్రీడా పోటీల వేదికలుగా ఉపయోగిస్తూ ఆ తర్వాత కోడిపందేల బరులుగా మార్చే ఎత్తుగడ కొనసాగుతోంది. అయితే అన్ని బరులపై నిఘా పెట్టామని.. నిబంధనలు ఉల్లంఘించి జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సాక్షి, అమరావతిబ్యూరో: సంప్రదాయం ముసుగులో కోడిపందేలు నిర్వహించే వారు కటకటాలు లెక్కించక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ముందు నుంచే నగరంలోని అనేక ప్రాంతాల్లో కోడిపందేలు, పేకాట తదితర జూద క్రీడలు ప్రారంభించారు. రోజూ ఎక్కడో చోట గుట్టుచప్పుడు కాకుండా పందేలు నిర్వహిస్తున్నారు. గతంలో సంక్రాంతి పండుగ ముందురోజు హడావుడిగా బరి ప్రాంతాలను శుభ్రం చేసి చదునుచేసి టెంట్లు ఏర్పాటు చేసి పందేలను నిర్వహించే వారు. రానురాను పందేలు నిర్వహణ తీరులో మార్పులు సంతరించుకుంటున్నాయి. విజయవాడ కమిషనరేట్ పరిధిలో అనధికారికంగా ఏర్పాటవుతున్న బరి ముందస్తుగా బరుల ఏర్పాటుకు ఇబ్బందులు లేకుండా సంక్రాంతి క్రీడా పోటీల నిర్వహణ పేరుతో వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్రాంతాలను సిద్ధం చేసి తాత్కాలికంగా వివిధ రకాల క్రీడా పోటీలకు శ్రీకారం చుడుతున్నారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలోని గన్నవరం, కంకిపాడు, ఉంగుటూరు, తోట్లవల్లూరు, నున్న, ఆత్కూరు పరిధిల్లో ఇలాంటి అనధికార బరులను పదకొడింటిని పోలీసులు గుర్తించారు. పలుచోట్ల స్థలాలను శుభ్రం చేసి సిద్ధంగా ఉంచుతున్నట్లు గుర్తించారు. అడిగితే సంక్రాంతికి ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం స్థలాన్ని చదునుచేశామని చెబుతున్నారు. దీంతో అధికారులు వారిని ఏమీ అనలేని పరిస్థితి ఏర్పడుతోంది. చదవండి: సంక్రాంతికి మీ ఇంటికా.. మా ఇంటికా? నిర్వాహకుల ధీమా.. న్యాయస్థానం ఆదేశాలతో కోడిపందేలు, ఇతర జూదాలను అడ్డుకునేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బరి ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి కూడా చివరి మూడు రోజులు అనుమతులు వస్తాయని నిర్వాహకులు ధీమాగా ఉంటున్నారు. కఠినంగా వ్యవహరిస్తాం.. అనుమతి లేకుండా బరులు ఏర్పాటు చేసినా.. నిబంధనలు ఉల్లంఘించి కత్తి కట్టి కోడిపందేలు నిర్వహించినా నేరం. అలాంటి నిర్వాహకులపై జంతు హింస నిరోధక చట్టం 1960 ప్రకారం సెక్షన్–11 కింద కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే పోలీసుల అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన 11 బరులను గుర్తించాం. పోలీసుల అనుమతితో సంప్రదాయ బద్ధంగా రంగవల్లులు, క్రీడల పోటీలు నిర్వహించవచ్చు. అలా కాకుండా సంప్రదాయం ముసుగులో కోడిపందేలు, పేకాట, గుండాట, కోతాట, నెంబరు పందేలు తదితర జూదక్రీడలు నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. – ద్వారకా తిరుమలరావు, సీపీ, విజయవాడ -
కాసుకోం‘ఢీ’
సత్తుపల్లి: కాకిడేగ పందానికి సై అంటే.. నెమలి పుంజు తొడకొడుతోంది. పందెం రాయుళ్లలో హుషారు ఉరకలేస్తోంది. సరదాల సంక్రాంతి పండగ పురస్కరించుకుని ఆంధ్రా సరిహద్దుల్లో పందెం బిర్రులు సిద్ధమవుతున్నాయి. పోలీసులు ఆంక్షలు పెడుతున్నా.. పందెం రాయుళ్లు వెనక్కు తగ్గడంలేదు. భోగి, సంక్రాంతి, కనుమ మూడురోజులు కోడి పందేలు వేసేందుకు రాయుళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఆంధ్ర సరిహద్దులో ఉన్న సత్తుపల్లి నియోజకవర్గంపై కోడిపందేల ప్రభావం అధికంగానే