సంక్రాంతి బరిలో తగ్గేదేలే... | Sankranthi Special Kodi Pandalu West Godavari District | Sakshi
Sakshi News home page

సంక్రాంతి బరిలో తగ్గేదేలే...

Published Sun, Jan 2 2022 7:04 AM | Last Updated on Sun, Jan 2 2022 11:49 AM

Sankranthi Special Kodi Pandalu West Godavari District - Sakshi

సాక్షి, భీమవరం(ప్రకాశం చౌక్‌), ద్వారకాతిరుమల: సంక్రాంతి బరికి సై అంటూ పందెంకోళ్లు కాలు దువ్వుతున్నా యి. పండుగ దగ్గర పడుతున్న కొద్దీ సమరోత్సాహంతో కదం తొక్కు తున్నాయి. ప్రత్యేక శిక్షణ శిబిరాల్లో నిరంతర సాధనతో రాటుదేలుతూ ఈ సంక్రాంతికి నువ్వా నేనా అన్న రీతిలో సిద్ధమవుతున్నాయి. ఎలాగైనా పందెం కొట్టాలన్న కసితో పందెంరాయుళ్లు కూడా పందెం నీదా.. నాదా అంటూ ఎంత ఖర్చుకైనా వెనకాడడం లేదు. పందెంకోళ్ల  వైభోగం చూసి ఒకపక్క జనం నోరెళ్లబెడుతుంటే.. మరోవైపు వాటి యజమానులు మాత్రం మురిసిపోతున్నారు. పందేల్లో పైచేయి కోసం తహతహలాడిపోతున్నారు.  



కోడి పందేలంటేనే గోదావరి జిల్లాలు.. ఇక భీమవరం, మెట్ట ప్రాంతాల్లో పండుగ మూడు రోజులు పందెం బరులు తిరునాళ్లను తలపిస్తాయి. భారీ ఎత్తున పందేలు నిర్వహిస్తారు. కోడి పందేలను వీక్షించేందుకు ఇతర రాష్ట్రాల నుంచే కాదు, దేశ విదేశాల నుంచి ఎన్నారైలు గోదావరి జిల్లాలకు తరలివస్తారు. పందేల్లో డబ్బు సంపాదించాలని కొందరు, తమ సత్తా చాటాలని మరికొందరు పుంజులను బరుల్లోకి దింపుతారు. ఈ ఏడాది కూడా పందేలు భారీ ఎత్తున నిర్వహించేందుకు భీమవరం, పాలకొల్లు, నరసాపురం, గణపవరం, వీరవాసరం, ఐ.భీమవరం, ద్వారకాతిరుమల, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, ఉంగుటూరు, భీమడోలు తదితర ప్రాంతాల్లోని పందెంరాయుళ్లు సిద్ధమవుతున్నారు. పండుగకు మరో రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో బిజీబిజీగా గడుపుతున్నారు.  



ఏడాది ముందు నుంచే కసరత్తులు 
ఎలాగైనా పందెం కొట్టాలనే లక్ష్యంతో సరైన పుంజును బరిలోకి దింపేందుకు పందెంరాయుళ్లు వాటి శిక్షణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. పుంజును పోటీలకు సిద్ధం చేసేందుకు దాదాపు ఏడాది ముందు నుంచే కసరత్తు ప్రారంభిస్తారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పందెం కోళ్ల శిక్షణ, పోషణకు యజమానులు సమయాన్ని వెచ్చిస్తున్నారు. ముందుగా వాటి గొంతులో నీటిని పోసి, కపం పోయేలా కళ్లి కొట్టడం, నోట్లో నీరు పోసి ఊదడం, ఒంట్లో కొవ్వు కరిగించేందుకు పొయ్యిపై అట్లపెనం పెట్టి, దానిపై నీరు చల్లి, ఆ నీటిని గుడ్డతో కోడి శరీరానికి రాయడం వంటివి చేస్తారు. కత్తిపోట్లు తట్టుకోవడానికి, ఒళ్లు గట్టిపడడానికి పసుపు, పిప్పళ్లు, వట్టివేర్లు, ఉక్కిసాయిలం, జామాయిల్‌ సీస, కుంకుళ్లు తదితర 20 రకాల ఆకులతో మరగబెట్టిన నీటిని పోత పోస్తున్నారు. నీటిలో ఈదించడం, వాకింగ్‌ చేయించడం వంటివి చేస్తారు. పుంజు బరిలో దిగినప్పుడు ఆవేశ పడకుండా ఢీకొట్టేందుకు ఈత కొట్టిస్తామని యజమానులు చెబుతున్నారు.   



రూ. 15 వేల నుంచి రూ.లక్ష వరకూ ధర 
జిల్లాలో ఏటా సంక్రాంతికి పందెం పుంజుల అమ్మకాలపై సుమారు రూ.10 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. పుంజు ధర సుమారు రూ.15 వేల నుంచి సుమారు రూ.లక్ష వరకు ఉంటుంది. నెమలి, కాకి నెమలి, పచ్చకాకి, సేతువ, పర్ల, డేగ, నెమలి డేగ, రసంగి, మైలా, ఫింగలా, పెట్టమర్రు తదితర రకాల పుంజులు ఉన్నాయి. గత మూడేళ్లుగా పెరూవియన్‌ జాతిని అభివృద్ధి చేస్తున్నారు. పెరూ దేశానికి చెందిన ఈ జాతి పుంజులు అమిత వేగంతో దెబ్బలాడతాయి. అవి చిన్నగా ఉండటం వల్ల స్వదేశీ కోళ్లతో సంకరం చేసి, వాటి ద్వారా వచ్చిన సెకండ్, థర్డ్‌ జనరేషన్‌ బ్రీడ్‌లను ప్రస్తుతం పందాలకు సిద్ధం చేస్తున్నారు.    

బలానికి డ్రై ఫ్రూట్‌ లడ్డూ, మటన్‌ కైమా 
బలం కోసం బాదం, పిస్తా, డ్రైఫ్రూట్‌ లడ్డూ, మటన్‌ కైమా, కోడిగుడ్లు పెడుతున్నారు. ఆహారంగా సోళ్లు, గంట్లు, మెరికలు అందిస్తున్నారు. పుంజును తరచూ పశువైద్యులకు చూపించి వారి సలహాల మేరకు విటమిన్‌ మాత్రలు అందిస్తారు. పుంజు సామర్థ్యం తెలుసుకునేందుకు తరుచూ ట్రయల్‌ పందాలు వేస్తారు. పుంజులపై భారీగా పెట్టుబడులు పెట్టి సంక్రాంతి పండుగకు రాబట్టుకోవాలని కొందరు, ప్రతిష్ట కోసం మరికొందరు శ్రమిస్తున్నారు. పందానికి పుంజును సిద్ధం చేసేందుకు సుమారు ఏడాది పాటు పెంచుతారు. ఒక్కొక్క పుంజుపై రూ.10 వేల నుంచి రూ.30 వేలు ఖర్చు చేస్తున్నారు. ముందుగా పుంజుల పెంపకం కోసం స్థలం లీజుకు తీసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఒక్కో శిబిరంలో 20 నుంచి 200 పుంజుల వరకు పెంచుతారు. వారి స్థాయిని బట్టి పుంజుల పెంపకం కోసం ఏడాదికి రూ.6 లక్షల నుంచి రూ.కోటి వరకూ ఖర్చు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement