- బరులు సిద్ధం చేసుకుంటున్న పందెగాళ్లు
- భరతం పడతామంటున్న పోలీసులు
కోడి పందేలకు ఈ–ప్రచారం
Published Sun, Jan 1 2017 11:04 PM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM
అమలాపురం టౌన్ :
ఈసారి సంక్రాంతి పండగల్లో కోడి పందేలు నిర్వహించొద్దని... పందేలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ఆ మేరకు సమాయత్తమవుతోంది. అయినప్పటికీ పందెగాళ్లు ‘బరి’లోకి దిగడానికి కత్తులు సానపడుతున్నారు. ఇందుకు సోషల్ మీడియా ద్వారా పందేల సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో పందెం కోడి నాలుగు రోజులుగా వాట్సాప్, ఫేస్‌బుక్‌ల్లో హల్‌చల్ చేస్తోంది. ఎవరి వాట్సాప్‌ల్లో చూసినా పందేల కోళ్ల వివరాలు, పెద్ద నోట్ల రద్దు వల్ల ఈ సారి పందేలను నగదు రహిత లావాదేవీలతో...స్వైపింగ్ మిషన్లతో నిర్వహిస్తామని చెబుతూ చిత్రాలు పోస్టు చేస్తున్నారు. పందెం కోడి పుంజులు ఎన్ని రకాలు... వాటి పేర్లు, ఫోటోలతో కూడిన చిత్ర మాలికను షేర్ చేస్తున్నారు. అలాగే ఈసారి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కోడి పందేలు నగదు రహిత లావాదేవీలతో నిర్వహిస్తున్న సమాచారం ఈ మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ఈ రెండు పోస్టింగ్‌లు ప్రస్తుతం గోదావరి జిల్లాల ప్రజల స్మార్ట్ ఫోన్ల వాట్సాప్‌ల్లో విహరిస్తున్నాయి. సంక్రాంతి దగ్గరపడుతుండడంతో ఎక్కడ చూసినా కోడి పందేలు.. ఈసారి నగదు రహిత లావాదేవీలతో పందేలు.. స్వైపింగ్ మిషన్లు.. వాట్సాప్ పోస్టింగ్‌లపైనే చర్చ జరుగుతోంది. పందెగాళ్ల ముందస్తు ఏర్పాట్లు, పోస్టింగ్‌లు ఇలా ఉంటే కోర్టు ఆదేశాల క్రమంలో పోలీసుశాఖ మాత్రం లాఠీ పట్టుకుని ఈసారి పోటీలను అడ్డుకునేందుకు సిద్ధమవుతోంది. ఈసారి కోడి గెలుస్తుందో...ఖాకీ గెలుస్తుందో సంక్రాంతి వరకూ వేచి చూడాల్సిందే.
Advertisement
Advertisement