ఉంది. పశ్చిమగోదావరిజిల్లా సీతానగరం, పోతునూరు, సీసం, చింతంపల్లి, కృష్ణాజిల్లా కొప్పాక, కొత్తూరు, కాకర్ల, పోళ్లు గ్రామాల్లో కోడిపందేల బిర్రులు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కృష్ణాజిల్లా చాట్రాయి మండలంలో కోడి పందేల బిర్రులపై పోలీసులు దాడి చేయటంతో ఇద్దరు యువకులు తప్పించుకునే ప్రయత్నంలో బావిలోపడి మృత్యువాత పడ్డారు. దీంతో ఆ జిల్లాలో కోడి పందేలు జరిగే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని పందెం రాయుళ్లు చెప్పుకుంటున్నారు. ఉత్సాహంగా.. ఉల్లాసంగా.. సంక్రాంతి పండగ మూడురోజులు పందేలు కాసేందుకు ఉత్సాహం చూపిస్తారు. సంకలో కోడిపుంజు పట్టుకుని పందేలకు వెళ్లేవాళ్లు ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా కన్పిస్తారు. పందేలను తిలకించేందుకు కూడా పెద్ద సంఖ్యలో తరలి వెళ్తారు. పట్టణాలు, నగరాల నుంచి పండగలకు వచ్చిన అతిథులు, బంధువులు పందేలను చూసేందుకు ఆసక్తి కనబర్చుతారు. పల్లెల్లో ఖరీదైన కార్లలో పందెం రాయుళ్లు హల్చల్ చేస్తుంటారు. పందెం కోసం ప్రత్యేక శిక్షణ పందేల కోసం కోడి పుంజులను ప్రత్యేక శిక్షణ ఇచ్చి పెంచుతారు. సాధారణ కోళ్ల కంటే పందెం కోళ్లు చూడటానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. పసిబిడ్డను పెంచినట్టు పందెం కోళ్ల ఆలనాపాలనా చూస్తారు. పందెం కోళ్ల ఆకారం.. కూత గంభీరంగా ఉంటుంది. పందేలకు మూడు నెలల ముందు నుంచే పందెం పుంజులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఏడాదిన్నర వయసు ఉన్న పుంజును ఎంచుకుని ప్రత్యేక బోనులో ఉంచి సకల సౌకర్యాలతో పెంచుతారు. పందెం కోళ్లు మిగతా కోళ్లతో జతకట్టనివ్వరు. బ్రహ్మచర్యం వల్ల పుంజులకు శక్తి పెరుగుతుందని విశ్వాసం. కోడి పుంజులకు సజ్జలు, సోళ్లు, మటన్ కీమా, బాదం, పిస్తా, పప్పు, పచ్చసొన తీసిని కోడిగుడ్డు, రెవిటాల్ టాబ్లెట్, 18 రకాల దినుసులు కలిపిన లేహ్యం తినిపిస్తారు. కొవ్వు పట్టకుండా వేడి నీళ్లల్లో వేప, జామ, వెదురు ఆకులు, పసుపు కలిపి మరగబెట్టిన గోరువెచ్చని నీటితో పందెం పుంజులకు ప్రత్యేకంగా స్నానం చేపిస్తారు. రెండు నెలల పాటు క్రమం తప్పకుండా పుంజును పందేనికి సిద్ధం చేస్తారు. పందెం కోళ్లల్లో సుమారు 50 రకాలు ఉంటాయి. కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, పర్ల, సీతువ, పూల, పింగళి, కౌజు, ఎర్రబోర, నెమలి పుంజులు ఉంటాయి. లక్షల్లో కోడి కోసాట.. కోడి పందేల మాటున అదే ప్రాంతంలో లక్షల రూపాయల్లో కోసాట(లోన, బయట) పేకాట నిర్వహిస్తుంటారు. ఓ వైపు కోడి పందేలు నడుస్తుండగానే కోసాట(పేకాట) నడుస్తుంటుంది. రాత్రి వేళ్లల్లో సైతం ఫ్లడ్‌లైట్ల వెలుగులో లక్షల రూపాయల కోసాట(లోన, బయట) జరుగుతుందని సమాచారం. పందెం రాయుళ్లు ఉదయం నుంచి మద్యం మత్తులో ఉండటంతో లోనబయట పేకాటలో సర్వం పోగొట్టుకున్న సందర్భాలు అనేకం వినిపిస్తున్నాయి. పందెం జరిగే తోటల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. కోడిపందేలు జరుగుతుండగానే కోసాట, గుండుపట్టాలు, పులిమేక జూదం నడుస్తున్నట్లు సమాచారం. జూదరులకు అందుబాటులో మద్యం, మాంసం విక్రయాలు, బిరియాని ప్యాకెట్లు లభిస్తుంటాయి. పోలీస్ నిఘా ఉన్నా.. కోడిపందేలు నియంత్రించేందుకు పోలీసులు నిఘా ముమ్మరం చేసి హెచ్చరికలు జారీచేసినప్పటికీ పందెం రాయుళ్లు ఖాతరు చేయటం లేదు. గతేడాది పండగ మూడురోజులు పోలీసులు పందేలను నిలువరించేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. పోలీసులు సరిహద్దుల్లో గస్తీకాస్తున్నా పందెంరాయుళ్లు కోడిపుంజులను వేరే దారిన పంపించి పందేల స్థావరాలను చేరుకుంటారు. ఒక్కోసారి పోలీసులకు పందేలు ఓచోట నడుస్తున్నాయని సమాచారం అందించి, వారిని బురిడి కొట్టించి వేరేచోట దర్జాగా పందేలు వేస్తుంటారు. పండగ మూడురోజులు కోడిపందేలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటూ పందెం రాయుళ్లు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిమాండ్ చేయటం విశేషం. -
కోడి పందెలు జోరు
మంచిర్యాలక్రైం: సంక్రాంతి ప్రత్యేకం కోడి పందెలు జోరందుకుంటున్నాయి. పందెంరాయుళ్లు సై అంటే సై అంటున్నారు. కోడి పందెల నిర్వహణ కోసం ఇప్పటికే జిల్లాలోని సరిహద్దు గ్రామాల్లో అన్నిచోట్ల రహస్యంగా సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు దొరకకుండా ఉండేలా స్థావరాలను ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. సంక్రాంతి సందర్భంగా ఈ ఏడాది కూడా భారీగా పందెలు నిర్వహించేందుకు పలువురు తమదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా పందెంరాయుళ్లు ఎలాగైనా నిర్వహించాలన్న ఉత్సాహంతో సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో కోడి పుంజులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గం మందమర్రి, కోటపల్లి, నెన్నెల, నీల్వాయి, మంచిర్యాల నియోజకవర్గంలోని లక్సెట్టిపేట, హాజీపూర్, మంచిర్యాల గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో కోడి పందెలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పందెలకు ప్రత్యేకం.. మంచిర్యాల జిల్లాలో గతంలో తరచుగా కోడి పందెలు నిర్వహించే ప్రాంతాలు లక్సెట్టిపేట మండలం వెంకట్రావ్పేట, బలరావుపేట, మందమర్రి మండలంలోని పులిమడుగు, మందమర్రి, శివ్వారం, కోటపల్లి మండలంలోని సిర్సా, అన్నారం, అర్జున్గుట్టా, కోటపల్లి, సుంపుటం, జనగామ, హాజీపూర్ మండలంలోని పెద్దంపేట, గొల్లపెల్లి, మంచిర్యాలలో గోదావరినదీ పరివాహక ప్రాంతాల్లో, శ్రీరాంపూర్‌లో, బెల్లంపల్లి డివిజన్లోని తాండూర్ మండలంలో భారీగా కోడి పందెలు నిర్వహించే వారు. గతేడాది టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు చేసిన దాడిలో 8 కేసులు నమోదు కాగా పందెం కోడి పుంజులు 21, పందెం నిర్వహిస్తున్న 43 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.58,270ల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వైఫల్యం వల్లే.. జిల్లాలో ప్రతిఏటా సంక్రాంతి పండుగకు భారీ ఎత్తున కోడి పందెలు నిర్వహిస్తున్నారు. వాటి నియంత్రణలో మాత్రం పోలీసులు వైఫల్యం చెందుతున్నారు. సీజన్లో అడపదడపా దాడులు చేస్తూ నామమాత్రపు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బడా పందెంరాయుళ్లపై దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి. కొన్నిచోట్లా ప్రభుత్వ ఉద్యోగులు, చోటమోటా రాజకీయ నాయకులు సైతం కోడి పందెల నిర్వహణలో పాల్గొనడం గమనార్హం. గతేడాది నమోదైన కేసులు కొన్ని.. 2018 జనవరి 4న మందమర్రి మండల కేంద్రంలోని శివారు ప్రాంతంలో కోడి పందెలు నిర్వహిస్తున్నారన్నా సమాచారం మేరకు రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి రెండు కోడి పుంజులను, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేవారు. వారి నుంచి రూ.5500 నగదు స్వాధీనం చేసుకున్నారు. 2018 జనవరి 11న స్థానిక పోలీసులు కోడి పందేల స్థావరంపై దాడిచేసి నాలుగు పందెం కోడి పుంజులు, ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. రూ. 4080 నగదు స్వాధీనం చేసుకున్నారు. 2018 జనవరి 15న లక్సెట్టిపేట మండల కేంద్రంలో కోడి పందెలు ఆడుతున్నారన్నా సమాచారం మేరకు రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడిచేసి మూడు పందెం కోళ్లు, ఇద్దరు వ్యక్తులను, రూ.1720 నగదు స్వాధీనం చేసుకున్నారు. 2018 ఫిబ్రవరి 21న జైపూర్ సర్కిల్ పరిధిలోని శ్రీరాంపూర్‌లో కోడి పందెల స్థావరంపై దాడిచేసి రెండు కోడి పుంజులను, 14 మందిని అరెçస్ట్ చేశారు. వీరివద్ద నుంచి రూ.22,850 నగదు స్వాధీనం చేసుకున్నారు. 2018 ఫిబ్రవరి 28న లక్సెట్టిపేట మండల కేంద్రంలోని శివారు ప్రాంతాల్లో కోడి పందెం స్థావరాలపై స్థానిక పోలీసులు దాడిచేసి మూడు కోడి పుంజులు, ఐదుగురు వ్యక్తులను అరెçస్ట్ చేశారు. వీరి నుంచి రూ.2030 నగదు స్వాధీనం చేసుకున్నారు. చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం నిషేధించిన ఏ ఆటలపైనా అయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సంక్రాంతి పండుగకు కోటి పందెలు అధికంగా ఆడుతుంటారు. ఇది తమిళనాడు, సీమాంధ్ర ప్రాంతాల నుంచి మనకు వచ్చింది. కోడి పందెలపై హైకోర్టు నిషేధం విధించింది. వీటిపై ఇప్పటికే టాస్క్‌ఫోర్స్ టీమ్ తిరుగుతోంది. గతంలో కేసులు నమోదు చేశాం. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందెలపై ప్రత్యేక దృష్టి సారించాం. కోడి పందెలు, పేకాట, మట్కా తదితర నిషేధిత ఆటలపై సమాచారం ఇచ్చి పోలీసులకు సహకరించాలి. కోడి పుంజులు ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. -
కోడి పందేల జాతర
కోడి పందేలకు వేళయింది. ఏటా సంక్రాంతి పండగకు రూ.లక్షల్లో కోడి పందేలు.. రూ.కోట్లలో పేకాట. ఏటా ఆనవాయితీగా వస్తున్న ఆటలో ఏడాదిపాటు చెమటోడ్చి పండించిన పంట కష్టం ఒక్కసారి పోగొట్టుకున్న అభాగ్యులెందరో. వీధిన పడిన కుటుంబాలు మరెన్నో. సత్తుపల్లి నియోజకవర్గం ఏపీ రాష్ట్రంలోని కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల సరిహద్దుల్లో ఉండడంతో జూదాన్ని అరికట్టడం పోలీసులకు తలకుమించిన భారంగా మారింది. డిసెంబర్ చివరి నుంచి జనవరి నెలాఖరు వరకు పందేలకు సీజన్‌గా చెప్పుకుంటారు. నెల రోజులపాటు ఏ నలుగురు జూదగాళ్లు కలిసినా పందెం ఎక్కడ జరుగుతుంది.. పేకాట ఎక్కడ నడుస్తుందనే సంభాషణలే. ఇందులోనే సంకలో పుంజు పెట్టుకొని తిరిగేవాళ్లు. కేవలం గంట వ్యవధిలోనే పందెంరాయుళ్లు ఒకేచోట కలుసుకోవడం.. అక్కడికక్కడే పందెం వేసుకోవడం.. మళ్లీ స్థలం మార్చడం నిత్యకృత్యం. పది రోజుల నుంచే అక్కడక్కడా పందేలు జరుగుతున్నాయంటే ఎంత డబ్బు చేతులు మారుతుందో అర్థం చేసుకోవచ్చు. సత్తుపల్లి: ఆంధ్రా సరిహద్దు మామిడి తోటలన్నీ పందెం బిర్రులుగా మారుతున్నాయి. సత్తుపల్లి ప్రాంతానికి చెందిన పందెంరాయుళ్లు బిర్రులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రూ.కోట్లలో కోడిపందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చకచకా చేసుకుంటున్నారు. ఆంధ్రా ప్రాంతంలో అయితే పోలీసుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవని.. సురక్షితంగా పందేలు వేసుకోవచ్చనే ఉద్దేశంతో పందెంరాయుళ్లు ఆంధ్రాకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది. ఆయా ప్రాంతాల్లో జరిగే పందెం బిర్రులన్నీ సత్తుపల్లి పరిసర ప్రాంత జూదగాళ్లతోనే నడుస్తాయి. రూ.కోట్లలో పేకాట.. కోడిపందెం మాటున రూ.కోట్లలో పేకాట నడుస్తున్నట్లు సమాచారం. కోడిపందేలు ఒక ఎత్తయితే.. రాత్రి, పగలూ తేడా లేకుండా విద్యుత్ జనరేటర్లు అమర్చి మరీ లోనా.. బయటా(పేకాట) నిర్వహించడంతో రెప్పపాటులో రూ.కోట్లు చేతులు మారి జూదరులు వీధినపడిన సంఘటనలు కోకొల్లలు. ఇవే కాకుండా.. గుండుపట్టాలతో జూదం నిర్వహిస్తారు. దీనికి తగినట్లుగా ఈ ప్రాంతంలో ఘర్షణలు చోటు చేసుకుంటాయి. అయితే పది రోజుల నుంచే ఆంధ్రా సరిహద్దుల్లో పేకాట జోరుగా నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కుక్కుట శాస్త్రమంటే.. ముసుగు పందేలలో కుక్కుట శాస్త్రం చూసుకొని పందెం వేస్తుంటారు. ఏ సమయంలో.. ఏ నక్షత్రంలో.. ఏ రంగుపుంజు పొడుస్తుంది.. యజమాని పేరులోని మొదటి అక్షరాన్నిబట్టి కుక్కుట శాస్త్రాన్ని అనుసరించి పందెం వేయడం ఆనవాయితీగా వస్తోంది. కోడి పందేలు జరిగే ప్రదేశం.. కోళ్ల యజమానులు ఉండే ప్రదేశం.. పందెం రోజు జరిగే నక్షత్రం.. శుక్లపక్షంలో నెగ్గే కోళ్లనుబట్టి పందేలు వేస్తారంటే ఆశ్చర్యం కలగక మానదు. కోళ్ల పందెం ఏ దిశగా జరుగుతుందో పుంజు యజమాని తన కోడిపుంజును ఆ దిక్కుకు తీసుకెళ్లే విషయంపైనే జయాపజయాలు ఆధారపడి ఉంటాయని పందెంరాయుళ్ల విశ్వాసం. ఆ మూడు రోజులు ఫుల్ జోష్.. భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజులు సంక్రాంతి పందేలకు అడ్డూ అదుపూ ఉండదు. సత్తుపల్లి శివారులోని చింతలపూడి మండలంలో ఐదారుచోట్ల పందేలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. సత్తుపల్లి ప్రాంతంలోని కొందరు పందెం బిర్రులు తీసుకొని మరీ పందేలు నడిపిస్తారు. ఏపీ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం, సీతానగరం, పోతునూరు, చింతంపల్లి, ధర్మాజిగూడెం, కళ్ల చెరువు, వెంకటాపురం, పంచాలకుంట, ప్రగడవరం, గోకారం, కృష్ణా జిల్లా తిరువూరు, కాకర్ల, విస్సన్నపేటల్లో పందేలు జోరుగా జరుగుతాయి. ఇంకా పెద్దపెద్ద పందేలు కొప్పాక, భీమవరంలో భారీ సెట్టింగ్‌ల మధ్య నిర్వహిస్తారు. పందెంకోళ్ల రకాలు.. పందెంకోళ్లు సుమారు 50 రకాల వరకు ఉన్నాయి. కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, పర్ల, సేతువు, పూల, పింగళి, కౌజు, నల్లమచ్చల సేతువు, ఎర్రబోరా, నల్లబోరా, మైల, కొక్కిరాయి, నల్ల సవల ఇలా అనేక రకాలు ఉన్నాయి. ప్రాంతాలనుబట్టి పేర్లు మారిపోతుంటాయి. వీటిలో కాకి, డేగ, నెమలి పందేలకు పెట్టింది పేరు. వీటి ధరలు రూ.5వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతాయి. పూర్వ కాలంలో కోడిపందేల కోసం యుద్ధాలు జరిగినట్లు చరిత్ర చెబుతోంది. పల్నాటి చరిత్ర, బొబ్బిలి యుద్ధంలో కోడిపందేల చరిత్ర ఆనవాళ్లు కనిపిస్తాయి. -
జోరుగా కోడి పందేలు
భద్రాచలం (ఖమ్మం): భద్రాచలానికి సమీపంలోని సరిహద్దు అటవీ ప్రాంతాల్లో జోరుగా కోడి పందేలు సాగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు సరిహద్దున ఉండటంతో అటువైపు అధికారులెవరూ కన్నెత్తి చూడటం లేదు. దీంతో నిర్వాహకులు యథేచ్ఛగా జూదం నిర్వహిస్తున్నా రు. భద్రాచలం పట్టణానికి సమీపంలో ఆంధ్రప్ర దేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం తునికి చెరువు, చోడవరం అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా చీరవల్లి సమీప అటవీ ప్రాంతాల్లో ప్రస్తుతం కోడి పందేలు నిర్వహిస్తున్నారు. వారంలో రెండు రోజులు, ఎక్కువగా గురు, ఆదివారాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. భద్రాద్రి, ఖమ్మం జిల్లాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి పందెంరాయు ళ్లు తరలివస్తున్నారు. ఎక్కువగా ఖమ్మం జిల్లాలో ని సత్తుపల్లి, భద్రాద్రి జిల్లాలోని దమ్మపేట, అశ్వారావుపేట పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం, చింతలపూడి తూర్పుగోదావరి, విశాఖ పట్నం జిల్లాల నుంచి ఇక్కడ నిర్వహించే కోడిపందేలలో పాల్గొనేందుకు వస్తున్నారు. భద్రాద్రి, ఖమ్మం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చే వారంతా భద్రాచలం మీదుగా, తూర్పు, విశాఖపట్నం నుంచి వచ్చే వారు రంపచోడవం ఘాట్‌రోడ్ నుంచి చింతూరు మీదగా వాహనాల్లో వస్తున్నారు. ఇక్కడ కోడిపందేలు నిర్వహించే రోజుల్లో ఆయా రూట్లలో కార్ల దండు కనిపిస్తుంది. భద్రాచలం ప్రాంతానికి యాత్రికులు, భక్తులు ఎక్కువగా వాహనాల్లోనే వస్తూ ఉంటారు. ఈ క్రమంలో తనిఖీలు లేకుండానే పందెంరాయుళ్లు దర్జాగా స్థావరాలకు చేరుకుంటున్నారు. కత్తులు కడితే రూ.లక్షలు పడాల్సిందే కోడి పందేలు కొందరు ప్రముఖల కనుసన్నల్లోనే సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భద్రాచలానికి సమీపంలో మూడు చోట్ల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోగా, ఎక్కడ నిర్వహిస్తారనేది పందెం రాయుళ్లకు ముందుగానే సమాచారం ఉంటుంది. స్థావరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉంటాయి. బిర్రులోకి వెళ్లే ప్రతీ ఒక్కరి నుంచి రూ. 300 రూ.500 వరకు నిర్వాహకులు వసూళ్లు చేస్తున్నారు. పందెం నిర్వహించే రోజున ఎంత మంది వచ్చినప్పటికీ, ఐదు వందల మంది పట్టే రీతిలో బిర్రు తయారు చేస్తున్నారు. ఈ లెక్కన ఒక రోజుకు కత్తుల కట్టిన చోట రూ.2.50 లక్షల వరకు వసూళ్లవుతాయి. పందెం కాసే డబ్బుల్లోంచి కూడా 5 శాతం కమీషన్ నిర్వాహకులకు ఇచ్చేలా తగిన ఒప్పందాలు ఉంటాయి. ఒక్క రోజుకు రూ. 3 నుంచి 5 లక్షల వరకూ నిర్వాహకులకు ముడతాయి. మూడు ముక్కల పేకాట, లోనబయట వంటి జూదం నిర్వహించుకునేందుకు నిర్వాహకులకు ముందస్తుగా డబ్బులు చెల్లించాలి. కోడిపందేలు నిర్వహించే చోట మద్యం విక్రయాలకు సంబంధించిన దుకాణాలు కూడా వెలుస్తున్నాయి. వీటిని పెట్టుకునేందుకు నిర్వాహకులకు డబ్బులు చెల్లించి ముందుగానే ఒప్పందం చేసుకోవాలి. ఈ రీతిన కోడి పందేల నిర్వహణకు లక్షలాది రూపాయలను నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పరిహారం డబ్బులు అందుకున్న బడాబాబులు సైతం వీటిలో పాల్గొనేందుకు వస్తుండటంతో ఇక్కడ పందేలు రూ.లక్షల్లోనే సాగుతున్నాయి. భద్రాచలం కేంద్రంగానే.. సరిహద్దు అటవీ ప్రాతంలో వినాయక చవితి మొదలుకుని సంక్రాంతి వరకు కోడిపందేల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. భద్రాచలం, బూర్గంపాడు మండలంలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామాలకు కొంతమంది జట్టుగా ఏర్పడి కోడిపందేలను నిర్వహిస్తున్నారు. పందేలు జరిగే రోజుల్లో తనిఖీలు చేయకుండా సరిహద్దు ప్రాంతాల్లోని ఒక్కో స్టేషన్‌కు నెలకు రూ. లక్ష ఇచ్చేలా ఒప్పందాలు జరిగాయనే విమర్శలు గుప్పుమంటున్నాయి. వీటి జోలికి వెళ్లకుండా ఉండేలా కొన్ని వర్గాలకు కూడా డబ్బులు పంచుతున్నారనే ప్రచారం ఉంది. గత ఏడాది కూడా ఇదే రీతిన సరిహద్దు ప్రాంతంలో కోడి పందేలు సాగాయి. అప్పట్లో జరిగిన మామూళ్ల పర్వంపై ఇక్కడి నిఘా వర్గాలు పక్కా ఆధారాలతో ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారని కూడా ప్రచారం జరిగింది. భద్రాచలంలో పనిచేసిన ఓ పోలీసు ఉన్నతాధికారి మారాయిగూడెం ప్రాంతంలో జరిగే కోడిపందేలును అడ్డుకునేందుకు ఛత్తీస్‌గఢ్ పోలీస్ ఉన్నతాధికారులతో కూడా మాట్లాడినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. ముందుగానే మేల్కొంటేనే.. భద్రాచలం కేంద్రంగా సాగుతున్న కోడిపందేల దందాపై పోలీసు అధికారులు అడ్డుకట్ట వేయాలి. లేకుంటే ఈ పరిణామాలు వేరే అక్రమాలకు తావిచ్చే అవకాశం ఉంటుంది. గత సంఘటనలు ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. గతంలో ఎటపాక పోలీసు స్టేషన్లో ఎన్ఐఏ అధికారిని అంటూ కొన్ని రోజులు పాటు హల్చల్ చేసిన నకిలీ పోలీసు భద్రాచలం కేంద్రంగానే కదలికలు కొనసాగించాడు. గంజాయి రవాణాకు కూడా ఇదే మార్గం కావటం పోలీసులకు కత్తిసాము వంటిదే. మళ్లీ ఈ ప్రాంతంలో కోడి పందేలకు తెరలేపగా, ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావటం, మరో పక్క మావోయిస్టుల కదలికలు కూడా బాగానే ఉండటంతో దీని వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. పోలీసు శాఖ ఉన్నతాధికారులు దీనిపై ముందుగానే దృష్టి సారించి కట్టడి చేయాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. -
రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో జోరుగా కోడి పందేలు
గద్వాల క్రైం: ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కోడిపందేల ఆట అంటే యమ క్రేజీ. అది జూదౖ మెనా జాలీగా ఆడుతుంటారు. ముఖ్యంగా సం క్రాంతి పండగ సందర్భంగా దాన్ని ఓ సంప్రదాయంగా ఆడతారనే విషయం అందరికీ తెలియదు. అయితే కొన్నిప్రాంతాల్లో ఆ సంప్రదాయం ముదిరి కత్తులు దూసుకునే వరకు వెళ్తుంది. రూ.లక్షల్లో బెట్టింగులు.. కోట్లల్లో చేతులు మారుతుంటాయి. ఆ సంస్కృతి ఇప్పుడు తెలంగాణలోనూ పాకుతోంది. అక్కడ కేవలం సంక్రాంతి పండగ సమయాల్లో సాగితే ఇక్కడ మాత్రం గుట్టుచప్పుడు కాకుండా నిత్యం రహస్యంగా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా.. పందెం కోళ్ల సై ఆటకు ఉమ్మడి జిల్లాలోని జడ్చర్ల, భూత్పూర్, ఖిల్లాఘనపురం, కొత్తకోట, కొల్లాపూర్, పాన్‌గల్, మిడ్జిల్, పెబ్బేరు, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాలకు చెందిన వారితో గుంటూరు జిల్లా కారంపుడి, పిడుగురాళ్లకు చెందిన కేటుగాళ్లు జోగుళాంబ గద్వాల జిల్లాను అడ్డాగా మార్చుకున్నారు. నడిగడ్డ ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం కావడంతో పందేలకు ఎలాంటి అడ్డంకులు ఉండవని ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. కొందరు బృందాలుగా ఏర్పడి రాష్ట్ర సరిహద్దుల్లో గుట్టలు, వాగులు, చిట్టడవి లాంటి రహస్య ప్రాంతాల్లో పందేలు కాస్తున్నారు. ఐదు రోజుల కిందట అయిజ శివారులో పక్కా సమాచారంతో కోళ్ల పందేల గుంపులపై పోలీసులు దాడులు చేశారు. అక్కడ వారినుంచి రూ.4.19 లక్షలు, 4 తుఫాన్ వాహనాలు, 4 కార్లు, 5 పందెం కోళ్లు, నాలుగు కత్తులు, 46 మంది కేటుగాళ్లను అరెస్టు చేశారు. ఇంత పెద్దమొత్తంలో బెట్టింగురాయుళ్లు పట్టుబడటం ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. వారిని విచారించగా ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నట్లు తెలిసింది. నడిగడ్డలో జరిగిన దాడులు.. జనవరిలో మల్దకల్ మండలంలో కోళ్ల పందేలు ఆడుతున్న 9 మంది పట్టుబడ్డారు. ఫిబ్రవరిలో ఇటిక్యాల మండలం ఎర్రవల్లి గ్రామ శివారులో 37 మంది కోళ్ల పందేలు కాస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అదేనెలలో ధరూర్ మండల కేంద్రంలో 10 మంది పందెంరాయుళ్లు దొరికారు. ఈనెలలో గట్టు మండలం బల్గెర గ్రామ శివారులో కోళ్ల పందెం ఆడుతున్న పది మంది అరెస్టయ్యారు. తాజాగా ఐదు రోజుల కిందట అయిజ మండల కేంద్రంలో వాగు ప్రాంతంలో జరిగిన దాడిలో భారీగా 46 మంది అరెస్టయ్యారు. ఇలా కేవలం ఈ ఏడాదినే లెక్కేసుకుంటే 102 మందిపై గేమింగ్ యాక్టు కింద కేసులు నమోదయ్యాయి. అక్రమాలకు అడ్డాగా నడిగడ్డ నడిగడ్డ అక్రమ దందాలు, నిషేధిత వ్యాపారాలు, నిషేధిత ఆటలు, జూదానికి అడ్డాగా మారుతోంది. ఇక్కడి పోలీస్ వ్యవస్థ కఠినంగా వ్యవహరిస్తున్నందునే వారి భాగోతం వెలుగుచూస్తోందనే చెప్పాలి. జూదం, బెట్టింగ్, కల్తీ విత్తనాలు, సారా, కల్తీ కల్లు లాంటి ఎన్నో అక్రమం దందాలను పోలీసులు ఒక్కొక్కటిగా చెక్ పెడుతూ వస్తున్నారు. ఇంత చేస్తున్నా కేటుగాళ్లకు భయం లేకుండా పోయింది. తాజాగా కోళ్ల పందేలా వ్యవహారం బయటికి రావడం కలకలం సృష్టిస్తోంది. పందెకోళ్లకు భలే డిమాండ్ కోళ్ల పందేలకు ఇక్కడ ప్రత్యేకమైన కోళ్లను ఎంపిక చేసుకుంటారు. అరుదైన జాతుల్లో ఉమ్మార్, శైలం, పెద్దవరిసే లాంటి పలు రకాల కోళ్లను మాత్రమే పందేలకు వినియోగిస్తారు. వాటి ధరలు వేలల్లో ఉంటాయంటే నమ్మశక్యం కాదు. కోళ్ల పోషణకు రాగులు, సద్దలు, జీడిపప్పు, పిస్తా తదితర తృణ ధాన్యాలు తినిపిస్తారు. ఈ కోళ్లన్నీ ఆంధ్రా ప్రాంతం నుంచే వస్తాయి. పందేనికి ముందు వాటి కాళ్లకు కత్తులు కట్టి రంగంలోకి దించుతారు. నికాసైన సారా తాగించి బరిలోకి దించుతారు. పక్కాప్లాన్‌తో నిర్వహణ కోళ్ల పందేల నిర్వహణ పక్కాప్లాన్‌తో ప్రారంభమవుతుంది. పోలీసులు, జన సంచారం లేని స్థలాలు గుర్తిస్తారు. ఎక్కడ నిర్వహించాలనేది కూడా స్థానికుల సాయంతో ముందుగా పరిశీలన చేసి బెట్టింగ్ రాయుళ్లను ఒక చోటుకు తీసుకొస్తారు. ఆ ప్రాంతంలో ఎవరూ రాకుండా జాగ్రత్త పడతారు. ఒకవేళఎవరైనా వస్తే తప్పించుకునేందుకు పథక రచనలు కూడా ఉంటాయి. రెండు గ్రూపులుగా విడిపోయి రెండేసి కోళ్లను ఆటలో వదులుతారు. ఆ రెండు గ్రూపుల వ్యక్తులు తమకు నచ్చిన కోడిపై బెట్టింగ్ కడతారు. రూ.10 వేల నుంచి మొదలు లక్షల్లో పందేలు కాస్తారు. పెట్టిన బెట్టుకు రెండు, మూడింతలు లాభం వస్తుండటంతో కకొందరు అప్పులు చేసి మరీ పందెం కాయడానికి వస్తున్నారు. గెలుపొందిన వారు లక్షాధికారులవుతుంటే ఓడిన వారు మాత్రం రోడ్డున పడుతున్నారు. కఠిన చర్యలు తప్పవు నిషేధిత పోటీలు నిర్వహించడం చట్టరీత్యా నేరం. కోడి పందేలు, జూదం, బెట్టింగ్ నిర్వహించే ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటాం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసుశాఖ గట్టి నిఘా పెట్టింది. జిల్లాలో కొంత మందితో బయటి రాష్ట్రానికి చెందిన వారు వచ్చి కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అలాంటి వ్యక్తుల కదలికలపై ఆరా తీస్తున్నాం. దొరికిన వారిపై గేమింగ్ యాక్టు కింద కేసులు నమోదు చేస్తున్నాం. – సురేందర్‌రావు, డీఎస్పీ, గద్వాల -
పెంటపాడు మండలం పరిమెళ్లలో కోళ్ల పందాలు